Saturday, September 18, 2010

గతం.. జ్ఞాపకం..
"కన్నీరైనా, ఆనందం అయినా.. గతం బావుంటుంది, అందం గా వుంటుంది. . గుర్తుకు తెచ్చుకోడానికి, ఊహల్లో మళ్లీ మళ్లీ బ్రతికేయడానికి.. ఎందుకంటే, దానిలో తెలియని మలుపులు వుండవు",


ఏదో పాత డైరీ తిరగేస్తుంటే కనిపించింది, ఎప్పుడో నేను రాసుకున్న ఈ వాక్యం. నిజమే, గతం భలే బావుంటుంది, అంతా నా ఆధీనం లోనే వున్నట్టు వుంటుంది మరి. కన్నీళ్లు గుర్తుకొస్తే, అయ్యో అంత చిన్న విషయానికే అంత బాధ పడ్డానా అనిపిస్తుంది... లేక, అంత కష్టం లోంచీ ధైర్యంగా ముందు కెళ్ళానా.. అని గర్వంగా వుంటుంది. ఆనందాలు గుర్తొస్తే, మనస్సు అంతా సంతృప్తి తో నిండిపోతుంది. కొన్ని నిర్ణయాలు, ఇలా కాక ఇంకోలా చేస్తే బావుండేదేమో అనిపిస్తుంది.. కొన్ని సార్లు, ఆ పని ఇంకొంచం శ్రద్ధ పెట్టి చేస్తే ఎంత బావుండేది.. ఈ వ్యక్తి ఎలా దూరమైపోయాడు నాకు... నేను అలా ఎందుకు ప్రవర్తించాను.. ఇలా.. ఏవో ఆలోచనలు.. మళ్లీ క్షణాలు వెనక్కి వెళ్లి, నన్ను నిలదీస్తున్నట్టు .. నాకు నేను సంజాయిషీ ఇచ్చుకుంటూ. సముదాయించుకుంటూ.

ఏది ఏమైనా.. గతమే నచ్చుతుంది నాకు.. ఇంకొక్కసారి మళ్లీ బ్రతికేస్తే ? ఆ జ్ఞాపకాలన్నీ మరొక్కసారి నిజం అయిపోతే.. ఈ లోగా, పరధ్యానం గానే నేడు కాస్త నిన్న అయిపోతుంది.. నేను మళ్లీ గతం గా గుర్తుకు తెచ్చుకుంటాను దాన్ని.. :-)

రేపు లేని క్షణాన్ని చూస్తానేమో కాని.. నిన్న లేని క్షణం ఇక నాకు తారస పడదుగా.. పర్వాలేదు.. నేను ఒంటరిని కాను..


ఎప్పుడో రాసుకున్నాను..

క్షణాల తీరాన అలసి నిలబడిపోతాను,....
జ్ఞాపకాలు కెరటాల్లా వచ్చి నన్ను తాకకుండానే వెనక్కి వెళ్ళిపొతాయి,....
నేను లెక్కపెట్టుకుంటూ వుంటాను....
నేడు కూడా జ్ఞాపకమై నన్ను వదిలి వెళ్ళిపొతుంది,....
నేను లెక్కపెట్టుకుంటూ వుంటాను,....

1 comment:

  1. >>కన్నీరైనా, ఆనందం అయినా.. గతం బావుంటుంది, అందం గా వుంటుంది. . గుర్తుకు తెచ్చుకోడానికి, ఊహల్లో మళ్లీ మళ్లీ బ్రతికేయడానికి.. ఎందుకంటే, దానిలో తెలియని మలుపులు వుండవు<<


    >>అంతా నా ఆధీనం లోనే వున్నట్టు వుంటుంది మరి
    నిజం చెప్పారు భాస్కర్ గారు...

    ReplyDelete