Sunday, December 27, 2009

రొటీన్ గా ఇంకో రోజు..

రాత్రంతా ఆశల్ని కని అలసిన నా కళ్ళు..
గది గోడల మీద చతికిలబడిన ఉషా కిరణాలు..
సూర్యోదయం తలుపులు తడుతుంటే..
కలలన్నీ కార్టూన్లై మాయమైపోతుంటాయి..
రోజు మొదలు.. హడావిడీ మొదలు..
నిన్న సగంలో ఒదిలేసిన క్వెరీ..
మొన్నప్పెడో క్రాష్ అయిన బైనరీ..
మద్యాహ్నం కల్లా చెయ్యాల్సిన డెలివిరీ..
అమ్మో,.,. మొత్తం మత్తు ఒదిలి.. బండి పట్టాల మీదకొస్తుంది..

ఓ నాలుగు సరదా ముచ్చట్లు.. ఓ మూడు అగచాట్లు..
కనీసం రెండు ప్రపంచ యుద్ధాలు.. అన్నీ శ్రీమతితోనే..
వెరసి మనదైన శుభోదయం..
ఇంతలో పొంచివున్న అతి పెద్ద ప్రమాదం...
పనిమనిషి రాకపోవడం. :-).

కట్ చేస్తే.. నింపాల్సిన టైమ్షీట్లు.. భయపెట్టే రివ్యూలు..
మీటింగ్లూ.. ప్లానింగులు...
ఎప్పుడో మధ్యలో సమయం చిక్కినప్పుడు రాసే కోడు.. నాలుగు లైన్లు..
ఎంత చేసినా మెచ్చని బాసు.. ఏంచేసిన తప్పని క్లాసు...
సాయంత్రానికి అద్దంలో వెక్కిరించే సొంత ఫేసు.. కలిపితే ఆఫీసు..
ఏది ఏమైనా.. ఐదు కొట్టెటప్పటికి రోజులో అసలు పని మొదలౌతుంది..
సంధ్య చీకటవ్వకుండా బయలుదేరడం కలగానే మిగిలిపోతుంది..
ఇలా తేది ఎప్పుడో నాకే తెలీకుండా తిరిగి పోతుంది..

నా రాతల్నీ..,, ఊహల్నీ... కలిపేసుకున్న సాగర తీరం..
అంతా ఆగిపోయిందనుకున్న క్షణాన అన్నీ తానే అయిన నేస్తం..
అన్నీ.. ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకం.. అదీ ఎప్పుడో వీకెండ్లో..
ఏమిటీ యాంత్రిక జీవితం.. అని సడన్ గా వస్తుంది.. ఆవేశం..
అన్నీ మార్చేయ్యలని అనిపిస్తుంది.
అప్రైసల్ ఎలా పోయినా పర్లేదు.. ఆరింటికల్లా ఇంటికొచ్చేయాలి..
ఠాగూర్ గీతాంజలి మళ్ళీ రాసేయాలి..
ఏవేవో కొత్త రిసొల్యూషన్లు..

ఈ క్రొత్త అధ్యాయం.. అలా ఒక రెండు పేజీ లు కదిలిందో లేదో..
ఓ తుఫాను.. టీ కప్పులో..
ఆఫీసో, ఇల్లో చెప్పలేను కానీ.
నా చిన్న బ్రతుక్కి .. ఓ చిన్న సైజు ఆపద..
ఓ నాలుగు రోజుల అన్ ప్లాన్డ్ లీవు..
అంతే.. అన్నింటా ప్రతిష్టంభన..

వారం రోజుల అతలాకుతలం..
అనంతరం.. తిరిగి మొదులౌతుంది జీవితం.. మొదటి గడిలోనే..
తీరం దాటిన ఆపద ఇంకాస్త సహనం పెంచితే..
బ్రతుకు.. వేగం మరికాస్త తగ్గించి..
పడకుండా కదిలితే చాలు అని తృప్తి పడుతుంది.
(మరి రిసొల్యూషన్లో... ? ఆ ఒక్కటీ అడక్కండి)

ఎంత వింతైనది ఈ జీవితం..
పరీక్షించాకే పాఠం నేర్పుతుంది..
నేర్చుకున్నది పాటించే వరకూ.. నేర్పుతూనే వుంటుంది..
వెలుగో చీకటో . . రోజు కదులుతూనే వుంటుంది.
తెలియని మలుపులుని పడేసి మరీ పరిచయం చేస్తుంది..
గెలుపో ఓటమో.. పరుగు ఆగనీయదు..
ఎంత వేగం గా పరిగెట్టిస్తుందంటే ..
ఎటు వైపు పరిగెడుతున్నామో.. ఎందుకు పరిగెడుతున్నామో..
మనమే మరచిపోతాం...

3 comments:

 1. "నా చిన్న బ్రతుక్కి .. ఓ చిన్న సైజు ఆపద.."

  "తీరం దాటిన ఆపద ఇంకాస్త సహనం పెంచితే.."

  "ఎంత వింతైనది ఈ జీవితం..
  పరీక్షించాకే పాఠం నేర్పుతుంది..
  నేర్చుకున్నది పాటించే వరకూ.. నేర్పుతూనే వుంటుంది.."
  chala baagundi.

  ReplyDelete
 2. Neatly written.

  "పరీక్షించాకే పాఠం నేర్పుతుంది.."

  నాకూ ఎప్పటికీ ఇదే అర్ధం కాదు. నేనెప్పుడూ ఒక అనుభవ కాలం ఆలస్యంగా ఎందుకు ఉంటాను అనేది.

  ReplyDelete
 3. జీవితమే గురువు అనేది అందుకేనేమో. జీవించటమనే కళని అనుభవాల పఠాలు చెప్పి మరీ నేర్పుతుంది. ఆ గురువుని ప్రేమించి/సేవించే ప్రతి మనిషీ ఒక విజేత అవుతాడు.

  ReplyDelete