Thursday, December 30, 2010

తెలంగాణా వొద్దు.. సమైక్య ఆంధ్రా వొద్దు.

నిజంగానే, నాకు తెలంగాణా వొద్దు, సమైక్య ఆంధ్రా వొద్దు. కానీ నావి ఈ క్రింది కనీస డిమాండులు. ఏ కమీషన్ రిపోర్ట్ ఇస్తుంది.. ఏ MP నిరాహార దీక్ష చేస్తారు ?

1. తాగడానికి రక్షిత మంచినీళ్ళు
2. ఏ తెల్లవారుజామునో రైలుపట్టాల ప్రక్కకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, కనీసం పది గడపలకో మరుగు దొడ్డి.
3. తల్లి బిడ్డ ఆరోగ్యానికి భరోసా ఇవ్వగలిగే ప్రసూతి సదుపాయం.
4. పెద్ద పెద్ద రోగాలు మాట ప్రక్కన పెట్టి, కనీసం విష జ్వరాలకు, కలరా, మలేరియా వగైరా వ్యాధులకు సరైన వైద్యం
5. మద్యపాన నిషేధం.
6. కానీసం ఏడు వరకూ మంచి చదువు.
7. అవినీతికి ఆస్కారం లేని స్థానికి పరిపాలన వ్యవస్థ

ఇవేవి ఇవ్వలేము అని మన నాయకులు అనుకుంటే, అయ్యా, నేను ఏ రాష్ట్రం లో ఉన్నా నా బ్రతుక్కి ఏది అర్థం ?

"వ్యవస్థ రోజుకి వంద సార్లు చస్తోంది. అన్ని సార్లు నేను ఏడ్వలేను. నన్ను బండ రాయిని చెయ్యి."

Tuesday, December 28, 2010

ఉల్లిపాయలు, టమాటాలు, .. తరువాత ఏంటో చెప్పుకోండి చూద్దాం ?
గత కొన్ని రోజులుగా, ధరాఘాతం తో అల్లాడించిన ఉల్లిపాయలు.. టమాటాలు.. ఈ వరుసలో తరువాతి వంతు ఎవరిది ? నా మటుకు నాకు, నిమ్మకాయలదే అనిపిస్తోంది మరి.

ప్రతీ రోజూ, స్థానిక నాయకుడితో మొదలుకుని, అధిష్టానాల వరకూ, అందరూ ఈ నిరాహార దీక్షలు చెయ్యడాలు, గ్లాసులు గ్లాసులు నిమ్మాకాయ నీళ్ళతో విరమించేయ్యడాలు..బళ్ళ కొద్దీ నిమ్మకాయలు పాపం రసం లేని డిప్పలుగా మిగిలిపోతున్నాయి. ఇప్పుడు డిమాండ్ / సప్లై అంటూ ఓ లాజిక్ మీకు తెలిసిందే కదా, ధర మాత్రం పెరక్కేంచేస్తుంది. అందుకని, ఒకటి రెండు రోజుల్లో ఎలానో భగవద్గీత రిలీజ్ అవుతోంది కాబట్టి ఈ సారి మన నాయకులు ఈ నిరాహార దీక్షలను ప్రక్కన పెట్టి, ఏ శ్రమ దానమో, ఇంకా బాధగా ఉంటే, రక్త దానమో చేసి తమ తమ ఉద్యమాలను నడిపించుకో ప్రార్థన. పాదయాత్రలు కూడా పర్వాలేదు, మన దేశం లో తోళ్ళ పరిశ్రమకు కాస్త చేయూతని ఇచ్చినట్టు ఉంటుంది.

మరీ తప్పని పరిస్థితిలో నిరాహార దీక్షలు చేసినా, ఇంక మరి విరమించే పని పెట్టుకోవద్దు.. ఏంటంటారు ?

Monday, December 27, 2010

అవినీతి కొత్తేం కాదు

అవినీతి దేశానికి కొత్తేం కాదు, మూల కారణాలకు చికిత్స (మూల కణ చికిత్స ?) చేయ్యాలంటున్న అమర్త్స్య సేన్. నిజమే కొమ్మలని, కాయల్ని మార్చినంత మాత్రాన చెట్టు వేరు కున్న జాడ్యం పోతుందా ? ప్రజాస్వామ్యం లో అత్యంత భాద్యత కల్గిన పదవి/పాత్ర ఓటరుది. ఆ పని మనం నిబద్దతతో చేయనంత వరకూ, ప్రజాస్వామ్యాన్ని తప్పు పట్టే హక్కు మనకి లేదని నా అభిప్రాయం.

Saturday, December 25, 2010

రాజా, కల్మాడీ ఇళ్ళల్లో సిబిఐ కి దొరికినవి ? (బ్రేకింగ్ న్యూస్)
స్కాం విలువ ఆధారం గా, మొదట రాజా గారి ఇంట్లో దొరికినవి మనవి చేసుకుంటున్నాను.

1. గత వారం మోర్ సూపర్ మార్కెట్ లో ఉల్లిపాయలు కొన్న రసీదు.
2. బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్న అబ్బాయి ప్రొగ్రెస్స్ రిపోర్ట్
3. కరుణానిధి గారి వంశ వృక్షం ఫోటో కాపీ.
4. ఓ ఐదేళ్ళ క్రితం కనిమొళి గారు పంపిన గ్రీటింగ్ కార్డు
5. నగర శివార్లలో ఉన్న ఓ దళిత స్కూలుకు రాజా గారు ఇచ్చిన లక్షా డెభ్భై ఆరువేల రూపాయల (ఈ సంఖ్య ఎక్కడో విన్నట్టుంది ? ) విరాళానికి సంభందించిన రసీదు
6. రోబో ఆడియో కాసేట్ మరియు CD కూడాను.
7. మధు కోడా నుంచి వచ్చిన ఒక ప్రశంసా పత్రం.

ఇవి కాక, కరంట్ బిల్లులు, పన్ను రసీదులు, మెడికల్ రిపోర్టులు (రాజా గారివి, మరియు కరుణానిధి భార్య గారివి కూడా), పయనీరు పేపర్ కట్టింగులు, నీరా రాడియా పెళ్లి ఫోటోలు మరియు పెటాకుల ఆర్డరు లభించాయి. ఈ పత్రాల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, సిబిఐ వాటిని జప్తు చేసేందుకు హైకోర్టు అనుమతికోసం ఎదురు చూస్తోంది. సిబిఐ కి ఆ హక్కు లేదని, అది చాలా అన్యాయమని, ఇప్పటికే మానవ హక్కుల సంఘాలు, ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి.

దాదాపుగా కల్మాడి గారి ఇంట్లోనూ, ఇలాంటి పత్రాలే లభించినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఎవరో సోనియా, రాహుల్ పేర్లమీద ఉన్న ఎకౌంటు స్టేట్మెంట్స్ దొరికాయి కానీ, ఆ వివరాలు ఈ కేసుకి సంభందించినవి కావని సిబిఐ తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసుని ఇంకా డీప్ గా శోధించడానికి సిబిఐ ప్రత్యేక బృందం, కల్మాడి గారి అమ్మమ్మ గారి ఊరుకి బయలుదేరినట్టు సమాచారం. అక్కడైనా ఆయన స్టడీ సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్ లాంటి కీలక పత్రాలు దొరకాలని ఆశిద్దాం.

ఇప్పుడే అందిన మరో ముఖ్యమైన వార్త, కేవలం స్కాం నాయకుల కోసం అపోలో ఆసుపత్రి వారు ఢిల్లీ లో సిబిఐ ఆఫీసు ప్రక్క సందులో ఓ ప్రత్యేక బ్రాంచ్ ని మొదలు పెడుతున్నారు. అదే విధం గా, నిమ్స్ లో నిరాహార దీక్షల వార్డుని వేరే గా మొదలు పెట్టాలని, ఆ వార్డు కేటరింగు కాంట్రాక్టు నాకే ఇవ్వాలని నేను నా బ్లాగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.

Monday, December 20, 2010

చిట్టి పొట్టి కవితలు - 3

ఫ్లాష్ బ్యాక్ : చిట్టి పొట్టి కవితలు :ఏ రాత్రో పడుకునేముందు, ఓ ఆలోచన రావడం, ప్రక్కనే ఏది దొరికితే, దాని మీద రాసేసి పడుకోవడం, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రాతలు, కవితలు కాదు, అలా అని మామోలు వాక్యాలూ కాదు. మొన్నెప్పుడో, నాయుడు గారి బ్లాగ్ లో వారి అందమైన హాఫ్లాంగ్ కవితలు చూసి నాకు ఆవేశం వచ్చింది, నేనూ ఇలా పోస్ట్ చేయ్యచ్చని. A long poem is a contradiction అన్నారు, ఈ చిట్టి కవితలు, సగం నిజాలేమో. అందరితో పంచుకోవాలని అనిపించి పోస్ట్ చేస్తున్నాను, మీకు అర్థం అయితే ఆనందమే.. అర్థం కాకుంటే, నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ;-) (ఎందుకంటే, నేను రాయని ఆ మిగతా సగం నిజం ఏంటో నాకూ తెలీదు మరి.. నిజంగా..


+++++++++++++++++++++++

ఎన్ని గాయాలో,
గుర్తుకు తెచ్చుకుని బాధపడటానికి.
కానీ, మిగిలిపోయినా, ఆ మచ్చలు..
కాలంపై నేను సాధించుకున్న అవార్డులు.

+++++++++++++++++++++++

చిన్నప్పుడు ఆడుకున్న సైకిల్ టైర్, కాలం అని తెలీదు నాకు..
లేకుంటే కొట్టి తిప్పేవాణ్ణి కాను.
యవ్వనం లో తొక్కుకుని వెళ్లిపోయిన పూల రెక్కలు నా ఆశల జ్ఞాపకాలే.. గుర్తించనే లేదు,
లేకుంటే ఏరి, గుండె జేబులో ఏ మూలోపడేసే వాణ్ణి.
మధ్య వయస్సంతా, నేను వెతికిన ఆ నీడ, నాది కాదని గ్రహించలేదు,
లేకుంటే, ఏ వీధి దీపం క్రిందో ఒంటరిగా నా నీడ చిక్కేది.
ఈ లోగా వృద్ధాప్యం అక్కున చేర్చుకుంది. ఇంతవరకూ చేసినవన్నీ పొరపాట్లే అని తెలుసుకోవడం..
ఎంత పొరపాటో కదా ?

+++++++++++++++++++++++

ఓ రెండు క్షణాలు నీతో మాట్లాడితే, నాకు నేను గుర్తొస్తాను.
ఓ నాలుగు క్షణాలు నీతో ఉంటే, నన్ను మరచిపోతాను మళ్లీ.
అంత కంటే ఎక్కువ నీతోనే వుంటే, ఇంక నిన్ను వేరుగా ఉండనివ్వను.

+++++++++++++++++++++++

మన మధ్య చిక్కుకుని..
ఏకాంతం ఒంటరైపోయింది.
వెండి వెన్నెల రాత్రి, వేడెక్కి,
జంట నిట్టూర్పులో కరిగిపోయింది.
తమకంతో పెనవేసుకుని..
మైమరచిన మనం..
ఒక్కటిగా అల్లుకుపోయిన ఆ క్షణం.
జీవితమా.. ఎవరువి నువ్వు ?
కాలమా.. కదలకే నువ్వు...

+++++++++++++++++++++++


ఇంతకు ముందు ప్రచురించిన పోట్టికవితల పోస్ట్ లింక్ :చిట్టి పొట్టి కవితలు - 2

Saturday, December 18, 2010

డిసెంబర్ లో ఎవడైనా సిమ్లా, మనాలి వెళ్తాడా.. ?

ఎవడైనా వెళ్తాడా, అంటే, నాకేం తెలుసు. మేము మాత్రం వెళ్లాం. :-) ఉష్ణోగ్రత సున్నా ని తాకుతుంటే, సిమ్లా మనాలి యాత్ర అద్భుతంగా జరిగింది. టాప్ అప్ ఆఫర్ లాగ, పనిలో పని ఢిల్లీ, ఆగ్రా కూడా చూసుకుని ఈ రోజే మళ్లీ గూటికి చేరుకున్నాం. యాత్ర విశేషాలు కాస్త వీలుచూసుకుని రాస్తాను లెండి.

మచ్చుకి ఓ 2 ఫోటోలు .. (ఇన్నాళ్ళకి ఫుల్ గా కాపీ రైట్స్ ఉన్న ఫోటో పెట్టా.. ;-) )


Monday, December 6, 2010

రెండు జతల కాళ్ళు, ఓ పెళ్లి కూతురు, ఓ ఉయ్యాల్లో పాపాయి.. :-)


పెళ్లి రోజు పురస్కరించుకుని, నిన్న తిరుమల లో కల్యాణం చేయించాం. వెయిటింగ్ లు ప్రక్కన పెడితే, ఈ సారి దర్శనం చాలా బాగా జరిగింది. కాస్త చలి., కొంచం వర్షం.. తిరుమల వాతావరణం కూడా అద్భుతం గా వుంది. పాంచజన్యం అతిధి గృహం, ఈ మధ్యే కట్టినట్టున్నారు, ఇంకా నిర్వాహణా లోపాల బారిన పడి పాడవ్వలేదు పాపం... రెండు రోజులు అక్కడే వున్నాం. ఎవరైనా తిరుమల వెళ్ళే ప్లాన్ లోఉంటే, ఈ గెస్ట్ హౌస్ పేరు చెప్పి రూం ఇవ్వమని అడగండి.. బావున్నాయి గదులు. ఉచిత భోజనం ఆరగించాం, నేను కొంచం అనుమానం గానే వెళ్ళినా, తిన్న తరువాత అర్థమయ్యింది, తిరుమల బయట హోటళ్ళ లో దొరికే దాని కంటే ఈ భోజనం వంద రెట్లు మెరుగు అని. TTD లో ఎన్ని లోపాలున్నా, ఈ బృహత్ కార్యాన్ని నిరంతరం గా నడిపిస్తున్న వారందరనీ అభినందించాల్సిందే.

ఇంకా అసలు విషయం, ఎప్పటిలానే, తీరిన కోర్కెలకు, థాంక్స్ లు, మరి కొన్ని కొత్త డిమాండులు పెద్దాయనికి ఇచ్చి చెన్నై వచ్చేసాం. (ఆ శీర్షికలో పెట్టినవి, మా ఆవిడ స్పెషల్ డిమాండులు, లోక కల్యాణం కోసం.. ఇలా బొమ్మలు అమ్ముతారని, వాటిని మన ప్రార్ధనలతో పాటూ, శ్రీవారికి సమర్పించవచ్చని, నేనూ నిన్ననే తెలుసుకున్నా. :-) )

కాస్త ప్లానింగ్.. ఇంకాస్త పేషెన్స్.. ఈ రెండు ఉంటే, తిరుపతి మళ్లీ మళ్లీ వెళ్లి రావొచ్చని అర్థమయ్యింది. ఈ నెలా రెండు నెలల్లో వెళ్దామనుకునే వారు మాత్రం, ఉన్ని దుస్తులు పట్టుకెళ్ళడం మరచిపోకండి.

Wednesday, December 1, 2010

ఇన్నాళ్ళకో మంచి పని చేసాం..

ముషారఫ్ కి భారత వీసా ని నిరాకరించారు, ఇందాకా ఈ వార్త చదివి ఎందుకో చాలా ఆనందమనిపించింది. ఏ సమస్యకీ ఇది పరిష్కారం కాదు, కాని ప్రపంచానికి మన స్టాండ్ తెలియ చెయ్యడానికి ఇదో చక్కని అవకాశం. ఎన్నో ఘాతుకాలకు ప్రత్యక్షం గానూ, పరోక్షం గానూ, కారణమైన ముషారఫ్ లాంటి దగుల్బాల్జీ నాయకుడిని మన గడ్డ మీదకు అనుమతించి, ఆయన చెప్పే చెత్త వినాల్సిన అవసరం మనకు ఎంత మాత్రమూ లేదు. ఇరు దేశాల మధ్య ఉన్న అగాధాన్ని సృష్టించింది, పెంచి పోషిస్తున్నది ఇలాంటి దగాకోరు, స్వార్థ నాయకులే అని నా అభిప్రాయం. క్రితం సారి ముషారఫ్ ఇండియా వచ్చినప్పుడు, ఇండియా టుడే ఆధ్వర్యం లో జరిగిన ఓ సదస్సులో పాల్గొని విషం కక్కాడు. తీవ్రవాదాన్ని ఒక చెట్టుతో పోల్చి ఏవో అబద్దాలు చెప్పుకొచ్చాడు, ప్రసంగం అనంతరం, ప్రఖ్యాత చదరంగం ఆటగాడు "కాస్పరోవ్", సూటిగా ఓ ప్రశ్న అడిగాడు - "తీవ్రవాదం చెట్టన్నారు సరే... కానీ, ఆ విష వృక్షానికి నీళ్ళు ఎవరుపోస్తున్నారు ?" - అని..

వీసా తో వచ్చే వాళ్ళని ఆపగలం.. బావుంది.. మరి మిగతావాళ్ళ సంగతి ?

హిందూ లో ఆ వార్త లింక్
Indian Express లో ఆ వార్త లింక్