Sunday, March 27, 2011

అన్నీ ఉచితమే, గాలి.. నీరు తప్ప..


తమిళ నాడులోని పార్టీల మానిఫెస్టోలు చూస్తుంటే, కళ్ళు తిరిగిపోతున్నాయి. లాప్ టాప్ లు, మిక్సీలు, గ్రైండర్లు, సెల్ ఫోన్లు, ఒకటేమిటి.. అన్నీను. అన్నీ ఉచితం. ఒక పార్టీ తో మరొకటి పోటీ పడి మరీ ఇస్తున్నాయి. మాదే ఒరిజినల్ అంటే, కాదు మాదే.. అంటూ రెండు కూటములూ రోజుకోసారి కొత్త బంపర్ ఆఫర్ల ని ప్రకటిస్తున్నాయి. సబ్సిడీలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఎలా ఇస్తారని మనం అడక్కూడదు.. వాళ్ళు చెప్పనక్కర్లేదు. ఏదైనా పార్టీ, మందు కూడా ఫ్రీ గా ఇస్తామని చెప్పినా మనం అస్సలు ఆశ్చర్య పోనక్కర్లేదు. ఏదైతేనేం, మా చెన్నై రోడ్లు ఎన్నికల హడావిడితో కిటకిట లాడుతున్నాయి, ప్రభుత్వ మద్యం దుకాణాలైతే మరీనూ, ఇండియా పాక్ సెమీస్ దగ్గర కూడా మీరు అంత సందడి చూడలేరు అంటే నమ్మండి.

తాగడానికి మంచినీళ్ళు.. మహానగరాల్లో పీల్చడానికి స్వచ్ఛమైన గాలి.. ఈ రెండూ మాత్రం మీకు ఏ మానిఫెస్టో లోనూ భూతద్దంతో వెతికినా కనపడవు. కాబట్టి అవి మాత్రం మనం రేషన్ షాప్ వెనకాల బ్లాక్ లో కొనుక్కోవాల్సిందే. పోలింగ్ బూతు గోడ మీద పార్టీ పేరు ఉందని.. అదేదో సభలో అధికార పార్టీ MP రెండు నిమషాలు ఎక్కువ మాట్లాడారని కేసులు బుక్ చేసే ఎన్నికల కమీషన్ కు ఈ ఉచితాల గోడు పట్టదా ? ఎవడబ్బ సొమ్ముతో ఇవన్నీ ఉచితంగా ఇస్తారయ్యా మీరు అని ప్రశ్నించే హక్కు/బాధ్యత ఎవరికీ లేదా ? మనలా బాధపడిపోయి.. వేదన పడే జనాలు ఎలాగో పోలింగు బూతు వైపు కన్నెత్తైనా చూడరు, ఆ విషయం పార్టీలకీ బాగా తెలుసు. నల్లధనం ఏరులై పారుతోంది, ఆర్ధిక మాంద్యం ప్రభావం అస్సలు లేదు మన ఎన్నికలమీద. ఆదాయపు పన్ను అధికారులు, గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి మీద దర్యాప్తు చేస్తూ బిజీ గా ఉన్నారు, అందుకని ఈ ఎన్నికల మీద దృష్టి సారించడం కష్టం. అయినా, ఎవరు ఓటు ఎంతకి కొన్నారు.. ఏ పార్టీ ఎంత ఖర్చుపెట్టింది ఇలాంటి వివరాలు, మన ప్రభుత్వాధికారుల కంటే, అమెరికన్ దౌత్యాధికారుల వద్దనైతే కరెక్ట్ గా ఉంటుంది. మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్/టైం లేకపోతె కంగారు పడకండి.. 2018 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇదే అంశం మీద ఫుల్ చర్చ.. మరియు రచ్చ. (వికీ లీక్స్ సౌజన్యంతో) సో ప్రస్తుతానికి మనం ప్రపంచ కప్ మీదా, తీన్ మార్ ఆడియో మీదా కాన్సంట్రేట్ చేసుకోవచ్చు. మా తమిళ తంబీలకి హ్యాపీ అండ్ ఫ్రీ ఎలక్షన్స్!!

Wednesday, March 16, 2011

గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ బహుమతి - 2010


మొదటి సినిమా చిత్రీకరణలో ప్రమాదవశాత్తు మరణించిన గొల్లపూడి శ్రీనివాస్ పేరిట, గొల్లపూడి కుటుంబం, ప్రతియేడు ఇస్తున్న జాతీయ పురస్కారం, 2010 సంవత్సరానికి గానూ, "పీప్లి లైవ్" దర్శకురాలు అనూషా రిజ్వీ కి దక్కింది. నిజానికి ఈ అవార్డు గురించిన వార్త వినేంత వరకూ, ఆ సినిమా ఒక దర్శకుని మొదటి ప్రయత్నం అని నాకు తెలియనే లేదు, అంత పక్కాగా ఉంది ఆ చిత్రం. విమర్శకుల ప్రశంసలు పొందిన ఆ చిత్రానికి/దర్శకురాలికి ఈ అవార్డు రూపంలో మళ్లీ గుర్తింపు రావడం అభినందనీయం. రైతు ఆత్మహత్యలు మరియు మీడియా నేపధ్యంలో తీసిన ఆ సినిమా, చూసిన కొన్ని రోజుల మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సన్నివేశాలు బయటికి హాస్యంగా కనిపించినా, అంతర్లీనంగా ఎన్నో అంశాలని/సమస్యలని నిజాయితీగా ఎత్తిచూపిన చిత్రం అది. వర్మ ఎంతో హడావిడి చేసి మీడియా మీదే తీసిన "రణ్" తో పోల్చి చూస్తే పీప్లి లైవ్ చాలా మెరుగైన సినిమా. కొంచం సీరియస్ చిత్రాలు చూసే అభిరుచి ఉన్న ప్రేక్షకులు మిస్ అవ్వకూడని చిత్రమే.

Sunday, March 13, 2011

తెలుగు జాతికి మరో పెను సవాల్ ? ;-)మనలో మనకి సవాలక్ష ఉండచ్చు, ఇప్పటి వరకూ, మనలో మనం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఆనందం గా వుండి ఉండవచ్చు, కానీ అవన్నీ మరచిపోయి మనం అందరం ఒక్క తాటిపై నడవాల్సిన సందర్బం ఇది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, మొత్తం తెలుగు జాతినే తుడుచుకుని పోగలిగే ఉపద్రవం..

"ఐ లవ్ యు డాడీ" దెబ్బకి ఆసుపత్రి పాలైన జనాలు ఇంకా డిశ్చార్జ్ కాకమునుపే మనం ఉహించని పెనుముప్పు మనకి మరో సవాల్ విసిరింది. పుష్పక విమానం కంటే మంచి డైలాగ్స్ తో, గగనం కంటే గొప్ప పాటలతో, అనకొండా తో పోటీ పడే కుటుంబ కథా చిత్రం "శుభం" - ప్రీమియర్ షో మన పాలిట శాపమై, మన టీవీ ల పాలిట కాల సర్పమై వస్తోంది. ఏ క్షణమైనా ఈ సునామి మన గడపల్ని చేరచ్చు, ఏ క్షణమైనా ఈ భూకంపం మన లివింగ్ రూం లో రావచ్చు. నా బాధ్యత గా నేను కొన్ని సూచనలు చేయదలిచాను. (తెలంగాణా, ఆంధ్రా భేద భావం లేకుండా, అందరూ తప్పక ఆచరించాల్సినవి)

1. కేబుల్ టీవీ సోదరులకు చెప్పి వారాంతాల్లో, పండగలలో, ఈ టీవీ ప్రసారాలు ఆపమని రిక్వెస్ట్ చేయచ్చు.
2. DTH సదుపాయం ఉన్న వారు, వాళ్ళ ఫేవరేట్ చానల్స్ లోంచి ఈ టీవీ ని తొలగించి, రిమోట్ ని పిల్లలకి అందకుండా, ఏ పుస్తకాల దగ్గరో దాచెయ్య గలరు.
3. ముఖ్యంగా, పైన చెప్పిన హై రిస్క్ టైం లో ఏ బంధువుల ఇంటికో వెళ్ళకుండా ఉంటె మంచిది. (వాళ్ళు మీ శత్రువులుగా మారే ప్రమాదముంది మరి)
4. నాగరికతకు దూరం గా, ఏ నల్లమల అడవులకో, ఆఫ్రికా అభయారణ్యాలకో వెళ్లగోరు వారికి ఇది శుభ తరుణం.
5. వృద్దులు కంటి ఆపరేషన్ కో , మానస సరోవర యాత్రకో వెళ్తే అత్యుత్తమం.
6. గర్భిణీలు, పసి పిల్లలు మరింత కేర్ ఫుల్ గా ఉండాలి, ఈ కొన్ని రోజులు టీవీ గదికి ఓ పది గజాల దూరం లో ఉంటె మరీ మంచిది.
(ఏ పాడుతా తీయగాకో కక్కుర్తి పడితే మరింక మాట/పాట మిగలదు, చూసుకోండి)

నేను చెప్పాల్సింది నేను చెప్పాను, విధి బలీయమైనది మరియు తింగరిది కనుక, ఎవరి జాగ్రత్తలు వాళ్లే తీసుకోవాలి. విధిని జయించిన వాడే మొనగాడు, మీకు తెలుసు కదా..
:-)

Friday, March 11, 2011

అన్నమయ్యది ఆంధ్రా.. రామదాసుది తెలంగాణా..

అన్నమయ్యది ఆంధ్రా.. రామదాసుది తెలంగాణా..

నిన్నటి వరకూ ఎప్పుడూ ఈ ఆలోచనకూడా రాలేదు నాకు. బహుశా, నాలాంటి చాలా మందికి కూడా.
చిలుకూరు వెంకన్నది తెలంగాణా, ఏడుకొండల వాడిది ఆంధ్రా.. అనే వాదన కూడా ఎంతో దూరం లో లేదు.

యువత ఆత్మహత్యలు చేసుకున్నారు.. తెలుగు జాతి నిజంగానే రెండు ముక్కలైంది అంటున్నారు.. (నేను ఏ ముక్కకు చెందాలో.. ?)
ఉద్యమం లోకి ఉన్మాదం చొరబడుతోంది. "మనం కాస్తా.. నువ్వూ.. నేనూ అయ్యింది.. ఇప్పుడది నువ్వో.. నేనో.. స్థాయికి దిగజారింది.. ఇంకా ముందుకెళితే. మిగిలేది మన్నే.. ఆ తరువాత, మనం గా మళ్లీ మనం ఏడవచ్చు."
ఈ విద్వేషాల మధ్య... సామాన్యుడు చస్తూ బ్రతుకుతున్నాడు. బ్రతికి చస్తున్నాడు. వాడి ఘోష ఎవడిక్కావాలి.. ?

ఇన్ని జరిగినా.. పార్టీలకు ఓట్లే కావాలి.. నాయకులకి పదవులే కావాలి..
కేంద్రానికి పక్క రాష్ట్రాల ఎన్నికలే ముఖ్యం... అదీ మన దౌర్భాగ్యం.

(మా అన్నయ్య, తెలంగాణా రాష్ట్రమే పరిష్కారం అంటున్నాడు. అమ్మ, సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అంటోంది. నాకు మాత్రం వీటిలో దేనికోసమూ చావాలని లేదు. ఎవడి విగ్రహమూ పగలగోట్టాలని లేదు.)

Tuesday, March 8, 2011

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - కరుణానిధి

ఇంటర్వల్ తరువాత కూడా మూడు, నాలుగు డ్యూయట్లు పాడుకున్న DMK, కాంగ్రెస్స్ క్లైమాక్స్ లో,ఉన్నట్టుండి U టర్న్ అన్నాయి.. ఇంతలోనే మళ్లీ కలిసిపోయాయి.

కేవలం మూడు సీట్ల కోసం ఇంత హడావిడి జరిగిందా ? ఈ మధ్యే వచ్చిన సర్వేల్లో ఎలానో DMK భవితవ్యం అంతంత మాత్రం గానే వుంది కదా, కొత్తగా మూడు సీట్లలో వచ్చేది పోయేది ఏముంది, వాటికోసం ఎవడైనా కేంద్ర మంత్రి పదవులు వదులుకుంటాడా ? నాకైతే మూడు సీట్లు కాదు, ఏవో మూడు కోర్కెల కోసం ఈ తతంగం చేసుంటారని అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో DMK కి అవసరమైనవి ఏంటి ?

నాకు అనిపించినవి..

1 2G రాజా గారి కేసు ఇంక ముందుకు వెళ్ళకూడదు, కనిమొళి పేరు పొరపాటున కూడా ఎక్కడా బయటకి రాకూడదు (ఖత్రోచి గారిలా ఎప్పుడో రాజాగారు హాయిగా బయట పడతారు)
2. వేలకోట్లు చేతులు మారిన వ్యవహారం బయటకి పొక్కకూడదు, ఆ డబ్బు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోడానికి వీలుగా కేంద్ర సహకారం
3. అదృష్టం బావుండి, హంగ్ స్థాయికి వస్తే, సోనియా అభయ హస్తం అందించాలి. (ఇంక దేనికి.. MLA లను కొనుక్కోడానికి)

(ఇంతేనా అంటే, జయలలిత మీద పాతకేసులు రెండో మూడో తిరగదోడడం, కలర్ టీవీ లు ఇవ్వద్దన్న ఎన్నికల అధికారి మార్పు, గత ఎన్నికల్లో చిదంబరం గారు వాడిన ఓటింగ్ యంత్రం లాంటివే ఈ సారి ప్రతీ చోట ఉపయోగించడం.. వగైరా.. వగైరా.. ఇలాంటి చిన్న చిన్నవి చెప్పాల్సిందేముంది.)

ఏది అయితేనేం, "అది నా తప్పే, నాదే పూర్తి బాధ్యత"- అని సిగ్గు పడకుండా ఒప్పుకునే ప్రధాని ఉన్నంతవరకూ, UPA కి ఏ డోకా లేదు. వేల కోట్లు అధినేత చేతిలోపెట్టి, ఆనందంగా జైల్లో కూర్చోగలిగే రాజాలు ఉన్నంత వరకూ, కరుణానిధి కి ఏ లోటూ రాదు..