Saturday, July 31, 2010

మర్యాద మరియు రామన్న ..చెన్నై లో మన తెలుగు "కాసినో" లో మర్యాద రామన్న చూసాం ఈ రోజు. సినిమా బావుంది. సరదా సరదాగా. రాజ మౌళి లాంటి యువ అగ్ర శ్రేణి దర్శకుడు, ఒక హాస్య ప్రధాన చిత్రాన్ని తీయడం మనస్పూర్తిగా అభినందించాల్సిన విషయం. ప్రేక్షకులు "ఒక లాంటి" చిత్రాలే ఆదరిస్తారని దర్శక నిర్మాతలు వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేసి ఒకే లాంటి చిత్రాలు మన మీద రుద్దకుండా అప్పుడప్పుడైనా ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు తీస్తే మనకీ సంతోషమే. రొటీన్ రాజ మౌళి చిత్రాలకి పూర్తిగా భిన్నమైన చిత్రం ఇది. వినోదాత్మకం గా వుండాలి అనే ఒకే ఒక ప్రాధాన్యం తో తీయబడ్డ చిత్రం, హాస్యం అంటే ఓ నలుగురు కమేడియన్స్ మీద ఓ పది అర్థం లేని సీన్లు తీసి అవసరం లేని చోట్ల అతక్కుండా, ఎంచుకున్న కథాంశం లోనే మేళవించాడు రాజ మౌళి.

ఇక కధ విషయానికి వస్తే, ఫాక్షన్ నేపధ్యం ఉన్న కుటుంబం లో పుట్టిన హీరో సునీల్, పగ ప్రతీకారాలే పరువు ప్రతిష్టలు అనుకునే ఆ కుటుంబాలకి దూరం గా ఎక్కడో హైదరాబాద్ లో పెరుగుతాడు. తన బ్రతుకు తెరువుకి డబ్బు కోసం ఒక పొలం అమ్మడం పని మీద సొంతవూరికి వెళ్లి అయిన వాళ్ళే అయినా, పగ వాళ్ళు ఐన కుటుంబానికి చిక్కుతాడు. శత్రువైనా సరే, ఇంటికి అతిధి గా వస్తే మర్యాద చేసే కుటుంబం అది. ఆ ఇంటి గడప దాటి బయటకు వెళ్తే ఇంక తను బ్రతకడని తెలుసుకున్న హీరో ఏవో ఒక కారణాలతో ఆ ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నాలు చెయ్యడం.. చివరకి తప్పక బయటకు వచ్చి వాళ్ళ బారిన పడడం వగైరా.. వగైరా.. ఈ హడావిడ్ల మధ్య ఆ విలన్ కూతురే ఐన హీరొయిన్ కి నచ్చడం.. ఇది మొత్తం మీద కధాంశం. కథ అంతా ఓ పాత ఇంగ్లీష్ మూవీ కాపీ అంటున్నారు. (అవర్ హాస్పిటాలిటి - 1923) అప్పటికి నేను పుట్టనూ లేదు, ఆ సినిమా చూడనూ లేదు కాబట్టి నాకు ఏ అభ్యంతరం లేదు. సినిమా మాత్రం ఏదో కాపీ సినిమా లా అస్సలు లేదు.

హీరో గా సునీల్ బానే చేసాడు, నిజానికి ఈ కథలో హీరో పాత్రకి పెద్ద రాద్ధాంతం ఏమీ లేదు, చాలా సాధారణమైన పాత్ర అది. దానిలో సరిగ్గా సరిపోయాడు సునీల్. కథకి పెద్ద గా అవసరం లేకపోయినా, పాటల్లో డాన్సులు మాత్రం చాలా కష్టపడి చేసాడు. మెచ్చుకోవాలి. సున్నితమైన హాస్యం పండించడం లో చాలా వరకూ విజయం సాధించాడు. మిగతా పాత్రలకు (హీరోయిన్, విలన్తో సహా) పెద్దగా వ్యక్తిత్వం ఆపాదించ బడలేదు, అందుకే వాళ్ళు బాగా చేసారో లేదో చెప్పడం కష్టం. నా వరకూ అయితే హీరో రాజ మౌళీ యే. హీరో సైకిల్ కి రవితేజ వాయిస్ ఓవర్ చెప్పడం బానే క్లిక్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో కథనం ఇంకా బాగుండి ఉండచ్చు అని అనిపించింది. ఒకటి రెండు పాటలు బావున్నాయి కాని, ఒక్క పాటలో మాత్రం ("రాయె సలోని") సాహిత్యం కొంచం నాసి రకం గా అనిపించింది. డైలాగ్లలో కూడా మనకు అలవాటైన పంచ్ లు కొంచం తక్కువే. ఒకటి రెండు పాత్రల మినహా మిగతా అన్ని పాత్రలకు మరీ రెండో శ్రేణి నటీనటులను ఎంపిక చెయ్యడం వలన, కొన్ని సీన్లు రాజ మౌళి అనుకున్నంత పండలేదు. మొత్తం మీద కొంచం కంగారు గా తీసాడేమో అనిపించింది.

కాలక్షేపం కోసం ఖచ్చితం గా చూడచ్చు. మరీ ఎక్కువ అంచనాలతో వెళ్ళకపోతే ఎక్కువ నచ్చుతుంది. సినిమా అంటే ఒక అర్థం, ఒక సందేశం వుండాలి అనుకుంటే మాత్రం, టీవీ లో వచ్చే వరకూ వేచి చూడండి.

ప్రత్యేకం గా గుర్తిండిపోయే డైలాగ్ ఏమీ లేదు కాని, రైలు వేగంగా వెళ్ళిపోతోందని బాధపడే హీరోయిన్ కి హీరో, వెళ్తోంది రైలు కాదు, లోకమే వెనక్కి వెళ్ళిపోతోంది అని కిటికీ లోంచి చూపించడం ఫ్రెష్ గా వుంది.

2 comments:

  1. బావుంది మీ రివ్యూ. ఇంకా చూడలేదు. ఇంట్లో ఎవరూ లేక బోరింగు గా వుంది కాబట్టి ఈ సినిమా చూడొచ్చేమో.

    ReplyDelete
  2. Movie is really excellent..naku chala nachindi...ayoo meeru casino lo choosara?..bhayankaramaina chetta theatre kada chennai lo kani em chestham telugu movies andulone kada...kaani PVR,Sathyam,Mayajaal lo kuda new telugu movies vesthundatam valla..nenu Casino ki velladam manesa..Maryada Ramanna PVR lo chusa..Casino lo chuste, movie chustunna feel antaga anipinchadu naku...PVR is really good :)

    ReplyDelete