Monday, August 23, 2010

ఎవరివి నువ్వు.. ?


ఎవరివో నువ్వు..
నీ జీవితం వెనుక నువ్వు పరుగులు తీస్తున్నావు..
నా జీవితం వెనుక నేను.
మన గమ్యాలు ఒకటే ఐతే..
మనమూ తారస పడతాం.. ఏదో ఒక మజిలీ లో..
ఓ నాలుగు క్షణాలు ఇచ్చిపుచ్చుకుంటాం..
అవే కనుక వేరు వేరు ఐతే..
మనం కలవకపోతేనే మేలు కదా!!

ఎవరివి నువ్వు.. ?

Monday, August 16, 2010

నువ్వే.గడిచే కొలదీ కాలమే గమ్యమైపోతుంది..
నడిచే కొద్దీ మార్గమే నేస్తమైపోతుంది..

చీకటని కళ్ళుమూసుకున్నానా...
నాలోకి చూసుకుంటే అంతా వెలుగే..
ఆ వెలుతురు నీ చిరునవ్వు కాక మరేమిటి.

ఒంటరినని భయపడిన క్షణం..
నీ చేయిపట్టుకుంటే... ప్రపంచమే నా వెంట.
ఆ ధైర్యం నీ తోడు కాక మరేమిటి..

గడిచే కొలదీ కాలమే గమ్యమైపోతుంది..
నాకు ఆ గమ్యం నీవే..
నడిచే కొద్దీ మార్గమే నేస్తమైపోతుంది..
నాకు ఆ మార్గం నీవే..
గుండె కొట్టుకుంటూ క్షణాల్ని జీవితం గా కరిగిస్తుందంట కదా..
నాకు తెలుసు.. ఆ జీవితమూ నువ్వే..

Saturday, August 14, 2010

స్వాతంత్ర్యం..


స్వాతంత్ర్యం..
బానిసత్వం నుంచి వచ్చింది స్వాతంత్ర్యం,..
కానీ పేదరికం నుంచి ఎప్పుడు ?
పరాయి అజిమాయిషీ నుంచి వచ్చింది..
మతతత్వం నుంచి ?
దగాకోరు పాలన నుంచి వచ్చింది..
అవినీతి నుంచి ఎప్పుడు ?

ప్రజాస్వామ్యం ఐతే ప్రతిష్టించాం..
ప్రజల హృదయాల్లోకి ఎప్పుడు ?
గెలిచే నాయకులకి ఏ కోరతా లేదు..
కానీ ప్రజల్ని గెలిపించేదెవరు ?

హక్కులన్నీ సాధించుకున్నాం..
మరి బాధ్యతల మాట ?
ప్రశ్నలు అన్నీ బానే అడుగుతాం..
కానీ అక్కడితో సరా మన పాత్ర ?
భారతీయులం అని గర్వ పడతాం..
ఆ గొప్ప తనంలో ఎప్పుడు మరి మన భూమిక ?

ఎగురుతున్న జెండా చూసినప్పుడు ఆ స్వేచ్చ కోసం జీవితాలు అర్పించిన యోధులందరికి మనసులోనే శిరస్సు వంచి నమస్సుమాంజలి తెల్పుకుంటాను. కానీ పరిణితి చెందిన సమాజానికి ఆ స్వాతంత్ర్యం ఒక బాధ్యత అని కూడా గుర్తుకు తెచ్చుకుంటాను.

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Wednesday, August 11, 2010

అతను.. నేను ?ప్రతీ రోజు కనిపిస్తాడు అతను..
బాగా పరిచయం ఉన్న ముఖమే..
రోజూ చూస్తూనే వుంటాను..
నన్నూ అతను చూస్తున్నట్టే ఉంటాడు..
కానీ ఓ పలకరింపు నవ్వేనా నవ్వడేం ?
నేనూ అంతే.. నేను మాత్రం ఏం తక్కువ ?

బాగా తెలిసినట్టే అనిపిస్తాడు..
కానీ రోజుకోలా...
ఓ రోజు ఆనందం గా ఉంటాడు..
ఓ రోజు వేదన గా కనిపిస్తాడు..
రాత్రి పడుకునే ముందు..
ఆలోచిస్తాను. రేపు నన్ను పలకరిస్తాడా ?

నిజమే రోజూ తారస పడే మనిషి..
గుర్తించి... నవ్వితే ఎంత బావుణ్ణు..
నాతో మాటా మాటా కలిపితే ఎంత బావుణ్ణు..

మొత్తానికి ఓ రోజు నేనే నిర్ణయించుకున్నాను..
అతను ఎలా వున్నా.. నాకు సంస్కారం వుంది కదా..
( నా స్వార్థం కూడా ? )
అయినా నా రోజు నేను ఎందుకు పాడు చేసుకోవాలి..
అతని గురించి ఆలోచించి.. విశ్లేషించి..

చివరకి ఓ రోజు నేనే పలకరింపు గా నవ్వాను...
వింతగా.. వెంటనే నవ్వాడు.. సరిగ్గా నాలానే..
ఆ బుద్ది ముందే ఉండచ్చు కదా..
హమ్మయ్య... ఆ రోజు నుంచి నాకు ఒక బాధ తగ్గింది..
రోజూ నేను నవ్వుతాను.. అతనూ నవ్వుతాడు..
పలకరింపు గా..
ఎందుకో నాకు నేను ఇంకొంచం నచ్చాను.. :-)

( ఇంతకీ అతన్ని ఎక్కడ కలుస్తున్నానో చెప్పానే లేదు మీకు ... - అద్దం లో.. )

Monday, August 9, 2010

మళ్లీ పుట్టనీ


ఈ మధ్య విన్న పాటల్లో ఈ సాహిత్యం (వేదం చిత్రం లోనిది) నాకు బాగా నచ్చింది. కీరవాణి రాసాడంటే కొంచం ఆశ్చర్యం గానే వున్నా, నమ్ముతున్నాను. వాక్యాలు అందం గా వున్నాయి, అంతకంటే భావం చాలా బావుంది. నిజంగానే మనిషి ఆశ పడాల్సింది, తను మనిషిగా బ్రతకాలనే. "మళ్లీ పుట్టనీ " అనే మాట కూడా ఎంతో అర్థవంతం గా అనిపించింది. కొమరం పులి లో చంద్ర బోస్ కూడా ఈ భావమే చెప్పాలనుకున్నాడేమో, "మారాలంటే" పాటలో.


ఉప్పొంగిన సంద్రం లా ఉవ్వెత్తున ఎగిసింది..
మనసును కడగాలనే ఆశ.
కొడిగట్టే దీపం లా మిణుకు మిణుకు మంటోంది..
మనిషిగ బ్రతకాలనే ఆశ.
గుండెల్లో ఊపిరై ..
కళ్ళల్లో జీవమై ..
ప్రాణం లో ప్రాణమై..
మళ్లీ పుట్టనీ… నాలో మనిషినీ…
మళ్లీ పుట్టనీ… నాలో మనిషినీ.మార్పు రావాల్సింది నాలోంచే అని అర్థమయ్యాక ఆ మార్పు ఎంతో సులభం అయ్యింది. ముప్పయ్యేళ్ళ వయసులో, నేను పాతికేళ్ళ తపస్సుకి కూర్చున్నాను, నా మనసును ఐదేళ్ళ వయసుకు తీసుకెళ్ళమని. భగవంతుణ్ణి ప్రార్థించాను.. నన్ను మళ్లీ పుట్టనివ్వమని.. నన్ను మళ్లీ పుట్టనివ్వమని..

Saturday, August 7, 2010

ఓదార్పు..


అలసిన ఆలోచనకి చిగురించే ఆశ ఓదార్పు..
మరల రాని గతానికి గుర్తొచ్చే జ్ఞాపకం ఓదార్పు..
చీకట్లో కరిగిన ఆ నిన్నకి ఉదయించే నేడు ఓదార్పు..

అంతులేని వేదనకి.. ఉబికి వచ్చే కన్నీరే ఓదార్పు..
రాలే ఆ కన్నీటిబొట్లకి తుడిచే నీ చేయే ఓదార్పు..
వెంటాడే ఒంటరితనానికి నీ ఉనికే ఓదార్పు..

సాగిపోయే జీవితానికి.. తోడొచ్చే కాలమే కదా ఓదార్పు!!

Tuesday, August 3, 2010

ఇంకో నాలుగు అడుగులు .. నాతో..
ఇంకో నాలుగు అడుగులు నువ్వు నాతో వేసి వుంటే,
ఆ గమ్యమేదో నాకూ కనిపించేదేమో..
ఇంకో నాలుగు మాటలు నువ్వు నాతోనే చెప్పి వుంటే,
నీకు అర్థమయ్యేలా నేనూ చెప్పగలిగే వాణ్ణేమో..

ఇంకో నాలుగు కలలు నాతో పంచుకుని వుంటే..
అవి నిజమే అని ఒప్పించగలిగే వాళ్ళమేమో..
ఇంకో నాలుగు క్షణాలు.. నువ్వు నాతోనే ఉండి వుంటే..
నేను మళ్లీ పుట్టే వాణ్ణేమో... కేవలం నీకోసం..

ఆ కెరటాల వెనుక దాగున్న ఆకాశాన్ని...
ఆ చీకట్ల వెనుక వేచి ఉన్న సూర్యోదయాన్ని..
ప్రతీ మలుపు చివరా సేదతీర్చే పూలతోటని..
ఆగక మనల్ని నడిపించే బ్రతుకు బాటనీ..
కలిసే చూడ గలిగే వాళ్ళమేమో.. మనం.

వెనక్కి తిరిగి చూసుకుంటే.. గెలుపే నన్ను వెక్కిరిస్తుంది..
నువ్వు లేని ఏ విజయం ఆనందాన్ని ఇస్తుంది.. ?
నువ్వు లేని ఆనందం.. అసలు ఆనందం ఎలా అవుతుంది.. ?( ఇప్పుడు పెద్దగా కాంటాక్ట్ లేని ఒకరిద్దరు నేస్తాలు ఎందుకో బాగా గుర్తొచ్చారు. బహుశా ఫ్రెండ్ షిప్ డే హేంగోవర్ కావొచ్చు.. ఆ మూడ్ లో ఓ నాలుగు లైన్లు రాసుకున్నాను. నిజంగానే ఒక్కోసారి ఆశ్చర్యం గా వుంటుంది నాకు, ఒకప్పుడు జీవితం అనుకున్న కొన్ని బంధాలు మళ్లీ పెనవేసుకోలేనంత దూరం అయినా.. జీవితం సాగుతూనే వుంటుంది.. మంచో చెడో.. కాలం కదులుతూనే వుంటుంది. మళ్లీ ఎప్పుడో అప్పుడు కలవక పోతారా అనే ఆశ కూడా హృదయం లో ఎక్కడో సజీవం గానే వుంటుంది )