Monday, April 19, 2010

ఒక్క క్షణం

నా సహోద్యోగి, తన కజిన్ గురించి గురించి చెబితే నిర్ఘాంతపోయాను. కన్నీళ్లు, దుఃఖం, నిర్వేదం .. ఈ మాటలేవీ సరిపోవు, నాకు ఆ క్షణం అనిపించిన దానికి. ఎవరి జీవితమైనా ఒక్క క్షణం లో ఆగిపోయేదే... కానీ ఈ ఒక్క క్షణం నా జీవితాంతం వెంటాడుతుంది. రాతలన్నీ పై వాడివే ఐతే, ఇంకెందుకు ఆ గుండెతడి.. చప్పుడు. అర్థమే లేదు.

http://findmahesh.com/

Sunday, April 18, 2010

నో మాన్స్ ల్యాండ్

బాగా టైం ఉన్నప్పుడు ఏదో తెలియని టీవీ చానల్ లో బాష కూడా అర్థం కాని సినిమా చూసే ప్రయత్నం చెయ్యడం, నాకు ఉన్నఒక వింత అలవాటు. నిన్న అలానే జీ వరల్డ్ మూవీస్ లో "నో మాన్స్ ల్యాండ్" మూవీ చూసాను. దాదాపు గా అర్థం అయ్యిందనే చెప్పుకోవాలి. బోస్నియా, సెర్బియా యుద్ధ నేపధ్యం లో సాగిన చిత్రం ఇది. సన్నివేశాలు కూడా బోస్నియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ బాషల్లోనే వుంటాయి. యుద్ధం యొక్క సంక్లిష్టత, అసంబద్దత, దగాకోరుతనాన్ని హృద్యంగా చిత్రీకరించారు. వైరి వర్గాలకి చెందిన నలుగురు సైనికులు "నో మాన్స్ ల్యాండ్" (సరిహద్దుల మధ్య ఏ వర్గానికీ చెందని ప్రదేశం) లో తారస పడతారు. వెనువెంటనే జరుపుకున్న కాల్పుల్లో, ఒక సైనికుడు మరణించగా, రెండో వర్గానికి చెందిన మరో సైనికుడు ఒక ల్యాండ్ మైన్ మీద అపస్మారక స్థితి లో మిగిలిపోతాడు, అలా మొదలౌతుంది చిత్రం. కొద్దిపాటి గాయాలతో మిగిలి ఉన్న ఇద్దరు సైనికులు ఒకరినొకరు దూషించుకోవడం, యుద్ధానికి మీదే బాధ్యత అని తప్పుపట్టుకోవడంతో, ఈ లోగా ఆ మూడో సైనికుడికి స్పృహ రావడం తో సగం సినిమా అయిపోతుంది. యుద్ధం యొక్క తీవ్రత, దాని వెనుక ఛిద్రం అయ్యే బ్రతుకులు, అద్భుతం గా చెప్పుకొచ్చారు. పరస్పర దూషణల అనంతరం, వాళ్ళు కాస్త మెత్త బడతారు, సానుభూతి చూపించుకుంటారు, కానీ మళ్లీ వాదించుకుంటారు. ఈ లోగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫ్రెంచ్ సైనికులు, మీడియా, సంఘటనా స్థలానికి చేరుకుంటారు. మీడియా ఫోకస్ వల్ల తప్పక UN సైనికులు రంగంలోకి దిగుతారు, సహాయం చెయ్యడానికి. అప్పటికే వేడెక్కి ఉన్న ఆ ఇద్దరు సైనికులు కాల్పులు జరుపుకోడంతో, ఒక UN సైనికుడు కూడా కాల్పులు జరుపుతాడు, పర్యవసానంగా ఆ ఇద్దరు సైనికులూ మరణిస్తారు. ఆ లాండ్ మైన్ మీద పడివున్న సైనికుడిని రక్షించడం అసాధ్యం అని గ్రహించిన UN సైనికులు, అతడిని అలానే వొదిలేసి, మీడియాకి మాత్రం, ల్యాండ్ మైన్ తీసేసామని, అంతా అయిపోయిందని చెప్పి, ఏమార్చి మెల్లగా జారుకుంటారు. చివరికి ఆ ఒక్క సైనికుడు మాత్రం ఆ మైన్ మీద అలానే పడివుంటాడు, చీకటౌతున్నఆకాశాన్ని చూస్తూ. .

ఈ అగ్ర దేశాల ఆధిపత్య పోరు, శాంతి సైన్యాల అసలు స్వభావం, నిర్లిప్తత అర్థవంతం గా చూపించారు, యుద్ధం వెనుక మానవీయ కోణాన్ని మనసుకి హత్తుకునేలా ఆవిష్కరించారు. సినిమా చూసిన చాలా రోజుల వరకూ వెంటాడే సినిమా ఇది, ఖచ్చితంగా. సినిమా మధ్యలో ఓ ఫ్రెంచ్ సైనికుడు చెప్పే ఈ మాట మొత్తం సినిమాకే హైలైట్. "Neutrality does not exist in the face of murder. Doing nothing to stop it is, in fact, choosing. It is not being neutral."

Sunday, April 11, 2010

అసంపూర్ణం

చాలా రోజులకి ఓ నాలుగు లైన్లు రాసుకునే వీలు చిక్కింది. అనుకున్నది రాసాను, కానీ అనుకున్నదే అసంపూర్ణం. దానికి నా అక్షరాలని తప్పు పట్టలేక, అలానే పోస్ట్ చేస్తున్నాను.


ఎందుకీ పరుగు..
ముళ్ళ దారిలో రాలిన పూల రెక్కలను వెతుక్కుంటూ..
ఎక్కడికీ ప్రయాణం..
చిరునవ్వులూ.. కన్నీళ్లు..
రెప్ప పాటులో,
వెలుగు చీకట్లై దోబూచులాడుతుంటే..
ఏదో ఒక రోజు నేను చేరుకుంటానా ఆ తెలియని గమ్యాన్ని .. ?
ఆస్వాదించే ఓ రెండు క్షణాలైనా గుండె పై జేబులో దాచుకోపోతే..
ఎందుకీ ఆరాటం .. ఏం పోగాట్టుకుంటామని ..
కల చెరపకుండా కనులు తెరిస్తే...
ఓ రెండు వెలుతురు చినుకులైనా పెదవులని తడపకపోతే ...
ఇంకెందుకీ ఈ ఆవేశం .. ఏం పొందాలనీ...
ప్రేమ అర్పించుకోమంటే .. జీవితం దక్కించుకోమంటోంది.
మనిషి మనిషి కి మారే మనసు కథకి ..
క్షణంకోలా ఏమార్చే బ్రతుకు వ్యధకి ..
ఏదీ విశ్రాంతి ..
ఏది నిజం .. ఏది అబద్దం ..
పారే ఏరు కన్నా ..
పోటెత్తే వరదలో నాకు అమాయకత్వం కనిపిస్తుంది ..
దాని అహంకారానికి జాలేస్తుంది ..
జీవితమూ అంతే...
కాలం తో పాటు కొట్టుకుపోతూ ..
ఆ వేగం నాదే అని బ్రమపడటం ..
అసలు గమ్యం .. పరుగెత్తే వేగం లో లేదు .
సాధించినదాన్ని, సాధించాల్సినదాన్ని అర్థం చేసుకోవడం లో వుంది .
దారి చివరన పడివున్న బండరాయిలో లేదు..
ఎంచుకున్న దారిలో వుంది ..
దారిపొడుగునా ఏరుకున్న పూల రెక్కలలో వుంది ..
ఎవరు చెప్తారు ఈ నిజం ..