Wednesday, February 23, 2011

"వాల్డ్ కప్"... "వాల్డ్ వార్".. (TV9 సౌజన్యంతో)

ఒంట్లో కొంచం బాలేక, కాస్త ముందరే ఇంటి దారి పట్టాను ఈ రోజు. సాయంత్రం ఏంచెయ్యాలో తెలీక ఛానల్స్ తిప్పుతుంటే, పై శీర్షిక కనిపించింది. నిజం గానే ఒక్క క్షణం ఏ "రహస్యానికి" సంభందించిన చెత్తో అనుకున్నా. కొంచం వివరం గా చూస్తే, అది మన ప్రపంచ కప్ క్రికెట్ పోటీల గురించిన కథనం అని అర్థమయ్యింది. "ప్రపంచ కప్ - ప్రపంచ పోరు" అనడానికి TV9 కి నామోషీ అనిపించి, "వాల్డ్ కప్" "వాల్డ్ వార్" అని వాడి ఉంటారు, అర్థం చేసుకోగలం. "వరల్డ్ కప్", అంటే ఏంపోయేదో తెలీదు మరి. ఇంగ్లీష్ ఉచ్ఛారణ అంత పక్కా గా కావాలనుకున్నప్పుడు, అదేదో ఇంగ్లీష్ లోనే తగలడితే ఏ బాధా ఉండదు కదా. కొత్తగా మనకి తెలుగు నేర్పక్కర్లేదు కానీ, మనకు తెలిసినవి కూడా మరచిపోయేలా చేస్తే కష్టమే. దీనికి తోడు, జెమిని న్యూస్ లాంటి ఛానల్స్ లో వచ్చే తెలుగు స్క్రోల్లింగ్ చూస్తే, మన తెలుగు అక్షరాలే అయినా, పదాలను గుర్తించలేం. కేవలం అభిరుచితో రాసుకునే తెలుగు బ్లాగుల్లో ఉన్నపాటి స్థాయి కూడా తెలుగు TV ఛానల్స్ కు లేదేమో. (భాష విషయం లో లెండి.. ;-) ) వెబ్ లోని తెలుగు వార్తాప్రత్రికలు వీటికి ఏమాత్రం తక్కువ తినలేదు. వీటిలో, "భారత్కు", "భారత్లో", "బ్యాట్స్మెన్లు" లాంటి పదాలు సర్వ సాధారణం. మొదట్లో చదువుతున్నప్పుడు ఏవో తిట్లు చదువుతున్నట్టు అనిపించినా పోను పోనూ అలవాటయ్యింది నాకు. అక్కడక్కడ ముద్రారాక్షసాలు పర్వాలేదు కానీ, మరీ కొత్త మాటలు సృష్టిస్తే అన్యాయమే.

ఇంకో తరం వచ్చేటప్పటికి, మన అసలు అక్షరాలు, మాటలు బ్రౌన్ గారి నిఘంటువులోనే చూసుకోవాలేమో.
(అంఠే మన ప్యూర్ ఆండ్ షూర్ తెల్గూ ఛానల్స్ ఉంఠాయి ఆఫ్కొర్స్.. మన్కు తెల్గూలో న్యూ న్యూ వార్డ్స్ నేర్ప్ డాన్కి.)

ఈ విషయం లో "ఈనాడు", వంద రెట్లు మెరుగు. మొన్నెప్పుడో "గగనసఖి" అని వాడటం చూసి ముచ్చట పడ్డాను. ఈ రోజు "శూన్యగంట".. ఒక్క క్షణం అర్థం కాలేదు కానీ, బావుంది వాడుకకు.

5 comments:

 1. ప్రపంచ కప్ ను పూర్తిగా తెనిగించండి .

  ReplyDelete
 2. భాస్కర్ గారు మీ చెప్పింది నిజం.... TV9 ఒక చెత్త ఛానల్ పేరుకి తెలుగు అందులో వుండేది అంతా ఆంగ్లం. ఈనాడు వాళ్ళు తెలుగు బాష మీద ప్రసారం చేస్తున్న "తెలుగు-వెలుగు" అంటే చాలా ఇష్టం నాకు. :) రాజేష్

  ReplyDelete
 3. అవును, నేనూ చూస్తున్నా! ఈ టీవీ 9 వాళ్ళ క్రియేటివిటీ రోజు రోజు కీ కొత్త పుంతలు తొక్కిస్తామని వాళ్ళనుకుంటున్నా వెర్రి తలలు వేస్తోందని ప్రేక్షకులకు అర్థమవుతోందిలెండి!

  ఆ మాట చూసి "ఇదేమి కప్పు" అనుకుని తెల్లబోయి వార్త చూస్తే అప్పుడు తెల్సింది అదిప్రపంచ కప్ అని! అసలు ప్రపంచ కప్ అని అనకుండా వరల్డ్ కప్ అనడమే ఎబ్బెట్టనుకుంటే వెళ్ళు దీన్ని "వాల్డ్ కప్" చేశారు. హుస్సేన్ సాగర్ నీళ్లను తాగునీటిగా మార్చవచ్చుగానీ టీవీ 9 భాషను బ్రహ్మ దేవుడు దిగొచ్చినా బాగు చేయలేడు.

  ReplyDelete
 4. మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.
  @JD గారూ, నేనూ ఒక క్షణం ఆలోచించాను, కానీ మరీ పూర్తిగా తెలుగు లో రాస్తే, అసలు అర్థమే మారిపోయేలా ఉంది. అయినా, వేమూరి వారి నిఘంటువు ప్రకారం, "కప్పు" తెలుగు పదమే, కాబట్టి, "ప్రపంచ కప్పు" అని వాడుకోవచ్చేమో. మీకు ఇంకేదైనా మెరుగైన మాట తోస్తే పంచుకోండి. "క్రికెట్" మాత్రం అనువదించకండి. :-)

  ReplyDelete
 5. నాకు మాత్రం "వాల్డ్ కప్" అని అనడంలో పెద్ద గా ఫీల్ అవ్వావాల్సిన అవసరం ఏమిటో అర్ధం కావడం లేదు ... మన మ్యూజిక్ ఛానల్ లో మన యాంకర్లు మాట్లాడం వినడం లేదా ?

  www.arajachandra.blogspot.com

  ReplyDelete