Thursday, December 31, 2009

Happy new year!!

ఒక సరదా సంభాషణ :
నేను: Happy new year!!
నువ్వు : Thank you. same to you.
నువ్వు : నూతన సంవత్సరం నిజంగా నూతనం గా వుంటుందనే ?
నేను: కొత్త సంవత్సరం కదా.. కొత్త గానే వుంటుంది..
నువ్వు : తేదీలు మారిపోతే, జీవితాలు మారిపోతాయా ?
నేను: నువ్వన్నదీ నిజమే కానీ, మార్పు కోరుకోవడంలో తప్పు లేదు కదా.. ఎందుకంటే మనిషి ఆశా జీవి.
నువ్వు: నిజం గా మార్పు కావాలి అనుకుంటే, నూతన సంవత్సరం కోసం ఎదురు చూడడం ఎందుకు.. ఈ రోజే మారొచ్చుకదా..
నేను: అవుననుకో..
మళ్ళీ నేనే : ఎవరెవరి జీవితాలనో ఉద్ధరించకపోయినా, నేను నా పుట్టిన రోజు ని ప్రతీ ఏడూ తప్పక జరుపుకున్నప్పుడు, కాలానికీ కూడా ఆ హక్కు వుంది కదా మరి.
నువ్వు : తప్పు లేదు లే.. ఖచ్చితంగా. . గమ్యమెక్కడో తెలియని ప్రయాణంలో, మైలు రాళ్ళూ ఓదార్పునిస్తాయి, కాసేపు సేద తీరుస్తాయి. . any new resolutions ?
నేను : గత సంవత్సరం అనుకున్న resolutions అలానే వున్నాయి.. పాటించగలిగితే.. నీ సంగతి ?
నువ్వు : నా పరిస్థితీ దాదాపుగా అలానే వుంది. ఏముంది.. ఓ నాలుగు కన్నీళ్ళు, మూడు చిరునవ్వులు.. రెండు ఓటములు.. మధ్యలో ఒక గెలుపు. ఈలోగా మళ్ళీ కొత్త సంవత్సరం.

ఏది ఏమైనా 2009 వెళ్ళిపోతోంది, అందరి జీవితాలని ఇంకో కొత్త మెట్టు మీదకి నెట్టి తను మాత్రం మెల్లగా జారుకుంటోంది. ఎప్పుడో పదేళ్ళకి 2009 ని తలుచు కుంటే, మనకి గుర్తొచ్చేది పంచుకున్న ఆనందాలే కానీ, కన్నీళ్ళు కాదు, కారాదు. అందుకే నాకు గతం అంటే ఇస్టం, గౌరవం. ఏందుకంటే వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, పంచిన చిరునవ్వులు ఆనందాన్ని ఇస్తే, దాటి వచ్చిన కన్నీటి మలుపులు, కాలంపై నా విజయాలను గుర్తు చేస్తాయి. కొత్త సంవత్సరం, అందరి జీవితాల్లోనూ మరిన్ని ఆనందాల్ని నింపాలని మనసారా కోరుకుంటూ.. "Wish You A Very Happy New Year".. అందరికీ...

(ఇంకొక ఆనందించదగ్గ విషయం ఏంటంటే, ఎవో నాల్గు పోస్టులు రాసి, ఆపేస్తానేమో అని అనుకున్న నేను, నేటికి, అర్థ శతకం పూర్తి చేసాను.. :-) కొత్త సంవత్సరంలో మరొక కొత్త పోస్ట్ తో మళ్ళీ కలుద్దాం.. )

Tuesday, December 29, 2009

మౌనం

ఎప్పుడో రాసుకున్నాను, "మౌనంతో మాటలాడితే నిశ్శబ్ధమే నేస్తమవ్వదా" అని..
నిజంగానే మౌనం మాటలాడుతుందా ? అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, మౌనం మాటల కంటే ఎక్కువే మాటలాడుతుందని, అర్థం లేని మామూలు మాటలకంటే చాలా బాగా కూడా మాటలాడుతుందని. ఏ భాషా చెప్పలేని ఎన్నో భావాలను మౌనం భలే తేలిగ్గా చెప్పేస్తుంది. మాటలకి అర్థం దాదాపుగా ఒకేలా ఉంటుందేమో.. ఎవరు అన్నా.. ఎవరు విన్నా.. , కానీ మౌనానికి అర్థం వినే హృదయానికే తెలుసు. సరిగ్గా మంచి కవిత్వం లా. అమ్మతో సాగర తీరంలో నడుస్తుంటే, ఏ మాటా లేకుండా.. ఎన్నో చెప్పినట్టు,.. ఎన్నో విన్నట్టు అనిపిస్తుంది. అందులో ఆశ్చర్యం ఏముంది ? అయినా అర్థం చేసుకునే హృదయం తోడుగా వుండాలే కాని, మాటలెందుకు. దండగ కదా. మౌనం నన్ను నాకు పరిచయం చేస్తుంది.. నన్ను నాకు దగ్గర చేస్తుంది. అది నా సమస్యల్ని తీర్చదు, కానీ నా "అసలు సమస్య" ఏంటో నిజాయితీగా చెప్తుంది.
నీకు అర్థమవ్వాలని నేను ఎప్పుడూ నీతో మాటలాడుతూనే ఉంటే నాకు నేను ఎప్పుడు అర్థమౌతాను ?
నిన్ను గెలవాలని నేను ఎప్పుడూ నీతో వాదిస్తూనే ఉంటే నన్ను నేను ఎలా గెలుస్తాను ?

Sunday, December 27, 2009

రొటీన్ గా ఇంకో రోజు..

రాత్రంతా ఆశల్ని కని అలసిన నా కళ్ళు..
గది గోడల మీద చతికిలబడిన ఉషా కిరణాలు..
సూర్యోదయం తలుపులు తడుతుంటే..
కలలన్నీ కార్టూన్లై మాయమైపోతుంటాయి..
రోజు మొదలు.. హడావిడీ మొదలు..
నిన్న సగంలో ఒదిలేసిన క్వెరీ..
మొన్నప్పెడో క్రాష్ అయిన బైనరీ..
మద్యాహ్నం కల్లా చెయ్యాల్సిన డెలివిరీ..
అమ్మో,.,. మొత్తం మత్తు ఒదిలి.. బండి పట్టాల మీదకొస్తుంది..

ఓ నాలుగు సరదా ముచ్చట్లు.. ఓ మూడు అగచాట్లు..
కనీసం రెండు ప్రపంచ యుద్ధాలు.. అన్నీ శ్రీమతితోనే..
వెరసి మనదైన శుభోదయం..
ఇంతలో పొంచివున్న అతి పెద్ద ప్రమాదం...
పనిమనిషి రాకపోవడం. :-).

కట్ చేస్తే.. నింపాల్సిన టైమ్షీట్లు.. భయపెట్టే రివ్యూలు..
మీటింగ్లూ.. ప్లానింగులు...
ఎప్పుడో మధ్యలో సమయం చిక్కినప్పుడు రాసే కోడు.. నాలుగు లైన్లు..
ఎంత చేసినా మెచ్చని బాసు.. ఏంచేసిన తప్పని క్లాసు...
సాయంత్రానికి అద్దంలో వెక్కిరించే సొంత ఫేసు.. కలిపితే ఆఫీసు..
ఏది ఏమైనా.. ఐదు కొట్టెటప్పటికి రోజులో అసలు పని మొదలౌతుంది..
సంధ్య చీకటవ్వకుండా బయలుదేరడం కలగానే మిగిలిపోతుంది..
ఇలా తేది ఎప్పుడో నాకే తెలీకుండా తిరిగి పోతుంది..

నా రాతల్నీ..,, ఊహల్నీ... కలిపేసుకున్న సాగర తీరం..
అంతా ఆగిపోయిందనుకున్న క్షణాన అన్నీ తానే అయిన నేస్తం..
అన్నీ.. ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకం.. అదీ ఎప్పుడో వీకెండ్లో..
ఏమిటీ యాంత్రిక జీవితం.. అని సడన్ గా వస్తుంది.. ఆవేశం..
అన్నీ మార్చేయ్యలని అనిపిస్తుంది.
అప్రైసల్ ఎలా పోయినా పర్లేదు.. ఆరింటికల్లా ఇంటికొచ్చేయాలి..
ఠాగూర్ గీతాంజలి మళ్ళీ రాసేయాలి..
ఏవేవో కొత్త రిసొల్యూషన్లు..

ఈ క్రొత్త అధ్యాయం.. అలా ఒక రెండు పేజీ లు కదిలిందో లేదో..
ఓ తుఫాను.. టీ కప్పులో..
ఆఫీసో, ఇల్లో చెప్పలేను కానీ.
నా చిన్న బ్రతుక్కి .. ఓ చిన్న సైజు ఆపద..
ఓ నాలుగు రోజుల అన్ ప్లాన్డ్ లీవు..
అంతే.. అన్నింటా ప్రతిష్టంభన..

వారం రోజుల అతలాకుతలం..
అనంతరం.. తిరిగి మొదులౌతుంది జీవితం.. మొదటి గడిలోనే..
తీరం దాటిన ఆపద ఇంకాస్త సహనం పెంచితే..
బ్రతుకు.. వేగం మరికాస్త తగ్గించి..
పడకుండా కదిలితే చాలు అని తృప్తి పడుతుంది.
(మరి రిసొల్యూషన్లో... ? ఆ ఒక్కటీ అడక్కండి)

ఎంత వింతైనది ఈ జీవితం..
పరీక్షించాకే పాఠం నేర్పుతుంది..
నేర్చుకున్నది పాటించే వరకూ.. నేర్పుతూనే వుంటుంది..
వెలుగో చీకటో . . రోజు కదులుతూనే వుంటుంది.
తెలియని మలుపులుని పడేసి మరీ పరిచయం చేస్తుంది..
గెలుపో ఓటమో.. పరుగు ఆగనీయదు..
ఎంత వేగం గా పరిగెట్టిస్తుందంటే ..
ఎటు వైపు పరిగెడుతున్నామో.. ఎందుకు పరిగెడుతున్నామో..
మనమే మరచిపోతాం...

Thursday, December 24, 2009

మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..

అయ్యా మీకో దండం...
మీ ఆంధ్రకో దండం.. మీ తెలంగానకో దండం..
మా బతుకులు మాకు ఈయండి..
మీ రాజకీయాలకో దండం.. మీ ఉద్యమాలకో దండం..
ఇక మా కడుపు కాస్త నిండనివ్వండి..
మూటలెత్తే మల్లేశన్న ముద్దదిని పక్షం అయ్యింది..
బందంటారు.. సమ్మె అంటార్..
ఆకలికి ఆంధ్ర .. తెలంగాన తేడా తెలీదయ్య..
టీకొట్టు సింహాచలం.. కొడుకు సచ్చి బండయ్యాడు..
ఎవని కడుపు మంట ఆపుతారయ్య.. ఊళ్ళు కాల్చి..
అమాయకుడి రక్తం ఏరులయ్యింది..
అమ్మ కడుపుకోత కన్నీటి వరదలైంది..
ఆ నెత్తుటిదీ.. ఈ ఏడుపుదీ ఏ రాష్ట్రమయ్యా ?
మేధావులూ. విధ్యార్ధులూ.. మీకూ ఓ పెద్ద దండం..
కలిసి వున్నా.. ముక్కలై మురిసిన..
మాకు రెక్కాడితే గానీ దినం గడవదు..
మీ కొలువు మీకుంటది.. మీ ఇలువ మీకుంటది.
మా పొట్టకొట్టకండి సారూ.
కలిసి వుండిపోతే కరువు ఆగుద్దా ?
ముక్కలైపోతే బీడు పండుద్దా ?
అయ్యా.. ఎంపీలూ ఎమ్మెల్యేలూ.. దండం...
మంత్రులకు ఇంకా పెద్ద దండం..
మీ రాజీనామాలు విదిల్చకండయ్యా.. ఎంగిలాకుల్లాగ..
వొందకో ఓటు అమ్ముకోడానికి సిగ్గెస్తాది మళ్ళీ..
మీకే సత్తువుంటె.. మీ బిజినెస్సులకి చెయ్యండి రాజీనామా..
బామ్మర్ది పేరిన వేసిన టెండర్లు చించండి..
కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. మీరు బాగుంటరు..
మీ పెళ్ళికాళ్ళొస్తరు.. ఆళ్ళింట సావుకు మీరు తోడెల్తరు..
కానీ మాకు చావే పెళ్ళాయె సారు..
ఓ నాలుగు దినాలు మమ్మల్నీ బతికి చావనివ్వండి..
సార్లూ.. కొట్టుకోడంలో బాగా కలిసిపోయారు..
సానా సంతోషం... థాంక్సూ..
మీ జెండా కర్రలెత్తుకుని కలిసి వూర్లో వూరేగండి..
చూడ ముచ్చటగా వుంటది..
కానీ మా కడుపుల్లోకి దించకండి సార్లూ..

( ఎవరు రైటో.. ఎవరు రాంగో కానీ.. మధ్యలో నలిగిపోతున్నది సామాన్యుడే. తొందర్లోనే ఈ రావణ కాష్టానికి ముగింపు పడుతుందని ఆశిస్తూ... )

Sunday, December 20, 2009

చెన్నై లో సంగీత నాట్యోత్సవాలు

ప్రతీ ఏడాదిలానే ఈ ఏడు కూడా సంగీత నాట్య ఉత్సవాలు చెన్నై లో వైభవంగా జరుగుతున్నాయి. నిన్ననే నారదగాన సభ లో జరిగిన ఏసుదాసు కచేరికి వెళ్ళాం. అద్భుతమైన ప్రదర్శన. సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర వరకూ మూడు గంటల పాటు కచేరి అనర్గళం గా సాగింది. ఎక్కువగా త్యాగరాయ కృతులనే ఆలపించిన ఏసుదాసు, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసారనడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చివర్లో పాడిన అయ్యప్ప గీతాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఆయన గొంతులోని గాంభీర్యం, స్వఛ్ఛత ఎప్పుడో విన్న మేఘసందేశం పాటల్లో ఎలా ఉన్నాయో, ఇప్పటికీ అలానే వున్నాయి. నాకు కాస్త దూరంలో కూర్చున్న వ్యక్తి ముస్లిం; వేషధారణ బట్టీ తెలుస్తూనే వుంది, నా కంటే ఎక్కువ ఎంజాయ్ చేసాడనే చెప్పాలి. పాడే వ్యక్తి క్రైస్తవుడు, పాటేమో త్యాగరాయ కృతి, తాళం వేస్తూ పరవిశించిపోతున్న ప్రేక్షకుడు ముస్లిం. మహదానందం గా అనిపించింది. ఇంతకంటే మన సంస్కృతికి నిదర్శనం ఏముంది. నిజం గానే మన సమాజానికి ఆధారమైన కళలు ఎలాంటి వ్యత్యాసాలనైనా కలిపేస్తాయి. మనుగడకు ఒక పరమార్ధాన్ని ఇస్తాయి. అదీ నిజమైన నాగరికత. అదీ మన నాగరికత. నాకు అనిపిస్తుంది, ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మనం, గత వందేళ్ళగా మరుగుజ్జు సంస్కృతుల వెనుక అనవసరం గా పరిగెడుతున్నామేమో అని.. మనం నేర్చుకోవాలి అనుకుంటే, మన గతానికి మించిన పాఠం లేనే లేదు కదా!! ప్రగతి అంటే కాంక్రీటు కట్టడాలూ, కరన్సీ నోట్లేనా ? సమాజపు నిజమైన ప్రగతినీ, పురోగతినీ కొలవాల్సింది.. కల్మషంలేని చిరునవ్వుల్లోనూ, సమిష్టి ఆనందాల్లోనూ, ప్రామాణికమైన నైతిక విలువల్లోనూ కదా ?

(For more details about the schedule of the music and dance festival, you can refer to - http://www.artindia.net/madras09/index.html )

Tuesday, December 15, 2009

జ్ఞాపకాల హరివిల్లు

దాదాపుగా, ఓ పదేళ్ళ క్రితం, నేను కొన్నాళ్ళు "harivillu.com" అని ఒక వెబ్ సైట్ మైంటైన్ చేసాను. ఏవో పాత డైరీలు తిరగేస్తుంటే, అప్పట్లో రాసుకున్న ఈ లైన్లు కనిపించాయి. ఆనందపడ్డాను. నిట్టూర్చాను. జీవితం ఎంత మారినా, కొన్ని భావాలు ఎప్పటికీ సజీవంగానే వుంటాయి కదా!!

హరివిల్లు, అనుభూతుల వినీలంలో మధుర స్మృతుల మంచు తుంపరలు..
స్వగతాల సమీరంలో చిగురిస్తున్న ఆశయాల సువాసనలు.
హరివిల్లు.. సాధించలేనిదే అనుభవించలేవు.. కానీ..

అనుభవించలేనిది సాధించడం ఎందుకు ? అని అమాయకంగా ప్రశ్నిస్తుంది..
నా భావాల రసరమ్య రాగంలో వినిపించని మౌనగీతిక నా హరివిల్లు..
క్షణాలు కెరటాల్లా వచ్చిపోతుంటే, కాళ్ళ క్రింద నేలనీ,

ఆశయాల ఆనవాలుని నాకోసం ఆపిపట్టుకునేది. నా హరివిల్లు.
ఆనందాల్ని నిర్వచిస్తుంది.. ప్రేమను విశ్లేషిస్తానంటుంది..
ఒంటరితనపు చీకట్లలో ఆరని క్రొవ్వొత్తు నా హరివిల్లు...

స్నేహపు వెలుగుల విరిజల్లు నా హరివిల్లు.
------------
వెలుగునంతా నాలోనే వుంచుకుని వీధిదీపాల వెనుక పరిగెడుతున్నానా ?
------------
నాలోంచి రావాల్సిన ఆనందాన్ని ఎప్పుడైతే బయట వెతకడం మొదలు పెట్టానో, ఆ క్షణం నుంచీ నేను నా ఆధీనం నుంచి పరిస్థితుల ఆధీనంలోకి వెళ్ళిపోయాను.
------------
కాస్త కన్నీరూ నీ ఆధిపత్యాన్ని గుర్తు చేస్తుంది. మంచిదే అనుకున్నాను.
------------
ఆనందం ప్రయత్నంలో వుంది, ఫలితంలో కాదు అని తెలుసుకున్నాక, నిజంగానే గెలుపు, ఓటముల మధ్య పెద్దగా తేడా తెలీలేదు.
------------
ఎవరెవర్నో నేనెందుకు మార్చాలి. నన్ను నేను సంస్కరించుకోవడం వద్ద బయలదేరాను. గమ్యం నాకు తెలుసు.
------------
అణువణువునా నువ్వే అని తెలుసుకున్నాక.. కనిపించిన ప్రతీ లావణ్యాన్ని పలకరించాను. నీకు ఆకృతినివ్వడానికి బదులు, కనిపించిన ప్రతీ ఆకృతిలో నిన్నే వెతుక్కున్నాను.
------------
నాలో నేను ఓడిపోతూ ఎవర్ని గెలవాలి ?
------------
మనిషి హృదయం అద్దం లాంటిది అంటే నేను ఒప్పుకోను.. ఎందుకంటే, పగిలిన ప్రతీమారు అది అతుక్కుంటుంది.. అందుకే మళ్ళీ పగిలిపోతుంది.
------------
గుర్తు తెలియని చీకటిలో, విరజిమ్ముతున్న వెలుగునే కాదు.. కరిగిపోతున్న క్రొవ్వొత్తుని కూడా చూడు.
------------
బాధ కంటే బాధ పడుతున్నాం అనే భావనే ఎక్కువ బాధ పెడుతుంది.
------------
ప్రేమింపబడటం ఒక అదృష్టమేమో.. కానీ ప్రేమించ గలగడం ఒక వరం.
------------
నిన్న మొన్నటి అనుభవాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.. ఓటమి క్షోభ పెట్టిన క్షణాలు.. కాలంపై నా విజయాలుగా మిగిలిపోతాయి.
------------
నేను అనే పరిధి దాటి చూసాను ప్రభూ.. అంతా నీవే... నువ్వెక్కడున్నావ్ అని అడగడం మానుకున్నాను.
------------

Sunday, December 13, 2009

ఒంటరి గది

ఒంటరి గది...
గాలిని ఒంటరితనం ఆక్రమించుకున్న ఆ గదిలో, నిశ్శబ్ధం మాట్లాడుతుంది. అందుకని అలిగి మాట గొంతు మూగబోతుంది. గతాన్నే తలుచుకుని జ్ఞాపకం కంటనీరు పెట్టుకుంటుంది. 'నేను' అనే అస్థిత్వం నిట్టూరుస్తుంది. కాలం పడిలేస్తూ వెళ్ళిపోతుంది. జీవితం మాత్రం ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోతుంది. కిటికీ రెక్కల సందుల్లోంచి జారుకుని నా ఆలోచన ప్రపంచాన్ని చుట్టి వెనక్కి వస్తుంది నాకు ఎన్నో చెప్పాలని, నన్ను చూసినంతనే సర్వం మర్చిపోతుంది. నన్ను ఒంటరిగానే మిగిల్చేస్తుంది.. అయినా నా ఒంటరితనం నాతోనే వున్నప్పుడు నేను ఒంటరిని ఎలా అవుతాను ?
(పాత డైరీ లో కనిపించి పలకరించాయి, నేను ఎప్పుడో రాసుకున్న ఈ లైన్లు)

Wednesday, December 9, 2009

నేనూ.. నీ జీవితాన్ని..

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

క్షణానికోలా మాట్లాడ్డానికి నేను నీ మనసుని కాను..
నువ్వు పడినా, లేచినా.. ఆగక పరిగెట్టే కాలాన్ని కాను..
కాస్త ఓదార్పుకే ఆవిరైపోయి నిన్ను వెక్కిరించే కన్నీటినీ కాను..
రెప్ప పాటులో మాయమయ్యే నీ చిరునవ్వుని కాను.

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

చీకటిలో నిన్ను ఒదిలివెళ్ళిపోడానికి నేను నీ నీడను కాను..
కాస్త వెలుగుకే కరిగి చెదరిపోయే నీ కలనీ కాను..
అర్థం తెలియని గెలుపుని కాను.. పరీక్షించే ఓటమినీ కాను..
దూరాన మురిపించే గమ్యాన్ని కాను.. ముళ్ళతో బాధించే మార్గాన్ని కాను.

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

అనుక్షణం నీతోనే వుంటాను.. నీకు తోడుగా..
పడిపోతే పట్టుకుని లేపుతాను..ఓదారుస్తాను..
పరిగెడితే 'కాస్త జాగ్రత్త' నేర్పుతాను..ప్రేమగా..
నీ గమ్యమేమో గానీ.. దారిపొడవునా నా కాలిముద్రలే..
నేనుండగా నిన్ను ఒంటరిని కానివ్వను..
నేను లేని రోజుని నువ్వూ చూడవు..

నేను కఠినంగా వుంటే, కోప్పడు.. కానీ ద్వేషించకు..
నీ వెనుకే తిరుగుతున్నానని ఆట పట్టించు.. కానీ చులకన చేయకు..
నేను నీకు కేవలం 'జీవితాన్నే' కావొచ్చు..
కానీ నాకు నువ్వే 'సర్వస్వం'.
ఏదో ఒక రోజు మనిద్దరం కలిసే ఆగిపోతాం..
ఈలోగా నీ (నా) బ్రతుక్కో అర్థాన్ని మిగల్చడమే నాకు పరమార్థం...
అర్థం చేసుకుంటావు కదూ...

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

Monday, December 7, 2009

కరిగే లోగా ఈ క్షణం..

ఈ మధ్యే వచ్చిన ఆర్య-2 కి వనమాలి రాసిన 'కరిగే లోగా ఈ క్షణం..' పాట లోని ఈ నాలుగు లైన్లూ చాలా నచ్చాయి.

పరుగులు తీస్తూ అలసిన ఓ నదిని నేను..
ఇరు తీరాల్లో దేనికీ చేరువ కాను..
నిదురను దాటి నడిచిన ఓ కల నేను..
ఇరుకన్నుల్లో దేనికీ సొంతం కాను..

అలాంటి భావన్నే ఇలా కూడా రాసుకోవచ్చనిపించి.. (ట్యూన్ లో లేదనుకోండి..)

పరుగులు తీస్తూ అలసిన ఓ నదిని నేను..
తీరాల్ని కలపను.. వేరూ కానివ్వను.. కానీ..
ఎదురు నిలిచే ధైర్యమున్న మనసుకి వంతెనైపోతాను..
తనలో కలిపేసుకునే సాగరానికి సొంతమైపోతాను..


నిన్ను దాటి నడిచే నీ కలను నేను..
వెచ్చని కన్నీటితో రెండు కళ్ళనూ కలిపేస్తాను..
ఏ కన్ను తెరిచినా క్షణంలో కరిగిపోతాను.. కానీ..
నీలోని నాకు ప్రాణం పోసే నిదురలో మాత్రం కాసేపు నిజం అయిపోతాను..
నీ గుండెలో ఏమూలో జ్ఞాపకంగా మిగిలిపోతాను.

Wednesday, December 2, 2009

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ

సిరివెన్నెల రాసిన ఈ పాటనుంచి నేర్చుకోవాల్సింది చాలానే వుంది.

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ....

విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం...
అప్పుడే నీ జయం నిశ్చయం రా....
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ.....

నింగి ఎంత పెద్ద దైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా...
నింగి ఎంత పెద్ద దైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా....
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేదురా...
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...
నిశా విలాసమెంతసేపురా.... ఉషోదయాన్ని ఎవ్వడాపురా ...
రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా...

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ....

నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ...
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...
ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవును రా..
నిరంతరం ప్రయత్నమున్నదా... నిరాశకే నిరాశ పుట్టదా ...
నిరంతరం ప్రయత్నమున్నదా... నిరాశకే నిరాశ పుట్టదా ...
ఆయువంటూ వున్నవరకు చావుకూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటు రా.. ...

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ....

--- ఇంక నా లైన్స్ .. :-)

కష్టమైన, నష్టమైన, కాలమన్న ప్రవాహాన కొట్టుకుంటు ముక్కలవ్వదా..
వేదనెంత గాఢమైన, బాధ ఎంత తీవ్రమైన, రెప్ప పాటు గుండె ఆగునా ?
వేదనెంత గాఢమైన, బాధ ఎంత తీవ్రమైన, రెప్ప పాటు గుండె ఆగునా ?
కంటనీరు ఏరులైన, దూసుకెళ్ళే ఆశ ముందు ఓటమైన ఓడకుంటదా ?
చూపు మేర చీకటైన, దారి తప్పి ఒంటరైన, నీ ఊహకంటూ హద్దు లేదురా..
అనుక్షణం పరిశ్రమున్నదా.. విధిరాత ఐన మారకుండునా..
అనుక్షణం పరిశ్రమున్నదా.. విధిరాత ఐన మారకుండునా..
ఆగకుండా.. అలవకుండా.. సాగిపొయే నడక ముందు చేరలేని గమ్యమేదిరా..

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ .