Monday, November 29, 2010

"ఆరెంజ్" రంగు ప్రేమ
ప్రేమలు పలు రకాలు. ఉదాహరణకి, అమ్మ ప్రేమ తెల్ల రంగులో నిర్మలంగా ఉంటుంది,వెలుగులా.. , విలన్లకి ఉండే ప్రేమ నల్ల రంగులో ఉంటుంది, చీకటిలా.. , పెళ్ళైన ఓ పదేళ్ళకి భార్యా భర్తల మధ్య ఉండే ప్రేమ, నీటిలాగ పారదర్శకంగా వుంటుంది, (ఉందో లేదో అన్నట్టు.. ), గోపికలకి కృష్ణుడి మీద ఉండే ప్రేమ ఆకాశం రంగులోనూ.. ఇలా ఎన్నో ప్రేమలు.. ఇంకో ముఖ్యమైన ప్రేమ, ఆరెంజ్ రంగు ప్రేమ, ఇది ఆకర్షణకి దగ్గరగానూ, ప్రేమకు కాస్త దూరంగానూ ఉంటుంది. కానీ అదీ ప్రేమే. దీన్ని మనం స్కూళ్ళ లోను, కాలేజిలలోను, ఆఫీసుల్లోనూ, చూడవచ్చు. ఇంకా వీజీ గా, పెళ్ళైన కొత్తలోనూ, సినిమాల్లోనూ చూడవచ్చు. ఈ ప్రేమ గాఢత ఎక్కువగాను, కాల వ్యవధి తక్కువగాను వుంటుంది. ఓ చిరునవ్వుకో, కొన చూపుకో, చేతి స్పర్శ కో పుట్టేస్తూ ఉంటుంది.. ఏ చిన్నిమాటకో, SMS కో, ఏ సీరియల్ విషయం లో గొడవకో మాయమైపోతుంది.


ఈ ప్రేమని, దాని లక్షణాలని, పూర్తి స్థాయిలో వివరించిన చిత్రం "ఆరెంజ్". ఈ ఆరెంజు రంగు ప్రేమ గురించి బాగా అవగాహన ఉన్న హీరో, అంతగా అవగాహన లేని హీరోయిన్ కి, మిగతా నటీనటులకు, ప్రేక్షకులకు ఈ ప్రేమని అర్థం అయ్యేలా చెప్పడం ఈ సినిమా ముఖ్యోద్దేశం. ఆ పరంగా, దర్శకుడు నూరు శాతం విజయం సాధించాడు. అందుకే ఈ సినిమాకి "ఆరెంజ్" అని సందర్భోచితమైన పేరు పెట్టేరు. ఇంతకు ముందూ, సఖి, స్వయంవరం వగైరా, వగైరా చిత్రాలు, ఈ ప్రేమని, దాని పరిణామ క్రమాన్ని వివరించే ప్రయత్నం చేసినా, "ఆరెంజ్" సినిమా ఇంకొంచం లోతుగా చెప్పుకొచ్చింది. ఉదాహరణలతో సహా.. కొన్ని డైలాగులు నిజమే అయినా, మనం ఒప్పుకోలేం, అలాగే కొన్ని సన్నివేశాలు కూడా. అది ఈ రంగు ప్రేమ మీద మన అవగాహనా రాహిత్యమే కానీ, సినిమా లో లోపం కాదు. ఇంక నటీనటుల విషయానికి వస్తే, అందరు వాళ్ళ వాళ్ళ పరిధిలో బానే చేసారు. జెనీలియా కొంచం తక్కువ, రాం చరణ్ కొంచం ఎక్కువ యాక్షన్ చేసుంటే ఇంకా బావుండేది. బ్రహ్మానందానికి ప్రతీ సారీ ఒకే డైలాగ్ కాకుండా, వేరే వేరే డైలాగ్లు రాసి ఉంటే హాస్యం ఇంకా పండేది. సినిమా లోనే ఒక ప్రేక్షకుడి పాత్ర క్రియేట్ చేసి, దాన్ని ప్రకాష్ రాజ్ కి ఇచ్చారు, అతను మన పాత్రని బాగా పోషించాడు. ఫస్ట్ హాఫ్ లో కంటే, సెకండ్ హాఫ్ లో ఉత్సాహంగా కనిపించాడు. అర్థం చేసుకోగలం. సంగీతం ఓ మోస్తరు కంటే బానే వుంది.


ఎవరో అన్నట్టు, కారణాల కోసం ప్రేమని, రివ్యూ లు చూసి సినిమాలు వదులుకోకూడదు. తప్పక చూడండి. మీ జీవితానికి ఓ కొత్త రంగుని అద్దుకోండి. (ఈ కొత్త రంగు మీ జీవితాన్నే మార్చేస్తుంది, అని ఎవరైనా చెప్తే నమ్మకండి. ఎందుకంటే, అన్ని రంగులు కలిస్తేనే జీవితం మరి)

ఓ చిరు సలహా : సినిమాని మరీ క్రిటికల్ గా చూసే వాళ్లతో కాకుండా, ఎంతో కొంత ఎంజాయ్ చేసే వాళ్లతో వెళ్ళండి, మీకు ఈ సినిమా నచ్చే అవకాశాలు పెరుగుతాయి.

Sunday, November 21, 2010

చిట్టి పొట్టి కవితలు - 2


ఫ్లాష్ బ్యాక్ : చిట్టి పొట్టి కవితలు :ఏ రాత్రో పడుకునేముందు, ఓ ఆలోచన రావడం, ప్రక్కనే ఏది దొరికితే, దాని మీద రాసేసి పడుకోవడం, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రాతలు, కవితలు కాదు, అలా అని మామోలు వాక్యాలూ కాదు. మొన్నెప్పుడో, నాయుడు గారి బ్లాగ్ లో వారి అందమైన హాఫ్లాంగ్ కవితలు చూసి నాకు ఆవేశం వచ్చింది, నేనూ ఇలా పోస్ట్ చేయ్యచ్చని. A long poem is a contradiction అన్నారు, ఈ చిట్టి కవితలు, సగం నిజాలేమో. అందరితో పంచుకోవాలని అనిపించి పోస్ట్ చేస్తున్నాను, మీకు అర్థం అయితే ఆనందమే.. అర్థం కాకుంటే, నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ;-) (ఎందుకంటే, నేను రాయని ఆ మిగతా సగం నిజం ఏంటో నాకూ తెలీదు మరి.. నిజంగా.. )+++++++++++++++++++++++

నా గుండె గదిలోనే నాకు నిర్భంధం,
మూసి ఉన్న ఆ తలుపుకు, గడియ బయట వుంటే, అది ఒంటరితనం.
లోనుంచే వుంటే.. అది ఏకాంతం.
వింతల్లా.. ఆ గదికి తలుపైతే వుంది కానీ, గోడలేవి ?
మరి ఎందుకు గుండె గదిలోనే నాకు నిర్భంధం ?

+++++++++++++++++++++++

ఏ రాగానికీ అందని ఒక స్వరముంది..
అది మౌనం..
ఏ జీవితానికి అర్థమవ్వని ఓ అనుభవం వుంది..
అది మరణం.
గమ్యానికవతల ఏముందో.. గమనానికి తెలిపేదెలా ?

+++++++++++++++++++++++

అందం గా తయారవ్వడానికి,
అద్దం ముందే గంటల తరబడి.
రాసిన పౌడర్ అంతా, అద్దానికి అంటితే..
లోలోనే నవ్వుకున్న అద్దం నన్నడిగింది..
నవ్వులు అతికించుకుంటావెందుకు అని..
గుండెలోంచి నవ్వడం ఎలా.. ?
మరచిపోయానా నేను..

+++++++++++++++++++++++ఇంతకు ముందు ప్రచురించిన పోట్టికవితల పోస్ట్ లింక్ : చిట్టి పొట్టి కవితలు - 1

Friday, November 19, 2010

సంచలనాల "అవుట్ లుక్"

నిజమో, అబద్దమో కానీ, ఈ వారం అవుట్ లుక్ కవర్ స్టొరీ గా ప్రచురించిన టెలిఫోన్ సంభాషణలు (నీరా రాడియా అనే ఓ పవర్ బ్రోకర్ జరిపినవి) సంచలనాత్మకం గా వున్నాయి. UPA ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు, DMK కి కేటాయించే మంత్రిత్వ శాఖల విషయం లో (ఎన్ని ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ? వగైరా.. వగైరా.. ) పలువురు ప్రముఖులు (రాజా, కనిమొళి, మొదలగు వారు) జరిపిన ఈ సంభాషణలు, మన ప్రజాస్వామ్య అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. నేను ఎంతగానో అభిమానించే ఓ ఇద్దరు జర్నలిస్ట్ లు (కావాలనే, పేర్లు రాయడం లేదు) కూడా ఆ సంభాషణల్లో పవర్ బ్రోకర్లలా మాట్లాడుతుంటే, నిర్ఘాంతపోయాను. ఎంత నిజమో, ఎంత అబద్దమో, కానీ, ఈ సంభాషణల వివరాలు చూస్తూవుంటే, 2G కుంభకోణం "Tip of the iceberg" అని మాత్రం అర్థం అయ్యింది. అవుట్ లుక్ వెబ్ సైట్ లో పెట్టిన కొన్ని tapes వినేటప్పటికి, మనసంతా అదోలా అయిపొయింది. ఏముంది, విని తెలుసుకోడానికి, ఈ నాయకులకి ఓట్లేసి (ఓటు వేయకుండానూ) గెలిపిస్తున్నందుకు సిగ్గు పడాలి అంతే. సరిపోదు. సిగ్గు తో చావాలి.

ఎవరికైనా, ఈ స్టోరీ పూర్వాపరాలు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే, అవుట్ లుక్ వెబ్ సైట్ చూడగలరు. - http://www.outlookindia.com/article.aspx?268071

Thursday, November 18, 2010

మీరు చదవని ఎంకి పాట!!

సుక్కనై రాతిరేల నీకు తోడవ్వకుంటానే ?

గురుతుకొస్తే సాలె, నా ఎంకి,
గుండె గుబులై పోతాది..
నన్ను నేను మరిసేపోతానే.
నాకు నా గురుతు రానీయకే..

తోడుగా నువ్వొస్తే ఓ సందేల,
ఎలుతురంతా సీకటై పోతాది..
నేను నీతో ఏకమై పోతానే.
నా తోడు వొదలకే..

దొరకనన్నావంటే ఓ నా ఎంకి,
బరువు బ్రతుకై పోతాది..
లోకమంతా నాకు ఎతుకులాటే.
నాతో దోబూచులాడకే..

సూసీ నను దాటేసినావంటే,
దాటీ నన్ను మరిసేసినావంటే,
యింక నేనెక్కడుంటానే..
సుక్కనై రాతిరేల నీకు తోడవ్వకుంటానే ?
మీరు చదవనిది అని ఖచ్చితం గా ఎలా చెప్పానంటే, రాసింది నేను కదా.. మీరు ఎక్కడ చదువుతారు.. :-) ఎంకి పాటలపై మక్కువతో ఆ శైలి లో రాసే ఓ తుంటరి ప్రయత్నం, అన్యదా భావించకండి.

(ఈ మధ్య, ముద్దు కృష్ణ గారి కవితా సంకలనం "వైతాళికులు" చదువుతున్నాను, అద్భుతమైన పుస్తకం)

Monday, November 15, 2010

చిట్టి పొట్టి కవితలు -1

ఏ రాత్రో పడుకునేముందు, ఓ ఆలోచన రావడం, ప్రక్కనే ఏది దొరికితే, దాని మీద రాసేసి పడుకోవడం, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రాతలు, కవితలు కాదు, అలా అని మామోలు వాక్యాలూ కాదు. మొన్నెప్పుడో, నాయుడు గారి బ్లాగ్ లో వారి అందమైన హాఫ్లాంగ్ కవితలు చూసి నాకు ఆవేశం వచ్చింది, నేనూ ఇలా పోస్ట్ చేయ్యచ్చని. A long poem is a contradiction అన్నారు, ఈ చిట్టి కవితలు, సగం నిజాలేమో. అందరితో పంచుకోవాలని అనిపించి పోస్ట్ చేస్తున్నాను, మీకు అర్థం అయితే ఆనందమే.. అర్థం కాకుంటే, నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ;-) (ఎందుకంటే, నేను రాయని ఆ మిగతా సగం నిజం ఏంటో నాకూ తెలీదు మరి.. నిజంగా.. )


+++++++++++++++++++++++

రెక్కలు లేనంతసేపూ,
అమ్మ ఒడి ఎంత వెచ్చనో కదా,
ఆనక ఎగిరిపోక తప్పనేలేదు,
పాతాళం లోకి.

+++++++++++++++++++++++

చిక్కుకు పోయిన ఆలోచనల,
సమాధి స్థితి.. జ్ఞాపకం.
కాలం గడ్డ కట్టుకుపోయిన క్షణాన..
అదే మరి నా జీవితం.

+++++++++++++++++++++++

చలికి తాళలేక వెన్నెల..
మనిద్దరిని కలిపింది.
అనుక్షణం నీకో వరం ఇవ్వాలని..
తారల లెక్క చాలదేమో.

+++++++++++++++++++++++

జీవితం అంతా లెక్కలే..
బాల్యమంతా హెచ్చివేతలు..
యవ్వనం కూడికలు.
అది దాటాక ఇంకేముంది..
తీసివేతలు.. భాగించుకోడాలు.
శేషం మిగలకుండా.

+++++++++++++++++++++++

Saturday, November 13, 2010

చెన్నైలో జాజ్ సంగీత కచేరిఈ కార్యక్రమానికి నేనూ వెళ్ళాను. ప్రదర్శన అత్యద్భుతం గా సాగింది. కాసేపు వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. సంగీతమే జీవితం అనుకునే కళాకారులు, తమను తాము మరచిపోయి, వాయిద్యాలతో చేసే విన్యాసాలు అపూర్వం, అనితర సాధ్యం. ఇలాంటి కార్యక్రమానికి (జాజ్ కచేరి కి) వెళ్ళడం నాకూ ఇదే మొదటి సారి, ఆ సంగీత శైలి పై నాకు పెద్ద అవగాహనా లేదు, కాని కూర్చున్నంతసేపు నన్ను మంత్ర ముగ్ధుణ్ణి చేసింది ప్రదర్శన, ఒక మంచి అనుభూతిని మిగిల్చింది. సాధారణం గా కర్నాటిక్, నాట్య ప్రదర్సనలు జరిగే నారద గాన సభలో జాజ్ కచేరి ని నిర్వహించడం కూడా అభినందనీయమే. ఎవరు వస్తారా, అననుకుని వెళ్ళాను, కాని హాల్ దాదాపుగా నిండిపోయింది. జపాన్ కాన్సులేట్ ఆధ్వర్యం లో జరగడం వల్ల కాబోలు, ఒక్క పాలు ఎక్కువ క్రమశిక్షణ తో జరిగింది కార్యక్రమం. కెమెరాలు పట్టుకుని, అడ్డదిడ్డం గా తిరగడాన్ని అనుమతించలేదు. హాయిగా అనిపించింది.

Friday, November 12, 2010

ఈ అనంతం లో అంతమెక్కడని వెతకను..?

ఈ అనంతం లో అంతమెక్కడని వెతకను..?

గుండెకి ఏ భాషా తెలీదు..
కానీ అది మాట్లాడుతూనే వుంటుంది.
మనసు లోతుల్లోకి ఏదీ చేరనే చేరదు..
కానీ అది కోరుకోవడం మానదు.. .

కాలం గుప్పెట్లో దాచుకున్న ఇసుక, జీవితం అయితే..
దాన్ని నా ఆశల అంచనాలతో ఇంకా బంధించకపోతేనేం ?
వదులుకున్నది.. దాచుకున్నది.. చివరకు రెండూ ఒక్కటే అయినప్పుడు..
ఆ చేతిని మాత్రం మూసి ఉంచడమెందుకు .. ?

ఈ అనంతం లో అంతమెక్కడని వెతకను..?

నేనే లేనప్పుడు.. అది అంతమయినట్టే కదా..
అప్పుడది అనంతం ఎలా అవుతుంది ?

Wednesday, November 10, 2010

మహారాజ రాజశ్రీ రాజా గారికి (కేంద్ర టెలికం మంత్రివర్యులు)

మహారాజ రాజశ్రీ రాజా గారికి,

శుభాభినందనలు. మేము క్షేమము, మీరు క్షేమమని తెలుస్తూనే వుంది. ఈ రోజు మీ ఘన కీర్తి గురించిన వార్తలు వింటుంటే, గర్వంగా ఫీల్ అయ్యాము. ఈ మైలు రాయి అందుకోడానికి మీరు ఎంత కష్టపడ్డారో, ఎన్ని విలువలను తాకట్టు పెట్టేరో తలుచుకుని, ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాం. కేంద్ర మంత్రిగా అవినీతి లో మీరు సాధించిన ఈ అత్యున్నత స్థాయి, మన దేశం లో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకూ, ఒక బెంచ్ మార్క్ గా మిగిలిపోతుంది. లక్షల్లో అవినీతి కే ఓ న్యాయమూర్తి గారు, కేవలం కొన్ని పదుల కోట్ల అవినీతి కే ఓ ముఖ్య మంత్రి గారు, పదవులు కోల్పోయిన ఈ రోజున, మీరు ఇంకా మీ కొలువు లోనే కొనసాగడం, మీ నైపుణ్యానికి, మా అదృష్టానికి ఒక తార్కాణం. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయంటే మరి ఆశ్చర్యం ఏముంది, అసూయ ఆ మాత్రం హడావిడి చేయిస్తుంది మరి. మీరు ఇలానే మన దేశ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆశిస్తున్నాం. టెండూల్కర్ లా మీ రికార్డ్ లు మీరే బద్దలు కొట్టాలని మా కోరిక.

2G , 3G , లే కాక, 4G , 5G కూడా త్వరలోనే రావాలి, మీరు మళ్లీ మీ ప్రతిభను ప్రదర్శించాలి. మొన్నెప్పుడో ఒబామా గారు, మనల్ని అభివృద్ధి చెందిన దేశం అననే అన్నారు, దేని లోనో చెప్పకుండా. ఈ సారి, నోబుల్ లాంటి అత్యున్నత పురస్కారం మీకు (మీదైన విభాగంలో) రావాలని మా డిమాండ్. లక్ష డెబ్బై ఆరు వేల కోట్లను (కాగ్ లెక్క ప్రకారం) , మన జనాభా తో భాగించి, నా న్యాయమైన వాటాని నాకు online transfer చేస్తారనే నమ్మకం తో ఇంక ముగిస్తున్నాను. (ఎకౌంటు వివరాలు మీకు SMS లో పంపగలను) ఈ సారి, మీరు IPO ఆలోచన కూడా చేయగలరు.

కనిమొళి గారికి కూడా, మా అభినందనలు తెలియచేయండి.

మీ శ్రేయిభిలాషి, (మీ శ్రేయస్సే మా శ్రేయస్సని నమ్మే)
విజయ్ భాస్కర్.

Tuesday, November 9, 2010

కోయంబత్తూర్ కిడ్నాపర్ ఎన్ కౌంటర్

ఇటీవల ఇద్దరు పసిపిల్లల కిడ్నాప్ మరియు హత్య కేసులో ముద్దాయి అయిన మోహన్ రాజ్ ఎన్ కౌంటర్ లో మరణించాడు. నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా జరిగిన కాల్పుల్లో మరణించాడని పోలీసుల వివరణ. నిజానిజాలు ప్రక్కన పెడితే, ఈ కేసు పూర్వాపరాలు తెలిసిన వారందరూ ఆనందించారు. నేను కూడా. కాకపొతే, అంతర్జాలం లో ఈ ఎన్ కౌంటర్ కి వస్తున్న మద్దతు చూస్తుంటే గర్వపడాలో, బాధ పడాలో తెలీడం లేదు. ఈ రకం గా, పోలీసులే తీర్పులిస్తుంటే, దాన్ని మనం సమర్ధిస్తుంటే, ఇంక న్యాయ వ్యవస్థ ఎందుకు ? నిందితుడు చేసిన నేరానికి మరణ శిక్ష సబబే ఖచ్చితం గా (నిజానికి ఇంకా పెద్ద శిక్ష కావాలి). కానీ మనం ఎన్ కౌంటర్ ని justify చెయ్యడం, మనకు మన కోర్టు ల పైన ఉన్న విశ్వాసానికి (అవిశ్వాసానికి) నిదర్శనం. ఓ రెండేళ్ళ క్రితం అనుకుంటా, వరంగల్ లో జరిగిన ఒక ఆసిడ్ దాడికి కూడా ఇలాంటి ఫలితమే మనం విన్నాం. తప్పో రైటో, నేరం చేద్దామనుకునే వాణ్ణి భయపెడితే మంచిదే, కాని, ఇప్పటికే బ్రష్టు పట్టిన పోలీసు వ్యవస్థకి ఈ సంస్కృతి పిచ్చోడి చేతిలో రాయి కాకూడదు. ఆ మధ్య నేను "అంజాదే" అని ఒక అర్థవంతమైన తమిళ సినిమా చూసాను, దాదాపుగా ఈ కేసు లాంటి ఇతివృత్తం తో తీయబడిన చిత్రం అది, ఆ చిత్రం లో కూడా ముగింపు ఇదే. శ్రీరాముడే వాలిని చాటుగా చంపాడు, ఈ మధ్య వింటున్న నేరాలకి మనుషులకి ఉద్దేశించి రాయబడిన IPC సరిపోదేమో అనిపిస్తోంది నాకు.

Sunday, November 7, 2010

వాట్ an expression సర్ జి!!


వాట్ an expression సర్ జి!! అదిరింది..

కళ్ళు బాగా తెరుచుకున్నట్టున్నాయి ?
నిజమే లెండి.. అందుకే అంటారు..
"నువ్వు నిద్రిస్తున్నావనే నిజం మెలుకువ వస్తేనే నీకు తెలుస్తుంది" అని.. (ఈనాడు మంచిమాట)
మీకు, మాకు ఉన్న ఓ వ్యత్యాసం చెప్పమంటారా., మీలా మాకు "ఆకలి, నిరుద్యోగం" కొత్త కాదు మరి. .

(మనలో మనమాట, మా చెన్నై లో తుఫాను కష్టాలు మొదలయ్యాయి.. )

Friday, November 5, 2010

రోబో కథ నాదే.. నాదే.. నాదే..

రోబో కథ నాదే !!!

ఏడో క్లాస్ క్వార్టర్లీ పరీక్షలో ఏ ఫ్రెంచ్ విప్లవం గురించో రాయమంటే, గుర్తు రాక నేను రాసిన కథే ఈ రోబో కథ. కావాలంటే క్రింద నేను రాసిన కామన్ పాయింట్స్ చూడండి, మీరే ఒప్పుకుంటారు.

1. హీరో చాలా మంచివాడు, హీరోయిన్ గొప్ప అందగత్తె.
2. హీరోయిన్ ని హీరో ప్రేమిస్తాడు, హీరోయిన్ కూడా హీరో ని ప్రేమిస్తుంది (అది వాళ్ళ స్వభావం మరి..)
3. విలన్, హీరోయిన్ అందానికి ఫ్లాట్ అయిపోయి హీరోయిన్ ని బంధిస్తాడు
4. హీరో విలన్ తో ప్రాణాలకు తెగించి పోరాటం చేసి హీరోయిన్ ని రక్షించుకుంటాడు

ఇవి మామోలే కదా అంటారా, ఇంకా వుంది నా లిస్టు.. డీటైల్డ్ గా,

5. హీరో హీరోయిన్ లు కలల పాటలు పాడుకుంటారు (విలన్ కూడా)
6. విలన్ ఎన్ని కానుకలు ఇచ్చినా హీరోయిన్ అతన్ని ప్రేమించదు
7. విలన్ ప్రాణం ఉన్న చిలకను (లేక మరేదో) హీరో గుర్తించి విలన్ ని అంతమొందిస్తాడు.
8. హీరో హీరోయిన్ ఆనందం గా నూరేళ్ళు బ్రతికేస్తారు, అని మనం నమ్మాలి. (కథ అయిపోయాకలెండి)

ఇందాకా టీవీ లో ఎవరో రోబో కథ వాళ్ళదే అని వాదిస్తుంటే, నా ట్యూబ్ లైట్ వెలిగి, నాకు జరిగిన అన్యాయం ప్రపంచానికి తెలియపరచాలని డిసైడ్ అయ్యాను. నిజానికి ఇలా నా ఈ కథ కాపీ కి గురికావడం ఇదే ప్రధమం కాదు, ఆయనెవరో వాల్మికి అంట, ఇదే కథ రాసి దానికి రామాయణమో మరొకటో పేరు పెట్టాడు. ఎంచేయ్యగలం. ఇండియా లో ఇంతే.. ఇండియా లో ఇంతే.. ఇండియా లో ఇంతే..(మణిరత్నం స్టైల్ లో మూడు సార్లు.. )


చెప్పడం మరచిపోయాను, ఇది నా వందో పోస్ట్. (అయితే ఏంటి అంటారా ?, ఏమీ లేదు, ఏదో నా తుత్తి కోసం చెప్పా :-))

చిన్న వివరణ : (వచ్చిన/రాబోయే ఒకటి రెండు అక్షింతలకు నా స్పందన)

పై పోస్ట్ నేను రాసింది, మన హిట్ సినిమాల ఫార్ములా లు అన్ని ఒకేలా వుంటాయి అని సరదాగా చెప్పడానికే కాని, రోబో స్టొరీ గురించి భాస్కర్ గారు లేవదీసిన ఇష్యూ గురించి మాత్రం కాదు అని గ్రహించగలరు. IPR గురించి కాస్త అవగాహన నాకూ వుంది, ఓ రకంగా ఒక రిసెర్చ్ పేపర్ విషయం లో నేనూ దాని బాధితుణ్ణే. ఆ సమస్యని తక్కువ చేసో, హేళన చెయ్యడమో నా ఉద్దేశం కానే కాదు, ఖచ్చితంగా. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ. మరొక కొత్త పోస్ట్ తో మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.

Thursday, November 4, 2010

దీపావళి బంపర్ ఆఫర్* - 105% డిస్కౌంట్ ( *షరతులతో )105% డిస్కౌంట్. మరల రానే రాదు ఈ అవకాశం. త్వరపడండి...

రోశయ్య గారి సుడి బాంబులు - "సుడి వున్నవాళ్ళకే "
*ఢిల్లీ నుంచి కాలిస్తేనే , హైదరాబాద్ లో పేలతాయి.
 
కెసిఆర్ ధమాల్ దుమేల్ - "ఆంద్రోళ్ళ గుండెల్లో"
*తెలంగాణా లో పెట్టి పుట్టినోళ్ళకే (ఫ్రీజోన్ కాదు.. ఫైర్ జోన్)
 
బాబూ'స్ పవర్ పటాసులు - "పవర్ ఉందా.. ఐతే పేలతాయి"
*పేలకపోతే, మళ్లీ ఎన్నికల వరకూ వెయిట్ చెయ్యండి . అంతే..
 
JP's క్లాస్ క్రాకెర్స్ - "పట్టుమని పదిమందికి"
*IAS, IPS కాకపోయినా.. కనీసం SSC వదిలేసినోళ్ళకే మరి.
 
నారాయణ చికెన్ బాంబులు - "కొనండి.. తినండి.. వేయండి.."
*ఎర్ర బట్టలు వేసుకున్నోళ్ళకే (వాటర్ ప్యాకెట్ ఫ్రీ)
 
దత్తన్న హోలీ బాంబులు - "ఎప్పుడు పేల్తాయో"
*నో షరతులు.. (ఎవడూ కొనడని అంత నమ్మకం)
 
చిరు మార్పు మతాబులు - "మారాల్సిందే.. ఎవరో ?"
*ప్రక్క పార్టీల నుంచి వచ్చినోళ్ళకే (కొమరం పులి కెమేరా ప్రింట్ ఫ్రీ)
 
జగన్ నేల జువ్వలు - "పై నుంచి క్రిందకి"
*హవాలా పేమెంట్ , ఓదార్పు డెలివరీ.
 
ఇవి కాక --

హనుమన్న మైక్రో విష్ణు చక్రాలు (పీకలు కొయ్యడానికి), లాంకో రాజా హడావిడి చిచ్చుబుడ్లు (TV9 స్పాన్సర్ షిప్ తో) , KK ఇంగ్లీష్ తుస్సు బాంబులు (జార్ఖండ్ లోనే పేలతాయి), రాములమ్మ పాము బిళ్ళలు (నిప్పు లేనే లేదు .. ఓన్లీ పొగ), వగైరా.. వగైరా.. కూడా లభ్యం.

 
మా తమిళ తంబీల కోసం :

కరుణ హోల్డేజ్ బాంబులు - "పెద్దలకు మాత్రమే "
*కాలవు, పేలవు. సో ప్రశాంతంగా పడుకోండి., (కుటుంబం అన్ లిమిటెడ్)
 
జయ-శశి జంట జువ్వలు - "సొమ్ము మీది.. సోకు మాదే"
*మీరు కొనండి, మేము కాలుస్తాం.. మీరు TV లో చూసి ఆనందించండి. (నాగులు చవితికి పునః ప్రసారం)
 
వైగో నిజం బాంబులు (పాతవి, కానుకగా వచ్చినవి, కొన్ని ఉండిపోయాయి మరి ఏంచేద్దాం), రామదాసు పొగలేని కాకరపువ్వొత్తులు కూడా వున్నాయి (గత దీపావళి స్టాక్ , కేవలం మీకోసం)


సరదాగా రాసాను, సరదాగానే తీసుకుంటారని ఆశిస్తూ..

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!!

Tuesday, November 2, 2010

చెన్నైలో తెలుగు వెలుగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ పురస్కరించుకుని, ఈ రోజు, చెన్నై లోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటి వాళ్ళ ఆధ్వర్యం లో ఒక కార్యక్రమం జరిగింది. అదృష్టవశాత్తు, ఈనాడు లో ఆ వార్త నా కంట బడింది. నేను పనిచేసే కార్యాలయానికి, ఇంటికి, దగ్గరలోనే ఉన్న మైలాపూరు లోనే అవ్వడంతో, ఓ గంట పర్మిషన్ పెట్టి కార్యక్రమానికి వెళ్ళాం. పాత రాష్ట్రము, కొత్త రాష్ట్రము, ఈ విషయాల లోతుల్లోకి వెళ్ళకుండా, తెలుగు వాళ్ళందరూ ఓ సాయంత్రం కలిసి తెలుగు తల్లిని స్మరించుకోవాలని పెట్టిన కార్యక్రమం కావడం తో చూడ ముచ్చటగా జరిగింది. సుప్రసిద్ధ రచయిత్రి మాలతి చందూర్ అధ్యక్షత వహించారు, గాన గంధర్వుడు SPB ప్రత్యేక అతిధి. చెన్నైలోని తెలుగు ప్రముఖులు కొందరు వచ్చిన వాళ్ళలో ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా, అమరజీవికి, వాళ్ళ సంస్థకి సంబంధించిన వివరాలతో ఒక వెబ్ సైట్ కూడా ప్రారంభించారు.

పరాయి రాష్ట్రంలో స్వచ్ఛమైన తెలుగు వినడం మహదానందం గా అనిపించింది, ప్రసంగాల్లో చెప్పిన విషయాలు, ముఖ్యం గా తెలుగు వాడుక గురించినవి పాతవే అయినప్పటికీ, సందర్బోచితం గా వుంది. SPB మాట్లాడుతూ, ఇళ్ళల్లో తెలుగు వాడుక పెంచాల్సిన ఆవశ్యకత గురించి మరొక్కసారి గుర్తుచేశారు. మొన్నెప్పుడో ఎవరో కుర్రాడికి "డెభై ఎనిమిది" అని చెప్పి రాయమంటే వెర్రి చూపులు చూసాడని వాపోయారు. అంతర్జాలం లో తెలుగు వినియోగం గురించి ఆయన ప్రస్తుతిస్తున్నప్పుడు, లోలోనే ఆనందించాను, మురిసి పోయాను. ప్రారంభంలో "నదియ" గారి నాట్య ప్రదర్శన, చివర్లో SPB ఆలపించిన పద్యం తో కార్యక్రమం నాకు మంచి సంతృప్తినే మిగిల్చింది. పాలుపంచుకున్నది కొద్దిమందే అయినా, సభ అర్థవంతం గా, ఆహ్లాదకరం గా సాగింది. SPB అననే అన్నారు - "గంగి గోవు పాలు గరిటడైనను చాలు" అని...

(ఇంకొంచం వివరంగా రాసే వాణ్ణే కానీ, ప్రస్తుతానికి ఇంతకంటే రాసే ఓపికలేదు, మీరు అర్థం చేసుకుంటారు లెండి. :-))