Saturday, February 26, 2011

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి.. - సిమ్లా మరియు మనాలి.

మొన్న డిసెంబర్ లో సిమ్లా, మనాలి పర్యటించినప్పుడు తీసినవి. (మన ఫోటోగ్రఫి నైపుణ్యం అంతంతమాత్రమే లెండి. ) ఎందుకో ఈ రోజు ఆవేశం వచ్చింది బ్లాగ్ లో పెడదామని. ఎప్పుడో వీలు చూసుకుని, వెనిస్, పారిస్, జూరిక్ ఫోటోలు కూడా పెడతాను.








Wednesday, February 23, 2011

"వాల్డ్ కప్"... "వాల్డ్ వార్".. (TV9 సౌజన్యంతో)

ఒంట్లో కొంచం బాలేక, కాస్త ముందరే ఇంటి దారి పట్టాను ఈ రోజు. సాయంత్రం ఏంచెయ్యాలో తెలీక ఛానల్స్ తిప్పుతుంటే, పై శీర్షిక కనిపించింది. నిజం గానే ఒక్క క్షణం ఏ "రహస్యానికి" సంభందించిన చెత్తో అనుకున్నా. కొంచం వివరం గా చూస్తే, అది మన ప్రపంచ కప్ క్రికెట్ పోటీల గురించిన కథనం అని అర్థమయ్యింది. "ప్రపంచ కప్ - ప్రపంచ పోరు" అనడానికి TV9 కి నామోషీ అనిపించి, "వాల్డ్ కప్" "వాల్డ్ వార్" అని వాడి ఉంటారు, అర్థం చేసుకోగలం. "వరల్డ్ కప్", అంటే ఏంపోయేదో తెలీదు మరి. ఇంగ్లీష్ ఉచ్ఛారణ అంత పక్కా గా కావాలనుకున్నప్పుడు, అదేదో ఇంగ్లీష్ లోనే తగలడితే ఏ బాధా ఉండదు కదా. కొత్తగా మనకి తెలుగు నేర్పక్కర్లేదు కానీ, మనకు తెలిసినవి కూడా మరచిపోయేలా చేస్తే కష్టమే. దీనికి తోడు, జెమిని న్యూస్ లాంటి ఛానల్స్ లో వచ్చే తెలుగు స్క్రోల్లింగ్ చూస్తే, మన తెలుగు అక్షరాలే అయినా, పదాలను గుర్తించలేం. కేవలం అభిరుచితో రాసుకునే తెలుగు బ్లాగుల్లో ఉన్నపాటి స్థాయి కూడా తెలుగు TV ఛానల్స్ కు లేదేమో. (భాష విషయం లో లెండి.. ;-) ) వెబ్ లోని తెలుగు వార్తాప్రత్రికలు వీటికి ఏమాత్రం తక్కువ తినలేదు. వీటిలో, "భారత్కు", "భారత్లో", "బ్యాట్స్మెన్లు" లాంటి పదాలు సర్వ సాధారణం. మొదట్లో చదువుతున్నప్పుడు ఏవో తిట్లు చదువుతున్నట్టు అనిపించినా పోను పోనూ అలవాటయ్యింది నాకు. అక్కడక్కడ ముద్రారాక్షసాలు పర్వాలేదు కానీ, మరీ కొత్త మాటలు సృష్టిస్తే అన్యాయమే.

ఇంకో తరం వచ్చేటప్పటికి, మన అసలు అక్షరాలు, మాటలు బ్రౌన్ గారి నిఘంటువులోనే చూసుకోవాలేమో.
(అంఠే మన ప్యూర్ ఆండ్ షూర్ తెల్గూ ఛానల్స్ ఉంఠాయి ఆఫ్కొర్స్.. మన్కు తెల్గూలో న్యూ న్యూ వార్డ్స్ నేర్ప్ డాన్కి.)

ఈ విషయం లో "ఈనాడు", వంద రెట్లు మెరుగు. మొన్నెప్పుడో "గగనసఖి" అని వాడటం చూసి ముచ్చట పడ్డాను. ఈ రోజు "శూన్యగంట".. ఒక్క క్షణం అర్థం కాలేదు కానీ, బావుంది వాడుకకు.

Sunday, February 20, 2011

చెన్నై MRTS స్టేషన్లు ఎంత సురక్షితం ?

మిగతా నగరాలకంటే చెన్నై మహా నగరం ఎంతో సురక్షితం అని నా ఫీలింగ్. కాని ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, చెన్నై ఏమీ తక్కువ కాదు, అనిపిస్తోంది. కొన్నేళ్ళ క్రితమే మొదలు పెట్టిన బీచ్ - వేలచ్చేరి MRTS లైన్ లో ఒకదాని తరువాత ఒకటి నేరాలు నమోదు అవుతూనే ఉన్నాయి. పాత లోకల్ రూట్స్ తో పోలిస్తే, ఈ మార్గం లో రద్దీ తక్కువ, దానికి తోడు, పదుల్లో జనాలుండే గ్రీన్ వేస్, మందవేలి, లైట్ హౌస్ వగైరా స్టేషన్లు కూడా ఊరంత కట్టారు. రెండు మూడు అంతస్తుల్లో ఉండే ఈ స్టేషన్లు ఎప్పుడో రద్దీ సమయాల్లో తప్ప మిగతా టైం అంతా నిర్మానుష్యం గానే ఉంటాయి, పెద్దగా సెక్యూరిటీ కూడా కనిపించదు. కనీసం ఓ నాలుగు దుకాణాలకి అద్దెకి ఇచ్చినా పరిస్థితి మెరుగ్గా ఉండేది. ఆ మధ్య ఎప్పుడో మందవేలి స్టేషన్ లో ఒక హత్య జరిగింది, మొన్న బుధవారం తిరువాన్మయుర్ స్టేషన్ లో మళ్లీ ఇంకో ఉదంతం. మా కొలీగ్ రూం మేట్ అరుణ్, టైడల్ పార్క్ లో పని ముగించుకుని సాయంత్రం ఆరు దాటాక, తిరువాన్మయుర్ స్టేషన్ కి చేరుకున్నాడు, కాస్త చీకటిగా ఉన్న ప్రదేశం లో అప్పటికే కాచుకుని ఉన్న ఓ ఇద్దరు యువకులు అకస్మాత్తుగా కత్తి తో దాడి చేసి నగదు, కొన్ని విలువైన వస్తువులు దోచుకున్నారు. ఇతను కాస్త ప్రతిఘటించడం తో ముఖం మీదా, చేతులకి గాయాలు కూడా అయ్యాయి. కొంచం తేరుకున్నాక, ఎగ్మూరు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాడు. రైల్వే పోలీసులు ఎప్పటిలానే దర్యాప్తు చేస్తాం, సెక్యూరిటీ పెంచుతాం అని ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇందులో ఇందులో ఇంకో అన్యాయం ఏంటంటే, ఆ గాయాలతో RA పురం లో ఉన్న బిల్ల్రోత్ ఆసుపత్రికి (ఒకప్పటి కాలియప్ప) వెళ్తే, పోలీసు కేసు కనుక అడ్మిట్ చేసుకోమన్నారంట, మరో మార్గం లేక సెంట్రల్ దగ్గరున్న జనరల్ హాస్పిటల్ కి వెళ్ళాడు అతను. (బిల్రోత్ ఆసుపత్రి మీద కూడా కేసు పెట్టే ఆలోచనలో ఉన్నాడు)

మన తెలుగు సాఫ్ట్ వేర్ జనాలు ఎక్కువగా ప్రయాణించేది ఈ MRTS రూట్ లోనే, వీలయితే ఒకరిద్దరితో కలిసి వెళ్తే మంచిది (ముఖ్యంగా రద్దీ లేని సమయాల్లో), బయట ప్రదేశాల్లో ఆఫీసు గుర్తింపు కార్డులు మెడలో వేసుకోకపోతేనే మేలు. ఏదైనా మనం మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ గొడవంతా ఎందుకనుకుంటే, ఆఫీసు దగ్గరలోనే, అద్దె కాస్త ఎక్కువ పోసైనా ఇల్లు తీసుకుంటే (నాలాగ అన్నమాట .. :-) ) ఉత్తమం.

Thursday, February 17, 2011

అసెంబ్లీ వార్తలకు "A" సర్టిఫికేట్ ఇవ్వచ్చు..

అసెంబ్లీ వార్తలకు "A" సర్టిఫికేట్ ఇవ్వచ్చు..

హింస, దౌర్జన్యం, బూతులు, కోతి చేష్టలు, జుగుప్స కలిగించే ప్రవర్తన.. ఇదీ మన శాసన సభ పరిస్థితి. ఈ దరిద్రానికి సంభందించిన వార్తలు రాత్రి పదకొండు తరువాతే ప్రసారం చెయ్యాలని ఓ రూల్ పెడితే బావుణ్ణు.

ప్రజాస్వామ్యం అసలు స్వరూపమిదా ? రాజ్యాంగానికి మనం ఇచ్చే విలువ ఇంతేనా ? మనల్ని మనం పాలించుకునే అర్హత అసలు మనకు ఉందా ? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.

రాజకీయం గా JP ఎంత మార్పు తెచ్చారో.. తెస్తారో.. గానీ, వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానించే లక్షలాది మందిలో నేనూ ఒకణ్ణి. ఉద్యమం, దాని తీవ్రత, సంక్లిష్టత ఎలా ఉన్నా, భౌతికం గా JP లాంటి ఒక నాయకుని మీద దాడికి పాల్పడడం హేయమైన చర్య. ఈ రోజు జరిగిన పరిణామాల వలన JP కోల్పోయిందేమీ లేదు.. ఆయన మీద సానుభూతి, గౌరవమూ పెరిగాయే గానీ తగ్గలేదు. కానీ ఉద్యమం ముసుగులో ఎలాంటి వ్యక్తులు నాయకులు గా మారి రేపు మనల్ని ఉద్ధరించబోతున్నారో తేటతెల్లమైంది.


నిజంగానే, ఎవరైనా ప్రజలకు మంచి చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా ?
ఐదేళ్లకోసారి వచ్చే బూటకపు ఎన్నికలు - అస్థిపంజరాలకు అందాల పోటీలేనా ?

ఈ నాలుగు మాటలూ రాసి సాధించేదేమీ లేదు.. ఎందుకంటే, మన కర్మ భూమిలో అందరూ కరక్టే. కాని నా బాధని వెళ్ళగక్కకుండా ఉండలేకపోయాను. దేవుడు కూడా మనల్ని కాపాడలేడేమో..

Monday, February 14, 2011

ప్రేమంటే ? (కొన్ని ఆలోచనలు.. కాదు కాదు.. అనుభూతులు.. )

ఈ రోజు ఉదయం నుంచి నా మదిలో మెదిలిన కొన్ని ఆలోచనలు..

ప్రేమంటే.. స్వార్థం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది..
ప్రేమంటే.. నన్ను నేనే అర్పించుకున్నా.. నీకోసం ఇంకా ఏదో చేయ్యాలనిపించేది..
ప్రేమంటే.. అందని ఆకాశాన్ని కాదు.. ఎదిరించే పక్షి రెక్కలను చూసి ముచ్చట పడేది..
ప్రేమంటే.. ఆశకీ .. జ్ఞాపకానికి.. ముడిపెట్టేది.. మురిసి పోయేది..
ప్రేమంటే.. కాలం కన్నా చాలా చిన్నది.. జీవితం కంటే చాలా పెద్దగా మిగిలిపోయేది..
ప్రేమంటే.. నన్ను నేను కోల్పోయినా .. నీకు మాత్రం చేరువవ్వాలని అనిపించేది..
ప్రేమంటే.. నీలోనూ ఉన్నది నేనే అని ఒప్పుకునేది.. నేనూ నీవే అని ఒప్పించేది..
ప్రేమంటే.. ఆ అనంతం.. అంతలోనే నాలో కరిగే ఈ క్షణం..

ప్రేమంటే.. అంతకంటే ముఖ్యమైంది ,, ఉన్నతమైనది.. ఒకటుంటే..
అదికూడా ప్రేమే.. అనిపించేది.

Sunday, February 13, 2011

అలా మొదలైంది ఇంకోలా ఉంటే ఇంకా బావుండేదేమో ?

చిన్న పని మీద, వీకెండ్ కి భాగ్యనగరానికి వచ్చా.. చెన్నై లో మళ్లీ అవుతుందో అవ్వదో అని, సతీ సమేతంగా "అలా మొదలైంది", అమీర్ పేట్ బిగ్ సినిమాస్ లో కవర్ చేసాం. ఈ మధ్య కాలం లో చూసిన మంచి తెలుగు సినిమా ఇదేనేమో. కానీ జనాలు ఇచ్చిన హైప్ వల్లనేమో, నేను కొంచం ఎక్కువ అంచనాలతో వెళ్ళడం వల్ల, ఏంటో ఇంకా ఏదో ఉంటుంది అనుకున్నా... మామోలుగానే ఉంది. ఇలాంటి సున్నితమైన కథలకి అవసరమైన ఎమోషన్స్ ఈ చిత్రం లో కొంచం తక్కువయ్యాయేమో అనిపించింది. దానికి తోడు మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ నుంచి వర్తమానంలోకి వచ్చి మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవడం, మరీ రొటీన్ గా అనిపించింది. (పాపం ఆశిష్ విద్యార్ధి ఇంకెంత ఇబ్బంది పడ్డాడో) స్క్రీన్ ప్లే ఇంటెరెస్టింగ్ గానే వుంది, కొన్ని సన్నివేశాలకి ఇంకాస్త బడ్జెట్ పెట్టి తీసుంటే, వాటి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. నువ్వే కావాలి, మనసంతా నువ్వే, జానే తూ.. వగైరా చిత్రాల్లో వచ్చే ఆ ఫీల్ ఈ సినిమా లో ఎక్కడా రాలేదు. కామెడీ మరియు నగర సంస్కృతిల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వలన, అసలు కథ కాస్త వెనుక పడిందేమో. నాకైతే, హీరో హీరోయిన్ లు కలిసినా, కలవక పోయినా, నష్టమేమీ లేదు అనిపించింది. పాత్రలు మన రోజువారీ జీవితానికి దగ్గరలోనే వున్నా, సన్నివేశాలు కాస్త ఎక్కువ నాటకీయం గా అనిపించాయి. దానికితోడు చాలా పాత్రలు మరీ సాధారణమైన నటులు చెయ్యడం వలన, ఆ పాత్రలకు పెద్దగా అర్థం లేకుండా పోయింది. (ఉదాహరణకి హీరోయిన్ తండ్రి పాత్ర)

ఇంతకంటే ఎక్కువ టైం నేను తన లాప్ టాప్ మీద కూర్చుంటే, మా అన్నయ్య ఫీల్ అవుతాడు, తరువాత నన్ను ఫీల్ అయ్యేలా చేస్తాడు. సో ఇంక ముగిస్తాను. ఇప్పుడు ఇదంతా రాసింది, మిమ్మల్ని ఈ చిత్రం చూడొద్దని చెప్పడానికి కాదు, తప్పకుండా చూడండి, కానీ నాలా మరీ ఎక్కువ అంచనాలతో వెళ్ళకపోతే మీకు సినిమా ఇంకా బాగా నచ్చుతుంది (ఇంతవరకూ చూడకపోతే లెండి). మన రెగ్యులర్ తెలుగు సినిమాలతో పోల్చుకుంటే, ఇది చాలా మెరుగైన సినిమా. సందేహమే లేదు.

చెప్పడం మరచిపోయాను, హైదరాబాద్ లో ఎండలు కుమ్మేస్తున్నాయి. (మా ఆవిడ బాషలో చెప్పాలంటే, చెన్నై చెమటే బెటర్.. :-) )

Sunday, February 6, 2011

ప్రజా రాజ్యం విలీనం ఇంత లేట్ ఎందుకయ్యిందంటే ............. ?

తెలంగాణా వల్లా ?
కాదు, ఎందుకంటే ఆ విషయం లో ఇప్పుడు వచ్చిన కొత్త క్లారిటీ ఏమీ లేదు గా..
సామాజిక న్యాయమా ?
రాష్ట్రం లో, ఒకటే కులాన్ని పట్టుకుని వేళ్ళాడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఇచ్చే న్యాయమేంటి..
మరి జగనా.. లేక స్థానిక ఎన్నికలా.. ?


నాకైతే, వీటన్నటికంటే, YSR , రోశయ్య పంచ కట్టుకోవడం వల్లే ఇన్నాళ్ళూ లేట్ అయిందని అనిపిస్తోంది. ఎందుకంటే, కాంగ్రెస్ నాయకుల పంచలు ఊడదీసి కొట్టమన్నాడు అప్పటి యువ రాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ ఒక్క భయం/కారణం చాలదూ ఈ ఆలస్యానికి. అంటే, ఇప్పుడు స్టైల్ గా ప్యాంటు వేసుకునే కిరణ్ కి పర్వాలేదనే కదా అర్థం. (డి శ్రీనివాస్ సంగతంటారా.. ఆయన ఉన్నా లేనట్టే..)

ఈ విలీనం తో రాష్ట్రానికి కొత్తగా వచ్చేది.. పోయేది ఏమీ లేదు అని నా గట్టి అభిప్రాయం. కానీ "యూజ్ అండ్ త్రో" టైపు కాంగ్రెస్, చిరంజీవికి ఇచ్చిన రహస్య హామీలను నిలబెట్టుకుంటుందా ?

నగదు బదిలీ లా, అంత సులువుగా చిరూకి పడ్డ ఓట్లు (ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానివి) కాంగ్రెస్ కి బదిలీ అవుతాయా ?
వేచి చూడాల్సిందే.

కానీ ఈ మొత్తం ఎపిసోడ్, ఏదో స్టార్ట్ అప్ కంపెనీ పెట్టి, కాస్త లాభాలో/నష్టాలో ఒచ్చిన వెంటనే ఓ బడా MNC కి అమ్మేసినట్టు అనిపిస్తోంది. మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త ఒరవడి. దీన్ని "చిరు మార్గం" అని పిలుచుకోవచ్చు. మార్పో.. మార్పు అన్నాడు.. ఇప్పుడు ఏ చానెల్ చూసిన ఆయన అమ్మిన మార్పే కనిపిస్తోంది. పర్లేదు లెండి, మన జనాలు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోరు.
అయినా రిమోట్ కి టీవీ ఎప్పుడూ లోకువే మరి.. (ఫ్లో లో వచ్చింది ఫాలో అయిపోవడమే .. )

(ఇందులో ఇందులో చెప్పడం మరచిపోయాను, చిరు పార్టీ కి వచ్చే ఎన్నికల్లో అయినా, వైజాగ్ వెళ్లి మరీ ఓటు వేద్దామని డిసైడ్ అయిన మా ఆవిడ, ఆ ఓటు ను కాంగ్రెస్ కి బదలాయించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.. మంచి పరిణామమే కదా.. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉందంటారా..? అయితే మార్పు రావాలంటారా ? ;-) )