Saturday, February 27, 2010

ఆకర్ష.. ఆకర్ష...

ఏదైనా ఒక వ్యవస్థీకృత విధానం ద్వారా ఓ సముద్ర తీరం యొక్క మొత్తం బరువుని లెక్కించగలమా ? ఒక్కో ఇసుక రేణువునీ తూస్తూ..

ఎందుకంటే, ప్రతీ చిన్న ఇసుక రేణువు ఒక నిర్ధిష్ఠమైన బరువుని (ద్రవ్య రాశిని) కలిగి ఉంటుంది. అందువలన ఖచ్చితంగా ఆకర్షణ శక్తినీ కలిగి ఉంటుంది. కానీ చాలా స్వల్పమైన. ఎంత తక్కువ అంటే, మనం గుర్తించలేనంత.. మనం "లేదు" అని భ్రమపడేటంత.. కానీ కలిగే ఉంటుంది. సరిగ్గా అలాంటి కొన్ని వేల కోట్ల ఇసుకురేణువులను ఒక్కచోటికి చేర్చి, ఒకదానితో ఒకటి జోడిస్తే, మరో చందమామ లా.. ఆ స్వరూపానికి ఎంత ఆకర్షణ శక్తి ఉంటుంది ? భూమ్మీద ఉన్న అన్ని మహాసముద్రాలను పైకీ, క్రిందకీ కదిపేటంత.. వినడానికి కొంత వింతగా ఉన్నా, ఇది నిజమే. కాదనలేం.

ఇప్పుడు ఇదే ఉదాహరణలో 'ఇసుక రేణువు' కి బదులు, 'ఒక ఆలోచన' ని చేరిస్తే ? మనిషి మెదడులోని ఒక ఆలోచనకి ఎంతోకొంత ద్రవ్యరాశిని ఆపాదిస్తే.. అందువలన ఎంతోకొంత (కొలవలేనంత) ఆకర్షణ శక్తి కూడా ఆ ఆలోచనకి ఉందని నమ్మగలిగితే... ఆ శక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అతి స్వల్పంగానైనా ప్రభావితం చెయ్యగల్గుతుంది కదా మరి.... ఒకే సమయంలో, కొన్ని వందల కోట్ల మెదళ్ళలోని ఆలోచనలు ఒకే దిశలో, ఒకే విషయంపై కేంద్రీకృతం అయితే .. ఆ వందల కోట్ల ఆలోచనల వలన ఉద్భవించే శక్తి, ఈ ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యగల్గుతుందా.. మనం గుర్తించేటంత ...

ఈ అనంతమైన సృష్ఠిలో ఉన్నదంతా తనకి తెలుసనీ, తనకి తెలియనిది ఈ సృష్ఠిలో ఉండదనీ అని అనుకోవడమే మనిషి మొదటి బలహీనత.

(Dan Brown రాసిన "The Lost Symbol" ఈ మధ్యే చదివాను. అందులోని ఒక పేరాని సరదాగా నా మాటల్లో రాసాను.)

Sunday, February 14, 2010

My Name Is Khan

ఓ రెండ్రోజుల క్రితం విడుదల అయిన షారుఖ్ ఖాన్ మూవీ "My Name Is Khan" ని, ఈ రోజే చెన్నై మాయాజాల్ లో చూసాం. ఈ మూవీ గురించి వచ్చిన హైప్ అంతా ప్రక్కన పెడితే, సినిమా బానే వుంది. గొప్పగా మాత్రం లేదు. కరణ్ జోహర్ అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా అంతా US లోనే చిత్రీకరించబడింది. నిజానికి కథే US లో నడుస్తుంది. 9/11 సంఘటనల తరువాత US లాంటి దేశాల్లో ముస్లింలు ఎదుర్కుంటున్న వివక్షను ఉద్ధేశించి తీయబడిన చిత్రం ఇది. సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకెండ్ హాఫ్ బావుంది. ఒక విధమైన మానసిక రుగ్మత వున్న వ్యక్తి పాత్రలో షారుఖ్ నటన అద్భుతం. కానీ అసలు కథాంశమే కొంచం బలహీనం గా వుంది. కొన్ని సన్నివేశాలు కంట తడి పెట్టించడం ఖాయం. కొన్ని ఆలోచింపచేస్తే, మరికొన్ని "అంత లేదేమో" అనిపిస్తాయి. కథ గొప్పగా లేకపోయినా, అనవసరమైన చెత్త మాత్రం లేదు. NRI లకి ఖచ్చితంగా నచ్చుతుంది. మా చెన్నై లో మాత్రం, ఆఖరి అరగంటా కొన్ని సీట్లు ఖాళీ అయిపోయాయి.. ఆశ్చర్యం అనిపించలేదు. "Beautiful Mind", "Forrest Gump" లాంటి సినిమాలు నచ్చుకున్న ప్రేక్షకులు ఖచ్చితం గా చూడొచ్చు. కానీ "3 Idiots" చూసిన మూడ్ లో వెళ్తే మాత్రం, ఇంటెర్వల్ కి ఇంటికి వచ్చేసే ప్రమాదముంది.

Saturday, February 13, 2010

ముందు తెలిసెనా ప్రభూ...

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త

ముందు తెలిసెనా ప్రభూ..
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త
ముందు తెలిసెనా ప్రభూ..

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద సుమదళములు పరువనా
సుందర మందార కుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త
ముందు తెలిసెనా ప్రభూ..

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త
ముందు తెలిసెనా ప్రభూ..


మేఘసందేశం లోని "ముందు తెలిసెనా" పాటని, మనీషా అనే చిన్నారి z-తెలుగులో నిన్న రాత్రి వచ్చిన సరిగమప లిటిల్ చాంప్స్ లో అద్భుతం గా పాడింది. ఎందుకో నాకు ఆ పాట భావం ఒక చిన్నారి పాడటం వలన ఇంకా అపురూపంగా అనిపించింది. గీతాంజలిని గుర్తు చేసింది.

దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును..


ఎంతటి తీయని భావన!! ఇలా రాయగల్గడం ఒక్క దేవులపల్లికే సాధ్యం అనుకుంటా..
ఇంత అందమైన కవితకి అంతటి అందమైన ట్యూన్ అందించిన రమేష్ నాయుడికి కూడా hats-off.

రాతిరైతే చాలు, చీకటంతా నీ వెలితితో నింపేసుకుంటాను..
నువ్వు నన్ను కోరి వచ్చే వేళ.. నీకు "నేను" ఎక్కడ అడ్డొస్తానో అని భయపడి..
నన్ను నేను మరచిపోయి .. మైమరచిపోయి నీకోసం వేచిచూస్తాను..
ఏ వెన్నెల రాత్రో వస్తావు నువ్వు.. నాకు మాత్రం వినపడేలా గుసగుసలాడతావు..
నేను గుండెలో దాచుకున్న ఊసులన్నీ నీ గొంతులో పలికిస్తావు... సంబరపడిపోతాను..
అది కలో.. నిజమో... తెలీక కలవరిపడిపోతాను.. కనులు తెరిస్తే కల కరిగి నువ్వు మాయమైపొతే...
నీ చల్లని చేతిని నా గుండెల మీద వుంచి.. చైతన్యాన్ని నింపేస్తావు..
నువ్వు నాతో ఉన్నావు అనే ఊహకే.. పరవశించి నా హృదయం వర్షిస్తుంది..
కన్నీళ్ళనుకోకేం...
నీకోసం నాలో నేను ఇన్నాళ్ళూ పాడుకున్న పాటని నీకు వినిపించాలనుకుంటాను..
కానీ నా మాట మౌనమౌతుంది..
నీకు మాత్రం అన్నీ వినిపిస్తున్నట్టే వుంటావు.. మెచ్చుకుంటావు..
కనులు తెరవకుండా.. నిన్ను చూడకుండా..
ఎంతసేపని నన్ను నేను కట్టడి చేసుకోను..
ధైర్యం చేసి కళ్ళు తెరుస్తానా.. నువ్వు మాయమైపోతావు..
నా గుండెల మీద నీ చేతిస్పర్శ నన్ను పలకరిస్తూనే ఉంది..
నాకు తెలుసు.. నీ రాక కల కాదులే...
మళ్ళీ అలాంటి వెన్నెల రాతిరి కోసం నేను ఎదురు చూస్తుంటాను..

Thursday, February 4, 2010

ఏం ఆలోచన అది.. ?

ఏం ఆలోచన అది.. ?
అన్ని కోణాల్లోనూ ఓటమిని చూపిస్తుంది..
ప్రతీ ఓటమికి నన్నే భాద్యుణ్ణి చేస్తుంది.

ఏం ఆలోచన అది.. ?
నలుగుర్లోనూ ఒంటరిని చేస్తుంది..
ఒక్కడినే ఉన్నా, ఇంకా ఒంటరితనం కావాలంటుంది.
నన్ను ఒదిలి నేను ఎక్కడికిపోను ?

ఏం ఆలోచన అది.. ?
అందర్నీ, అన్నింటినీ ద్వేషిస్తుంది..
నన్ను నేనే ద్వేషించుకునేలా చేస్తుంది..
అందులోనే ఓదార్పుని వెతుక్కుంటుంది.

ఏం ఆలోచన అది.. ?
నా వ్యక్తిత్వాన్ని దూదిపింజెలా తీసిపారేస్తుంది..
ఎంత బలహీనుణ్ణి చేస్తుందంటే, ..
నాకు నేనే భయపడేటంత..

గుండె ధైర్యాన్ని కొల్లగొట్టి,
ఆశని మొదళ్ళకి నరికి,
కన్నీళ్ళను నాకు కానుకగా ఇచ్చి..
తానే గెలిచాననుకుని వెళ్ళిపోతుంది.

ఏం ఆలోచన అది.. ?

జ్ఞాపకమై, గుర్తొచ్చీ బాధించే ఆ ఆలోచన..
దుఃఖం కాక మరేమిటి ?

(ఆ పైనున్న స్వర్గ నరకాల మాటేమో కానీ, ఇక్కడున్నంత వరకూ, ఆనందం స్వర్గమే, నరకమంటే దుఃఖమే.. మరి అవి ఎవరి చేతిలో ఉన్నట్టు ? )