Monday, November 29, 2010

"ఆరెంజ్" రంగు ప్రేమ
ప్రేమలు పలు రకాలు. ఉదాహరణకి, అమ్మ ప్రేమ తెల్ల రంగులో నిర్మలంగా ఉంటుంది,వెలుగులా.. , విలన్లకి ఉండే ప్రేమ నల్ల రంగులో ఉంటుంది, చీకటిలా.. , పెళ్ళైన ఓ పదేళ్ళకి భార్యా భర్తల మధ్య ఉండే ప్రేమ, నీటిలాగ పారదర్శకంగా వుంటుంది, (ఉందో లేదో అన్నట్టు.. ), గోపికలకి కృష్ణుడి మీద ఉండే ప్రేమ ఆకాశం రంగులోనూ.. ఇలా ఎన్నో ప్రేమలు.. ఇంకో ముఖ్యమైన ప్రేమ, ఆరెంజ్ రంగు ప్రేమ, ఇది ఆకర్షణకి దగ్గరగానూ, ప్రేమకు కాస్త దూరంగానూ ఉంటుంది. కానీ అదీ ప్రేమే. దీన్ని మనం స్కూళ్ళ లోను, కాలేజిలలోను, ఆఫీసుల్లోనూ, చూడవచ్చు. ఇంకా వీజీ గా, పెళ్ళైన కొత్తలోనూ, సినిమాల్లోనూ చూడవచ్చు. ఈ ప్రేమ గాఢత ఎక్కువగాను, కాల వ్యవధి తక్కువగాను వుంటుంది. ఓ చిరునవ్వుకో, కొన చూపుకో, చేతి స్పర్శ కో పుట్టేస్తూ ఉంటుంది.. ఏ చిన్నిమాటకో, SMS కో, ఏ సీరియల్ విషయం లో గొడవకో మాయమైపోతుంది.


ఈ ప్రేమని, దాని లక్షణాలని, పూర్తి స్థాయిలో వివరించిన చిత్రం "ఆరెంజ్". ఈ ఆరెంజు రంగు ప్రేమ గురించి బాగా అవగాహన ఉన్న హీరో, అంతగా అవగాహన లేని హీరోయిన్ కి, మిగతా నటీనటులకు, ప్రేక్షకులకు ఈ ప్రేమని అర్థం అయ్యేలా చెప్పడం ఈ సినిమా ముఖ్యోద్దేశం. ఆ పరంగా, దర్శకుడు నూరు శాతం విజయం సాధించాడు. అందుకే ఈ సినిమాకి "ఆరెంజ్" అని సందర్భోచితమైన పేరు పెట్టేరు. ఇంతకు ముందూ, సఖి, స్వయంవరం వగైరా, వగైరా చిత్రాలు, ఈ ప్రేమని, దాని పరిణామ క్రమాన్ని వివరించే ప్రయత్నం చేసినా, "ఆరెంజ్" సినిమా ఇంకొంచం లోతుగా చెప్పుకొచ్చింది. ఉదాహరణలతో సహా.. కొన్ని డైలాగులు నిజమే అయినా, మనం ఒప్పుకోలేం, అలాగే కొన్ని సన్నివేశాలు కూడా. అది ఈ రంగు ప్రేమ మీద మన అవగాహనా రాహిత్యమే కానీ, సినిమా లో లోపం కాదు. ఇంక నటీనటుల విషయానికి వస్తే, అందరు వాళ్ళ వాళ్ళ పరిధిలో బానే చేసారు. జెనీలియా కొంచం తక్కువ, రాం చరణ్ కొంచం ఎక్కువ యాక్షన్ చేసుంటే ఇంకా బావుండేది. బ్రహ్మానందానికి ప్రతీ సారీ ఒకే డైలాగ్ కాకుండా, వేరే వేరే డైలాగ్లు రాసి ఉంటే హాస్యం ఇంకా పండేది. సినిమా లోనే ఒక ప్రేక్షకుడి పాత్ర క్రియేట్ చేసి, దాన్ని ప్రకాష్ రాజ్ కి ఇచ్చారు, అతను మన పాత్రని బాగా పోషించాడు. ఫస్ట్ హాఫ్ లో కంటే, సెకండ్ హాఫ్ లో ఉత్సాహంగా కనిపించాడు. అర్థం చేసుకోగలం. సంగీతం ఓ మోస్తరు కంటే బానే వుంది.


ఎవరో అన్నట్టు, కారణాల కోసం ప్రేమని, రివ్యూ లు చూసి సినిమాలు వదులుకోకూడదు. తప్పక చూడండి. మీ జీవితానికి ఓ కొత్త రంగుని అద్దుకోండి. (ఈ కొత్త రంగు మీ జీవితాన్నే మార్చేస్తుంది, అని ఎవరైనా చెప్తే నమ్మకండి. ఎందుకంటే, అన్ని రంగులు కలిస్తేనే జీవితం మరి)

ఓ చిరు సలహా : సినిమాని మరీ క్రిటికల్ గా చూసే వాళ్లతో కాకుండా, ఎంతో కొంత ఎంజాయ్ చేసే వాళ్లతో వెళ్ళండి, మీకు ఈ సినిమా నచ్చే అవకాశాలు పెరుగుతాయి.

5 comments:

 1. బావుంది మీ విశ్లేషణ. ఎర్ర గులాబీలూ, ఎరుపూ గాఢమైన, శాస్వతమైన ప్రేమకి చిహ్నం కాబట్టి ఇది అంతకంటే తక్కువ ప్రేమ కనక ఆరెంజ్ అన్నమాట.

  ReplyDelete
 2. I like your post.Its very genuine and informative :) Nenu alochinchina vdihanam lone meeru alochincharu. :)

  ReplyDelete
 3. >> సినిమాని మరీ క్రిటికల్ గా చూసే వాళ్లతో కాకుండా, ఎంతో కొంత ఎంజాయ్ చేసే వాళ్లతో వెళ్ళండి, మీకు ఈ సినిమా నచ్చే అవకాశాలు పెరుగుతాయి.

  I know :)

  ReplyDelete
 4. nice review... nacchesindi movie. Evaru success ayaaro teliyadu kaani Bhaskar maatram marks kottesaadu.. oka adhbutham aina concept ki roopakalpana chesi.. :)

  ReplyDelete