Sunday, April 18, 2010

నో మాన్స్ ల్యాండ్

బాగా టైం ఉన్నప్పుడు ఏదో తెలియని టీవీ చానల్ లో బాష కూడా అర్థం కాని సినిమా చూసే ప్రయత్నం చెయ్యడం, నాకు ఉన్నఒక వింత అలవాటు. నిన్న అలానే జీ వరల్డ్ మూవీస్ లో "నో మాన్స్ ల్యాండ్" మూవీ చూసాను. దాదాపు గా అర్థం అయ్యిందనే చెప్పుకోవాలి. బోస్నియా, సెర్బియా యుద్ధ నేపధ్యం లో సాగిన చిత్రం ఇది. సన్నివేశాలు కూడా బోస్నియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ బాషల్లోనే వుంటాయి. యుద్ధం యొక్క సంక్లిష్టత, అసంబద్దత, దగాకోరుతనాన్ని హృద్యంగా చిత్రీకరించారు. వైరి వర్గాలకి చెందిన నలుగురు సైనికులు "నో మాన్స్ ల్యాండ్" (సరిహద్దుల మధ్య ఏ వర్గానికీ చెందని ప్రదేశం) లో తారస పడతారు. వెనువెంటనే జరుపుకున్న కాల్పుల్లో, ఒక సైనికుడు మరణించగా, రెండో వర్గానికి చెందిన మరో సైనికుడు ఒక ల్యాండ్ మైన్ మీద అపస్మారక స్థితి లో మిగిలిపోతాడు, అలా మొదలౌతుంది చిత్రం. కొద్దిపాటి గాయాలతో మిగిలి ఉన్న ఇద్దరు సైనికులు ఒకరినొకరు దూషించుకోవడం, యుద్ధానికి మీదే బాధ్యత అని తప్పుపట్టుకోవడంతో, ఈ లోగా ఆ మూడో సైనికుడికి స్పృహ రావడం తో సగం సినిమా అయిపోతుంది. యుద్ధం యొక్క తీవ్రత, దాని వెనుక ఛిద్రం అయ్యే బ్రతుకులు, అద్భుతం గా చెప్పుకొచ్చారు. పరస్పర దూషణల అనంతరం, వాళ్ళు కాస్త మెత్త బడతారు, సానుభూతి చూపించుకుంటారు, కానీ మళ్లీ వాదించుకుంటారు. ఈ లోగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫ్రెంచ్ సైనికులు, మీడియా, సంఘటనా స్థలానికి చేరుకుంటారు. మీడియా ఫోకస్ వల్ల తప్పక UN సైనికులు రంగంలోకి దిగుతారు, సహాయం చెయ్యడానికి. అప్పటికే వేడెక్కి ఉన్న ఆ ఇద్దరు సైనికులు కాల్పులు జరుపుకోడంతో, ఒక UN సైనికుడు కూడా కాల్పులు జరుపుతాడు, పర్యవసానంగా ఆ ఇద్దరు సైనికులూ మరణిస్తారు. ఆ లాండ్ మైన్ మీద పడివున్న సైనికుడిని రక్షించడం అసాధ్యం అని గ్రహించిన UN సైనికులు, అతడిని అలానే వొదిలేసి, మీడియాకి మాత్రం, ల్యాండ్ మైన్ తీసేసామని, అంతా అయిపోయిందని చెప్పి, ఏమార్చి మెల్లగా జారుకుంటారు. చివరికి ఆ ఒక్క సైనికుడు మాత్రం ఆ మైన్ మీద అలానే పడివుంటాడు, చీకటౌతున్నఆకాశాన్ని చూస్తూ. .

ఈ అగ్ర దేశాల ఆధిపత్య పోరు, శాంతి సైన్యాల అసలు స్వభావం, నిర్లిప్తత అర్థవంతం గా చూపించారు, యుద్ధం వెనుక మానవీయ కోణాన్ని మనసుకి హత్తుకునేలా ఆవిష్కరించారు. సినిమా చూసిన చాలా రోజుల వరకూ వెంటాడే సినిమా ఇది, ఖచ్చితంగా. సినిమా మధ్యలో ఓ ఫ్రెంచ్ సైనికుడు చెప్పే ఈ మాట మొత్తం సినిమాకే హైలైట్. "Neutrality does not exist in the face of murder. Doing nothing to stop it is, in fact, choosing. It is not being neutral."

1 comment:

  1. Anti personnel mine is deliberately planted under the soldier who was unconscious, believing that he was dead. The intention was that when the other side army personnel come and try to take the body, the mine jump up (its made like that)and explodes killing all around. That was the nefarious idea of planting such a mine.

    The solder was not dead but only fainted. He is one of the major characters in the movy.

    Do you know, this movy got oscar beating our Lagarn.

    In the category of best foreign film, Lagan was nominated for Oscar. But this movy "No Man's Land" beat Lagan and got the Oscar for that year. No regrets, No Mans Land is a fine movy which should be seen with English subtitles. There are very very sharp dialogues in it.

    ReplyDelete