Wednesday, July 21, 2010

సో సో .. అండ్ స్లో స్లో - "ఉడాన్"


ఆఫీస్ లో ఓ గంట పర్మిషన్ పెట్టి మరీ చూసాం "ఉడాన్". పెద్దగా అంచనాలతో వెళ్లకపోయినా, వేరే వేరే వెబ్ సైట్స్ లో ఇచ్చిన సమీక్షలు చూసి కొంచం పాజిటివ్ గానే వెళ్ళాం. కానీ మూవీ మరీ అంతగా ఆకట్టుకోలేదు. చాలా స్లో గా, సీరియస్ గా వుంది. ఈ మధ్య కాలం లో ఇంత స్లో narration చూడలేదు. అలా అని సినిమా బావు లేదు అనీ చెప్పలేం. ఏదో పాత ఓ హెన్రీ కథ ని మూడు గంటల సినిమా గా మలిస్తే ఎలా వుంటుందో అలానే వుంది. సినిమా చూస్తున్నంత సేపూ "అబ్బా కథేమిటి అసలు కదలడమే లేదు" అనిపించింది. కానీ అయిపోయే సరికి తీద్దామనుకున్నది బానే తీసాడేమో అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అంతంత సేపు చూడడం మనకి అలవాటు లేని పని, అందుకే కొంత వింతగా అనిపించింది. కానీ నిజజీవితం లో జరిగే pace తో సన్నివేశాలు చిత్రీకరణ సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుణ్ణి ప్రభావితం చేస్తుంది. ఆ కోణాన చూస్తే దర్శకుడి ప్రయత్నం విజయవంతం అయ్యిందనే చెప్పాలి. కొన్నేళ్ళ క్రితం "రైన్ కోట్" అనే సినిమా చూసినప్పుడు నాకు సరిగ్గా ఇలానే అనిపించింది. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు కంటే తరువాతే ఎక్కువ ఆలోచింప చేస్తాయని నా ఆభిప్రాయం.

ఇక కథ విషయం లోకి వస్తే, ఒక బాధ్యత తెలియని తండ్రితో అతని కొడుకు పడే కష్ట నష్టాలు. 17 ఏళ్ళ వయసులో ఎగిరే పక్షి లా స్వేచ్ఛ కోరుకునే కొడుకు.. తండ్రి అంటే జూ లో "క్యూరేటర్" అనుకునే తండ్రి. ఈ ఇద్దరి మధ్యన జరిగే సంఘర్షణే ఈ సినిమా. అసలు కథ చాలా చిన్నది, అందుకే రాసే ధైర్యం చెయ్యడం లేదు. (ఎవరైనా పాపం సినిమా చూద్దామనుకుంటే తిట్టుకోకుండా) మామోలు సినిమా కథల్లో జరిగే అనుకోని మలుపులు, సైకిల్ టైర్ తో పాటు కాల చక్రం గిరగిరా తిరిగి పోవడం, ఇంటర్వల్ తరువాత ఒక ముఖ్యమైన పాత్ర వచ్చి అందరి వ్యక్తిత్వాల్ని మార్చెయ్యడం.. వగైరా.. వగైరా.. ఈ కథలో మనకి కనిపించవు. కథనం మన జీవితాలకి మరీ దగ్గరగా వుండటం తో నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. కథ చివరకి వచ్చేసరికి .. ఇంతకీ ఏం చెప్పాలనీ ఇదంతా .. అని అనిపిస్తుంది. మనిషి జీవితం లోని నిస్సహాయత, బలహీనతలు, మూర్ఖత్వం, కలలు, ఆశలు.. చివరగా స్వేచ్చ, తెగింపు.. ఇవీ నాకు కథలో అంతర్లీనం గా కనిపించినవి. మధ్య మధ్యలో మన హీరో (17 ఏళ్ల కుర్రవాడు) చెప్పే కవితలు, కథలు చాలా బావున్నాయి. సినిమా చివరలో తండ్రికి రాసే ఉత్తరం హైలైట్.

సీరియస్ సినిమాలే చూసే ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు. నాలాంటి సాధారణ ప్రేక్షకులు DVD తో సరి పెట్టుకోవచ్చు. ఏ చానెల్ లోనో వచ్చినప్పుడు చూద్దామనుకుంటే మాత్రం.. రెండో సారి వ్యాపార ప్రకటనలు వచ్చినప్పుడు చానల్ మారిపోయే ప్రమాదం ఎంతైనా వుంది. :-)

1 comment:

  1. your convey is nice aalage aa letterlo message kuda convey chesta bagungdedi

    ReplyDelete