Sunday, March 27, 2011

అన్నీ ఉచితమే, గాలి.. నీరు తప్ప..


తమిళ నాడులోని పార్టీల మానిఫెస్టోలు చూస్తుంటే, కళ్ళు తిరిగిపోతున్నాయి. లాప్ టాప్ లు, మిక్సీలు, గ్రైండర్లు, సెల్ ఫోన్లు, ఒకటేమిటి.. అన్నీను. అన్నీ ఉచితం. ఒక పార్టీ తో మరొకటి పోటీ పడి మరీ ఇస్తున్నాయి. మాదే ఒరిజినల్ అంటే, కాదు మాదే.. అంటూ రెండు కూటములూ రోజుకోసారి కొత్త బంపర్ ఆఫర్ల ని ప్రకటిస్తున్నాయి. సబ్సిడీలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఎలా ఇస్తారని మనం అడక్కూడదు.. వాళ్ళు చెప్పనక్కర్లేదు. ఏదైనా పార్టీ, మందు కూడా ఫ్రీ గా ఇస్తామని చెప్పినా మనం అస్సలు ఆశ్చర్య పోనక్కర్లేదు. ఏదైతేనేం, మా చెన్నై రోడ్లు ఎన్నికల హడావిడితో కిటకిట లాడుతున్నాయి, ప్రభుత్వ మద్యం దుకాణాలైతే మరీనూ, ఇండియా పాక్ సెమీస్ దగ్గర కూడా మీరు అంత సందడి చూడలేరు అంటే నమ్మండి.

తాగడానికి మంచినీళ్ళు.. మహానగరాల్లో పీల్చడానికి స్వచ్ఛమైన గాలి.. ఈ రెండూ మాత్రం మీకు ఏ మానిఫెస్టో లోనూ భూతద్దంతో వెతికినా కనపడవు. కాబట్టి అవి మాత్రం మనం రేషన్ షాప్ వెనకాల బ్లాక్ లో కొనుక్కోవాల్సిందే. పోలింగ్ బూతు గోడ మీద పార్టీ పేరు ఉందని.. అదేదో సభలో అధికార పార్టీ MP రెండు నిమషాలు ఎక్కువ మాట్లాడారని కేసులు బుక్ చేసే ఎన్నికల కమీషన్ కు ఈ ఉచితాల గోడు పట్టదా ? ఎవడబ్బ సొమ్ముతో ఇవన్నీ ఉచితంగా ఇస్తారయ్యా మీరు అని ప్రశ్నించే హక్కు/బాధ్యత ఎవరికీ లేదా ? మనలా బాధపడిపోయి.. వేదన పడే జనాలు ఎలాగో పోలింగు బూతు వైపు కన్నెత్తైనా చూడరు, ఆ విషయం పార్టీలకీ బాగా తెలుసు. నల్లధనం ఏరులై పారుతోంది, ఆర్ధిక మాంద్యం ప్రభావం అస్సలు లేదు మన ఎన్నికలమీద. ఆదాయపు పన్ను అధికారులు, గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి మీద దర్యాప్తు చేస్తూ బిజీ గా ఉన్నారు, అందుకని ఈ ఎన్నికల మీద దృష్టి సారించడం కష్టం. అయినా, ఎవరు ఓటు ఎంతకి కొన్నారు.. ఏ పార్టీ ఎంత ఖర్చుపెట్టింది ఇలాంటి వివరాలు, మన ప్రభుత్వాధికారుల కంటే, అమెరికన్ దౌత్యాధికారుల వద్దనైతే కరెక్ట్ గా ఉంటుంది. మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్/టైం లేకపోతె కంగారు పడకండి.. 2018 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇదే అంశం మీద ఫుల్ చర్చ.. మరియు రచ్చ. (వికీ లీక్స్ సౌజన్యంతో) సో ప్రస్తుతానికి మనం ప్రపంచ కప్ మీదా, తీన్ మార్ ఆడియో మీదా కాన్సంట్రేట్ చేసుకోవచ్చు. మా తమిళ తంబీలకి హ్యాపీ అండ్ ఫ్రీ ఎలక్షన్స్!!

1 comment:

  1. Please read the article written by me in my blog by following the link below:

    http://saahitya-abhimaani.blogspot.com/2011/03/blog-post_20.html

    ReplyDelete