Monday, May 31, 2010

ప్రేమంటే... ఎన్ని అర్థాలో..

ప్రేమంటే ?
ఈ ప్రశ్న నన్ను జీవిత కాలం వెంటాడుతూనే వుంది..

బాల్యమంతా.. ప్రేమ అంటే.. అమ్మే..
అది కావాలి.. ఇది కావాలి అని అమ్మని సతాయిస్తూ..
నవ్వుతూ.. ఏడుస్తూ.. కల్మషం తెలీకుండా..
ఆ క్షణాన.. ఆ ప్రేమ నాకు హక్కు...
ఆ ప్రేమకి తీసుకోవడమే తెలుసు..

ఆ ప్రేమ.. ఒక వరం..

యవ్వనం లో.. ప్రేమ అంటే.. స్నేహాలు.. మోహాలూ..
అది పొందిన క్షణాన ప్రపంచాన్నే గెలిచినంత ఆనందం..
పోగ్గట్టుకుంటే.. కాలం ఆగిపోయినట్టే..
ఆ ప్రేమంతా.. అనుభూతే..
ఆ ప్రేమకి కల్పనే తెలుసు..

ఆ ప్రేమ.. వ్యామోహం..

మూడు పదులు దాటాక.. ప్రేమ అంటే.. కుటుంబం..
ఇది చెయ్యాలి.. అది సాధించాలి..
నా వాళ్ళకి ఇంకా మెరుగైన జీవితం ఇవ్వాలి..
ఆ ప్రేమంతా.. బాధ్యతే..
ఆ ప్రేమకి ఇవ్వడమే తెలుసు..

ఆ ప్రేమ.. వాస్తవం..

ఆరుపదులు దాటాయా.. మళ్లీ ప్రశ్నించుకున్నాను..
వాళ్ళు కావాలి.. వీళ్ళు నన్ను కావాలనుకోవాలి..
అందరూ బావుండాలి.. అందరూ నాతో వుండాలి..
ప్రేమే బలహీనత గా మారిపోయిన క్షణం..
ఆ ప్రేమకి గతమే తెలుసు..

ఆ ప్రేమ... జ్ఞాపకం..

సరిగ్గా.. చివరి సారి.. శ్వాస వొదిలే వేళ..
అదే ఆలోచన.. నాకు తెలీకుండానే... ప్రేమ అంటే..
భగవంతుడే.. సమస్త జగానా వున్నది..
అణువణువునా..ఆయన అమృతత్వమే..
ఆ ప్రేమ హక్కూ కాదు.. బాధ్యతా కాదు..అదే పరమార్థం..
ఆ ప్రేమకి నీ నా సరిహద్దులే తెలీవు..

ఆ ప్రేమ.. అనంతం..

సరిగ్గా ఒక జీవిత కాలం సరిపోయింది..
ప్రేమకు ఉన్న అన్ని అర్థాలూ తెలుసుకోడానికి..
మళ్లీ జన్మంటూ వుంటే..
మళ్లీ ఇలానే నేర్చుకోవాలా ?

Sunday, May 30, 2010

నవీన్

ఆరిజోనా ఫీనిక్స్ లో ఒక బోటు ప్రమాదం, విశాఖపట్టణానికి చెందిన యువ ఇంజినీరు నవీన్ మృతి. కాసేపటి క్రితం టివి లో వార్త చూసి నిశ్చేష్టుణ్ణి అయిపోయాను. నవీన్ తలిదండ్రులు ఇద్దరూ ఆంధ్ర విశ్వ విద్యాలయం లో ప్రొఫెసర్లు. వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటేనే మనసంతా వేదనగా వుంది. ఈ మధ్య కాలం లో ప్రతీ రెండు మూడు వారాలకి ఇలాంటిదో వార్త వింటూనే వున్నాం. ప్రణీత, తరువాత మహేష్.. మళ్లీ ఇప్పుడు నవీన్.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి.. ఉన్నత విద్యకోసమో, మెరుగైన ఉద్యోగాల కోసమో, వెళ్ళిన పిల్లలు, ఇలా హటాత్తుగా జీవితాల్లోంచి మాయమైపోతే, ఆ కుటుంబం తేరుకోడానికి ఒక జీవిత కాలం సరిపోదు. పెద్ద పెద్ద సూట్కేసులు సద్దుకోవడం, ఎయిర్ పోర్ట్ లో సెండాఫ్.. కళ్ళ ముందు మెదులుతుంటే, ఏ కారణాలు.. ఏ ఓదార్పు.. ఏదీ సముదాయించలేదు ఆ కుటుంబాలని. విధి రాతని ఎవరూ మార్చలేరేమో కాని, కడుపులో పెట్టుకుని కాపాడుకున్న పిల్లలు, ఇలా పార్థివ దేహాలై తిరిగి వస్తే, తట్టుకోగల్గడం, అంగీకరించగలగడం అసాధ్యమే ఆ తల్లిదండ్రులకి.

మామోలుగానే అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి ప్రమాదాలకి ఆస్కారం ఎక్కువ, మనవాళ్ళు అలాంటి వాటికి ఎక్కువే ఎక్సపోజ్ అవుతున్నారు కూడా. ముఖ్యం గా లాంగ్ వీకెండ్స్ లో స్నేహ బృందాలతో విహార యాత్రలకు వెళ్ళడం అక్కడ సర్వ సాధారణం. ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలేమో, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించుకుంటే, కొంతవరకూ మానవ తప్పిదం వల్ల జరిగే ప్రమాదాలను అయినా నివారించగల్గుతామేమో. ఆ మధ్య ఎప్పుడో విదేశీ విశ్వ విద్యాలయాలకి కి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు, నేను ముందుగా ఆనందించినది ఈ కారణానికే.

ఈ ప్రపంచీకరణ వలన ఒక రకంగా మన కుటుంబ వ్యవస్థ కూడా చిన్నా భిన్నం అయ్యింది, దానికి తోడు, ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు కాలంతోటి ఈ పరుగు లో మన గెలుపు నిజానికి ఓటమేమో అనిపిస్తోంది.., ఓ 50 ఏళ్ళ క్రితమే జీవితాలు బావుండేవేమో అనిపిస్తుంది నాకు. ఇంకో 50 ఏళ్ళ తరువాతా అలానే అనిపిస్తుందేమో కూడా. ఎందుకంటే పరిణామం వ్యవస్థ స్వభావం.

Wednesday, May 19, 2010

మౌనం .. నీదీ.. నాదీ

ఈ రోజు నాకు తారస పడిన ఈ రెండు లైన్లు కి ముచ్చట పడి.. నా మాటల్లో రాసుకున్నాను..


I plucked a silence from you
I plucked a silence from me
And entwined it into a conversation of sorts..నీ నుంచి ఒక మౌనాన్ని కోసుకున్నాను.
నాలోని మౌనాన్నీ వెతికి పట్టుకున్నాను..
ఆ రెంటినీ కలిపి నాలోనే అల్లుకున్నానా!!..
అదో మధుర భాష్యం అయ్యింది..

నీ నుంచి ఒక్క క్షణం అడిగే తీసుకున్నాను.
నా లోనీ ఆ క్షణాన్ని కోరి ఏరుకున్నాను..
ఆ రెంటినీ కలిపి నాలోలోనే కరిగించుకున్నానా!!
అది నా జీవితం అయ్యింది...

Sunday, May 9, 2010

అమ్మకేం కావాలి ..

అమ్మకేం కావాలి ? అను నిత్యం నన్ను వెంటాడే ప్రశ్న ఇది. ఈ సంక్లిష్ట ప్రపంచం లో నన్ను నిలబెట్టి.. నాకంటూ ఒక జీవితాన్నిచ్చి.. తను మాత్రం, తన ఏకాంతం లోనే ఇంకో జీవితాన్ని ఆవిష్కరించుకునే అమ్మకి ఏంకావాలి ? రోజూ మాట్లాడే సమయం కాకుండా ఏ మధ్యాహ్నమో ఆఫీసు నుంచి కాల్ చేస్తే, సంబరపడిపోయే అమ్మకి ఏంకావాలి ? .. ఏ పండగ రోజునో చెప్పకుండా ఇంటికొచ్చి సర్ప్రైజ్ ఇస్తే, ఆనందం తో కన్నీళ్లు పెట్టుకునే అమ్మకి ఏంకావాలి ? మదర్స్ డే కదా అని ఉదయమే ఫోన్ చేసి విష్ చేస్తే, నేను బ్రేక్ ఫాస్ట్ చేసేనా లేదా అని కంగారు గా అడిగే అమ్మకి ఏంకావాలి ? ..

అమ్మకి ఇవ్వడమే తెలుసు.. అందుకే ఆ భగవంతుడే ప్రత్యక్షమై నాకు ఒక వరాన్నిస్తానంటే, అమ్మకి అమ్మగా నన్ను పుట్టించమంటాను.. అప్పుడు అర్థమౌతుందేమో అమ్మకేం కావాలో.. అప్పుడు ఇవ్వగల్గుతానేమో అమ్మకేం కావాలో..

ఈ రోజు "ఈనాడు ఆదివారం" లో వచ్చిన ఈ రెండు వాక్యాలు నాకు చాలా నచ్చాయి..

"నీకంటూ ఓ అస్తిత్వం లేనప్పుడు కూడా నిన్ను కోరుకుంది. నువ్వెలా ఉంటావో తెలియకపోయినా ప్రేమించింది. నువ్వు కనిపించడానికి గంట ముందు నుంచీ నీకోసం ప్రాణాలర్పించడానికి సిద్ధ పడింది. అమ్మ మనసెంత గొప్పది! "

"అమ్మకి ప్రపంచమే తెలియిదనుకుంటాం. ఆమె ప్రపంచాన్ని వదిలి వెళ్ళాక కానీ అర్థం కాదు, అమ్మ గొప్ప తత్వవేత్త అని. "

అందరికీ "మదర్స్ డే" శుభాకాంక్షలు..