Sunday, July 24, 2016

భయం లేదు..


ఈ ప్రయాణం గమ్యంతో అంతమవ్వదు..
ఈ పయనానికి అంతమే గమ్యం.
ఏ విరామం, విశ్రాంతి నాకు ఆటవిడుపు ?
కళ్ళు వెతుకుతూనే ఉంటే, కాళ్ళు చతికిలబడ్డా,
ఆలోచనలు ఆగక అలసిపోతుంటే, కళ్ళు మూతబడ్డా..

"నేను" లేని ప్రపంచం కోసం నేను మథనపడతాను.
"నా" లోనే. "నా" అంతా.

ఏ సందు చివరో నేను ఆగిపోతాను.
ఏ తెలియని మలుపు వద్దో.
అది నాకు ఇష్టమైనదో కాదో..
నేను ఓడినట్టో, లేక గెలిచినట్టో..
నా వెంట ఇక రాని "నా" వాళ్ళందరిలోనూ..
కొంతైనా నేను మిగులుతానా ?
నాదో, మరి కాదో తెలీని ఈ పోరాటానికి..
రవ్వంతైనా ముద్ర ఉంచి సాగుతానా ?

నాకు తెలిసే అవకాశం లేదుగా.
భయం లేదు.

నేను కోరుకుంటే మొదలవ్వలేదు ఇది..
ఆగడానికి నా అనుమతి అడగదు.
అడుగులు నావే అయినా..
నడక నాది కాదు. అది కాలానిది.
గమనం నాదే అయినా..
గమ్యం యాదృచ్చికం. అది జీవితానిది.
Wednesday, January 27, 2016

అన్నీ సగమే..

అన్నీ సగమే

మధ్యలో ఆగిపోయిన మాటలు..
నన్ను వెంటాడతాయి.

కొన్ని బంధాలు.. మరికొన్ని కన్నీళ్ళు.
ఇంకొన్ని దూరాలు.. వెంటొచ్చే తీరాలు.
అన్నీ సగమే. 
నాలో తమని దాచేసుకుంటాయి.

సాగే జీవితమూ సగమే నాది.
మిగిలినదంతా ఒంటరితనం. నిండుగా.

Saturday, January 9, 2016

నేను, నేను శైలజ..


చాలా యేళ్ళ క్రితం నిన్నే పెళ్ళాడుతా చిత్రం చూసి, ఇదేం అంత గొప్ప సినిమా కాదే అని నిట్టూరుస్తుంటే, నలుగురూ మొత్తబోయారు. అప్పట్లో అదో కళా ఖండం మరి. ఓ సాయంత్రం కాఫీ తాగుతూ, ఆ చిత్రం గురించి నాలానే ఫీల్ అయిన మా శారద పిన్ని ఏం తేల్చారంటే, మనలోనే లోపముంది అని.. జనాలకి అలా తీస్తేనే నచ్చుతున్నాయనీ..మరి అందరూ అలా నచ్చుకుని మెచ్చుకున్న చిత్రం, నాకు మాదిరిగానే రుచించడాన్ని నేను నచ్చుకోలేకపోయాను. ఏంచేస్తాం. 

ఇన్నేళ్ళ తరువాత సరిగ్గా మళ్ళీ అలానే అనిపించింది నేను శైలజ చూసాక..బోలుడంత వ్యయ ప్రయాసలకు ఓర్చి.. చెన్నై మహా నగరానికంటే మహాబలిపురానికే కాస్త దగ్గరగా అనిపించే మాయాజాల్ లో సినిమా చూస్తే, ఏముంది దాంట్లో.. నాకైతే ఏమీ కనిపించలేదు. మనసంతా నువ్వే సినిమాలోంచి మనసు తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చెత్తలా ఉంది అనను.. కానీ మరీ గొప్పగా చెప్పుకోడానికి మాత్రం ఏమీ లేదు. చూసి వారమే అయ్యింది కానీ, గుర్తుకు తెచ్చుకుందామంటే ఏ సన్నివేశం గుర్తు రావడం లేదు, రామ్ తనవంతు బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ తప్ప. 

ఆ మధ్య వచ్చిన సోలో, ఖచ్చితం గా ఇంతకంటే మెరుగైన సినిమా.  ఇంత పాజిటివ్ గా (TV5 మినహా) టాక్ రావడానికి కారణాలు ఏమిటో మరి తెలియలేదు. వెబ్ సైట్ల సమీక్షల క్రింద కామెంట్స్ చూస్తే, నేనూ అదే సినిమా చూసానా, లేక చెన్నై లో వేరే సరుకు ఏమైనా వదిలారా అనిపిస్తోంది. ఎంత తెలుగు సినిమాలు నాసిరకం గా ఉంటున్నా, మరీ మన అంచనాలు ఇంత క్రిందకి దిగిపోయాయా. ? మమ్మల్ని చూడ్డానికి చెన్నై వచ్చిన పాపానికి మాతో పాటు సినిమా చూసిన మా అన్నయ్యకి ఫోన్ చేసి నా గోడు వెళ్ళబోసుకుంటే.. తను తేల్చిందీ మళ్ళీ అదే.. మనదే తప్పు అని.. ఇప్పుడు ట్రెండు, బెండు ఇదేనని. 

ప్రస్తుత తెలుగు సినిమాలు చూసి అందరిలాగే హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యడానికి ఎవరైనా ట్రైనింగులు వగైరాలు ఏమైనా ఇస్తున్నారేమో కనుక్కోవాలి.. లేకపోతే ఇంకా బేషుగ్గా పాత సినిమాలనే కొత్త టీవీ లో చూసుకుని మురిసిపోవాలి.

Monday, December 28, 2015

కొన్ని మాటలు

కుంభవృష్టిలో నిలుచున్నా,
ఎండిన గుండె తడవ్వదు.
ఒంటరితనం.

----------

నీతోనూ లేను,
నువ్వు లేకుండానూ లేను.
గతం.
----------

దారులు నను చీల్చుకుపోతాయి..
మాటలు దాటుకుపోతాయి.
నీడలు జారుకుంటాయి.
దోబూచులాడుతూ..

వెలిగి ఆరుతూ..
నిలుచుండిపోయాను.
నేను మాత్రం ఒంటరిగా.
ఏ చీకటికో.. సాక్ష్యంగా.
లేదా ఏ గాయనికో.. గమనానికో.
బహుశా..

వీధి దీపం.

--------

మాటలతో దాచేసాను..
మౌనాన్ని.

--------

Tuesday, December 1, 2015

సుకుమారి 21F

మొన్న వారాంతంలో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే ఇచ్చి నిర్మింప చేసిన కుమారి 21F చూసాను. ఈ మధ్య కాలం లో ఇంత డివైడడ్ టాక్ ఎక్కడా వినలేదు. కొందరు ఓహో సూపర్ అంటే, మరికొందరు చీ, థూ అని.

సినిమా కి పెద్దగా అంచనాలతో వెళ్ళలేదు నేను. ఇంటెర్వల్ ఫీలింగ్ అయితే, ఏముంది ఈ సినిమా లో ఓ నాలుగు పెద్దల సన్నివేశాలు తప్ప అనిపించింది. కానీ చివర్లో కొన్ని సీన్లు బానే వచ్చాయి. ఏదో చెప్పాలనుకున్నాడు అని మాత్రం అనిపించింది. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడే ఒక ఇంప్రెషన్ ని మిగులుస్తాయి, మరికొన్ని ఇంటికొచ్చాక.. ఇంకొన్ని మళ్ళీ మళ్ళీ చూసాక.. కానీ ఈ సినిమా విషయం లో నేను ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాను, చూసి నాలుగు రోజులు అవుతున్నా, బావుందా లేదా అని తేల్చుకోలేని స్థితి.

వాళ్ళు తీద్దామనుకున్నది, ముఖ్యం గా సుకుమార్ బుర్రలో ఉన్నది, స్క్రీన్ మీదకు చాలా మటుకు వచ్చిందనే చెప్పాలి. దీనికి కొంత మనం దర్శకుడిని, మరియు కేమెరా మాన్ రత్నవేలు ని అభినందించాలి. కథ ఆ మధ్య వచ్చిన ఫ్రెంచ్ సినిమా (Lila dit ça) కి కాపీ లానే ఉంది. హక్కులు తీసుకుని వాడుకుంటే ఇంకా బావుండేది. ఈ విషయం లో మనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ, కొన్ని కథలు చిన్న నిడివితోనే బావుంటాయి. మరీ సాగదీస్తే అనవసరపు విషయం ఎక్కువ అయ్యి, అసలు మరుగున పడుతుంది. ఈ చిత్రం విషయం లో కూడా కొంత ఆ ప్రభావం కనిపిస్తుంది. “A” సర్టిఫికేట్ కోసమే తపన పడి కొన్ని సన్నివేశాలు తీసారేమో అనిపించింది. మెచ్చుకోదగ్గ అంశం, కథలో అవకాశం ఉన్నా అసభ్యతకు తావు ఇవ్వలేదు. ద్వంద్వార్ధాలు లేవు, అన్నీ డైరెక్ట్ మాటలే.

హీరోయిన్ పాత్రనే నమ్ముకున్న సినిమా ఇది. మిగతా రోల్స్ కేవలం పేరుకే. హీబా పటేల్ తన పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. డబ్బింగ్, లిప్ సింక్ వగైరాలు కొంచం మెరుగ్గా ఉండి ఉంటే ఇంకా బావుండేదేమో. హీరో రాజ్ తరుణ్ తో పెద్ద ఇబ్బందేం లేదు. ముఖ్యమైన సంభాషణల్లో అరవకుండా, మాట్లాడ్డం నేర్చుకుంటే మనకు సులువు గా ఉంటుంది.

గుర్తించదగ్గ మరో అంశం, నెగిటివ్ కారెక్టర్ వేసిన నోయెల్ ది. తన పరిధిలో బాగా నటించాడు. కొన్ని మాటలు, చేతలు కొత్తగా ఉన్నాయి.

ఈ సినిమా ని సుకుమారే దర్శకత్వం వహించి వుంటే ఇంకా మెరుగైన ఫలితం వచ్చేదేమో. ఒక ఆబ్స్ ట్రాక్ట్ పెయింటింగ్ ని బాగా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తోంది నాకు ఇప్పుడు. దూరం నుంచి చూస్తే నచ్చేదేమో.. లేక అది మామోలు పెయింటింగ్ అయితే అర్థం అయ్యేదేమో..

సినిమా చెత్తలా లేకుంటే చాలు నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి లో ఉన్నాం కనుక, ఈ చిత్రం విజయం సాధించడం లో ఆశ్చర్యం ఏమీ లేదు.