Saturday, January 30, 2010

ఆశ గొప్పదా ? సంతృప్తి గొప్పదా ?

ఆశ గొప్పదా ? సంతృప్తి గొప్పదా ? ఓ రెండు రోజులుగా ఎందుకో ఈ ఆలోచన బుర్రలో తిరుగుతోంది. ఏదైనా సాదించాలనే కోరిక, ఆశ లేకపోతే జీవితం వృధా అనిపిస్తుంది నాకు. నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండాలి. రేపు తలుపు తట్టేలోపు ఏదో ఒక్క విషయంలోనైనా తనను తాను గెలవాలని... లేనిదేదో పొందాలని అనుకోవడం సహజం.. సమంజసం కూడా. కానీ అలా అని ఎప్పుడూ లేనిదానికోసం పరుగే అంటే.. సాధించినది ఎప్పుడు అనుభవిస్తాం... ఆనందంగా ఓ నాలుగు క్షణాలు గడపలేకపోతే ఏం ఆశించినా.. ఏం సాధించినా ఏం ఉపయోగం ? కనిపిస్తూ నడిపించే ఆ గమ్యం, ఆశ అయితే, ఆ దిశగా పడే ప్రతీ అడుగునీ సంతృప్తి తోనే నింపుకోవాలి. అప్పుడే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చివరికి సాధించిన దానికి ఒక అర్థం మిగులుతుంది.

దూరం నుంచి చూస్తే ఈ రెండూ పరస్పర విరుద్ధంగానే కనిపిస్తాయి.. కానీ జీవితానికి ఈ రెండూ ముఖ్యమైనవే. ఆలోచించి చూస్తే ఈ రెండూ ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్థమౌతుంది. ఆశ గెలిపిస్తుంది.. సంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది.. ఆ రెండూ కలిస్తేనే అసలు విజయం.

పారే ఏరు ఏ ఒక్క మజిలీతోనూ పరుగులాపదు.. అలా అని మార్గమంతా పచ్చదనంతో నింపకామానదు.. మనిషి జీవితమూ అంతే. రోజంతా శ్రమించాక, రేయి నిదురపుచ్చుతుంటే, సాధించింది.. పొందినది.. ఓ సంతృప్తి నివ్వాలి.. అలసట తీర్చాలి. కానీ రేపు మీద ఉన్న ఆశ,.. తెలవారక ముందే నన్ను మేల్కొలపాలి. ఇంకో సూర్యోదయంతో నాకు తోడు రావాలి..

ఒక్కటి మాత్రం నిజం.. నేను సాధించిన దాని విలువ, దానిని నేను ఎలా అనుభవించానో అన్నదాని మీదే ఆధారపడి ఉంది. కాదంటారా ?

Wednesday, January 20, 2010

ఎలా.... అయినా...

చూపులు బయటే ఆగిపొతాయి...
కానీ దానికి కళ్ళను ఎలా తప్పుబట్టను?
ప్రేమకూడా ఒక్కోసారి స్వార్థంతో ముడిపడిపోతుంది...
అందుకు హృదయాన్ని ఎలా నిందించను?

జీవితం కదలకపోతే ఆ పాపం కాలానిదా?
మార్గంలో ముళ్ళుంటే ఆ దోషం గమ్యానిదా?

అయినా...
రెప్ప మూసి మనోఃనేత్రంతో చూస్తే...
నా చూపుకి పరిధులెక్కడ?
అమృతత్వాన్ని నింపుకుంటే...
నా చిన్నిగుండెకి 'నా', ''నీ' బేధమెక్కడ?

కాలప్రవాహానికి అందని అనుభవముందా?
నాలోనే ఉంటూ నన్ను నడిపించే ఆ గమ్యానికి..
చేరని మార్గముంటుందా?

Monday, January 11, 2010

ఫణి

ఫణి- కొంతమంది జీవితంతో గెలిచి మరణంతో ఓడిపొతారు..మరికొందరు మరణం మీద గెలిచి జీవితంతో ఓడిపోతారు. ఫణి మాత్రం జీవితాన్ని గెలిపించాడు.. చివరకు మరణాన్నీ గెలిపించాడు.. ఎందుకో ...
ఒక స్నేహితుడి ద్వారా, దాదాపుగా ఓ పదేళ్ళ క్రితం మొదటిసారి కలిసాను నేను ఫణిని. తనతో నా పరిచయం కూడా చిన్నదే. అదేసమయంలో, మొదలైన ఒక ఆరోగ్య సమస్య తన జీవితాన్నీ .. తన కుటుంబం జీవితాల్నీ ఎప్పటికీ మార్చేసింది. ఒకప్రక్క డయాలిసిస్ చేయించుకుంటూ మరో ప్రక్క ఇంజినీరింగ్ పరీక్షలు రాసేవాడు తను. తన గుండె నిబ్బరం చూసి ఆశ్చర్యమనిపించేది. ఫణి ముఖం మీద చిరునవ్వు మాత్రం ఎన్నడూ చెదరలేదు. తప్పక, ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు, వాళ్ళ నాన్నగారే కిడ్నీ ఇచ్చారు. తర్వాత తన ఆరోగ్యం బాగా మెరుగు పడింది.మెల్ల మెల్లగా మామోలుమనిషి అయ్యాడు. ఆనందపడ్డాం. తను అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు. విధే ఓడిపోయింది అనుకుని, ఊపిరి పీల్చుకున్నాం.
జీవితం పరుగులో దారులు వేరయ్యాయి, తర్వాత ఎప్పుడూ కలవనేలేదు.. కానీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మాత్రం మనిషి అంటే అలా ఉండాలి, అని అనిపించేది. చిన్న చిన్న సమస్యలకే విరక్తి చెంది ప్రాణాలు తీసుకునే యువతను చూసినప్పుడు ఫణి నుంచి మనమందరం నేర్చుకోవాల్సింది చాలానే ఉంది అనుకునేవాణ్ణి.
తర్వాత ఇన్నాళ్ళకి, అకస్మాత్తుగా, తను ఇక లేడు, అనే వార్త తెలిసింది. ఏడాదిగా మళ్ళీ డయాలిసిస్ మీద ఉన్నాడంట . మాటల్లో పెట్టలేని షాక్ కి గురయ్యాను. గుండె బరువైపోయింది. కన్నీళ్ళు ఆగలేదు. వైద్య పరిభాషలో దీనికి ఏవేవో కారణాలు ఉండి ఉండవచ్చు, కానీ నేను ఒప్పుకోలేను. చాలా అన్యాయం అనిపించింది. పోరాడి నిలబడిన యోధుడుని ఇంత సులువుగా తనతో తీసుకెళ్ళే హక్కు ఎవరిచ్చారు మృత్యువుకి ? మరణం మనిషికి మరొక్క అవకాశం ఎందుకు ఇవ్వదు ? ఇలాంటివి విన్నప్పుడే నాకు అనిపిస్తుంది అసలు దేవుడున్నాడా అని.. ఒక వేళ ఉన్నా ఇంత దయలేని వాడు దేవుడెలా అయ్యాడని.
ఇప్పుడు ఈ నాలుగు లైన్లు రాసుకోడానికి అర్థమేమీ మిగల్లేదు.. నాకు తెలుసు. పదిమందీ గుర్తుకు పెట్టుకునేలా ఫణి ఏమీ సాధించక పొయుండొచ్చు కూడా. కానీ, తను జీవితంతోనూ పోరాడాడు.. మరణంతోనూ పోరాడాడు. చిరునవ్వు చెదరకుండా.. నా దృష్టిలో గెలుపు తనదే.. ఒక్కటి మాత్రం నిజం, తనను దగ్గరగా చూసిన వాళ్ళ హృదయాల్లో తను ఎప్పటికీ సజీవంగానే ఉంటాడు. తను నింపిన స్పూర్తీ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. విడదీసానని విర్రవీగే మృత్యువు, మనిషిని తీసుకెళ్ళ గలదు కానీ.. జ్ఞాపకాల్ని కాదు.

Friday, January 8, 2010

బేతాళ ప్రశ్నలు

యండమూరి కొత్త పుస్తకం "బేతాళ ప్రశ్నలు" ఈ మధ్యే చదువుతున్నాను. "పాండిత్యం, తెలివి, అనుభవం, హేతువాదం, నైపుణ్యం, అన్నీ కలిస్తే వచ్చేది జ్ఞానం. విడివిడిగా వాటికి అంత ప్రాముఖ్యత లేదు." ఈ వాక్యం పుస్తకం ఉపోద్ఘాతం లోనిది. నిజమే అనిపించింది. జ్ఞానం అంటే విషయాలను తెలుసు కోవడమేకాదు కదా! తెలుసుకున్న దాని వెనుక అసలు అర్థం విశ్లేషించుకోగలగడం... అవసరమైన చోట ఉపయోగించుకోగలగడం.

యండమూరి పుస్తకంలా లేదు, అనే బాధ కొద్దిగా ఉంది కానీ, పుస్తకం చాలా బావుంది. ఎక్కడెక్కడో విన్న, చదివిన పజిల్స్ ని కథల్లా అద్భుతంగా ప్రెజెంట్ చేసారు. నిజంగానే నేను ఇంటెర్వ్యూల్లో ఎదుర్కున్న ప్రశ్నలు చాలా ఈ పుస్తకం లో దర్శనమిచ్చాయి. ఆశ్చర్యమనిపించింది. ఇలాంటి పుస్తకాలు చదవడం వలన నాకు రెండు లాభాలు కనిపిస్తున్నాయి. ఒకటి: ఆ ప్రశ్నలకు జవాబు మనకి తెలుస్తుంది. రెండు: ఇలాంటి సమస్యలకి, ఇలా కూడా ఆలోచించొచ్చు అని అర్థం అవుతుంది. ఏ టెంత్ క్లాసో చదువుతున్న విధ్యార్థికి కానుకగా, ఖచ్చితంగా ఇవ్వగలిగిన పుస్తకం. ఇటువంటి ప్రయోజనకరమైన పుస్తకాలు యండమూరి నుంచి (వీళ్ళనేం చేద్దాం లాంటివి కాదు) ఇంకా ఆశిస్తూ ......

"గొప్ప గొప్ప విషయాలన్నీ లావుపాటి పుస్తకాల్లోనే ఉండవు.. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలేకానీ, ఓ చందమామ కథో, వేమన పద్యమో చాలదూ ?"

Friday, January 1, 2010

నువ్వు-నేను

వెలుగు చీకట్లు మనిషిలోనూ దోబూచులాడుతుంటాయి. చిరునవ్వులైనా, కన్నీళ్ళైనా అది మనలోపలనుంచి రావాల్సిందే. మరి అలాంటప్పుడు మన ఆనందం ఎప్పుడూ మన ఆధీనంలోనే ఉండాలి కదా ? అందుకే నాకనిపిస్తుంది, ప్రతీ మనిషిలోనూ కనీసం రెండు వ్యక్తిత్వాలు అనుక్షణం పోటీ పడుతుంటాయేమో..అని. ఏది చివరకి విజయం సాధిస్తే, అది మన ప్రవర్తన గా బయటకు కనిపిస్తుంది, ఆ క్షణానికి. అందుకే నేను గట్టిగా నమ్ముతాను, గెలుపైనా, ఓటమైనా.. అది నాతోనే.. నాలోనే. ..
ఇలాంటి ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఒక కవిత ( కవిత లాంటిది :-) ) రాసి ఆ మధ్య ఎప్పుడో కిరణ్ ప్రభ గారికి కి పంపించాను, అది ఈ రోజు కౌముది లో దర్శనమిచ్చింది. వీలున్నప్పుడు తప్పక చూడండి.
(కౌముది లింక్: http://www.koumudi.net/Monthly/2010/january/index.html )