Saturday, October 31, 2009

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ.

(ఆంధ్రా తెలుగు తల్లి వేరు, తెలంగాణా తెలుగు తల్లి వేరు, అని నిన్ననే తెలుసుకున్నాను. శ్రీకాకుళం తెలుగు తల్లి, విశాఖ తెలుగు తల్లి కూడా వేరు, వేరు అని తెలుసుకునేలోపు, ఒక్కసారి ఈ గేయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని. చదివినందుకు ధన్యవాదాలు.)

మేఘమా (ప్రయాణం)

నిన్న రాత్రి, టీవీ లో ప్రయాణం మువీ వచ్చింది. అమృతవర్షిణి పాడిన 'మేఘమా' పాట విని కొంచం ఆవేశపడి ఒక నాలుగు లైన్లు రాసుకున్నా. పెద్దగా అర్థం లేకపోయినా, ట్యూన్ లో పాడుకునేలా. :-)

స్నేహమా సాగాలమ్మా ప్రేమగా ఒదుగుటకు.
కాలమా ఆగాలమ్మా శ్వాసగా కరుగుటకు..

రాతిరంతా.. గుండెలోని గాయం కంటనీరై వర్షిస్తుంది.
మాటరాక గొంతులోని రాగం జ్ఞాపకం గా లాలిస్తుంది.

Thursday, October 29, 2009

కవిత

ఓ రెండు బొట్ల అనుభూతి చాలదూ నేను కదలడానికి..ఏదో ఒకటి రాసుకుందామనిపిస్తుంది.. కానీ మళ్ళీ కొత్తగా ఏం రాయను ?చదివే ప్రతీ కంటికీ ఏంకావాలో నాకేంతెలుసు ?ఎంత నిట్టూరిస్తే మాత్రం.. నా బాధ నీకు అర్థమౌతుందా ?కన్నీళ్ళు అందరివీ వెచ్చగానే వుంటాయి.. కాని కలలు వేరు కదా... అయినా నువ్వు నా అక్షరాలే చదువుతానంటే.. నా నిశ్శబ్ధాన్ని ఎలా చెప్పను నీకు... నీతో మట్లాడాలనే వుంటుంది నాకు..కానీ నీతో మట్లాడితే నాకు నేను గుర్తొస్తానే.. .అదే భయం.. రాసుకున్న నాలుగు లైన్లూ చూసి.. ఇది కాదే చెప్పాలనుకున్నది .. అనిపిస్తుంది..ఎంచెయ్యను.. కాగితాల్ని చింపెస్తాను లే.. నాకు కనిపించకుండా...కాని అక్షరాల్ని ఎలా ముక్కలు చెయ్యడం.. అవి నన్ను వెక్కిరిస్తూనే వుంటాయి.నేను ఏడ్వకుండానే.. నువ్వు ఓదారుస్తావు.. నాకే నేను అర్థం అవ్వకపోయినా.. నీకు అంతా అర్థం అయ్యిందంటావ్..ఇదెక్కడి అన్యాయం..అయినా నీకు నేనంటే ఎందుకంత లోకువ..నా ఒంటరితనం నీకు కవిత్వం లా కనిపిస్తుంది.కన్నీరేమో కావ్యం అంటావ్.. నవ్వితే హరివిల్లంటావ్..నవ్వకపోతే సముద్రం అంటావ్.నేనేమైనా ప్రకృతిని అనుకున్నావా..ఎందుకు నేనంటే నీకు అంత అలుసు..నువ్వు నన్ను కవితా అని పిలవక్కర్లేదు.. నాకూ ఒక గుండె ఉందని ఒప్పుకో చాలు.. దాని రెప్పల సవ్వడి ఎప్పుడైనా విను. చాలు.

Saturday, October 24, 2009

సరదాగా నాలుగు లైన్లు

అలసిపోయిన ఆలోచనకి ఒంటరితనం - ఒక ముసుగు.
---
తెల్లారిపోయిన కలలకు స్వాగతం చెప్పేది - బెడ్ కాఫీ.
---
గెలిచాకే అర్థం అయ్యింది - నిన్నటి ఓటమి.
---
మచ్చలేని వ్యక్తిత్వాన్నీ నేలపాలు చెయ్యగలిగేది - స్వార్థం.
---
ఎంత సంపదతో అయినా వెలకట్ట లేనిది - అమ్మ చిరునవ్వు.
---
అక్షరాలే లేని అద్భుత పుస్తకం - అద్దం.
---
అన్ని ఋతువుల్లోనూ వర్షించేది - కన్నీరు.
---
చల్లని వెన్నెల్లోనూ గుండెను మండించేది - అసూయ.
---
సగటు జీవికి చివరికి మిగిలే fixed deposit - జ్ఞాపకాలు.
---
తలదించుకుంటే తప్పు నాదే అంటుంది - సమాజం.
---
జీవితమే అర్పించేసినా ఇంకా చెయ్యాలనిపించేది - ప్రేమ.
---
రాసిన నాలుగు లైన్లకీ ఎమిటా సంబంధం అని విచారిస్తోంది - నా బ్లాగు. :-)

Friday, October 16, 2009

దీపావళి

దీపావళి - నెల రోజుల ముందునుండే హడావిడి మొదలయ్యేది. మందుగుండు సామాను కొనడం, ఎండబెట్టడం, మతాబులు, చిచ్చు బుడ్లు తయారుచేసుకోవడం. ఒక్కొక్కరికీ ఇన్ని అని లెక్క పెట్టి మరీ చేసుకునేవాళ్ళం. స్కూల్లో కూడా ఇవే కబుర్లు. ఈ అంకం ముగిసాక మొదలయ్యేది కొత్త బట్టల సందడి. అప్పట్లో ఈ రెడీమేడ్స్ ఇంత ప్రాచుర్యం పొందలేదు, బట్టను తానుల్లోంచి తీయించి, ఆస్థాన టైలర్ కి ఇచ్చి, వాడు ఆ పండగ సీసన్ బిజీ లో ఎప్పుడు కుడితే అప్పుడు, ఎలా కుడితే అలా, మహా ప్రసాదం అనుకుని తీసుకునేవాళ్ళం. ఈ హడవిడి ల మధ్య పండగ రానే వచ్చేది. ముందు రోజు రాత్రంతా మనసు కొత్త బట్టల మీదే వుండేది. ఎప్పుడు తెలవారుతుందా.. ఎప్పుడు వేసుకుందామా అని. నిద్ర పడితే వొట్టు. ఎదో మొత్తానికి లేచామనిపించి, తలంటు స్నానానికి కూర్చునేవాళ్ళం. అప్పట్లో ఇంకా ఈ షాంపూ సొబగులు తెలీవనే చెప్పాలి. కళ్ళు మండుతూ, వేన్నీళ్ళతో తలంటు స్నానాలు. తరువాత పసుపు పెట్టిన కొత్త బట్టలు, పిండి వంటలు.. వచ్చే పోయే అతిధులు, నిజంగా మన పండగలు ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇంక సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని వైటింగ్. మళ్ళీ త్వరగా స్టార్ట్ చేస్తే అందరికంటే ముందే మన టపాసులు అయిపోతాయని దిగులు. సో కాస్త లేట్ గా స్టార్ట్ చేసే వాళ్ళం. 'దుబ్బు దుబ్బు దీపావళీ' అంటూ. కాకరి పువ్వొత్తులు, మాతాబాలు, చిచ్చు బుడ్లు, భూ చక్రాలు, విష్ణు చక్రాలు, ఎన్నో వెరైటీ లు. కుటుంబం అంతా కలిసి దీపావళి చేసుకోవడం నిజంగానే ఒక అపూర్వ ఘట్టం. ఒక పెద్ద కర్రకి చివర కాకర పువ్వొత్తుని పెట్టి చిచ్చు బుడ్లు వెలిగించడం, జాగ్రత్తకు పరాకాష్ట. :-) కొన్ని గంటల వరకూ ఈ సందడి వుండేది. మిఠాయి పొట్లాలు, టపాసులూ ఖాళీ అయ్యే వరకూ. ఆ అమావాశ్య, వెన్నెల రాత్రిలా మెరిసి పోయేది, మురిసి పోయేది. ఎప్పుడు తెలవారేదో కానీ, ఇంటింటి ముందు ఒక పెద్ద కాల్చేసిన టపాసుల కుప్ప వుండేది, ఎవరి ఇంటి ముందు పెద్ద కుప్ప వుంటే వాళ్ళు గొప్ప అన్నమాట.

ఆ జ్ఞాపకాలను తలచుకుంటేనే హృదయం బరువెక్కిపోతుంది. నాగరికతో, మరొకటో, ఆ స్వచ్ఛమైన ఆనందాల నుంచి చాలానే దూరం వచ్చేసామేమో అనిపిస్తుంది ఇప్పుడు. రేపే దీపావళి, ఇంకా రేపు ఉదయం వెళ్ళి ఓ రెండు కాకరపువ్వొత్తులు కొని సాయంత్రం కాల్చామనిపించేస్తాం. ఏ 'పొకిరీ' తోనో, 'అష్టా చమ్మా' తోనో పండగ గ్రాండ్ గా అయ్యిందనిపిస్తాం.

anyways.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

B'Day

జీవితం ఇంకో అడుగు ముందుకేసింది. కాలం తనకు మాత్రమే తెలిసిన గమ్యం దిశగా సాగిపోతోంది. బాల్యం వరం, యవ్వనం పరుగు, వృద్ధాప్యం జ్ఞాపకం. ఈ దశలన్నింటినీ ఒకే రోజులో చూపించగలిగేది జీవితం. ఎక్కడో చదివాను, వ్యక్తిత్వాలు, దృక్పధాలు మార్చడానికి పెద్ద పెద్ద సంఘటనలేమీ అక్కర్లేదు, ఒక్క తెల్ల వెంట్రుక చాలు అని. :-) నిజమేనేమో.

ఏం సాధించావు ? అని అడిగితే, పంచిన చిరునవ్వుల లెక్కే చెప్పుకుంటాను. ఏం సాధించాలనీ ? అని అడిగితే, ఆగకుండా సాగిపోవడమే అన్నది నా సమాధానం. నిజమో అబద్దమో కానీ, జీవితం క్షణికం మాత్రం కాదు, దాని ముగింపే క్షణికం. లెక్కకు అందని అనుభూతుల, అనుభవాల సమ్మేళనం అది. కాలం అనే ఉలితో ఎంతో నైపుణ్యంతో చెక్కబడిన శిల్పం అది. అందుకే నాకదంటే గౌరవం.

Monday, October 5, 2009

వ్యత్యాసం

డబ్బు సుఖాల్ని ఇస్తుంది, ప్రేమ ఆనందాల్ని ఇస్తుంది.
జీవితానికి ఈ రెండూ అవసరమే..
వాటి మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోవడం ఇంకా అవసరం.

Sunday, October 4, 2009

ఒక్క ఆలోచన

ఒక్క ఆలోచన ఓటమిని గెలుపుగా మర్చేస్తుంది..
ఒక్క ఆలోచన ఒంటరితనాన్ని ఏకాంతం చేస్తుంది..

ఒక్క ఆలోచన చీకటిని వెలిగిస్తుంది..
మౌనాన్ని వినిపిస్తుంది.

ఒక్క ఆలోచన, ఆగిపోయిన నన్ను తిరిగి నడిపిస్తుంది..
అసలు గమ్యం గుర్తుచేస్తుంది..

ఒక్క ఆలోచన, కన్నీటిని జ్ఞాపకం చేస్తుంది..
నిన్ను ని నా జీవితం చేస్తుంది.

ఒక్క ఆలోచన, నన్ను పుట్టిస్తూనే వుంటుంది..
మళ్ళీ.. మళ్ళీ..

పంచదార బొమ్మ

పంచదార బొమ్మ (మగధీర) లో చరణం - hats-off to chandra bose!

గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా ?
గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది..
ఏమిటంట నీలోని గొప్ప ?

వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది,
పక్షపాతమెందుకు నా పైన ?
వెలుగు దారి చుపింది, చినుకు లాల పోసింది,
వాటితోటి పోలిక నీకేల ?

అవి బ్రతికున్నప్పుడె తోడుంటాయమ్మా ..
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా ....

ఇక నా lines (though not in the tune).

గాలి ఊపిరికి నిట్టూర్పు వుంది..
నేల తల్లికి ఆ నింగి వుంది..
కాని.. నాకు నువ్వే లోకం..
నువ్వు లేని లోకం శూన్యం..

వాన చినుకు మట్టిలో ఇంకి పోతుంది..
వెలుగు చీకటిలో కలిసిపోతుంది..
కాని... నాకు నువ్వే గమ్యం..
నీతోనే నాకు అంతం.