Saturday, January 30, 2010

ఆశ గొప్పదా ? సంతృప్తి గొప్పదా ?

ఆశ గొప్పదా ? సంతృప్తి గొప్పదా ? ఓ రెండు రోజులుగా ఎందుకో ఈ ఆలోచన బుర్రలో తిరుగుతోంది. ఏదైనా సాదించాలనే కోరిక, ఆశ లేకపోతే జీవితం వృధా అనిపిస్తుంది నాకు. నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండాలి. రేపు తలుపు తట్టేలోపు ఏదో ఒక్క విషయంలోనైనా తనను తాను గెలవాలని... లేనిదేదో పొందాలని అనుకోవడం సహజం.. సమంజసం కూడా. కానీ అలా అని ఎప్పుడూ లేనిదానికోసం పరుగే అంటే.. సాధించినది ఎప్పుడు అనుభవిస్తాం... ఆనందంగా ఓ నాలుగు క్షణాలు గడపలేకపోతే ఏం ఆశించినా.. ఏం సాధించినా ఏం ఉపయోగం ? కనిపిస్తూ నడిపించే ఆ గమ్యం, ఆశ అయితే, ఆ దిశగా పడే ప్రతీ అడుగునీ సంతృప్తి తోనే నింపుకోవాలి. అప్పుడే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చివరికి సాధించిన దానికి ఒక అర్థం మిగులుతుంది.

దూరం నుంచి చూస్తే ఈ రెండూ పరస్పర విరుద్ధంగానే కనిపిస్తాయి.. కానీ జీవితానికి ఈ రెండూ ముఖ్యమైనవే. ఆలోచించి చూస్తే ఈ రెండూ ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్థమౌతుంది. ఆశ గెలిపిస్తుంది.. సంతృప్తి ఆనందాన్ని ఇస్తుంది.. ఆ రెండూ కలిస్తేనే అసలు విజయం.

పారే ఏరు ఏ ఒక్క మజిలీతోనూ పరుగులాపదు.. అలా అని మార్గమంతా పచ్చదనంతో నింపకామానదు.. మనిషి జీవితమూ అంతే. రోజంతా శ్రమించాక, రేయి నిదురపుచ్చుతుంటే, సాధించింది.. పొందినది.. ఓ సంతృప్తి నివ్వాలి.. అలసట తీర్చాలి. కానీ రేపు మీద ఉన్న ఆశ,.. తెలవారక ముందే నన్ను మేల్కొలపాలి. ఇంకో సూర్యోదయంతో నాకు తోడు రావాలి..

ఒక్కటి మాత్రం నిజం.. నేను సాధించిన దాని విలువ, దానిని నేను ఎలా అనుభవించానో అన్నదాని మీదే ఆధారపడి ఉంది. కాదంటారా ?

2 comments:

  1. కాదని ఎందుకంటామండి మీరు చెప్పింది అక్షరాల నిజం!
    కాని అందరు వాళ్ళలో ఉన్న విషయాన్ని చూసుకొకుండా లెని దాని కోసం నిరాస చెందుతుంటారు
    అలాంటి వారికి మీ పోస్ట్ కనువిప్పు కావలని కోరుకుంటూ...

    ReplyDelete
  2. నిజమే ఆశలేనిదే జీవితం లేదు కాని,
    తృప్తి లేని జీవితం నరకమె .....

    ReplyDelete