Tuesday, December 15, 2009

జ్ఞాపకాల హరివిల్లు

దాదాపుగా, ఓ పదేళ్ళ క్రితం, నేను కొన్నాళ్ళు "harivillu.com" అని ఒక వెబ్ సైట్ మైంటైన్ చేసాను. ఏవో పాత డైరీలు తిరగేస్తుంటే, అప్పట్లో రాసుకున్న ఈ లైన్లు కనిపించాయి. ఆనందపడ్డాను. నిట్టూర్చాను. జీవితం ఎంత మారినా, కొన్ని భావాలు ఎప్పటికీ సజీవంగానే వుంటాయి కదా!!

హరివిల్లు, అనుభూతుల వినీలంలో మధుర స్మృతుల మంచు తుంపరలు..
స్వగతాల సమీరంలో చిగురిస్తున్న ఆశయాల సువాసనలు.
హరివిల్లు.. సాధించలేనిదే అనుభవించలేవు.. కానీ..

అనుభవించలేనిది సాధించడం ఎందుకు ? అని అమాయకంగా ప్రశ్నిస్తుంది..
నా భావాల రసరమ్య రాగంలో వినిపించని మౌనగీతిక నా హరివిల్లు..
క్షణాలు కెరటాల్లా వచ్చిపోతుంటే, కాళ్ళ క్రింద నేలనీ,

ఆశయాల ఆనవాలుని నాకోసం ఆపిపట్టుకునేది. నా హరివిల్లు.
ఆనందాల్ని నిర్వచిస్తుంది.. ప్రేమను విశ్లేషిస్తానంటుంది..
ఒంటరితనపు చీకట్లలో ఆరని క్రొవ్వొత్తు నా హరివిల్లు...

స్నేహపు వెలుగుల విరిజల్లు నా హరివిల్లు.
------------
వెలుగునంతా నాలోనే వుంచుకుని వీధిదీపాల వెనుక పరిగెడుతున్నానా ?
------------
నాలోంచి రావాల్సిన ఆనందాన్ని ఎప్పుడైతే బయట వెతకడం మొదలు పెట్టానో, ఆ క్షణం నుంచీ నేను నా ఆధీనం నుంచి పరిస్థితుల ఆధీనంలోకి వెళ్ళిపోయాను.
------------
కాస్త కన్నీరూ నీ ఆధిపత్యాన్ని గుర్తు చేస్తుంది. మంచిదే అనుకున్నాను.
------------
ఆనందం ప్రయత్నంలో వుంది, ఫలితంలో కాదు అని తెలుసుకున్నాక, నిజంగానే గెలుపు, ఓటముల మధ్య పెద్దగా తేడా తెలీలేదు.
------------
ఎవరెవర్నో నేనెందుకు మార్చాలి. నన్ను నేను సంస్కరించుకోవడం వద్ద బయలదేరాను. గమ్యం నాకు తెలుసు.
------------
అణువణువునా నువ్వే అని తెలుసుకున్నాక.. కనిపించిన ప్రతీ లావణ్యాన్ని పలకరించాను. నీకు ఆకృతినివ్వడానికి బదులు, కనిపించిన ప్రతీ ఆకృతిలో నిన్నే వెతుక్కున్నాను.
------------
నాలో నేను ఓడిపోతూ ఎవర్ని గెలవాలి ?
------------
మనిషి హృదయం అద్దం లాంటిది అంటే నేను ఒప్పుకోను.. ఎందుకంటే, పగిలిన ప్రతీమారు అది అతుక్కుంటుంది.. అందుకే మళ్ళీ పగిలిపోతుంది.
------------
గుర్తు తెలియని చీకటిలో, విరజిమ్ముతున్న వెలుగునే కాదు.. కరిగిపోతున్న క్రొవ్వొత్తుని కూడా చూడు.
------------
బాధ కంటే బాధ పడుతున్నాం అనే భావనే ఎక్కువ బాధ పెడుతుంది.
------------
ప్రేమింపబడటం ఒక అదృష్టమేమో.. కానీ ప్రేమించ గలగడం ఒక వరం.
------------
నిన్న మొన్నటి అనుభవాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.. ఓటమి క్షోభ పెట్టిన క్షణాలు.. కాలంపై నా విజయాలుగా మిగిలిపోతాయి.
------------
నేను అనే పరిధి దాటి చూసాను ప్రభూ.. అంతా నీవే... నువ్వెక్కడున్నావ్ అని అడగడం మానుకున్నాను.
------------

1 comment: