Sunday, January 30, 2011

భావుకత, సందిగ్దతల మేళవింపు - ధోబీ ఘాట్నేను, మా ఆవిడ, బీచ్ లో నడుస్తున్నాం, కెరటాల పై తెల్లటి నురుగ, తడి ఇసుకపై మా పాదాల గుర్తులు, ఎక్కడో దూరం గా మిణుకు మిణుకుమంటున్న దీపాలు. . మిగతా ప్రపంచం గుర్తుకు రావడం లేదు. కాలం కదులుతోంది, నా ఊపిరి తాళం లో. కాసేపటికి, నాకు నా కాలి గురుతులు కూడా కనిపించడం లేదు. నేను మాయమైపోయానా ?, నా ఒంటరి తనం మాత్రం సాక్ష్యం చెపుతోంది, నా అస్తిత్వానికి. వెనక్కి తిరిగి వెతుకు తున్నాను, ఎక్కడ బయలుదేరాము, ఎక్కడికి వెళ్తున్నాం ?, అని, ఏ గుర్తూ కనిపించదేం ?, అంతేలే, కాలానికి జ్ఞాపకాలు ఎప్పుడూ చులకనే. ఈ ఒంటరి ప్రయాణం లో ఇంకో నాలుగు అడుగులకి, నాకు తడిసి ముద్దైన ఒక డైరీ దొరికింది. నేనే లేను అనుకునే క్షణం లో, ఓ తోడు అది. చదవడం మొదలు పెట్టాను, ఈ డైరీ ఇంతకు ముందు నేను చదివిన డైరీల్లా లేనే లేదు. నిజానికి ఇది, ఒక్కరు రాసిన డైరీ కాదేమో, ఓ నలుగురు వ్యక్తులు నాకు తారస పడ్డారు మొదటి నాలుగు పేజీలూ దాటేటప్పటికి. నలుగురు కలిసి ఒకే జీవితాన్ని ఎలా గడుపుతారు ?, వీళ్ళెవ్వరూ నాలా లేరు, కాని వాళ్ళ కన్నీళ్లు, చిరునవ్వులు ఎక్కడో బాగా పరిచయం ఉన్నట్టే ఉంది. ఇప్పుడు నాతో పాటు, వాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారు, ఆ కాలి ముద్రలు నాకు స్పష్టం గా కనిపిస్తున్నాయి, కెరటాలు కూడా ఆ ముద్రలు చెరపకుండానే తడిపి వెళ్ళిపోతున్నాయి. కానీ నేనెక్కడ ? ఆ నలుగురు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. కొన్ని మాటలు ఎంతో అమాయకంగా, మరికొన్ని కర్కశం గా, ఇంకొన్ని ఏ అర్థం లేకుండా.. అసలు వాళ్ళ మౌనమే ఎక్కువ మాట్లాడుతున్నట్టుంది. వీళ్ళ మధ్య సంబంధం ఏంటి ? ఆ నలుగురి నేపధ్యాలు నాకు వేరు వేరు గా తోస్తున్నాయి, అలానే వాళ్ళ కన్నీళ్లు ఆనందాలు కూడా. అబ్బా ఆ ఒక్క పేజీలో వీళ్ళు ఎంత బలహీనులో, కాదు ఎంత బలవంతులో, కానీ ఆ పక్క పేజీలో, ఎందుకంత నిరాశ, సందిగ్దత,.. నిజమైన జీవితంలో లా.. అయినా, 'జీవితంలో లా' ఏంటి ?, ఇది కథ కాదుగా, మూడు చుక్కల్లో అన్నీ మారిపోడానికి, కరక్టే ఇది ఎవరిదో డైరీ. ఓ నలుగురి ప్రయాణాన్ని, తనకు అర్థం అయినట్టు తనలో దాచుకున్న రంగుల దర్పణం.
కాదు.. కాదు.. ఎవరో రాసిన కవితల సంపుటి. నేను డైరీ అని భ్రమ పడ్డానా ? కాదు డైరీయేనేమో.. నాలో ఎందుకింత సందిగ్దత ?

అలా దాదాపుగా, ఓ గంటా నలభై నిమషాలు వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాను నేను, కలలు.. కన్నీళ్లు.. భయాలు.. సాహసాలు.. వాళ్ళ జీవితాల్లో పెద్ద మార్పేమీ లేదు, అలా అని మారకుండానూ లేవు. మార్పు లేనిది జీవితమే కాదుగా. .

అకస్మాతుగా వాళ్లతో నా ప్రయాణం ఆగిపోయింది, ఆ అనుభూతుల డైరీలో మిగతావన్నీ ఖాళీ పేజీలే. ఒక్క క్షణం, పెను ఒంటరి తనం నా హృదయం లో, మరుక్షణం ఒక నిట్టూర్పు, చిరునవ్వు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను నడవాల్సిన అడుగులు ఇంకా చాలానే ఉన్నాయని. దాచుకోవాల్సిన తడిముద్రలు కూడా. (మా ఆవిడ చెప్తోంది.. ఏవండీ, నాకు ఒక కథల పుస్తకం దొరికింది... అని.. )


(ధోబీ ఘాట్ - ముంబై డైరీస్ సినిమా నిన్ననే చూసాం. ఇదీ కథ, వీళ్ళు బాగా చేసారు, వీళ్ళు చెయ్యలేదు.. అంటూ, రాసుకోడానికి ఏమీ లేదు. అందుకే నా అనుభూతిని మాత్రమే పంచుకున్నాను. మీకు ఖచ్చితం గా వేరే అనుభూతినే మిగులుస్తుంది. అస్సలు నచ్చకపోయే అవకాశమూ ఉంది. కానీ, మీరు ఇంటర్వల్ లో మాత్రం ఇంటికి వచ్చేయరు, ఎందుకంటే, ఈ సినిమాలో ఇంటర్వల్ లేదుగా.. ;-) )

Friday, January 28, 2011

దసరాకి సంక్రాంతి టికెట్లు.. సంక్రాంతికేమో ఉగాదివి.. :-)చెన్నై లో ఉన్న నాబోటి వాళ్ళ పరిస్థితి ఇది. ఆ మధ్య ఓ దసరా అయిన ఓ నాలుగు రోజులకు, మా కొల్లీగ్ ఒక అమ్మాయి సంక్రాంతికి టికెట్లు బుక్ చేసుకున్నారా అని అడిగింది. నేను ఎగాదిగి చూసి, ఓ క్షణం ఆలోచించి నాపనిలో నేను మళ్లీ మునిగిపోయాను. సాయికుమార్ స్టైల్ లో కట్ చేస్తే, సంక్రాంతి రానే వచ్చింది, ఆ అమ్మాయి హ్యాపీ గా వైజాగ్ వెళ్లి వచ్చింది, మేము మాత్రం "మై హోం చెన్నై" అని తృప్తి పడ్డాం. ఈ సారి అందుకని, ప్రతీకారం తీర్చుకున్నా నేను. పక్కా ప్లానింగ్ తో మా ఆవిడ sms కొట్టి మరీ గుర్తు చేసింది, నేనూ సరియిన సమయం లో సరియిన నిర్ణయం తీసుకుని, ఉగాదికి భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ టికెట్లు తీసేసి, మా కొల్లీగ్ కి కూడా "బుక్ చేసుకోండంటూ", ఓ ఉచిత సలహా ఇచ్చేసా. అదీ తాజా పరిస్థితి. :-)

ప్రతీసారీ ఇంత ప్లానింగ్ చెయ్యగలమా.. అసలు మూణ్ణెల్ల తరువాత ఏ కంపెనీ లో ఉంటామో, అదే ప్లాన్ చెయ్యలేం కదా.. కానీ గట్టిగా చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఉన్నవి మూడో, నాలుగో ట్రైన్లు , వాటిలో సగం దిక్కుమాలిన టైముల్లో బయలుదేరేవే, మిగిలింది వారానికోసారి ఉన్న భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్. పోనీ చెత్త టైం అయినా పర్వాలేదు అని అనుకుని, హౌరా మెయిల్ కు సిద్ధపడ్డా, ఆ ట్రైన్ లో మూడొంతుల టికెట్లు కిళ్ళీ వేసుకుంటేనే ఇస్తారు. ఇంక బస్సు సంగంతంటారా, వెయ్యి దాకా పొయ్యాలి, గుక్కెడు మంచినీళ్ళు తాగడానికి నాలుగు సార్లు ఆలోచించాలి. ఈ మధ్య రెడ్ బస్సు వెబ్ సైట్ ధర్మమా అని, అవీ దొరకడం లేదు. పండగ అయితే చాలు, టికెట్ రెండు రెట్ల రేటుకు పబ్లిగ్గా అమ్ముతున్నారు. ఇంతా కష్టపడి వెళ్లామే అనుకోండి, పండగ పూట ఫుల్ గా లాగించి ఓ అర గంట సాగోరడానికి లేదు, మళ్లీ ఏ మధ్యాహ్నమో బయలుదేరాల్సిందే. ఆ మధ్య ఎప్పుడో, కక్కుర్తి పడి, ఓ గంట లేట్ గా బయలు దేరే, ఏదో పేరు వూరు తెలీని ట్రైన్ కి బుక్ చేస్తే, అది సరదాగా ఆ శుభదినం ఓ పన్నెండు గంటలు లేట్ అయ్యింది. చివరాఖరికి మళ్లీ బస్సే దిక్కయ్యింది.

ఈ ఆటుపోట్లు అన్నీ ఎందుకని అనుకుని, పండగకి చెన్నై లోనే ఉండి పొతే ఓ సుఖముంది. హాయిగా రెస్ట్ అనచ్చు, దగ్గరలో ఉన్న ఏ బంధువుల ఇల్లో పావనం చెయ్యచ్చు, రోడ్లన్నీ ఖాళీగా ఉండటం తో అవకాశం ఉంటే షికార్లూ చెయ్యొచ్చు. ఏంచేస్తాం మరి, అలా త్రప్తిపడిపోవడం మానవ నైజం కదా. హైదరాబాద్ లో ఉన్న జనాలు ఏమైనా బెటర్ గా ఉన్నారేమో తెలీదు మరి. ఇప్పుడు గరీబ్ రధ్ లాంటి ఓ ట్రైన్ ఒకటి చెన్నై వైజాగ్ ల మధ్య తగలేయ్యచ్చు కదా. కావాలంటే, కోల్కతా వెళ్లి మరి మమత కి దొంగ ఓట్లు వేసి వొద్దాం. ఆ మధ్య ఎప్పుడో శ్రీధరే అనుకుంటా, ఓ కార్టూన్ వేసాడు, ఒకావిడ పక్కింటావిడికి చెప్తుంది, "పండగకి అమ్మాయి అమెరికా నుంచి వస్తోంది, అబ్బాయికే హైదరాబాద్ నుంచి రావడానికి టికెట్ దొరకలేదు" అని.

ఇప్పుడు సంక్రాంతి తరువాత ఇంత వ్యాసం ఎందుకు రాసానో అర్థం అయ్యిందా, నాలాంటి వాళ్లెవరైనా ఉంటే మేలుకుంటారని, ఉగాదికి టికెట్లు కొనుక్కుంటారనీ. :-) చెప్పడమే మరచిపోయాను, ఉగాది సోమవారం పడింది మరి.

మనసులోని ఇంత బాధని వెళ్ళగక్కి, ఓ రెండు లైన్ల కవిత లేకపోతే ఏం బావుంటుంది. కాసుకోండి.

దసరాకి కొను సంక్రాంతి ట్రైన్ టికెట్లు,
లేకుంటే తప్పవు మరి లాస్ట్ మినిట్ ఇక్కట్లు.
అసలు పండగే, దొరికితే, బస్సులో ఓ రెండు సీట్లు.
లేకుంటే ఏముంది.. కొని మురిసిపో తీతీయని శ్రీకృష్ణా స్వీట్లు.
ఉరేగుతానంటే, కాదంటాయా ఖాళీ ఖాళీ మదరాసు స్ట్రీట్లు.
నో మోర్ డౌట్లూ ............. :-)

Sunday, January 23, 2011

ఆగని ప్రయాణం


ఆగని ప్రయాణం ..

వెలుగు తో పాటూ నీడా వెళ్ళిపోతుంది..
నిదురపుచ్చే చీకటి ఒడి ఎంత చల్లనో.
రెక్కలొచ్చి నేస్తం నింగికెగసింది..
ఒంటరి దారి ఎంత సొంతమో.
చేరుకున్నాక ప్రతి గమ్యం పలచనయ్యింది..
ఇంకా అందని ఆ మెట్టు ఎంత అందమో.
జీవితం తన అబద్దాలని ఓ రోజు ఆపేస్తుంది..
మరణం పలికే ఆహ్వానం ఎంత నిజమో.

ప్రతీ అంతంలోనూ ఒక ఆరంభమే దాగుంది.
అలసినా, ఆగని ఈ ప్రయాణం ఎంత పొడవో కదా..

Saturday, January 22, 2011

ఆ ఒక్కరు ఇక లేరు..

ఈ రోజు ఉదయం పేపర్ లో ఇవివి మరణ వార్త చూసినవెంటనే నిజంగా నోట మాట రాలేదు. ఎన్నో ఎంటర్ టైనింగ్ సినిమాలు, వాటితో పాటు మరికొన్ని అర్థవంతమైన సినిమాలు అందించిన ఇవివి ఇక లేరు అంటే ఒప్పుకోడానికి చాలా కష్టంగానే ఉంది, ఆయన లోటు ఖచ్చితం గా భర్తీ చెయ్యలేనిదే. నా మటుకు నాకు ఆయన డైరెక్ట్ చేసిన ఆ ఒక్కటి అడక్కు బాగా గుర్తు, మా అన్నయ్యలతో, కజిన్స్ తో ఆ సినిమా ఎన్ని సార్లు చూసానో లెక్కే లేదు. కుటుంబంతో చూడ్డానికి కాస్త ఇబ్బందే అయినా, ఆయన తీసిన కొన్ని సినిమాలు చూసిన ప్రతీసారి కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ సన్నివేశాలు గుర్తొచ్చి మరీ గిలిగింతలు పెడతాయి. తెలుగు సినిమా ఫార్ములా సీన్ల మీద, మొదట సెటైర్లు పేల్చినది ఆయనేనేమో కూడా.

జంధ్యాల బ్రాండ్ కామెడీ కే కాస్త బూతు,సెటైర్ జోడించి తనదైన శైలి సృష్టించారు ఇవివి. ఆయన మొదటి సినిమా "చెవిలో పువ్వు" లో అనుకుంటా, టైటిల్స్ లోనే "యాక్షన్" కి బదులు "కట్" చెప్పి, మొదట సినిమా కదండీ క్షమించెయ్యండి అంటారు ఇవివి. ఆమె, అల్లుడా మజాకా, ఆరుగురు పతివ్రతలు -- ఈ మూడు చిత్రాలు ఒక్కరే దర్శకత్వం వహించారంటే నమ్మశక్యం కాదు. ఒక టైం లో అగ్రశ్రేణి హీరోలు ఆయన డేట్స్ కోసం వేచి చూసేవారంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ ని పరిశ్రమకి పరిచయం చేసే బాధ్యతా, చిరు ఆయన పైనే పెట్టారు అందుకే. ఒకటో రెండో హిట్లు వస్తేనే ఆస్కార్ అవార్డు వచ్చిన బిల్డప్ ఇస్తున్న ఈ రోజుల్లో, అన్ని విజయవంతమైన చిత్రాలు ఇచ్చినా ఇవివి, లో ప్రొఫైల్ లోనే ఉన్నారు ఇన్నాళ్ళు. అడపాదడపా తన దైన శైలి లో చిత్రాలు తీస్తూనే ఉన్నారు.

ఇష్టపడి చదువుతున్న సరదా పుస్తకం సగంలోనే అయిపోయినట్టు అనిపిస్తోంది నాకు. మరికొన్ని మంచి చిత్రాలు మిస్ అయ్యాం మనం అందరం. పరిశ్రమ కాస్త హడావిడి చేసి మరచిపోతుందేమో, కానీ ప్రేక్షకులు మాత్రం ఆయన్ని, ఆయన అందించిన చిత్రాలని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. "మార్చ్ అంటే, ఇది మార్చ్ కాదు ఏప్రిల్", "డిక్కీ ఎలా ఉందండీ.. డిక్కీ.. ", "అప్పు.. డే తెలవారిందా" లాంటి డైలాగ్లు నేనైతే మరచిపోను.

Wednesday, January 19, 2011

నువ్వెక్కడ ? నేనెక్కడ ?

మొన్నెప్పుడో సడన్ గా ఈ ఆలోచన బుర్ర లోకి వచ్చింది.. "నేను నేనా.. లేక నా జ్ఞాపకాన్నా" అని.. మరీ పరమార్థాల్లోకి వెళ్ళకుండా, దానికి ఇంకో రెండు అనుభూతులు,వాక్యాలు జోడిస్తే, ఇలా మిగిలింది.ఎగిరే ఆ గాలిపటానికి ఇంద్రధనుస్సు రంగులు అద్దేనా ?

ఎగసే ఆ ఏటి అలకు, తోడుగా, వెన్నెల కొలువుండిపోయేనా ?


నేను నేనేనా.. లేక గుర్తొచ్చే నా జ్ఞాపకాన్నా ?

నీవు నీవేనా.. లేక చిగురిస్తున్న నీ ఆశవా ?

మరి మనల్ని కలిపే ధైర్యం ఈ క్షణానికుందా . ?

లేక మన విరహమే ఈ జీవితమా.. ?


ఒంటరితనం ముసుగేసుకుని..

మనలోనే మనం.. మళ్లీ మళ్లీ పుట్టిన తరుణం..

జారిన ఆ కన్నీటి బొట్టు.. మన వర్తమానమా ?

అయితే ఆ వర్తమానం లో, నువ్వెక్కడ ? నేనెక్కడ ?

Tuesday, January 11, 2011

మార్కెట్లోకి రాబోయే ఆత్మకథలు (వ్యథలు)
IPL లో గంగూలీ కష్టాలు చూస్తుంటే పగవాడికి కూడా రాకూడదు అని అనిపిస్తోంది. గంగూలీ మనసు విరిగి ఒకవేళ ఆత్మకథ రాయడం మొదలు పెడితే దానికి ఏం పేరు పెడతాడు ?, నాకైతే, "20 ఓవర్స్ టూ కిల్ రియల్ క్రికెట్" అని పెట్టి దాల్మియా కి అంకితమిస్తే బావుంటుంది అనిపించింది. ఆవిష్కరించడానికి ప్రణబ్ ముఖర్జీ ని పిలవచ్చు, కానీ అసలే పండగల సీజన్, టికెట్ దొరుకుతుందో, దొరకదో, అందుకని ఖాళీగా ఉన్న సోమనాథ్ చటర్జీ అయితే సులువు గా ఉంటుంది. ఈ రకం గా చూస్తే, ఇంకా ఎవరెవరు ఆత్మకథలు రాసే మూడ్ లో ఉన్నారా అని ఆలోచిస్తే, నాకు ఈ క్రింది పేర్లు తోచాయి.


చంద్రబాబు కరెక్ట్ గా ఆ మూడ్ లోనే ఉన్నారు, "నా రెండు కళ్ళు, నా రంగు కళ్ళ జోడు" అని పెట్టి, ఏ బిల్ గేట్స్ కో అంకితం అనచ్చు. కార్యక్రమానికి ముఖ్య అతిధి గా, జాతీయ నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా రానే వస్తాడు. ఈ మధ్యే తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసిన రోశయ్య గారైతే, "కొస (రి) మెరుపు - ఓ ఆత్మావలోకనం మరియు ఆర్త నాదం" అంటే బేషుగ్గా ఉంటుంది. సోనియా గాంధీ అక్కయ్య కూతురుకి అంకితమిచ్చుకోవచ్చు, ఇంక ప్రారంభోత్సవానికంటారా, రాబర్ట్ వధేరా గాంధీ (ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాగన్నమాట) ని పిలుద్దాం, ఇంకా , . కొంచం మసాల కథ కావాలనుకుంటే, మరి, మన మాజీ గవర్నర్ గారే కరెక్ట్. "ఏ తీగ పూవుకు.. " అని పేరు పెడితే రసవత్తరం గా ఉండనే ఉంటుంది. ఆవిష్కరణకి నిత్యానంద ని పిలిచి ABN లో లైవ్ అన్నామనుకోండి అదిరిపోతుంది. పెద్దగా కథ లేకపోయినా, DS "ఒంటరినైపోయాను.. " కూడా కోస్తాలో బానే అమ్ముడవ్వచ్చు. ఇవి కాక, మన పవన్ కళ్యాణ్ రాసే "నేను.. నా ఆత్మ.. మరియు SJ సూర్య" మీదా నాకు బాగా అంచనాలున్నాయి. కానీ ఈ ఆఖరి పుస్తకం విషయం లో మనకి పైరసీ ఒక ఛాలెంజ్ కాబోతోంది, ఫాన్స్ సహకరించాలి.


V.H గారిని కూడా అడిగి చూడచ్చు, కానీ మరీ ఆయన ఆత్మకథ కి కూడా రాజీవ్ పేరు తగిలిస్తే, జనాలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆ ప్రయత్నం విరమించుకున్నాను.


ఇంతేనా అంటే,.. మీరు ఏమైనా కలపాలనుకుంటే, కామెంట్ రాయండి, నేను వొద్దనలేదు కదా.. :-)

Sunday, January 9, 2011

ఇదేం వేలం.. ఇదేం వెర్రి.. ఇదేం మీడియా.

గత రెండు రోజులుగా, IPL వేలానికి జాతీయ మీడియా ఇస్తున్న కవరేజ్ చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. ఏ పార్లమెంట్ ఎన్నికలకో ఇచ్చే అంత టైం దాదాపుగా అన్ని జాతీయ ఇంగ్లీష్ ఛానెల్స్ ఇస్తున్నట్టున్నాయి. IPL లో అసలు క్రికెట్ ఎంతో గానీ ఈ అనవసరపు హడావిడి చూస్తుంటే వొళ్ళు మండుతోంది. ఇంతకంటే జనాలు తెలుసుకోవాలనుకుంటున్న అంశాలు ఏవీ లేవా ? ఈ మధ్య కాలం లో నాకు, ఈ ఛానెల్స్ ప్రోగ్రాములకి, యాడ్స్ కి పెద్ద వ్యత్యాసం కనిపించడం లేదు. అంబానీలకు, మాల్యాలకు, లెక్క లేని డబ్బు చాలానే ఉంది, వాళ్ళు కోట్లు పెట్టి కొండ మీద కోతినైన కొంటారు, దానికి వాళ్ళ కంపెనీ చొక్కా తొడుగుతారు.. కాని ఇందులో మనకి తీరే సరదా ఏముంది ?

మన తెలుగు ఛానల్స్ చూస్తే, ఏ రెండు ఛానల్స్ ముఖ్యాంశాలు ఒకలా ఉండడం లేదు (కనీసం, ఒక్క విషయం). ఈనాడు పేపర్ చదివితే శ్రీ కృష్ణ రిపోర్ట్ ఇంకా రాలేదేమో అనిపిస్తోంది. నాకు ఒక్కటి అర్థం అయ్యింది, చెప్పేది అబద్దం/అసంబద్దం అని తెలియాలంటే, ఎవడో ఒకడు నిజం చెప్పాలి, ఇప్పుడు మన మీడియా లో ఆ పరిస్థితి లేదు, అందరూ చెప్పేది అబద్దమే కాబట్టి, అందరు చెప్పేది నిజమే అని మనల్ని మనం మోసం చేసుకోడం భలే తేలిక.

( క్రింద నేను కాపీ చేసిన ఇమేజ్ రాజ్ దీప్ ఆధ్వర్యంలో నడుస్తున్న CNN IBN ప్రోగ్రాం గైడ్. ఇదేదో దుబాయ్ నుంచి నడుస్తున్న స్పోర్ట్స్ ఛానెల్ కాదు, అత్యంత పాపులర్ జాతీయ న్యూస్ ఛానల్. )

Thursday, January 6, 2011

శ్రీ కృష్ణ రిపోర్ట్ లోని ఆ ఆరు పాయింట్లు (యధాతధంగా)

1. Maintain status quo.

2. Bifurcation of the State into Seemandhra and Telangana; with Hyderabad as a Union Territory and the two states developing their own capitals in due course.

3. Bifurcation of State into Rayala-Telangana and coastal Andhra regions with Hyderabad being an integral part of Rayala-Telangana.

4. Bifurcation of Andhra Pradesh into Seemandhra and Telangana with enlarged Hyderabad Metropolis as a separate Union Territory. This Union Territory will have geographical linkage and contiguity via Nalgonda district in the south-east to district Guntur in coastal Andhra and via Mahboobnagar district in the south to Kurnool district in Rayalaseema.

5. Bifurcation of the State into Telangana and Seemandhra as per existing boundaries with Hyderabad as the capital of Telangana and Seemandhra to have a new capital.

6. Keeping the State united by simultaneously providing certain definite Constitutional/Statutory measures for socio-economic development and political empowerment of Telangana region – creation of a statutorily empowered Telangana Regional Council.

Sunday, January 2, 2011

చెన్నై లో సంగీత నాట్యోత్సవాలు : ఏసుదాసు స్వర విన్యాసం అనితర సాధ్యం


నిన్న సాయంత్రం మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ లో జరిగిన ఏసుదాసు కచేరి అత్యద్భుతం గా సాగింది. మూడు గంటలకు పైగా కొనసాగిన కార్యక్రమం లో ఏసుదాసు తన స్వరవిన్యాసం తో ప్రేక్షకులను తన్మయత్వం లో ముంచెత్తారు. ఆయన గుండె గొంతులోంచి జాలువారిన త్యాగరాయ కృతులు వింటుంటే, భక్తి మార్గంలో సంగీతానికి అంత పెద్ద పీట ఎందుకు వేస్తారో అర్థమయ్యింది. మాటలకే కాదు, సంగీత స్వరాలకూ ఆయన అలవోకగా అనుభూతిని అద్దుతుంటే, ఆ స్వరాలు.. ఆ క్షణాలు (ఆయన హావభావాలు కూడా), విని మైమరచిపోయే మనస్సుకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శాస్త్రీయ సంగీతం ఓనమాలు కూడా తెలీని నాలాంటి ప్రేక్షకుడికే ఇలా అనిపించిందంటే, నిజం గా, కాస్త పరిచయం ఉన్న వారు, పులకరించిపోయుంటారు. అందులో ఏ సందేహమూ లేదు. మృదంగం, వయోలిన్ సహకారం కూడా ఎంతో గొప్పగా అనిపించింది.

ఆయన ఆలపించిన కృతుల్లో, "పావన గురు", "దాశరధీ", "మాకేలరా విచారము", "చక్కని రాజమార్గములుండగా", మొదలగునవి ఉన్నాయి. కార్యక్రమం చివర్లో, రసిక ప్రియ రాగం యొక్క సంక్లిష్టత, ప్రాముఖ్యత ప్రేక్షకులకు వివరించారు. ఒకటి రెండు అయ్యప్ప పాటలూ ఆలపించారు. కార్యక్రమం మధ్యలో ఓ రెండు సార్లు సౌండ్ సిస్టం కాస్త ఇబ్బంది పెట్టినా ఆయన తన సహనం కోల్పోలేదు. నిజానికి, ఆయనే ఒక సారి సౌండ్ సిస్టం ని ఆపమని చెప్పి, తన పాట ఆడిటోరియం లో ఎంతవరకూ చేరుతుందో చూసుకున్నారు. ఆయన గొంతులోని వాల్యూం కి ఆశ్చర్య చకితులైన ప్రేక్షకులు తమ స్పందనని కరతాళ ధ్వనులతో తెలియ చేసారు.

మొత్తానికి నూతన సంవత్సరం ఆనందదాయకం గా మరియి అర్థవంతం గా మొదలయింది. మొదటి సారి కచేరి కి వెళ్ళినప్పుడు, ఓ రెండేళ్ళ క్రితం అనుకుంటా, "అబ్బా మూడు గంటలా" అని అనుకున్న నేను, ఇప్పుడు "అయ్యో, అప్పుడే అయిపోయిందా" అనే స్టేజి కి వచ్చాను. మంచి పరిణామం. ఏదైనా రుచిమరిగితేనే కదా.. :)

Saturday, January 1, 2011

కొత్త సంవత్సరం. కావాలి సరికొత్త జీవితం.

కొత్త సంవత్సరం. కావాలి సరికొత్త జీవితం.

కాలం కదిలితేనే అందం.
అప్పుడే గా అనుభవం జ్ఞాపకం అయ్యేది.
ఆశలు నిజంగా మారి పలకరించేది.
జీవితానికి పరమార్థం గమనమే అయితే,
ఆ దారిలో ప్రతి మజిలీ మరి గమ్యమే కదా..
దాటి పోయిన కాలాన్నిబేరీజు వేసుకోడానికి.
నూతనోత్సాహాలతో మళ్లీ మొదలవ్వడానికి.


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


(సాయంత్రం, మైలాపూరు ఫైన్ ఆర్ట్స్ లో ఏసుదాసు కచేరి కి వెళ్తున్నామోచ్ )