Saturday, July 31, 2010

మర్యాద మరియు రామన్న ..చెన్నై లో మన తెలుగు "కాసినో" లో మర్యాద రామన్న చూసాం ఈ రోజు. సినిమా బావుంది. సరదా సరదాగా. రాజ మౌళి లాంటి యువ అగ్ర శ్రేణి దర్శకుడు, ఒక హాస్య ప్రధాన చిత్రాన్ని తీయడం మనస్పూర్తిగా అభినందించాల్సిన విషయం. ప్రేక్షకులు "ఒక లాంటి" చిత్రాలే ఆదరిస్తారని దర్శక నిర్మాతలు వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేసి ఒకే లాంటి చిత్రాలు మన మీద రుద్దకుండా అప్పుడప్పుడైనా ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు తీస్తే మనకీ సంతోషమే. రొటీన్ రాజ మౌళి చిత్రాలకి పూర్తిగా భిన్నమైన చిత్రం ఇది. వినోదాత్మకం గా వుండాలి అనే ఒకే ఒక ప్రాధాన్యం తో తీయబడ్డ చిత్రం, హాస్యం అంటే ఓ నలుగురు కమేడియన్స్ మీద ఓ పది అర్థం లేని సీన్లు తీసి అవసరం లేని చోట్ల అతక్కుండా, ఎంచుకున్న కథాంశం లోనే మేళవించాడు రాజ మౌళి.

ఇక కధ విషయానికి వస్తే, ఫాక్షన్ నేపధ్యం ఉన్న కుటుంబం లో పుట్టిన హీరో సునీల్, పగ ప్రతీకారాలే పరువు ప్రతిష్టలు అనుకునే ఆ కుటుంబాలకి దూరం గా ఎక్కడో హైదరాబాద్ లో పెరుగుతాడు. తన బ్రతుకు తెరువుకి డబ్బు కోసం ఒక పొలం అమ్మడం పని మీద సొంతవూరికి వెళ్లి అయిన వాళ్ళే అయినా, పగ వాళ్ళు ఐన కుటుంబానికి చిక్కుతాడు. శత్రువైనా సరే, ఇంటికి అతిధి గా వస్తే మర్యాద చేసే కుటుంబం అది. ఆ ఇంటి గడప దాటి బయటకు వెళ్తే ఇంక తను బ్రతకడని తెలుసుకున్న హీరో ఏవో ఒక కారణాలతో ఆ ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నాలు చెయ్యడం.. చివరకి తప్పక బయటకు వచ్చి వాళ్ళ బారిన పడడం వగైరా.. వగైరా.. ఈ హడావిడ్ల మధ్య ఆ విలన్ కూతురే ఐన హీరొయిన్ కి నచ్చడం.. ఇది మొత్తం మీద కధాంశం. కథ అంతా ఓ పాత ఇంగ్లీష్ మూవీ కాపీ అంటున్నారు. (అవర్ హాస్పిటాలిటి - 1923) అప్పటికి నేను పుట్టనూ లేదు, ఆ సినిమా చూడనూ లేదు కాబట్టి నాకు ఏ అభ్యంతరం లేదు. సినిమా మాత్రం ఏదో కాపీ సినిమా లా అస్సలు లేదు.

హీరో గా సునీల్ బానే చేసాడు, నిజానికి ఈ కథలో హీరో పాత్రకి పెద్ద రాద్ధాంతం ఏమీ లేదు, చాలా సాధారణమైన పాత్ర అది. దానిలో సరిగ్గా సరిపోయాడు సునీల్. కథకి పెద్ద గా అవసరం లేకపోయినా, పాటల్లో డాన్సులు మాత్రం చాలా కష్టపడి చేసాడు. మెచ్చుకోవాలి. సున్నితమైన హాస్యం పండించడం లో చాలా వరకూ విజయం సాధించాడు. మిగతా పాత్రలకు (హీరోయిన్, విలన్తో సహా) పెద్దగా వ్యక్తిత్వం ఆపాదించ బడలేదు, అందుకే వాళ్ళు బాగా చేసారో లేదో చెప్పడం కష్టం. నా వరకూ అయితే హీరో రాజ మౌళీ యే. హీరో సైకిల్ కి రవితేజ వాయిస్ ఓవర్ చెప్పడం బానే క్లిక్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో కథనం ఇంకా బాగుండి ఉండచ్చు అని అనిపించింది. ఒకటి రెండు పాటలు బావున్నాయి కాని, ఒక్క పాటలో మాత్రం ("రాయె సలోని") సాహిత్యం కొంచం నాసి రకం గా అనిపించింది. డైలాగ్లలో కూడా మనకు అలవాటైన పంచ్ లు కొంచం తక్కువే. ఒకటి రెండు పాత్రల మినహా మిగతా అన్ని పాత్రలకు మరీ రెండో శ్రేణి నటీనటులను ఎంపిక చెయ్యడం వలన, కొన్ని సీన్లు రాజ మౌళి అనుకున్నంత పండలేదు. మొత్తం మీద కొంచం కంగారు గా తీసాడేమో అనిపించింది.

కాలక్షేపం కోసం ఖచ్చితం గా చూడచ్చు. మరీ ఎక్కువ అంచనాలతో వెళ్ళకపోతే ఎక్కువ నచ్చుతుంది. సినిమా అంటే ఒక అర్థం, ఒక సందేశం వుండాలి అనుకుంటే మాత్రం, టీవీ లో వచ్చే వరకూ వేచి చూడండి.

ప్రత్యేకం గా గుర్తిండిపోయే డైలాగ్ ఏమీ లేదు కాని, రైలు వేగంగా వెళ్ళిపోతోందని బాధపడే హీరోయిన్ కి హీరో, వెళ్తోంది రైలు కాదు, లోకమే వెనక్కి వెళ్ళిపోతోంది అని కిటికీ లోంచి చూపించడం ఫ్రెష్ గా వుంది.

Monday, July 26, 2010

గీతాంజలి


నా లాగే అడపా తడపా మంచి పుస్తకాలు వెతుక్కుని మరీ చదివే ఒక స్నేహితుణ్ణి, చాలా కాలం తరువాత ఈ మధ్యే మళ్లీ కలిసాను. యోగక్షేమాల అనంతరం మా వాడు సూటిగా ఒక వింత ప్రశ్న వేసాడు.

అంతే తెలియని ఒంటరి ప్రయాణానికి నువ్వు తోడుగా ఒకే ఒక్క వస్తువుని తీసుకెళ్లాలని నిబంధన వుంటే దేన్నితీసుకెళ్తావ్ ? - అని.

"నన్ను" నేను ఖచ్చితం గా తీసుకెళ్తాను అన్నాను. తడుము కోకుండా. :-)
నేను సీరియస్ గా అడుగుతున్నాను.. అన్నాడు కొంచం సీరియస్ గా..
వదిలేటట్టు లేడు అని అర్థం అయ్యింది. ఒక్క క్షణం నిజం గానే ఆలోచించాను.
నేను గీతాంజలి పుస్తకాన్ని తీసుకెళ్తాను తోడుగా.. అన్నా ...
వాడికి నా సమాధానం నచ్చిందో లేదో కాని .. అక్కడితో ఆ టాపిక్ ఆపేసాడు.

నేను మాత్రం ఇంటికి వచ్చాక కూడా ఆలోచించాను. నా సమాధానం నిజమేనా అని.. కొంతసేపటికి నిజమే అని నిర్ధారణ కి వచ్చాను. నా వరకు నాకు, పుస్తకాన్ని మించిన నేస్తం లేదని పిస్తుంది. అద్భుతమైన కవిత్వమైతే ఇంక తిరుగే లేదు. నా దృష్టిలో హృదయం తో రాసిన కవిత్వం అందరికీ ఎంతో కొంత అర్థమౌతుంది.. ఎంత అర్థం చేసుకోగలిగితే అంత అర్థమౌతుంది. గీతాంజలి నిజంగా ఆక్షయ పాత్రే. ప్రేమ తత్వానికి అది పరాకాష్ఠ. అర్పించుకోవడం అంటే కోల్పోవడం కాదు.. పొందడం అని చెప్తుంది గీతాంజలి. నాకు బాగా గుర్తు, మొదటి సారి చలం అనువదించిన గీతాంజలి చదువుతూ వుంటే ఒక రెండు పేజీలు తిరిగే సరికి నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.. చాలా సేపటి వరకూ. వర్షించింది కళ్ళు కాదేమో కూడా. ఒక్కసారి "బెంగాలీ" వచ్చి వుంటే ఎంత బావుణ్ణో కదా అనిపించింది. (ఆంగ్లం లో రాసినది టాగోరే అయినా, అసలు బెంగాలీ మూలం అద్భుతం అంటారు) అందుకేనేమో కవిత్వానికి భాష, కాలం, ఎల్లలు ఏవీ హద్దులు కాబోవు.

"మాట అర్థం ఒక్కటే చెప్తుంది.. వాక్యం కారణాలు అన్వేషిస్తుంది.. కానీ కవిత భావానికి ప్రాణం పోస్తుంది.. మాటకే కాదు.. మాట మధ్య మౌనానికి కూడా ఒక పరమార్థం ఇస్తుంది.. "

గీతాంజలి ముందు మాటలో చలం అంటాడు - "గీతాంజలి అంతరార్థం చలానికేం తెలుసు.. టాగోర్ కెంత మాత్రం తెలుసు ? " ఎంతో లోతైన మాట అది.

"నా ప్రతీ మాటకి వాళ్ళు అర్థాలు వెతుకుతారు..
నువ్వు అంతా చూస్తూనే ఉంటావు..
భావాలన్నింటికి పరమార్థం నువ్వే అయినప్పుడు
నా మాటలన్నీ చేరాల్సింది నీ చెంతకే అయినప్పుడు..
నేను మౌనం గానే వుండిపోతాను..
నీకు అంతా వినిపించింది కదా ?"


చివరగా ఒక ప్రశ్న, మీరైతే ఏం పట్టుకెళ్తారు ? :-)

Sunday, July 25, 2010

ఏకాంతానివా ? ఒంటరితనానివా ?


ఎవరివి నువ్వు ?
నా ఏకాంతానివా ? ఒంటరితనానివా ?

నువ్వు నా వైపుగా వేసే ప్రతీ అడుగు.. నా చే రెండు అడుగులు వెనక్కి వేయిస్తోంది..
నువ్వు నా వైపుగా వేసే ప్రతీ అడుగు.. మన మధ్య దూరం పెంచుతూనే ఉంది.
అద్దం ముందు నిలబడి నేను కాలాన్ని వెనక్కి.. ముందుకి నేట్టేస్తుంటాను..
కానీ ఆ గోడ మీదున్న గడియారం నన్ను చూసి నవ్వుతోందేం ?
గమ్యమంటూ ఏదో ఉంది.. అని నువ్వే నన్ను ఒదారుస్తావు..
కాని దాన్నెలా గుర్తు పట్టడం అది నన్ను దాటుకునిపోయేలోగా.. ?
క్షణం లో మొదలౌతుంది జీవితం.. అంతమయ్యేదీ క్షణం లోనే..
ఆ రెంటి మధ్య ఒక జీవిత కాలం ఎదురు చూపులేనా ?
నేను నిన్ను పొందుతున్నానా.. పోగొట్టుకుంటున్నానా ?
నన్ను నేను వెతుక్కుంటూ..

ఇంతకీ ఎవరివి నువ్వు ?
నా ఏకాంతానివా ? ఒంటరితనానివా ?

Wednesday, July 21, 2010

సో సో .. అండ్ స్లో స్లో - "ఉడాన్"


ఆఫీస్ లో ఓ గంట పర్మిషన్ పెట్టి మరీ చూసాం "ఉడాన్". పెద్దగా అంచనాలతో వెళ్లకపోయినా, వేరే వేరే వెబ్ సైట్స్ లో ఇచ్చిన సమీక్షలు చూసి కొంచం పాజిటివ్ గానే వెళ్ళాం. కానీ మూవీ మరీ అంతగా ఆకట్టుకోలేదు. చాలా స్లో గా, సీరియస్ గా వుంది. ఈ మధ్య కాలం లో ఇంత స్లో narration చూడలేదు. అలా అని సినిమా బావు లేదు అనీ చెప్పలేం. ఏదో పాత ఓ హెన్రీ కథ ని మూడు గంటల సినిమా గా మలిస్తే ఎలా వుంటుందో అలానే వుంది. సినిమా చూస్తున్నంత సేపూ "అబ్బా కథేమిటి అసలు కదలడమే లేదు" అనిపించింది. కానీ అయిపోయే సరికి తీద్దామనుకున్నది బానే తీసాడేమో అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అంతంత సేపు చూడడం మనకి అలవాటు లేని పని, అందుకే కొంత వింతగా అనిపించింది. కానీ నిజజీవితం లో జరిగే pace తో సన్నివేశాలు చిత్రీకరణ సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుణ్ణి ప్రభావితం చేస్తుంది. ఆ కోణాన చూస్తే దర్శకుడి ప్రయత్నం విజయవంతం అయ్యిందనే చెప్పాలి. కొన్నేళ్ళ క్రితం "రైన్ కోట్" అనే సినిమా చూసినప్పుడు నాకు సరిగ్గా ఇలానే అనిపించింది. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు కంటే తరువాతే ఎక్కువ ఆలోచింప చేస్తాయని నా ఆభిప్రాయం.

ఇక కథ విషయం లోకి వస్తే, ఒక బాధ్యత తెలియని తండ్రితో అతని కొడుకు పడే కష్ట నష్టాలు. 17 ఏళ్ళ వయసులో ఎగిరే పక్షి లా స్వేచ్ఛ కోరుకునే కొడుకు.. తండ్రి అంటే జూ లో "క్యూరేటర్" అనుకునే తండ్రి. ఈ ఇద్దరి మధ్యన జరిగే సంఘర్షణే ఈ సినిమా. అసలు కథ చాలా చిన్నది, అందుకే రాసే ధైర్యం చెయ్యడం లేదు. (ఎవరైనా పాపం సినిమా చూద్దామనుకుంటే తిట్టుకోకుండా) మామోలు సినిమా కథల్లో జరిగే అనుకోని మలుపులు, సైకిల్ టైర్ తో పాటు కాల చక్రం గిరగిరా తిరిగి పోవడం, ఇంటర్వల్ తరువాత ఒక ముఖ్యమైన పాత్ర వచ్చి అందరి వ్యక్తిత్వాల్ని మార్చెయ్యడం.. వగైరా.. వగైరా.. ఈ కథలో మనకి కనిపించవు. కథనం మన జీవితాలకి మరీ దగ్గరగా వుండటం తో నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. కథ చివరకి వచ్చేసరికి .. ఇంతకీ ఏం చెప్పాలనీ ఇదంతా .. అని అనిపిస్తుంది. మనిషి జీవితం లోని నిస్సహాయత, బలహీనతలు, మూర్ఖత్వం, కలలు, ఆశలు.. చివరగా స్వేచ్చ, తెగింపు.. ఇవీ నాకు కథలో అంతర్లీనం గా కనిపించినవి. మధ్య మధ్యలో మన హీరో (17 ఏళ్ల కుర్రవాడు) చెప్పే కవితలు, కథలు చాలా బావున్నాయి. సినిమా చివరలో తండ్రికి రాసే ఉత్తరం హైలైట్.

సీరియస్ సినిమాలే చూసే ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు. నాలాంటి సాధారణ ప్రేక్షకులు DVD తో సరి పెట్టుకోవచ్చు. ఏ చానెల్ లోనో వచ్చినప్పుడు చూద్దామనుకుంటే మాత్రం.. రెండో సారి వ్యాపార ప్రకటనలు వచ్చినప్పుడు చానల్ మారిపోయే ప్రమాదం ఎంతైనా వుంది. :-)

Friday, July 16, 2010

మనం వేరుగా ఎందుకున్నాం ?


ప్రతీ రేయి నీ వెలితి తోనే మొదలౌతుంది..
ఈ రాత్రైనా వొస్తావేమో అని ఆశ మిణుకు మిణుకు మంటూ..
ఆ వెలుగులోనే ముస్తాబై గడపకేసి చూస్తూ వుండిపోతాను..

ఏ అర్థ రాత్రో.. ఇంక రావేమో అని భయం మొదలు..
తలుపు దగ్గరకేసి.. వీధి వీధి తిరుగుతాను..
నిన్ను తెలిసిన వాళ్ళనీ.. తెలియని వాళ్ళనీ..
అందరిని అడుగుతాను.. నీ ఆచూకీ...
కానీ ఎవరూ చూపించరేం నిన్ను నాకు...
అడుగు జాడలేక్కడున్నా నీవేనేమో అని ఆశగా చూస్తాను..
నా వేదనని ఓదార్చే వాళ్ళే గానీ..
నిన్ను పట్టుకుని నాకు అప్పగించరేం..

కొందరు నాలానే నిన్ను వెతుకుతూ కనిపిస్తారు..
మరికొందరు గుడిలో బంధించామంటారు..
ఇంకొందరు గుండెలో దాచేసుకున్నామంటారు ..
ఎవరిని నమ్మను నేను.. ?
అయినా వెలుగుతున్న కొవ్వోత్తుని దాచి..
వెలుతురంతా దాచేసామనుకుంటారు వాళ్ళు..
నేను నమ్మను లే..

ఎక్కడెక్కడో నిన్ను వెతుక్కుని ..
బడలికతో ఏ అరుగుమీదో కూలిపోతాను నేను..
మెలుకువ వచ్చేసరికి మళ్లీ నాతో నేనే.. బాగా పొద్దెక్కి పోతుంది.
ఆ చీకట్లో నువ్వే నన్ను అక్కున చేర్చుకున్నావంట కదా..
నువ్వే నన్ను ఎత్తుకుని ఇంటికి చేర్చావంట కదా..
అందరూ చెప్పుకుంటున్నారు.. నేను నమ్మాను లే..

గుండె అంతా గర్వంతో నిండి పోతుంది..
మనసంతా మళ్లీ దిగులే..
నువ్వు లేనిదెక్కడ అని.. నిన్ను నేను వెతకను ?

అవునూ.. ప్రతీ రాత్రీ నువ్వూ నాకోసమే వెతుకుతున్నావా ?
అందరినీ నా గురించే అడుగుతున్నావా ?
వీధి వీధి తిరిగి.. ఎక్కడో పడి ఉన్ననన్ను తిరిగి తెచ్చుకుంటున్నావా ?

నువ్వు అంతగా నన్ను కోరుకుంటున్నప్పుడు ..
నేను వున్నది నీకోసమే అయినప్పుడు..
మనం వేరుగా ఎందుకున్నాం ?

Tuesday, July 6, 2010

కష్టపడకుండా సాధించగలిగేది..


జీవితం లో కష్టపడకుండా సాధించగలిగేది "ఓటమి' ఒక్కటే.. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన వాక్యం ఇది - "The only thing in life achieved without effort is failure"

నిజమే.. కష్టపడకుండా ఏదీ రాదు.. ఒక వేళ ఏ వచ్చినా దానికి విలువ, సార్థకత లేవు.. ఎందుకో సాయంత్రం నుంచి నా ఆలోచన ఈ వాక్యం చుట్టూనే తిరుగుతోంది.

కష్టపడకుండా.. ప్రతిఫలం ఆశించకూడదు.. మొదటి మెట్టు..
కష్టపడినా ప్రతిఫలం ఆశించకూడదు... రెండోది..
కష్టపడటమే.. ఫలం... వేరేగా గమ్యమంటూ లేనే లేదు.. మూడోది.. .

ఓడిన ప్రతిసారీ .. నా అడుగు వేగం ఇంకాస్త పెరుగుతుంది..
ఏదో ఓ రోజు.. ఆ ఓటమైనా ఓడిపోక ఇంకేం చేస్తుంది.. ?

గెలవాలనే "తపనే" నన్ను నడిపిస్తుంది.. గెలిపిస్తుంది..
కానీ గెలిచాక అర్థం అయ్యింది.. అసలు గెలుపు.. ఆ "తపనే" అని...

Sunday, July 4, 2010

నాకు తెలుసు


చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని నేను..
అంధకారాన్ని బంధించాననుకుంటాను.
జ్ఞాపకాల కెరటాల మధ్య ఊగిసలాడుతూ..
కాలాన్ని ఆపేసానని మురిసిపోతాను.

నిన్ను పొందాలనే తాపత్రయం లో నన్ను నేను పోగొట్టుకున్నాను..
"నేను" లేను అని తెలుసుకుని.. నువ్వూ వదిలి వెళ్ళిపోయావు..
ఎవరూ వద్దని అనుకుంటే.. అది ఏకాంతం..
ఎవరూ లేకపోతే.. అది ఒంటరితనం..
కానీ నాలో నేనే లేకపోతే.. దాన్నేమంటారు ..
జీవితం ?

నేను ఓటమిని ఒప్పుకోలేదులే..
నన్ను నేను వెతుక్కుంటూ బయలుదేరాను..
నాకు తెలుసు... నువ్వూ నన్ను పోగొట్టుకోవని...
నాకు తెలుసు..
నువ్వు అనంతానివేమో.. కాని నేను లేకుండా..
నువ్వు అసంపూర్ణానివే..
నాకు తెలుసు.