Sunday, June 27, 2010

రాముడు ఎవరో ?, రావణుడు ఎవరో ?

ఆఫీసు వాళ్ళు, టికెట్లు, ఇంటర్వల్ లో తినడానికి ఫుడ్ కూపన్లు కూడా ఇచ్చి పంపిస్తే మొత్తానికి మణిరత్నం "రావణ్" కి వెళ్ళొచ్చా. సినిమా కంటే, మా చెన్నైలో ఈ మధ్యే ప్రారంభం అయిన PVR (స్కైవాక్ మాల్ లో) బావుంది. సినిమా అనుకున్నట్టు గానే చాలా పేలవం గా వుంది. రామాయణ కథకి పోలిన పాత్రలు చిత్రం లో కనిపించినా, కథ మాత్రం కొంచం వేరేగా, తేడాగా, వింతగా వుంది. సినిమా అయిపోయే సరికి రాముడెవరో, రావణుడు ఎవరో అని అనుమానం రావడం ఖాయం. దాదాపుగా, ఓ ఇరవై ఏళ్ళ క్రిత్రం మణిరత్నం తీసిన దళపతి లో కూడా మహా భారత కథ చాయలు కనిపిస్తాయి, కాని ఆ చిత్రం లోని పాత్రలకు ఒక ఔచిత్యం, కథనం లో ఒక వైవిధ్యం కనిపిస్తాయి. ఆ రెండూ లేవు ఈ "రావణ్" లో. అసలు పాత్రల వ్యక్తిత్వాల్లో స్పష్టతే లేదు, కథనమూ మరీ మామోలుగా వుంది. దానికి మణిరత్నాన్నే తప్పు పట్టాలేమో. సినిమా లో నాకు నచ్చినదంటూ ఏమైనా వుంటే., అది సందర్భోచితమైన ఫోటోగ్రఫి మరియు అద్భుతమైన లోకేషన్స్. ఇక నటీనటుల విషయానికి వస్తే, వాళ్ళ కున్న పరిధిలో బానే చేసారనే అనిపించింది, పోల్చాల్సి వస్తే, అందరికంటే ఐశ్వర్య రాయ్ బాగా చేసింది అనే చెప్పాలి. గొప్ప గొప్ప దర్శకులు అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తూనే వుంటారు.. కారణం ఏదైనా.. నైపుణ్యం, అనుభవం ఒక స్థాయి దాటాక ఎవరిమాటా వినవేమో. ఓ ఆరేళ్ళ క్రితం "స్వరాభిషేకం" చూసినప్పుడూ అలానే అనిపించింది నాకు. నిజానికి ఇలాంటి సినిమాలకి వర్మ పెట్టింది పేరు, "అమృత" లాంటి కళాఖండాలు తీసిన మణిరత్నం కూడా ఆ బాట లోకే వెళ్తున్నట్టున్నాడు. సినిమాలో నాకు నచ్చిన డైలాగ్ ఏదా అని ఒక పది నిమషాలు ఆలోచించాను, ఏదీ గుర్తుకు రాలేదు. :-)

Tuesday, June 8, 2010

ఐనిస్టీన్ ఎప్పుడో అన్నాడంట...

ఐనిస్టీన్ ఎప్పుడో అన్నాడంట, "ఈ భూగోళం మీదున్న తేనె టీగలు అన్నీ ఒక వేళ నశించి పోతే, సరిగ్గా అలా జరిగిన నాలుగు ఏళ్లకు మానవాళి కూడా నాశనం అవుతుందని. ". అదే మాట ప్రేమ గురించి చెప్పాల్సి వస్తే ? ఒక్క ఏడాది చాలనేవాడేమో. నిజంగానే మానవాళిని పట్టి పీడుస్తున్న అతి పెద్ద రుగ్మత ప్రేమ రాహిత్యమే. ఎక్కడో చదివాను, మనిషి జీవితం లో మరణం కంటే విషాదం, ప్రేమించ లేకపోవడం అని. నిజమే, ఒకరి ప్రేమను పొందగల్గడం అదృష్టమే కావొచ్చు, కాని ప్రేమించ గల్గడం, నలుగురికీ ప్రేమను పంచగల్గడం ఖచ్చితం గా ఒక వరమే. ఏ మతం లోతుల్లోకి వెళ్ళినా, ఏ గురువు బోధనలు అకళింపు చేసుకున్నా.. చివరకు అర్థమయ్యేది అదే. .. చుట్టూ ఉన్న నలుగురికీ ప్రేమను పంచమని.. ఆ పంచడం లోనే ఉన్న అసలు ఆనందం అనుభవించమని. ఇంత ప్రపంచాన్ని నిర్మించి, చుట్టూ ఉన్న ప్రకృతిలో ఇన్ని వరాలని దాచిన ఆ భగవంతుడు, మనిషి గుండెలో ఉన్న కాస్త ప్రేమను ఎందుకు కాపాడ లేకపోతున్నాడో కదా ?