Sunday, February 20, 2011

చెన్నై MRTS స్టేషన్లు ఎంత సురక్షితం ?

మిగతా నగరాలకంటే చెన్నై మహా నగరం ఎంతో సురక్షితం అని నా ఫీలింగ్. కాని ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, చెన్నై ఏమీ తక్కువ కాదు, అనిపిస్తోంది. కొన్నేళ్ళ క్రితమే మొదలు పెట్టిన బీచ్ - వేలచ్చేరి MRTS లైన్ లో ఒకదాని తరువాత ఒకటి నేరాలు నమోదు అవుతూనే ఉన్నాయి. పాత లోకల్ రూట్స్ తో పోలిస్తే, ఈ మార్గం లో రద్దీ తక్కువ, దానికి తోడు, పదుల్లో జనాలుండే గ్రీన్ వేస్, మందవేలి, లైట్ హౌస్ వగైరా స్టేషన్లు కూడా ఊరంత కట్టారు. రెండు మూడు అంతస్తుల్లో ఉండే ఈ స్టేషన్లు ఎప్పుడో రద్దీ సమయాల్లో తప్ప మిగతా టైం అంతా నిర్మానుష్యం గానే ఉంటాయి, పెద్దగా సెక్యూరిటీ కూడా కనిపించదు. కనీసం ఓ నాలుగు దుకాణాలకి అద్దెకి ఇచ్చినా పరిస్థితి మెరుగ్గా ఉండేది. ఆ మధ్య ఎప్పుడో మందవేలి స్టేషన్ లో ఒక హత్య జరిగింది, మొన్న బుధవారం తిరువాన్మయుర్ స్టేషన్ లో మళ్లీ ఇంకో ఉదంతం. మా కొలీగ్ రూం మేట్ అరుణ్, టైడల్ పార్క్ లో పని ముగించుకుని సాయంత్రం ఆరు దాటాక, తిరువాన్మయుర్ స్టేషన్ కి చేరుకున్నాడు, కాస్త చీకటిగా ఉన్న ప్రదేశం లో అప్పటికే కాచుకుని ఉన్న ఓ ఇద్దరు యువకులు అకస్మాత్తుగా కత్తి తో దాడి చేసి నగదు, కొన్ని విలువైన వస్తువులు దోచుకున్నారు. ఇతను కాస్త ప్రతిఘటించడం తో ముఖం మీదా, చేతులకి గాయాలు కూడా అయ్యాయి. కొంచం తేరుకున్నాక, ఎగ్మూరు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాడు. రైల్వే పోలీసులు ఎప్పటిలానే దర్యాప్తు చేస్తాం, సెక్యూరిటీ పెంచుతాం అని ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇందులో ఇందులో ఇంకో అన్యాయం ఏంటంటే, ఆ గాయాలతో RA పురం లో ఉన్న బిల్ల్రోత్ ఆసుపత్రికి (ఒకప్పటి కాలియప్ప) వెళ్తే, పోలీసు కేసు కనుక అడ్మిట్ చేసుకోమన్నారంట, మరో మార్గం లేక సెంట్రల్ దగ్గరున్న జనరల్ హాస్పిటల్ కి వెళ్ళాడు అతను. (బిల్రోత్ ఆసుపత్రి మీద కూడా కేసు పెట్టే ఆలోచనలో ఉన్నాడు)

మన తెలుగు సాఫ్ట్ వేర్ జనాలు ఎక్కువగా ప్రయాణించేది ఈ MRTS రూట్ లోనే, వీలయితే ఒకరిద్దరితో కలిసి వెళ్తే మంచిది (ముఖ్యంగా రద్దీ లేని సమయాల్లో), బయట ప్రదేశాల్లో ఆఫీసు గుర్తింపు కార్డులు మెడలో వేసుకోకపోతేనే మేలు. ఏదైనా మనం మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ గొడవంతా ఎందుకనుకుంటే, ఆఫీసు దగ్గరలోనే, అద్దె కాస్త ఎక్కువ పోసైనా ఇల్లు తీసుకుంటే (నాలాగ అన్నమాట .. :-) ) ఉత్తమం.

No comments:

Post a Comment