Wednesday, April 20, 2011

నువ్వు నా జ్ఞాపకానివేనా ?

అవునూ.. నువ్వు నా జ్ఞాపకానివేనా ?

నేను రోజూ మారుతూనే ఉన్నాను..
కానీ నాకు నీలో మార్పు నచ్చదు.
నేను కాలం తో పాటూ, పరిగెడుతూ ఉంటాను..
నిన్ను మాత్రం గతం లోనే దాచేస్తాను.
నన్నుకూడా నేను మరచిపోతానేమో..
కానీ నిన్ను మాత్రం అనుక్షణం గుర్తుకు తెస్తాను..
మనిద్దరి మధ్య దూరం ఒక్క ఆలోచనే..
కానీ మన కలయిక ఒక జీవితం.

ఒక్కోసారి నీకోసం నన్ను నేనే అర్పించుకుంటాను.
కానీ నాలోనే ఉంది నీ అస్తిత్వం.
నేను ఆగిపోతే.. మనం ఒక్కటైపోతాం.
ఎప్పటికీ..

అవును.. నువ్వు నా జ్ఞాపకానివే..

Saturday, April 16, 2011

మార్పు రావాలి.. మార్పు కావాలి..


ఈ మధ్య ఎందుకో నా బ్లాగ్ టెంప్లేట్ నాకే బోర్ కొడుతోంది, ముఖ్యం గా, మాలిక లో ఓ నాలుగు బ్లాగులు చూసి నా బ్లాగ్ కి వస్తే, IPL చూసాక రంజీ ట్రోఫి చూసినట్టు, TV9 న్యూస్ తరువాత దూరదర్శన్ లో వార్తలు చూస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ, బ్లాగ్ లో రంగులు, హడావిడి కంటే విషయం ముఖ్యం అని ఎప్పటినుంచో నా అభిప్రాయం..సో టెంప్లేట్ మార్చాలా.. వద్దా.. అని తెగ మథన పడిపోతుంటే, మా ఆవిడ మార్చేయండి అని ఒక ఉచిత సలహా పడేసింది. పెళ్ళాం చెబితే వినాలి కదా.. (మనకీ అదే ఉద్దేశం ఉన్నప్పుడు.. ;-) ) అందుకని ఉన్నవాట్లో కొంచం బ్రైట్ గా కానీ సింపుల్ గా ఉండే టెంప్లేట్ కి మారుతున్నాను. నాకు బానే అనిపించింది, మీకూ చూడగా చూడగా నచ్చుతుంది లెండి. సోకు మారింది కనుక, ఏదో సొత్తూ మారుతుంది అని ఆశ పడేరు, మేటర్ అదే.. సేమ్ టూ సేమ్ :-)

Thursday, April 14, 2011

పని చేస్తేనే జీతమా ? మరీ ఇంత అన్యాయమా ?

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో మరీ విడ్డూరం గా ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తేనే జీతమంట, మరీ ఇంత అన్యాయమా.. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. ప్రభుత్వ ఉద్యోగమంటేనే నగదు బదిలీ పధకం లాంటిది. పని చేసినా, చేయకున్నా, జీతం ఇవ్వాల్సిందే. ఇది ఉద్యోగుల హక్కు, ప్రభుత్వ బాధ్యత. ఫర్ సప్పోజ్, కాలేజీ కి వెళ్ళాల్సిన కుర్రాడు, ఏ అభిమాన హీరో సినిమాకో తప్పక వెళ్లాడే అనుకోండి, అమ్మ అన్నం పెట్టడం మానేస్తుందా, నాన్న పాకెట్ మనీ ఆపేస్తాడా, లేదు కదా, ఇదీ అలాంటిదే, ఉద్యోగం అంటూ ఇచ్చాక, పని చేసినా, చెయ్యకున్నా, చెయ్యనివ్వకున్నా, జీతం ఇవ్వాల్సిందే. మీకు ఇంకా అర్థం అయినట్టు లేదు, ఇలాంటప్పుడే మనం వెంకటేష్ ఏం చెప్పాడో గుర్తుకు తెచ్చుకోవాలి. బీడీ తాగితే పొగ వస్తుంది కానీ, పొగ తాగితే బీడీ రాదు కదా.. ;-)

అసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్ లోనే ఉందంట, ఈ క్లాజు, పని చెయ్యక్కర్లేదు జీతం తీసుకోడానికి, లంచం కావాలంటేనే పని చెయ్యాలని అని. మరి ఆ రకంగా చూసినా, ఇది సర్వీసు నిబంధనలను అతిక్రమించడమే. కాబట్టి, ఇందుమూలం గా నేను ఉద్యోగ సంఘాలను కోరేదేంటంటే, మరి ఇంక వెనక్కి తగ్గేది లేదు, పని చెయ్యాలి అని రూల్ పెట్టాక కూడా ఉద్యోగాలు చెయ్యడం లో అర్థం లేదు, రాజీనామా పత్రాలు వాళ్ళ మొహాన కొట్టండి. పనే చేద్దామనుకుంటే, ఇక్కడే పని చెయ్యాలా, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఏంటంటారు ?

కాకపొతే, ప్రభుత్వానికి కూడా ఓ చిన్న నివేదన:

నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ చదువుతున్నప్పుడు, మా ప్రొఫెసర్ గారొకరు, సెమిస్టరు లో రెండే రెండు సార్లు, క్లాసుకి వచ్చారు (పొరపాటున కూడా, "పాఠం చెప్పారు" అని చదవకండి), మిగతా రోజుల్లో ఎప్పుడూ ఆయన్ని డిపార్టుమెంటు దరిదాపుల్లో చూసిన గుర్తు లేదు, కోర్సు అయ్యాక, "నో డ్యూ" కోసమని ఆయన సంతకం పెట్టించుకోలేక తిరుగుతుంటే, మా ఫ్రెండ్ ఒకడు అందరికీ ఆయన సంతకం తానే పెట్టి సహాయం చేసాడు. డిపార్ట్ మెంట్ గుమాస్తా ఒకాయన్ని నేను అడిగాను, ఎవరైనా చెక్ చెయ్యడానికి వస్తే పరిస్థితి ఏంటని ? ఆయన నా వైపు వేదాంత ధోరణిలో ఓ చూపు చూసి, ఆ ప్రొఫెసర్ గారు తేదీ రాయకుండా ఇచ్చిన లీవ్ లెటర్ చూపించాడు. ఏ శనివారం సాయంత్రమో వచ్చి వారానికి సరిబడ సంతకాలు హాజరు పుస్తకం లో చేసి వెళ్తారంట ఆయన. ఆయన జీతం కూడా ఆపేస్తే బావుంటుందని ప్రభుత్వానికి నా వినతి. ఇక్కడే ఒక తిరకాసు వుంది, ఇప్పుడు ఆయనే మరి ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్, వీలుపడుతుందో లేదో :-) (ఆయన సేవలకు గుర్తింపు గా ఆ పదవి ఇచ్చారు లెండి, కుల ప్రాతిపదికన కాదు)

పనిలో పని, ఈ మధ్య పుట్టపర్తిలోనే ఎక్కువ కనిపిస్తున్న, డాక్టర్ రవిరాజ్ గారు (ప్రముఖ నెఫ్రాలజిస్ట్), KGH లో పని చేసినన్ని రోజులూ, ఆసుపత్రి వంక చూస్తే ఒట్టు, అప్పోలో లో ఆయన బిజీ అలాంటిది, పోనీ DME అయ్యాక ఏమైనా మారారేమో అనుకుంటే, విష జ్వరాలు ప్రబలిన ఏజెన్సి ఏరియా లో కనుక్కుంటే మనకి సరియిన సమాచారం వస్తుంది. మరి ఆయన జీతం లేక ఫించను విషయం కూడా ప్రభుత్వం ఒక సారి ఆలోచించాలి. ఇంకా, కడప ఎన్నికల్లో, వీధికో ఇంచార్జ్ గా, బిజీ గా ఉన్న (రాష్ట్ర) మంత్రులు, శాసన సభ ముఖం కూడా చూడని శాసన సభ్యులు, అతి పెద్ద ప్రజాస్వామ్యం లో ఓటు హక్కుని కూడా వినియోగించుకోని ప్రధాని గారు, ఇలా.. ఓ చిన్న లిస్టు ఉంది, వీరందరికీ కూడా జీత భత్యాలు తక్షణమే ఆపి తమ సచ్చీలతను నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.

చెప్పడం మరచాను, నాకు తెల్సిన ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, భాగ్యనగరం లో సమ్మెల హడావిడి తగ్గాక, ఆదివారాలు కూడా పనిచేసి వాళ్ళ పని పూర్తిచేసారు, మరి ఆ ఆదివారాలకు ఏమైనా డబల్ పే ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా ?

Wednesday, April 13, 2011

చిట్టి పొట్టి కవితలు - 4

ఫ్లాష్ బ్యాక్ : చిట్టి పొట్టి కవితలు :ఏ రాత్రో పడుకునేముందు, ఓ ఆలోచన రావడం, ప్రక్కనే ఏది దొరికితే, దాని మీద రాసేసి పడుకోవడం, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రాతలు, కవితలు కాదు, అలా అని మామోలు వాక్యాలూ కాదు. మొన్నెప్పుడో, నాయుడు గారి బ్లాగ్ లో వారి అందమైన హాఫ్లాంగ్ కవితలు చూసి నాకు ఆవేశం వచ్చింది, నేనూ ఇలా పోస్ట్ చేయ్యచ్చని. A long poem is a contradiction అన్నారు, ఈ చిట్టి కవితలు, సగం నిజాలేమో. అందరితో పంచుకోవాలని అనిపించి పోస్ట్ చేస్తున్నాను, మీకు అర్థం అయితే ఆనందమే.. అర్థం కాకుంటే, నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ;-) (ఎందుకంటే, నేను రాయని ఆ మిగతా సగం నిజం ఏంటో నాకూ తెలీదు మరి.. నిజంగా..+++++++++++++++++++++++

తుది గెలుపు ఏ దిక్కున దాగుందో..
ఎన్ని గమ్యాలకవతల అసలు ఆనందం అందుతుందో..
నేను మాత్రం తప్పకే చీకటిని అనుసరిస్తున్నాను.
ఆ సూర్యోదయం నన్ను వెతుక్కుంటోంది.. ప్రతీ రేయి.

+++++++++++++++++++++++

కరిగిపోయే క్షణానికేం తెలుసు.. కాలం విలువ..
తోడై తీసుకుపోయే మరణానికేం తెలుసు.. ప్రాణం విలువ..
పోగొట్టుకున్నదాని విలువ.. ఎంతో.. ఏమో..
ఎడతెగని వాదనకేం తెలుసు.. మౌనం విలువ.
హద్దులేని స్వార్థానికేం తెలుసు.. అనుబంధం విలువ.

(ప్రపంచ పదుల ప్రభావం)

+++++++++++++++++++++++

నాకు బోలుడంత ఒంటరితనం కావాలి..
ఎంతంటే, నేను కూడా లేనంత..
అది నీలో కాక మరెక్కడ దొరుకుతుంది.. ?

+++++++++++++++++++++++

నువ్వు గతంలోనే ఉండిపోతానంటే,
నేను తిరిగి బ్రతికేస్తాను ఆ నిన్నని.
మన కలయిక ఏదో ఒక రేపుకే సాధ్యమైతే,
అంతవరకూ నేను శిలనైపోతాను.. వేచిచూస్తూ.
ఈ క్షణం వరంగా నువ్వు దిగివస్తానంటే..
కాలాన్ని ఆపేస్తాను,.. ఇంక.

+++++++++++++++++++++++

గాయం కొత్త కాదు.. బాధే కొత్త..
కష్టం కొత్త కాదు.. కన్నీరే కొత్త..
ముళ్ళతో తోడొచ్చే ఈ బాటా కొత్త కాదు..
బెరుకుగా నాతో అడుగేస్తున్న నువ్వే కొత్త..

+++++++++++++++++++++++


ఇంతకు ముందు ప్రచురించిన చిట్టి పోట్టి కవితల పోస్ట్ లింక్: చిట్టి పొట్టి కవితలు - 3

Saturday, April 9, 2011

చిన్న గీత/ పెద్ద గీత - ఓ పాతికేళ్ళ నాటి కథ

(చాలా రోజులకి మళ్లీ ఒక పోస్ట్ చెయ్యడానికి వీలు చిక్కింది. ఈ మధ్య కాస్త ఆరోగ్య కారణాల వల్ల లాప్ టాప్ అందని ద్రాక్షే అయ్యింది, ఆఫీసు లో పని ఎలాగో తప్పదు లెండి. )


దాదాపుగా ఓ పాతికేళ్ళ క్రిందటి సంగతి, అమ్మమ్మ వాళ్ళింట్లో, నా మానాన నేనేదో టేబుల్ ఫ్యాన్ లో కాగితాలు పెట్టి ఆడుకుంటుంటే, మా బుచ్చి మామయ్య నాపై ఒక ప్రశ్నసంధించాడు. తికమక పెట్టె ప్రశ్నలు అడగడం, వాటికి మళ్లీ సమాధానాలు మనకి చెప్పడం ఆయనకి సరదా. ఆయన మామోలు మాటల్లో నేర్పిన సైన్సు పాఠాలు, నాకు పదో తరగతి వరకూ సరిపోయాయి. ఓ తెల్లకాగితం మీద ఓ మాదిరి సైజులో గీత గీసాడు, ఆ గీతను చెరపకుండా, చిన్నది చెయ్యమని ఆజ్ఞ. నేను తీవ్రంగా ఆలోచించాను, (2G మీద JPC వెయ్యడానికి కేంద్రం ఆలోచించినంత రేంజ్ లో) వెంటనే తట్టిన సమాధానం, కాగితాన్ని ఫ్యాన్ లోకి తోసేయ్యడమే.. అమ్మో ఇలాంటి పనులు మా మామయ్య అస్సలు సహించడు కదా, అయినా చెరపకుండా గీత ఎలా చిన్నది అవుతుంది, అదేమైనా పుల్ల ఐసా ఎండకి కరిగిపోడానికి.. అసాధ్యం అనిపించింది. అదే చెప్పా.. బిక్కముఖం వేసుకుని. ఆ గీత ప్రక్కనే ఓ పెద్ద గీత గీసి ఇదే సమాధానం అనే టైపులో నాకో లుక్కిచ్చి వెళ్ళిపోయాడు. నాకు సగం అర్థం అయ్యి, సగం అవ్వకా.. ఆ కాగితాన్ని ఫ్యాన్ లో పెట్టి ఆటలో మునిగిపోయా. పెద్ద గీతా లేదు.. చిన్న గీతా లేదు. అసలు కాగితమే లేదు.. అదీ నా సమాధానం. :-)

ఓకే.. ఇంక ఫ్లాష్ బ్యాక్ లోంచి వర్తమానం లోకి వచ్చేద్దాం. మొన్నామధ్య మా బాస్ ఈ ఏడాది నాకు ఆయన ఇచ్చే రేటింగ్, వగైరాలు చెప్పడానికి గదిలోకి పిలిచాడు. ఎప్పటిలానే, మనకి కావాల్సింది వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్లకు నచ్చిందే ఇస్తారు. ఏంచేస్తాం.. మరీ అంచనాలు తారు మారు అయిపోలేదు కాని, కొంచం డీలా పడ్డాను, కాస్త ఆవేశం కూడా వచ్చింది. ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవా చెప్పాడు కదా అని, ఆవేశాన్ని వెంటనే బయటకి చూపించకుండా, మరుసటి రోజుకు అట్టే పెట్టా, ఆ రోజంతా/రాత్రంతా అదే ఆలోచన, ఏమిటీ అన్యాయం.. ఇంకా ఎన్నాళ్ళు ఈ పని దోపిడీ.. ఈ టైపు లో.. మా ఆవిడ బుర్ర కూడా బానే తిన్నా, అన్నీ విని, అంత కష్టంగా ఉంటె, కంపెనీ మారిపోండి అంది.. ఇంకేమంటాం, AC ఉష్ణోగ్రతని ఇంకాస్త తగ్గించి, ముసుగేసుకిని పడుకున్నా. కాకపొతే, మా బాస్ కి మాత్రం గాట్టిగా నా నిరసన తెలియ చేయాలని, మరీ అవసరం అయితే గతంలో ఆయన చేసిన తప్పుడు నిర్ణయాలు, నేను చేసిన త్యాగాలు త్రవ్వి తీయాలని ఫుల్ గా డిసైడ్ అయ్యా. ఆ క్షణానికి నా మనసు కాగితం మీద ఒకటే గీత. అదే అతి పెద్దది.

తదుపరి రోజు ఉదయం లేచేటప్పటికి ఆయన నుంచి నా ఫోనుకి మెసేజ్, "మా తండ్రిగారు, ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పరమపదించారు" - అని... నాకు నోట మాట రాలేదు, స్థాణువు అయిపోయాను, ఏంచేయాలో, ఏమని సమాధానం ఇవ్వాలో తెలీలేదు, "ధైర్యం గా ఉండండి, ఏ అవసరం ఉన్నా తెలియచేయండి"- అని మెసేజ్ పెట్టి, ఆఫీసుకు బయలు దేరాను. వెళ్లానే కాని, మనసంతా ఏదో లానే ఉంది, మా బాస్ పెళ్లి చేసుకోలేదు, ఆయనికి వాళ్ళ తండ్రిగారే ప్రపంచం, ఆయన బాగోగులు చూసుకోడానికి సరియిన మనుషులు దొరకరేమో అనే భయం తో ఎక్కడో ఆఫీసుకి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. మా బాస్ ఎప్పుడు మాట్లాడినా ప్రతీ రెండు వాక్యాలకొకసారి చెప్పేది ఆయన తండ్రిగారి గురించే. ఎందుకో ఒక్కసారి భయం వేసింది, ఈ కష్టం నుంచి ఈయన బయటకి రాగలడా అని.. మరి ఇంక ఆలోచించలేదు, హాఫ్ డే లీవ్ పెట్టి ఆయన ఇంటికి బయలుదేరాను, ఆఫీసుకు బాగా దూరం కావడం వల్ల ఆయన ఇల్లు ఎక్కడో ఆఫీసులో ఎవరికీ తెలీదు , కాస్త ఆ ప్రాంతం మీద ఐడియా ఉన్న కొలీగ్ సాయంతో ఆయన ఇల్లు చేరుకున్నాం. ఎక్కడా ఏడుపులు వినిపించడం లేదు, ఏదో భక్తి పాట చిన్నగా వినిపిస్తోంది. ఊదొత్తుల వాసన.. గదిలో మధ్యలో ఒక అద్దాల పెట్టెలో మా బాస్ తండ్రిగారి పార్థివ శరీరం. చూసిన వెంటనే నాకు తెలీకుండానే రెండు చేతులు జోడించాను, పెద్ద గెడ్డం తో ఆయన ఒక స్వామీజీ లా ఉన్నారు, ముఖం లో ఒక తెలీని తేజస్సు. ఉదయం ఏడు గంటలకి ఊపిరి తీసుకోవడం కాస్త కష్టం గా ఉందని అన్నారంట, మరుక్షణం కొడుకు చేతుల్లోనే కుప్పకూలిపోయారు. మా బాస్ ఎక్కడున్నారా అని గది అంతా వెతికాను, ఎక్కడో ఒక మూల కూర్చుని ఉన్నారు ఆయన, ముఖం లో ఏ భావం లేదు. ఇల్లు అడ్రస్ వెతుక్కోసడం కష్టం అవ్వలేదు కదా, అన్నారు, లేదు అన్నాం. ఏమని ఓదార్చాలో తెలీలేదు నాకు, మనిషి జీవితం లో అతి పెద్ద విషాదాలకు అసలు ఓదార్పు ఉండదేమో అనిపించింది. నిజమే, అలాంటి సందర్భాల్లో మనకు తోడుగా వచ్చేది కాలమొక్కటే. ఎందుకంటే అది ఆగదు, మనల్ని ఆగనివ్వదు. ఓ పది నిమషాల నిశ్శబ్దం తరువాత ఇంక బయలదేరి వచ్చేసాం. కానీ ఆ దృశ్యం నా మనసులో చాలా సేపు కదులుతూనే ఉంది. ఆ క్షణం నా మనసు కాగితాన అదే అతి పెద్ద గీత, నిన్నటి రోజంతా నన్ను అతలాకుతలం చేసిన రేటింగ్ నాకు ఇప్పుడు గుర్తుకూడా లేదు.. ఇప్పుడు మా బాస్ మీద కోపం లేదు, సానుభూతి ఉంది, అంతకుమించి దుఖం.

అంతే.. సమస్య.. తరువాత అంత కంటే పెద్ద సమస్య.. ఒక సమస్య పరిష్కరింప బడితే.. అంత కంటే చిన్న సమస్య గురించి తపన పడతాం. ఇదేగా జీవితం. ఏ సమస్య చివరిది.. ? ఏది అంతిమ పరిష్కారం ? మనం గెలుస్తున్నామో, ఓడిపోతున్నామో.. జీవితం ఎప్పుడూ తెలియనివ్వదు. ఒకదాని తరువాత మరొకటి.. అడుగులు వెయ్యడమే. పాద ముద్రలు దాచుకునేటంత సమయం ఎవరికుంది. ఆ బాధ్యత కాలానిది.

మా బుచ్చి మామయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు నాకు పూర్తిగా అర్థం అయ్యింది. ఉగాది కి వైజాగ్ వెళ్ళినప్పుడు, అపార్ట్ మెంట్లో క్రిందన ఆడుకుంటున్న మా ప్రక్కింటి పిల్లాడి పై నేను మళ్లీ అదే ప్రశ్న సంధించాను, వాడు నా వైపు ఎగా దిగా చూసాడు. కాగితాన్ని దూరంగా పెట్టి, చూడండి ఇప్పుడు గీత చిన్నది అయిపోయింది అన్నాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఈ సమాధానం నాకు అర్థం అవ్వడానికి ఇంకో పాతికేళ్ళు సరిపోతుందా ?