Sunday, January 30, 2011

భావుకత, సందిగ్దతల మేళవింపు - ధోబీ ఘాట్నేను, మా ఆవిడ, బీచ్ లో నడుస్తున్నాం, కెరటాల పై తెల్లటి నురుగ, తడి ఇసుకపై మా పాదాల గుర్తులు, ఎక్కడో దూరం గా మిణుకు మిణుకుమంటున్న దీపాలు. . మిగతా ప్రపంచం గుర్తుకు రావడం లేదు. కాలం కదులుతోంది, నా ఊపిరి తాళం లో. కాసేపటికి, నాకు నా కాలి గురుతులు కూడా కనిపించడం లేదు. నేను మాయమైపోయానా ?, నా ఒంటరి తనం మాత్రం సాక్ష్యం చెపుతోంది, నా అస్తిత్వానికి. వెనక్కి తిరిగి వెతుకు తున్నాను, ఎక్కడ బయలుదేరాము, ఎక్కడికి వెళ్తున్నాం ?, అని, ఏ గుర్తూ కనిపించదేం ?, అంతేలే, కాలానికి జ్ఞాపకాలు ఎప్పుడూ చులకనే. ఈ ఒంటరి ప్రయాణం లో ఇంకో నాలుగు అడుగులకి, నాకు తడిసి ముద్దైన ఒక డైరీ దొరికింది. నేనే లేను అనుకునే క్షణం లో, ఓ తోడు అది. చదవడం మొదలు పెట్టాను, ఈ డైరీ ఇంతకు ముందు నేను చదివిన డైరీల్లా లేనే లేదు. నిజానికి ఇది, ఒక్కరు రాసిన డైరీ కాదేమో, ఓ నలుగురు వ్యక్తులు నాకు తారస పడ్డారు మొదటి నాలుగు పేజీలూ దాటేటప్పటికి. నలుగురు కలిసి ఒకే జీవితాన్ని ఎలా గడుపుతారు ?, వీళ్ళెవ్వరూ నాలా లేరు, కాని వాళ్ళ కన్నీళ్లు, చిరునవ్వులు ఎక్కడో బాగా పరిచయం ఉన్నట్టే ఉంది. ఇప్పుడు నాతో పాటు, వాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారు, ఆ కాలి ముద్రలు నాకు స్పష్టం గా కనిపిస్తున్నాయి, కెరటాలు కూడా ఆ ముద్రలు చెరపకుండానే తడిపి వెళ్ళిపోతున్నాయి. కానీ నేనెక్కడ ? ఆ నలుగురు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. కొన్ని మాటలు ఎంతో అమాయకంగా, మరికొన్ని కర్కశం గా, ఇంకొన్ని ఏ అర్థం లేకుండా.. అసలు వాళ్ళ మౌనమే ఎక్కువ మాట్లాడుతున్నట్టుంది. వీళ్ళ మధ్య సంబంధం ఏంటి ? ఆ నలుగురి నేపధ్యాలు నాకు వేరు వేరు గా తోస్తున్నాయి, అలానే వాళ్ళ కన్నీళ్లు ఆనందాలు కూడా. అబ్బా ఆ ఒక్క పేజీలో వీళ్ళు ఎంత బలహీనులో, కాదు ఎంత బలవంతులో, కానీ ఆ పక్క పేజీలో, ఎందుకంత నిరాశ, సందిగ్దత,.. నిజమైన జీవితంలో లా.. అయినా, 'జీవితంలో లా' ఏంటి ?, ఇది కథ కాదుగా, మూడు చుక్కల్లో అన్నీ మారిపోడానికి, కరక్టే ఇది ఎవరిదో డైరీ. ఓ నలుగురి ప్రయాణాన్ని, తనకు అర్థం అయినట్టు తనలో దాచుకున్న రంగుల దర్పణం.
కాదు.. కాదు.. ఎవరో రాసిన కవితల సంపుటి. నేను డైరీ అని భ్రమ పడ్డానా ? కాదు డైరీయేనేమో.. నాలో ఎందుకింత సందిగ్దత ?

అలా దాదాపుగా, ఓ గంటా నలభై నిమషాలు వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాను నేను, కలలు.. కన్నీళ్లు.. భయాలు.. సాహసాలు.. వాళ్ళ జీవితాల్లో పెద్ద మార్పేమీ లేదు, అలా అని మారకుండానూ లేవు. మార్పు లేనిది జీవితమే కాదుగా. .

అకస్మాతుగా వాళ్లతో నా ప్రయాణం ఆగిపోయింది, ఆ అనుభూతుల డైరీలో మిగతావన్నీ ఖాళీ పేజీలే. ఒక్క క్షణం, పెను ఒంటరి తనం నా హృదయం లో, మరుక్షణం ఒక నిట్టూర్పు, చిరునవ్వు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను నడవాల్సిన అడుగులు ఇంకా చాలానే ఉన్నాయని. దాచుకోవాల్సిన తడిముద్రలు కూడా. (మా ఆవిడ చెప్తోంది.. ఏవండీ, నాకు ఒక కథల పుస్తకం దొరికింది... అని.. )


(ధోబీ ఘాట్ - ముంబై డైరీస్ సినిమా నిన్ననే చూసాం. ఇదీ కథ, వీళ్ళు బాగా చేసారు, వీళ్ళు చెయ్యలేదు.. అంటూ, రాసుకోడానికి ఏమీ లేదు. అందుకే నా అనుభూతిని మాత్రమే పంచుకున్నాను. మీకు ఖచ్చితం గా వేరే అనుభూతినే మిగులుస్తుంది. అస్సలు నచ్చకపోయే అవకాశమూ ఉంది. కానీ, మీరు ఇంటర్వల్ లో మాత్రం ఇంటికి వచ్చేయరు, ఎందుకంటే, ఈ సినిమాలో ఇంటర్వల్ లేదుగా.. ;-) )

No comments:

Post a Comment