Sunday, November 29, 2009

కర్తవ్యం

ఎందుకో ఈ రోజు, వూరంతా ఒకటే హడావిడి. ఎవరో స్వామీజీ వచ్చి రామాలయంలో సేదతీరుతున్నారంట, ఎన్నో మహిమలు చేస్తున్నారంట. ఈ వార్త వేగం గా వూరంతా ప్రాకి, ఎప్పుడూ గుడి మొహం కూడా చూడని జనాల్ని సైతం ఆలయానికి తీసుకువచ్చింది. ఏదిఏమైనా, భక్తి కంటే మహిమ బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఎవరైనా మానవాతీత శక్తులు చూపిస్తే, వాళ్ళు మన సో కాల్డ్ సమస్యలన్నిటినీ చిటికలో మాయం చేస్తారని ఒక ఆశ. సహజం. అదిమానవ నైజం. ఇందులో నిజానిజాలకి చోటు లేదు, కేవలం నమ్మకం, దాని వల్ల వచ్చే ఒక ధైర్యం, ఓదార్పు. ఏదైతేనేం, మొత్తానికి గుడి దగ్గర జన ప్రవాహం ఆగకుండా పెరుగుతూనే వుంది. స్వామీజీ మహిమలు కూడా వింతగావున్నాయి, ఆయన ఏ ఉంగరమో, వీభూదో సృష్టించడం లేదు, మంచి నీళ్ళు సృష్టిస్తున్నాడు.. దాహంగా వున్న అందరికీ. దాహం లేకుండా అడిగితే నీళ్ళు రావంట. బావుంది కదా కాన్సెప్ట్. ఎంత దూరాన వున్నా, ఆయన మాట్లాడేప్రతీ మాటా చివరన వున్న వారికి కూడా స్పష్టంగా వినిపిస్తోంది. వూరంతా వర్షం పడిన ఆ గంటా, ఆయనతో వున్న వారి మీద చినుకు కూదా పడలేదంట. మహిమలు సంగతి ప్రక్కన పెడితే, ఆయన ప్రతీ మాటా చెవిలో అమృతంపోస్తున్నట్టు వుంది. ఆయన చూపు, ఎంతటి అంధకారాన్నైనా వెలిగించేలా తీక్షణంగా వుంది. ప్రశాంతమైన చిరునవ్వు. ఆయన చుట్టూ ప్రోగైన జనాలు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు, పరిష్కారాలు అడుగుతున్నారు. కానీఇలాంటి ప్రశ్నలకి ఆయన నోరిప్పితే కదా. చిరు మందహాసమే సమాధానం. జనంలో అసహనం పెరుగుతోంది, మా ఊరి పెద్ద కూడా ముందు వరసలోనే వున్నాడు, ఆతనిదీ అదే పరిస్థితి. చివరకు అతనే ధైర్యం తెచ్చుకుని, మా వూరిప్రజల కష్టాలు తీర్చమని స్వామీజీ కి మరొక్కసారి మొరపెట్టుకున్నాడు. ఈసారి స్వామీజీ కొంచం కరుణించారు, ఎమిటా కష్టాలు అని అడిగారు. మా వాళ్ళు చిట్టా విప్పారు. మళ్ళీ మౌనమే సమాధానం. కాసేపటికి మట్లాడడం మొదలుపెట్టారు. ఆయనకి మా జనాలకి మధ్య సంభాషణ ఇలా జరిగింది.
స్వామీజీ : నన్ను మీరు చాలా ప్రశ్నలడిగారు, నేనూ ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. ఒక వేళ భగవంతుడే ప్రత్యక్షమై, అతను ఆదేశించిన పనిని మీరు చేస్తే, మొత్తం ప్రపంచాన్ని ఈ కష్టాలన్నింటి నుండీ దూరం చేస్తాను అని మాట ఇస్తే, మీరు ఆపనిని చేస్తారా ? అది ఎంత కష్టతరమైనా ?
ఒకడు : నేను చేస్తాను స్వామీజీ, అది ఎలాంటి పని అయినా..
మరొకడు : ప్రపంచం అంటే, మా వూరు కూడా కదా స్వామీజీ, నేనూ సిద్ధమే.
ఇంకొకడు : ప్రపంచాన్నే కష్టాలనుంచి కాపాడుతానంటే, నేను ఎలాంటి పని/శిక్ష కి అయినా సిద్ధం స్వామీజీ. నా శిరస్సు ఖండించినా సరే.. నన్ను నిలువునా పాతిపట్టినా..
ఇంకొకడు : నన్ను ఏ చెట్టుకో ఉరితీసినా.. నన్ను అగ్ని ప్రవేశం చెయ్యమన్నా... ఇంకొకడు : ఈ జనం అందరికోసం, నరకంలో వేసే శిక్షలన్నీ భరించడానికి నేను సిద్ధమే స్వామీ..
(ఇలా మా జనాలు ఒకరితరువాత ఒకరు, ఒకరికి తగ్గకుండా ఒకరు ప్రతిజ్ఞలు చేస్తూనే వున్నారు. స్వామీజీ అందరూ మాట్లాడిన తరువాత.. కాసేపటికి చిరునవ్వుతో ఇలా అన్నారు.. )
స్వామీజీ : ప్రజలారా, భగవంతుడు మీరు జీవించి వున్నంత కాలం ఆనందంగా ఉండమన్నాడు. అదే అతను మీకు అదేశించిన పని, కర్తవ్యం.
ఒక్క క్షణం అంతా కలకలం.. తరువాత అంతా నిశ్శబ్ధం. మా జనాలకీ అర్థం అయినట్టుంది.
(Inspiration from Richard Bach's Illusions)

Thursday, November 26, 2009

వీళ్ళనేం చేద్దాం!

వీళ్ళనేం చేద్దాం!

ఈ మధ్యే యండమూరి రాసిన ఈ పుస్తకం చదివాను. నా అభిప్రాయాల్ని అందరితో పంచుకోవాలని అనిపించింది. ఇది విశ్లేషణ కాదు, కేవలం నా స్పందన.

పుస్తకం మొత్తం మీద ఒక మోస్తరుగా అనిపిస్తుంది. చెప్పిన విషయాలు చాలానే వున్నా, మనసులోకి నాటుకుని గుర్తుండిపోయేవి కొన్నే. ఒక 'మంచి పుస్తకం' కన్నా, ఒక 'అబ్సర్డ్ థ్రిల్లర్' రాయాలనే తపనే ఎక్కువ కనిపించింది. పుస్తకం మాత్రం మొదలు పెట్టాక మొత్తం చదివించేస్తుంది, చదివిన ఒకటి రెండు రోజుల వరకూ ఒకింత ఆలోచింప చేస్తుంది కూడా. ప్రస్తుత సమాజానికి సరిగ్గా సరిపోయేటట్టు, అద్దం పట్టేట్టు వుంది. మొదట్లో కొన్ని పేజీలు 'అంతర్ముఖాన్ని' గుర్తుచేస్తాయి. (భగవంతుడు, ఆత్మలు వగైరా.. వగైరా..). ఇంక ఇతివృత్తం సంగతికి వస్తే, తప్పు దారిలోకి వెళ్ళిపోడానికి రెడీ గా వున్న ఒక రచయితని (భరద్వాజ), భగవంతుడు, అప్పటికే తనువు చాలించిన మరొక రచయిత (మహర్షి) ప్రమేయంతో సరైన దారిలోకి తేవడం. అసలు కధ చిన్నదే, కానీ కధనం కాంక్రీట్ గా వుంది, సమాజంలో కుళ్ళుని ఎత్తిచూపడానికి ఏ ఒక్క అవకాశం యండమూరి వదల్లేదు. కుళ్ళునే ఎత్తి చూపారు, అని చదివే మనసు అక్కడక్కడ రోదిస్తే ఆశ్చర్యం లేదు. అబ్సర్డ్ థ్రిల్లర్ అని చెప్పుకోడానికేమో కావాలని ఒక పేజీ (11వ పేజీ) ప్రింటింగ్ బాగా చెయ్యకపోవడం..మధ్యలో ఎక్కడో ఓ రెండు పేజీలు ఖాళీగా వుంచెయ్యడం కొంత వింతగా అనిపించింది. కొన్ని పాత్రలు, నిజ జీవితానికి మరీ దగ్గరగా వుండేటట్టు మలిచే అనవసరపు ప్రయత్నం కనిపించింది.(ముఖ్యంగా కాంట్రాక్టర్ రెడ్డి ది). రచయిత భరద్వాజ భార్య అతన్ని వదిలి పెట్టి వెళ్ళాకే అసలు కధ మొదలౌతుంది. అతని భార్య కి 'శాంతి' అని పేరు పెట్టడం చాలా అర్థవంతంగా వున్నట్టు అనిపిస్తుంది. భరద్వాజ తిరిగి తన శాంతిని పొందడంతో కధ ముగుస్తుంది.

చివర్లో భరద్వాజ ప్రసంగం హైలైట్ గా నిలవాలి, కానీ పేలవంగా సాగిందనే చెప్పాలి. నిజం గానే ఇలాంటి పుస్తకం రాయడమే ఒక రిస్క్, ఎందుకంటే రచయిత మరీ నిష్టూరంగా నిజాలన్నీ చెప్తానంటే కొన్నిసార్లు చదవడానికి వెగటుగా వుంటుంది. అది నిజమే అని మనకీ తెలిసినా ...

పాత్రలు ఆకట్టుకునేలానే వున్నాయి, కాని వాటి వ్యక్తిత్వాలు మనసుకి హత్తుకునేలా.. గుర్తుండిపోయేలా లేవు. కొన్ని వివరణలు 'ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారీ' పుస్తకానికి దగ్గరలో వున్నాయి. ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రాసిన యండమూరిది అని అనుకోకుండా చదివితే.. ఒక్కసారి చదవచ్చు.. ఖచ్చితంగా. మనం అండర్ లైన్ చేసుకుందామనుకునే లైన్స్ ని ప్రింటింగ్ లోనే బోల్డ్ లో ఇచ్చారు. మంచి ప్రయత్నం. పుస్తకం చివరన యండమూరి ఇంటర్వ్యూ ఎందుకు పెట్టేరో తెలీలేదు. 'ఆస్థి అనేది నువ్వు ఇతరులకు చూపించేది కాదు.. నువ్వు అనుభవించేది.. ', 'నువ్వున్నంత కాలం నీ విలువ లేదు.. నువ్వు లేని మరుక్షణం అది తెలుస్తోంది.' ఈ రెండు వాక్యాలు గుర్తుండిపోయాయి.

Tuesday, November 24, 2009

ముసుగు

'ముసుగులతో తిరిగి తిరిగి అద్దం లో నన్ను నేను పోల్చుకోలేకపోయాను'. ఎప్పుడో రాసుకున్న లైన్ ఇది. నిజంగానే, అందుకే ఏ కల్మషం తాకని చిన్నారి నవ్వు అంత అందంగా వుంటుంది, అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, ఎవరికోసం ఈ ముసుగులన్నీ ? ఎవరిని మోసం చేస్తున్నాం ?

నేనూ కల కంటాను..
హాయిగా మనస్పూర్తిగా నవ్వుకోవాలనీ..
ఓదార్పు ఆశించకుండా ఏడ్వగలగాలనీ..
ప్రతీ ఆనందాన్ని పంచుకుని పెంచుకోవాలనీ..
ప్రతీ కష్టం నుంచీ పాఠం తప్పక నేర్చుకోవాలనీ..
నేనూ కల కంటాను..
నాతో నేను నిజాయితీగా మట్లాడుకోగలగాలనీ..
క్షణాలన్నింటినీ జ్ఞాపకాలుగా గుండెలో దాచేసుకోవాలనీ..
నేనూ కల కంటాను..
నన్ను నేను గెలవాలనీ.. గెలుస్తూనే వుండాలనీ..
ఎక్కడో యండమూరి రాసారు, సున్నితత్వం అంటే చిన్న చిన్న విషయాలకు బాధపడటం కాదు.. ఆనందించడం అని. నిజమే హాయిగా నవ్వుకోవడానికి ఎంత ధైర్యం,ఆత్మవిశ్వాసం కావాలి ? :-)

Tuesday, November 17, 2009

ఎంత సులువు..

ఈమధ్య నేనొక పెద్దాయన్ని కలిసాను. ఆయనకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఎక్కడో విదేశాల్లోనూ, ఇంకొకరు ఢిల్లీలోనూ సెటిల్ అయ్యారంట. ఈ పెద్దాయన మాత్రం ఇక్కడ ఒంటరిగా వుంటున్నారు. పిల్లల దగ్గరకు వెళ్ళినా చుట్టం చూపుగానే. ఆయన అన్న ఒక మాట ఎందుకో నన్ను బాగా ఆలోచింపచేసింది. - "మా తమ్ముడు పిల్లలు పెద్దగా చదువుకోలేదు. ఎవో చిన్న చిన్న వుద్యోగాలు ఇక్కడే చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఆనందంగా వుంటుంటే చూసి ఇప్పుడు నేను విచార పడుతున్నాను మా పిల్లల్ని అంత కట్టడి చేసి ఎందుకు చదివించేనా అని. ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను,... నేను గెలిచేనా ? ఓడిపోయానా ? అని."
ఆయన అన్న మాట ఎంత ప్రాక్టికలో గాని, ఆ మాట వెనుకు దాగున్న వేదన మాత్రం నన్ను బానే డిస్టర్బ్ చేసింది. దాదాపుగా ఈ కాంటెక్స్ట్ లోనే ఆ మధ్య రాసుకున్న లైన్స్ ని మళ్ళీ నాకు గుర్తు చేసింది.
పిల్లలే లోకం గా వాళ్ళ జీవితాలనే అర్పించి, పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులు వాళ్ళ వృద్ధాప్యం అంతా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే, సాధించిన ఏ అభివృద్ధిని చూసి నేను మీసం మెలేయాలి ? ఇల్లు చిన్నగా వున్నప్పుడే బావుండేది, అమ్మ చెయ్యి ఎప్పుడూ నాకు తగులుతూనే వుండేది. కలలో కూడా.. ఇప్పుడు.. ఇళ్ళు విశాలమయ్యాయి, కానీ కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఎవరి లోకం వారిది. చివరికి చిన్న కొడుకుని, పెద్ద కూతురిని ఫొనుల్లోనే చూసుకుంటున్నాం.

ఎంత సులువు, నాకే అందనంత ఎత్తులో వున్న
నా కను పాపను చూసి గర్వపడడం..
నాకు చూపు లేకపోయినా..
ఎంత సులువు, నిద్ర లేని రాత్రులన్నింటినీ
జ్ఞాపకాలతో తడిపేసుకుని,
చిరునవ్వుతో తెలవారడం.
ఎంత సులువు, ఓదార్పు కి భయపడి,
కన్నీటిని ఎక్కడో గుండె పలచటి పొరల్లో దాచేయ్యడం..
ఎంత సులువు, జీవితపు చివరి మజిలీలో,
అందరూ వుండీ ఒంటరైపోవడం...
పోటీ ఎవరిమధ్యోగానీ,
నేనే గెలిచాను అనుకుని తృప్తిపడడం...
ఎంత సులువు, .. ఎంత సులువు...

Friday, November 13, 2009

దేశమును ప్రేమించుమన్నా

గురజాడ వారు రాసిన ఈ గేయం ఈ మధ్యే వందేళ్ళ పండగ జరుపుకుంది. మనసు పెట్టి చదువుతుంటే, ప్రతీ అక్షరం ఇప్పటికీ, ఎప్పటికీ అర్థవంతంగా, అద్దం పట్టేలానే అనిపించింది. ఇలాంటి మహానుభావులు పుట్టిన ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వంగా వుంటుంది, ఇంతలో సాయంత్రం సరదాగా టీవీ పెడితే వచ్చే న్యూస్ చూసి హృదయం సిగ్గుతో కుచించుకుపోతుంది. ఎంతమంది గురజాడలు, శ్రీశ్రీలు కావాలి నేటి సమాజానికి ?

దేశమును ప్రేమించుమన్నా,
మంచి యన్నది పెంచుమన్నా;
వట్టి మాటలుకట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్ట వోయ్!
పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్ ;
తిండి కలిగితెకండ గలదోయ్
కండ గల వాడేను మనిషోయ్ !
ఈసురో మని మనుషు లుంతే
దేశ మేగతి బాగు పడునోయ్ ?
జల్దు కొని కళ లెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్!
అన్ని దేశాల్ క్రమ్మ వలెనోయ్
దేశి సరుకుల నమ్మ వలెనోయ్ ;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !
వెనక చూసినకార్య మేమోయ్ ?
మంచి గతమున కొంచెమేనోయ్
మంద గించక ముందు అడుగేయ్ !
వెనక పడితే వెనకెనోయ్ !
పూనుస్పర్ధను విద్య లందే
వైరములు వాణిజ్య మందే ;
వ్యర్ధ కలహం పెంచ బోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !
దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పు కోకోయ్
పూని యేదై నాను వొక మేల్
కూర్చి జనులకుచూపవోయ్ !
ఓర్వలేమి పిశాచి, దేశం
మూలుగులు పీల్చేసెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !
పరుల కలిమికి పొరలి యేడ్చే
పాపికెక్కడ సుఖం కద్దోయ్ ?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !
స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడు పడవోయ్ !
దేశ మంటే మట్టి కాదోయ్,
దేశ మంటే మనుషులోయ్ !
చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్థు లంతా నడవ వలెనోయ్,
అన్న దమ్ముల వలెను జాతులు
మతము లన్నీ మెలగ వలెనోయ్ !
మతం వేరై తేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్ !
దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్,
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండ వలెనోయ్ !
ఆకు లందున అణగి మణగీ
కవిత కోయిలపలుక వలెనోయ్
పలుకులను విని దేశమం దభి
మానములు మొలకెత్త వలెనోయ్ !

Tuesday, November 10, 2009

మేలుకో

మేలుకో మధ్యతరగతి మేలుకో,
ఆరు దశాబ్ధాల స్వాతంత్ర్యాన్ని అనుభవించావు కలల్లోనే,
ఇకనైనా కళ్ళు తెరు.
పైతరగతి సంపదను, స్వాతంత్ర్యాన్ని అనుభవించింది.
క్రింది తరగతి సబ్సిడీని, స్వేచ్ఛని అనుభవించింది.
ఏం మిగిలింది నీకు ?
నీ చూపు నీ ఇల్లు దాటదు,
నీ లెక్క నీ ఆదాయాన్ని దాటదు,
ఇంకా ఎన్నేళ్ళు ఈ 30 రోజుల జీవితాలు ?
సమాజం అంటే కేవలం భాధ్యతే కాదు,
నీ హక్కు కూడా,
వ్యవస్థ కోసం నువ్వు కాదు,
నీకోసం వ్యవస్థ. గ్రహించు.
తలాడించింది చాలు.తలెత్తి ప్రశ్నించు.
అడవుల్లో ఆగిపోయే విప్లవాలు,
సభల్లో హోరెత్తే వాగ్ధానాలు,
ఏవీ మార్చలేవు నీ బ్రతుకుని.
నీ రేపునీ, రాబోయే తరం తలరాతనీ,
మార్చగలిగేది నీ దృక్పధమే.
ఏ చరిత్ర పుస్తకంలోనూ లేదు,
నీ గతానికి కనీసం ఒక పేజీ.
నీ పన్నుపోటు పెంచే ఏ ప్రణాళికలోనూ లేదు,
నీ రేపుకి ఒక దిక్సూచి.
నువ్వు మాత్రం రోజూ ధారపోస్తావు,
చమటనీ, కన్నీటిని,
తాకట్టుపెడతావు తెగువనీ,తెలివితేటలనీ.
నీ కలలు ప్లాస్టిక్ చిరునవ్వుల రియాలిటీషోలు..
నీ ఆశలు ఆకాశాన్ని తాకాలనే కెరటాలు.
ఇంకా ఎన్నిరోజులు బ్రతుకుతావు..
ఇలా రోజూ చస్తూ ?
మేలుకో..
సహించింది చాలు.. సమాధానం అడుగు.
అంగీకరించింది చాలు.. అధికారం అడుగు.
నీ భవిష్యత్తుని శాసించు.. నిర్మించు.