Wednesday, December 9, 2009

నేనూ.. నీ జీవితాన్ని..

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

క్షణానికోలా మాట్లాడ్డానికి నేను నీ మనసుని కాను..
నువ్వు పడినా, లేచినా.. ఆగక పరిగెట్టే కాలాన్ని కాను..
కాస్త ఓదార్పుకే ఆవిరైపోయి నిన్ను వెక్కిరించే కన్నీటినీ కాను..
రెప్ప పాటులో మాయమయ్యే నీ చిరునవ్వుని కాను.

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

చీకటిలో నిన్ను ఒదిలివెళ్ళిపోడానికి నేను నీ నీడను కాను..
కాస్త వెలుగుకే కరిగి చెదరిపోయే నీ కలనీ కాను..
అర్థం తెలియని గెలుపుని కాను.. పరీక్షించే ఓటమినీ కాను..
దూరాన మురిపించే గమ్యాన్ని కాను.. ముళ్ళతో బాధించే మార్గాన్ని కాను.

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

అనుక్షణం నీతోనే వుంటాను.. నీకు తోడుగా..
పడిపోతే పట్టుకుని లేపుతాను..ఓదారుస్తాను..
పరిగెడితే 'కాస్త జాగ్రత్త' నేర్పుతాను..ప్రేమగా..
నీ గమ్యమేమో గానీ.. దారిపొడవునా నా కాలిముద్రలే..
నేనుండగా నిన్ను ఒంటరిని కానివ్వను..
నేను లేని రోజుని నువ్వూ చూడవు..

నేను కఠినంగా వుంటే, కోప్పడు.. కానీ ద్వేషించకు..
నీ వెనుకే తిరుగుతున్నానని ఆట పట్టించు.. కానీ చులకన చేయకు..
నేను నీకు కేవలం 'జీవితాన్నే' కావొచ్చు..
కానీ నాకు నువ్వే 'సర్వస్వం'.
ఏదో ఒక రోజు మనిద్దరం కలిసే ఆగిపోతాం..
ఈలోగా నీ (నా) బ్రతుక్కో అర్థాన్ని మిగల్చడమే నాకు పరమార్థం...
అర్థం చేసుకుంటావు కదూ...

నేనూ.. నీ జీవితాన్ని..
నీలోని నీకు 'నిన్ను' చూపించే దర్పణాన్ని.

2 comments:

  1. "నేనుండగా నిన్ను ఒంటరిని కానివ్వను.."

    "నేను కఠినంగా వుంటే, కోప్పడు.. కానీ ద్వేషించకు.."

    చాలా బాగుంది. మీ బ్లాగు మొత్తం చదివాను. బాగుంది మీ మనసు.

    ReplyDelete