Thursday, September 30, 2010

మరీ ఇంతఅన్యాయం ఐతే ఎలా అండి.. ? :-)


ఉదయం, ఈనాడు పేపర్ ని ఆన్ లైన్ లో చూస్తుంటే, పై ఫోటోలు చూసి, ఒక్క క్షణం కొంచం కంగారు పడ్డాను. కాసేపు నవ్వుకుని, తేరుకుని, తరువాత ప్రింట్ స్క్రీన్ తీసుకుని దాచుకున్నా.

మరీ ఇంతఅన్యాయం ఐతే ఎలా అండి.. ? :-)

(ఎప్పటిలానే, సాంకేతిక కారణాల వలన కావొచ్చు, కాసేపటికి సరిదిద్దుకున్నారు. )

Saturday, September 18, 2010

గతం.. జ్ఞాపకం..
"కన్నీరైనా, ఆనందం అయినా.. గతం బావుంటుంది, అందం గా వుంటుంది. . గుర్తుకు తెచ్చుకోడానికి, ఊహల్లో మళ్లీ మళ్లీ బ్రతికేయడానికి.. ఎందుకంటే, దానిలో తెలియని మలుపులు వుండవు",


ఏదో పాత డైరీ తిరగేస్తుంటే కనిపించింది, ఎప్పుడో నేను రాసుకున్న ఈ వాక్యం. నిజమే, గతం భలే బావుంటుంది, అంతా నా ఆధీనం లోనే వున్నట్టు వుంటుంది మరి. కన్నీళ్లు గుర్తుకొస్తే, అయ్యో అంత చిన్న విషయానికే అంత బాధ పడ్డానా అనిపిస్తుంది... లేక, అంత కష్టం లోంచీ ధైర్యంగా ముందు కెళ్ళానా.. అని గర్వంగా వుంటుంది. ఆనందాలు గుర్తొస్తే, మనస్సు అంతా సంతృప్తి తో నిండిపోతుంది. కొన్ని నిర్ణయాలు, ఇలా కాక ఇంకోలా చేస్తే బావుండేదేమో అనిపిస్తుంది.. కొన్ని సార్లు, ఆ పని ఇంకొంచం శ్రద్ధ పెట్టి చేస్తే ఎంత బావుండేది.. ఈ వ్యక్తి ఎలా దూరమైపోయాడు నాకు... నేను అలా ఎందుకు ప్రవర్తించాను.. ఇలా.. ఏవో ఆలోచనలు.. మళ్లీ క్షణాలు వెనక్కి వెళ్లి, నన్ను నిలదీస్తున్నట్టు .. నాకు నేను సంజాయిషీ ఇచ్చుకుంటూ. సముదాయించుకుంటూ.

ఏది ఏమైనా.. గతమే నచ్చుతుంది నాకు.. ఇంకొక్కసారి మళ్లీ బ్రతికేస్తే ? ఆ జ్ఞాపకాలన్నీ మరొక్కసారి నిజం అయిపోతే.. ఈ లోగా, పరధ్యానం గానే నేడు కాస్త నిన్న అయిపోతుంది.. నేను మళ్లీ గతం గా గుర్తుకు తెచ్చుకుంటాను దాన్ని.. :-)

రేపు లేని క్షణాన్ని చూస్తానేమో కాని.. నిన్న లేని క్షణం ఇక నాకు తారస పడదుగా.. పర్వాలేదు.. నేను ఒంటరిని కాను..


ఎప్పుడో రాసుకున్నాను..

క్షణాల తీరాన అలసి నిలబడిపోతాను,....
జ్ఞాపకాలు కెరటాల్లా వచ్చి నన్ను తాకకుండానే వెనక్కి వెళ్ళిపొతాయి,....
నేను లెక్కపెట్టుకుంటూ వుంటాను....
నేడు కూడా జ్ఞాపకమై నన్ను వదిలి వెళ్ళిపొతుంది,....
నేను లెక్కపెట్టుకుంటూ వుంటాను,....

Monday, September 13, 2010

ఓ మంచి మాట :-)నిన్నటి ఈనాడు ఆదివారం లో, వచ్చిన ఈ "మంచి మాట" నాకు ఎంత నచ్చిందో, చెప్పనలవి కాదు.

"విజయమంటే మనం చేరుకున్న గమ్యం కాదు.. ఆ గమ్యాన్ని చేరే క్రమం లో ఎదురైన కష్టనష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం"
ఎంత నిజం...

విజయం అంటే మార్గమా..? గమ్యమా ? ఈ మధ్య నా బుర్రలో తిరుగుతున్నఆలోచన ఇది. సో నిజానికి, విజయం అంటే ఆ రెండూ కాదు,..


విజయమంటే,
మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోడానికి, మనం ఎంచుకున్న మార్గంలో, వేసే ప్రతీ అడుగు మనకి నేర్పే అనుభవం..
ఎంత నిజం...

నా గెలుపు ఇంకెవరినైనా ఓడిస్తుందేమో .. కాని.. నాకు అర్థం అయ్యింది.. నా అనుభవం.. నన్ను గెలిపిస్తుంది.. నా మీదే.. అదేగా మరి అసలు విజయం ?

Sunday, September 12, 2010

గదిలో ఆకాశం..


గదిలో ఆకాశం.
నాకంటూ ఓ ఆకాశం.. నా గదిలో.
నా చిరునవ్వులకి వెన్నెల కురిపిస్తుంది.
వేదనికి కన్నీటిని వర్షిస్తుంది.. నా కళ్ళల్లోంచి.
గదిలో ఆకాశం.
నా ఆశల్ని, తాను హరివిల్లై అలంకరిస్తుంది.
కాస్త నిస్తేజానికి తానూ చీకటై వంత కలుపుతుంది.
విజయాలకు మెరుపు తోరణాలు కడుతుంది..
ఓటములకు కారుమబ్బులూ..
గదిలో ఆకాశం.
నా ఆలోచనలకు నీడనిస్తుంది.. వాటికో రూపమివ్వాలని దాని ఆరాటం.
అన్నీ ఉండీ, నేను ఒంటరైన క్షణం, నాకు తోడు తానే అవుతుంది.
గదిలో ఆకాశం.
రేయి చీకట్లో, నిన్నని దాచేస్తుంది. ఉహల్లోని రేపుని కలగా చూపిస్తుంది.
కన్ను తెరిచి చూస్తే మాత్రం, నిజాన్ని తప్పక చూడనిస్తుంది.
గదిలో ఆకాశం..
అన్నింటికంటే ముఖ్యం గా...
నన్ను నాకు గుర్తుచేస్తూనే వుంటుంది..
మరచిపోయినప్పుడు.
నా గదిలో ఆకాశం..

అలా తిరగని ఫ్యాన్ వైపే చూస్తారెందుకండీ ?
ఏముంది అక్కడ ? మా ఆవిడ కోప్పడుతూనే వుంది..
నా గదిలో.. నా ఆకాశం. నా మనస్సుకి వెలుపలి ప్రతిబింబం.

Friday, September 10, 2010

నా బ్లాగ్ మొదలు పెట్టి ఏడాది అయిపోయిన్దోచ్..


నా బ్లాగ్ మొదలు పెట్టి ఏడాది అయిపోయిన్దోచ్.

ఈ రోజే ఉదయం ఎప్పటివో పాత పోస్ట్స్ చూస్తుంటే అర్థమయ్యింది నేను బ్లాగ్ రాయడం మొదలు పెట్టి ఏడాది దాటిపోయిందని. :-) ఉద్యోగ రీత్యా, గత సంవత్సరం కొన్ని నెలలు పారిస్ లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎప్పటినుంచో ఉన్న"తోచింది రాసుకునే" అలవాటు కి కాస్త సమయం చిక్కింది. ఓ నలుగురు నేస్తాలతో రాసింది పంచుకోడానికి "బ్లాగ్" మంచి మార్గం గా తోచింది నాకు. అలా మొదలు పెట్టిన బ్లాగ్, తరువాత తరువాత ఎంతమంది (ఎవరైనా అసలు ?) చూసారో, చూస్తున్నారో తెలీదు కాని, నేను రాసుకున్న నాలుగు మాటలూ ఒకే చోట వుండడం నాకు సౌకర్యం గా వుంది, మళ్లీ మళ్లీ చదువుకోడానికి, గుర్తుకు తెచ్చుకోడానికి. మొదలు పెట్టినప్పుడు, మళ్లీ ఇండియా వెళ్ళిన వెంటనే ఆవేశం చల్లారిపోతుంది అనుకున్నాను, కాని ఆశ్చర్యంగా ఇప్పటికీ అడపాదడపా రాస్తున్నాను. ఇంకొంత కాలం రాసుకోగల్గుతానని ఆశిస్తూ. :-)

"కాలం ఎంత వేగం గా పరిగెట్టినా నాకేం భయం...
క్షణాలు అన్నీ జ్ఞాపకాలగా నా గుండెలో బద్రంగా వుండిపోతున్నప్పుడు..
మార్గం ఎంత పొడుగైతే మాత్రం నాకేం భయం..
ప్రతీ అడుగూ గమ్యమే అని అనుకున్నప్పుడు.. "

Thursday, September 9, 2010

నాకు అర్థమయ్యింది..

ఏ చూపుకీ అందని అందమొకటి ఉంది,
నాకు అర్థమయ్యింది.. అది నాలోనే ఉంది అని..

ఏ భాషకీ అందని ఓ అర్థముంది,
నాకు అర్థమయ్యింది.. అది నా మౌనమే అని..

ఏ బాటకీ అందని ఓ గమ్యముంది,
నాకు అర్థమయ్యింది.. అది నా మన:శ్శాంతే.

Sunday, September 5, 2010

చెలీ, నీవే నా కోరికవి.


చెలీ, నీవే నా కోరికవి.

చెలీ, ..
ఏ తడి మెట్ల మీదో ఆవిరైపోతున్న నీ పాదాల గురుతులను,
తమకంతో ముద్దాడే ప్రియుణ్ణి నేనే.
ఏ వెన్నెల రాత్రో వాకిట్లో నువ్వు నిదురిస్తుంటే,
ఆ వెలుగు తుంపర్ల మధ్య దోబూచులాడుతున్న నీ నీడను,
గట్టిగా వాటేసుకునేది నేనే.
నీ వేడి నిట్టూర్పులను గుప్పిట్లో బంధించి,
గుండెలో దాచేసుకుంటాను.
నీ మాటల్ని, పాటల్ని, నా మౌనంలో నింపేసుకుని,
పరవశించిపొతాను.
వినిపించే నీ చిరునవ్వుల సవ్వడికి..
కనిపించని ఆ ఆనంద తాండవం నాదే మరి.

చెలీ.. నీవే.. నీవే నా కోరికవి..
నా బ్రతుకు భాష్యానివి.
నిన్ను కోరుకోవడంలోనే వుంది నా అస్థిత్వం.
పొందడంలో కాదు సుమీ.
నువ్వు అబద్దం అంటారు వాళ్ళు.
తృణప్రాయం అంటారు.. త్యజించమంటారు.
ఎందుకనో..

కానీ, నిన్ను విడిచిన.. ఇక నేనెక్కడ ?
నువ్వు క్షణికమేనేమో..
కాని ఆ క్షణం అసత్యం కాదుగా...
నీ కౌగిలి అక్షయం కాదేమో...
కాని ఈ జీవితమూ కాదుగా శాశ్వతం ?