Friday, October 29, 2010

ఇంకా ఎన్ని ? ( కవితే కాబోలు :-) )

రెప్ప వేయక గాలిస్తున్నాను, నా లోకమంతా..
వెలుగు జాడే లేదు.


ఇంకా ఎన్ని మాటలు నేర్చుకోవాలి, .. మౌనాన్ని అర్థం చేసుకోడానికి.
ఇంకా ఎన్ని మలుపులు చుట్టి రావాలి, బయలు దేరిన చోటుకే చేరుకోడానికి.
ఎన్ని గెలుపులు.. ఎన్ని ఓటములు.. ఆ రెండూ ఒక్కటే అని ఒప్పుకోడానికి.
ఎన్ని కన్నీళ్ళు.. ఎన్ని ఆనందాలు.. ఆ రెంటిని గుండెలోనే దాచేయ్యడానికి.

ఇంకా ఎన్ని జ్ఞాపకాలు.. ఇంకా ఎన్ని ఆశలు..
కాలాన్ని గతంలోనే ఆపేయడానికి.
ఇంకా ఎన్ని బంధాలు.. అనుబంధాలు..
నన్ను విడిచి నేను ముందుకు సాగిపోడానికి.

కళ్ళుమూసుకుని సూటిగా చూస్తున్నాను.. నాలోకే..
వెలుగు తప్ప మరేది లేదు.

Wednesday, October 27, 2010

జేజమ్మ మళ్లీ పుట్టింది.. కాశ్మీర్ కోసం.

అరుంధతమ్మ (జేజమ్మ) మళ్లీ పుట్టింది, కాశ్మీర్ కష్టాలన్నీ తీర్చడానికి. చరిత్ర అంతా ఓ లుక్ వేసి, అసలు కాశ్మీర్ ఇండియా లో భాగమే కాదు అని తేల్చేసింది. దశాబ్దాలుగా పొరుగు దేశం ప్రోద్బలంతో జరుగుతున్న ఈ మారణ హొమం స్వాతంత్ర్య ఉద్యమమే అని, ఇంతవరకూ అసువులు బాసిన జవాన్లంతా భారత దేశం కోసం అర్థం లేని పోరాటం చేసారని నిర్థారించింది. కాశ్మీర్ అక్కడ వాళ్ళ జన్మ హక్కు అని చెప్పిన జేజమ్మ, దేశాన్ని ఇంకా ఎన్ని ముక్కలు చెయ్యగలమో చెప్తే, దానికనుగుణం గా మనం ఆనందం గా వేరే వేరే దేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. స్వాతంత్ర్యం ఎవరికి మాత్రం చేదు ? అందులో మా తమిళనాడు ముందుంటుంది. రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలపై కనీసం రాళ్ళు విసురుకోలేని స్వాతంత్ర్యమూ ఓ స్వాతంత్ర్యమేనా ? ప్రత్యక్షం గానూ, పరోక్షం గానూ, దేశం లో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రు దేశం తో చేతులు కలిపే స్వేచ్చ కూడా లేకపోతే, ఇంకేం స్వేచ్చ అది. అననే అన్నారు కదా, దేశమంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుషులోయ్ అని. కాస్త మార్చి రాసుకుందాం, దేశమంటే కొందరు మనుషులేనోయ్, మిగతా దేశమంతా మట్టిగా మిగిలిపోయినా.. మిగలకపోయినా..

మానవ హక్కులకి, శాంతి భద్రతలకి వ్యత్యాసం మన జేజమ్మకి తెలియంది కాదు, కానీ ఆవిడకున్నపరిణితి మనకు లేదు మరి విషయాన్ని వేరే దృక్కోణం లో అర్థం చేసుకోడానికి. అవినీతి, అధికారం.. ఈ రెండే లక్ష్యాలుగా నడుస్తున్న మన రాజకీయాలకి ఆ మాత్రం ఆలోచన అసలే లేదు. మనుషుల్లో లానే, వ్యవస్థలోనూ లోపాలు వుంటాయి, వాటిని ఎత్తి చూపే హక్కు అందరికి వుంది. కానీ, అందులో భాగం గా, దేశ సమగ్రతకే భంగం కలిగిస్తే, మొదటికే మోసం వస్తుంది. భారత దేశం ఎన్ని ముక్కలైతే అంత ఆనందించే దేశాలు మన చుట్టూ చాలానే వున్నాయి.. మొదటి రెండు ముక్కలూ మనం చేస్తే చాలు, మిగతా పని అవే చూసుకుంటాయి. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు పతనమయ్యేది ఇలానే. చరిత్ర పునరావృతం కాదని ఆశిద్దాం.


ఇంతకీ ప్రభుత్వానికి.. దేశానికి తేడా ఉందా లేదా ? మనం మన హక్కుల కోసం పోరాడాల్సింది ఎవరితో ?

Wednesday, October 20, 2010

ఈ నిర్లక్ష్యానికి ఎవరిదీ బాధ్యత ?

ఖమ్మం జిల్లాలో, తుపాకుల పై పోలీసులు నిర్వహించిన ఒక అవగాహనా ప్రదర్శనలో, పొరపాటున తుపాకీ పేలడం వలన ఇద్దరు పిల్లలు మరణించారు. మధ్యాహ్నం, భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు TV9 లో ఈ వార్త చూసి, నిర్ఘాంత పోయాను. ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఏ పాపం ఎరుగని ఇద్దరు చిన్న పిల్లల ప్రాణాలు, అకారణం గా గాలిలో కలిసిపోయాయి. ఎంత అమానుషం.. ఇందాకా న్యూస్ లో ఆ అధికారి వివరణ ఇస్తూ, ఎవరో ఒకరు బుద్ధిలేక చేసిన పనికి ఏంచెయ్యగలం అని చెప్పడం చూసి, నాకు వొళ్ళు మండింది. ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థలో నేనూ ఒక భాగం అయినందుకు సిగ్గు గా అనిపించింది. శాఖాపరమైన దర్యాప్తు అంటారు, ఏదో కంటి తుడుపు క్రమశిక్షణా చర్య తీసుకుంటారు. మీడియా కూడా కొన్ని రోజులకి విషయాన్ని మరచిపోతుంది. మనం కూడా. కానీ ఆ కుటుంబాల పరిస్థితి ? వాళ్ళు తేరుకోడానికి ఒక జీవిత కాలం సరిపోతుందా ? ఏంచేస్తే ఆ ముక్కుపచ్చలారని పిల్లల్ని తిరిగి తేగలం ? ఆ పసి మొగ్గలకు మరుజన్మ అంటూ వుంటే, మళ్లీ ఇలాంటి దిక్కుమాలిన సమాజాల్లో పుట్టించొద్దని ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకుంటున్నాను.

Sunday, October 17, 2010

విజయదశమి శుభాకాంక్షలు


విజయదశమి శుభాకాంక్షలు!!
మా ఇంట్లో పూజా కార్యక్రమాలు అయిపోయాయి. ఇంక ప్రసాదాలే తరువాయి. :-)

Tuesday, October 12, 2010

ఈనాడు ఆదివారం పిల్లల కార్టూన్ :-)మొన్నటి ఈనాడు ఆదివారం అనుబంధం లో వచ్చిన ఈ పిల్లల కార్టూన్ నాకు భలే నచ్చింది. కార్టూన్ అసలు అర్థం నవ్వుకోడానికే, అయినా ఎందుకో దాంట్లో ఓ మంచి ఆలోచన నాకు కనిపించింది.

నిజమే నేను పోటీ పడాల్సింది నాతోనే కదా. ఆ కార్టూన్ లోని వాక్యాన్నే ఇంకోలా రాసుకున్నాను..
"ఎవరైనా గెలవాల్సింది వాళ్ళ మీదే కదా !!"

నా నేడుని నిన్న కంటే మెరుగ్గా ఉంచుకుంటాను..
వచ్చే ఆ రేపు ఇంకా మెరుగ్గా వుండాలని ఆశ పడతాను.
అనుక్షణం నేను పోటీ పడుతూ వుంటాను, నాతోనే.
గెలుస్తూ వుంటాను, ఓడిపోతుంటాను.. నాలోనే.


కాలపు రెక్కలు అలసినప్పుడల్లా, జీవితం, ఒక్క క్షణం ఆగి, నా వైపు చూస్తుంది. నన్ను నేను ఆవిష్కరించుకుంటాను. సరికొత్తగా.
ప్రతీ చిన్న మజిలీకీ అదో పేరు పెట్టుకుని మురిసిపోతుంది, నేను మాత్రం మళ్లీ మొదలౌతాను. సరికొత్తగా. .

Sunday, October 10, 2010

ఎగిరే నిచ్చెన


ఎగిరే నిచ్చెన..

నా బాల్యమంతా నేను ఆ నిచ్చెన చూస్తూనే వున్నాను..
దాని మెట్లు నాకు బంగారు రంగులో మెరుస్తూ కనిపించాయి.
అది ఎక్కి ఎవరైనా అలా పైకి వెళ్తుంటే, నేనూ మురిసి పోయేవాణ్ణి.
అది భూమ్యాకాశాలను నా కళ్ళ ముందే కలిపేసేది.
నేనూ ఓ రోజు దాని మొదట మెట్టు ఎక్కాను.
తర్వాతి మెట్లు ఎప్పుడు ఎక్కానో కూడా గుర్తు రాదేం ?
ఎవరో జాగ్రత్త.. జాగ్రత్త అన్నారు.. ఎవరది ?
నేను అలా పైపైకి వెళ్తూనే వున్నాను..
ఆ ఆకాశం చేతికందదేం ?
ఇంకా ఎన్ని మెట్లు, ఆ నింగి అంచుల్ని తాకేందుకు ?
ఆ జాబిల్లి వచ్చి నా హృదయాన్ని హత్తుకోదేం ?

మొదటి సారి, నేనూ నేల వైపు ఆశగా చూసాను.
నా ప్రశ్నల జవాబులకోసం.
నాకు అర్థం అయ్యింది.. నేను వున్నది ఎగిరే నిచ్చెన అని..
అది నా అడుగులు కంటే వేగం గా నన్ను నాకు దూరం చేసేసిందని.
నేలని వెతుకుతూనే వున్నాను నేను..
నన్నూ నేను వెతుకుతూనే వున్నాను.
నా నడక ఆగిపోయింది. కాని ప్రయాణం ఆగదేం ?

ఏదో ఒకరోజు ఇక మెట్లే వుండవు... అప్పుడు ?
ఆ క్షణమూ నేను క్రింద పడను.. నాకు తెలుసు.
ఎందుకంటే.. నేను పడే అంత ఎత్తు లో లేను కదా ?
ఒకవేళ పడితే, నేను మొదలైన చోటుకే చేరు కుంటానా ?
అదే ఐతే నాది ప్రయాణం ఎలా అవుతుంది.. ?
దాన్ని జీవితం అనాలేమో ?
ఇంతకీ నావి ప్రశ్నలా ? జవాబులా ?

Saturday, October 9, 2010

చెన్నై లో తెలుగు రోబో ..


శనివారం ప్రొద్దున్నే ఎక్కడికండి బయలుదేరారు ? ఈ ప్రశ్నతో మొదలైంది నా వీకెండ్. చిన్న బ్యాంకు పని మీద అన్నాసాలై లో నాకు పని ఉన్న బాంక్ శాఖని వెతికి పట్టుకోడానికి మధ్యాహ్నం అయ్యింది. ఎలాగో సగం రోజు పోయింది, కనీసం ఇంట్లో ఓ నాలుగు మార్కులైన కొడదాం, అనే సదుద్దేశం తో ఏదో ఒక సినిమా టికెట్లు కొనడానికి కాసినో లో దూరాను. కౌంటర్ ఖాళీ గానే వుంది, హౌస్ఫుల్ బోర్డు తో సహా. వాకబు చేస్తే, ఖలేజా టికెట్లు బ్లాక్ లో మాత్రమే అమ్ముతున్నారని, సూపర్ స్టార్ రోబో మాత్రం పిలిచి ఇస్తున్నారని అర్థమయ్యింది. టాక్ తెలీకుండా, త్రివిక్రమ్ తో (మరీ ముఖ్యం గా మహేష్ తో) పెట్టుకోడం ఎందుకని, రోబో కి ఫిక్స్ అయ్యాను. సో అలా ఈ రోజు నాకు రోబో దర్శన భాగ్యం కలిగింది.

సినిమా మొత్తం మీద బానే వుంది. నా లాగ పెద్దగా అంచనాలు లేకుండా వెళ్తే, అంత ఇబ్బంది పెట్టే సినిమా మాత్రం కాదు. గ్రాఫిక్స్, విజువల్స్ కోసం ఖచ్చితం గా చూడొచ్చు. కొన్ని పాటల్లో లోకేషన్స్ కూడా అద్భుతం గా వున్నాయి. మొదటి పావుగంటా కొంచం రజిని స్టాంప్ కనిపించింది కానీ, మిగతా రెండున్నర గంటలూ పూర్తి స్థాయి, శంకర్ సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్, కొంచం బోరింగ్ గా, చిరాగ్గా అనిపించింది. సడన్ గా ఇంటర్వల్ తరువాత, ఏదో ఇంగ్లీష్ సినిమా రీల్ పెట్టేసాడా అన్నట్టుంది. action సినిమాలు నచ్చుకునే ప్రేక్షకులకు ద్వితీయార్థం కూడా నచ్చుతుందేమో.

ఇక కధ విషయానికి వస్తే, విషయం చాలా చిన్నది. జవాన్లకు దీటుగా పనిచేసే రోబో తయారుచేస్తాడు రజిని. ఆ రోబో కూడా అచ్చం రజిని లానే వుంటుంది. దానికి వొంద మంది సామర్ధ్యం వున్నా, మంచి చెడు తేడా తెలీదు అనే నెపం తో ఆ రోబో కి అప్ప్రొవల్ లభించదు. అది ఒక సవాలు గా తీసుకుని, దాన్ని emotionally intelligent చేస్తాడు రజిని. అక్కడతో అసలు కథ మొదలౌతుంది, ఇక ఆ రోబో మనిషి లా సొంతం గా ఆలోచించడం, హీరోయిన్ తో ప్రేమలో పడటం, విలన్లు ఆ ప్రేమని వాడుకోవడం .. వగైరా.. వగైరా.

శంకర్ సినిమాగా చూస్తే, అసలు విషయం మీద శంకర్ ఇంకొంచం శ్రద్ద పెట్టాల్సిందేమో అనిపిస్తుంది. కానీ, కథ, కథనం, ప్రక్కన పెట్టి, స్క్రీన్ చూస్తూ ఆనందించ గల్గితే, కనుల పండుగే. భారతీయ సినిమా ని , సాంకేతికంగా, ఒకేసారి ఓ పదిమెట్లు దాటిన్చేసాడు శంకర్ ఈ సినిమా తో. సంగీతం కూడా సినిమాకి తగ్గట్టే వుంది. (సాహిత్యం ఎప్పటిలానే, నాసిరకం గానే వుంది ) రజిని కోసమే సినిమాకి వెళ్ళే వాళ్లకి, స్క్రీన్ మీద ఒకేసారి వంద మంది రజినీలు కనిపిస్తే, ఏంచేస్తారో మరి. (అదీ విలన్ గా)

ఒక సన్నివేశం లో, దేవున్నాడా అనే ప్రశ్నకి సమాధానం చెప్తూ, రోబో, నా creator నా ప్రక్కనే వున్నాడు, అంటే దేవుడున్నట్టే, అని చెప్పడం బాగా పండింది. చివర్లో, "ఆలోచించడం మొదలుపెట్టాక, ఇలా ముక్కలు చేసి పెట్టారు" అని రోబో అనడం కూడా కథకి సరిగ్గా సరిపోయింది. ఇంతకీ, బండి మీద ఇంటికి వస్తున్నప్పుడు మా ఆవిడ ని అడిగాను, నచ్చిందా అని, రోబో లోకి విలన్లు ఆ రెడ్ చిప్ ని పెట్టనంత వరకూ బావుంది అంది. :-) అంతే గా మరి, మనిషి అయినా, రోబో అయినా... జీవితం అయినా.. చెడు కూడిన తరువాత ఇంకేముంది వినాశనమే.

(శంకర్, రజినీ లు ఎంత డామినేట్ చేసారంటే, ఐశ్వర్య రాయ్ గురించి రాయడమే మరచిపోయాను నేను.. :-) )

Saturday, October 2, 2010

ప్రశ్నలు.. సమాధానం.
అమ్మ- దసరాకి వైజాగ్ వస్తున్నావా ? ఒక్క రోజు అదనంగా సెలవు దొరుకుతుందా ?
శ్రీమతి - ఈ శనివారమూ ఆఫీసు కి వెళ్ళాలా ?

అన్నయ్య - పని మీద ఒక వారానికి ఇండియా వస్తున్నాను.. నీకు ఏమైనా కావాలా US నుంచి ?
నేస్తం - ప్రాజెక్ట్ ఎలా వుంది ? పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందా ?

సహోద్యోగి - ఈ రోజు కాంటీన్ లో సమోసా చాట్ బావుంది, ట్రై చేస్తారా ?
దూరపు బంధువు - డాక్టర్ పని మీద చెన్నై వస్తున్నాను, రాజమండ్రి రోజ్ మిల్క్ ఎస్సెన్సు తీసుకు రానా ?


ఎన్ని ప్రశ్నలు.. నాకు మాత్రం ఒకే సమాధానం చెప్పాలని అనిపిస్తుంది..
"ఐ లవ్ యు టూ" అని.

మామోలు మాటల్లోనూ దాగి ఉన్న ప్రేమని చూడగలిగే విజ్ఞతని ఇవ్వమని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ వేడుకుంటాను నేను.


ప్రేమంటే, తన ఉదృతితో జీవనాన్ని స్తంబింప చేసే తుఫాను కాదు..
ఆప్యాయం గా గడ్డిపూచ తలనిమిరే తొలకరి..
ప్రేమంటే... పెద్ద పెద్ద భావాలూ.. గుండెల్ని పిండే మాటలూ.. కాదు..
ఒక చిన్న ఆత్మీయ చిరునవ్వు.. ఒంటరైన క్షణాన, నేను వున్నాను అనే ఓదార్పు..
ప్రేమంటే, క్షణికావేశం లో ఒకరికోసం ఒకరు చావగలగడం కాదు..
ఒకరికోసం ఒకరు ఆనందం గా బ్రతక గలగడం.. జీవితాంతం..

ప్రేమంటే.. దాచిపెట్టిన జ్ఞాపకాల మూటను విప్పి, మైమరచి పోవడమే కాదు..
ఈ క్షణం, చుట్టూ ఉన్న నలుగురుకి ఆనందం పంచడం కూడానూ.. :-)