Wednesday, April 13, 2011

చిట్టి పొట్టి కవితలు - 4

ఫ్లాష్ బ్యాక్ : చిట్టి పొట్టి కవితలు :ఏ రాత్రో పడుకునేముందు, ఓ ఆలోచన రావడం, ప్రక్కనే ఏది దొరికితే, దాని మీద రాసేసి పడుకోవడం, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రాతలు, కవితలు కాదు, అలా అని మామోలు వాక్యాలూ కాదు. మొన్నెప్పుడో, నాయుడు గారి బ్లాగ్ లో వారి అందమైన హాఫ్లాంగ్ కవితలు చూసి నాకు ఆవేశం వచ్చింది, నేనూ ఇలా పోస్ట్ చేయ్యచ్చని. A long poem is a contradiction అన్నారు, ఈ చిట్టి కవితలు, సగం నిజాలేమో. అందరితో పంచుకోవాలని అనిపించి పోస్ట్ చేస్తున్నాను, మీకు అర్థం అయితే ఆనందమే.. అర్థం కాకుంటే, నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ;-) (ఎందుకంటే, నేను రాయని ఆ మిగతా సగం నిజం ఏంటో నాకూ తెలీదు మరి.. నిజంగా..



+++++++++++++++++++++++

తుది గెలుపు ఏ దిక్కున దాగుందో..
ఎన్ని గమ్యాలకవతల అసలు ఆనందం అందుతుందో..
నేను మాత్రం తప్పకే చీకటిని అనుసరిస్తున్నాను.
ఆ సూర్యోదయం నన్ను వెతుక్కుంటోంది.. ప్రతీ రేయి.

+++++++++++++++++++++++

కరిగిపోయే క్షణానికేం తెలుసు.. కాలం విలువ..
తోడై తీసుకుపోయే మరణానికేం తెలుసు.. ప్రాణం విలువ..
పోగొట్టుకున్నదాని విలువ.. ఎంతో.. ఏమో..
ఎడతెగని వాదనకేం తెలుసు.. మౌనం విలువ.
హద్దులేని స్వార్థానికేం తెలుసు.. అనుబంధం విలువ.

(ప్రపంచ పదుల ప్రభావం)

+++++++++++++++++++++++

నాకు బోలుడంత ఒంటరితనం కావాలి..
ఎంతంటే, నేను కూడా లేనంత..
అది నీలో కాక మరెక్కడ దొరుకుతుంది.. ?

+++++++++++++++++++++++

నువ్వు గతంలోనే ఉండిపోతానంటే,
నేను తిరిగి బ్రతికేస్తాను ఆ నిన్నని.
మన కలయిక ఏదో ఒక రేపుకే సాధ్యమైతే,
అంతవరకూ నేను శిలనైపోతాను.. వేచిచూస్తూ.
ఈ క్షణం వరంగా నువ్వు దిగివస్తానంటే..
కాలాన్ని ఆపేస్తాను,.. ఇంక.

+++++++++++++++++++++++

గాయం కొత్త కాదు.. బాధే కొత్త..
కష్టం కొత్త కాదు.. కన్నీరే కొత్త..
ముళ్ళతో తోడొచ్చే ఈ బాటా కొత్త కాదు..
బెరుకుగా నాతో అడుగేస్తున్న నువ్వే కొత్త..

+++++++++++++++++++++++


ఇంతకు ముందు ప్రచురించిన చిట్టి పోట్టి కవితల పోస్ట్ లింక్: చిట్టి పొట్టి కవితలు - 3

4 comments:

  1. మీకు అర్థం అయితే ఆనందమే.. అర్థం కాకుంటే, నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ;-) --- idi evarni vudesinchi anaru ? naku teliyali :)

    ReplyDelete
  2. avi potti kavitalem kaadu gatti kavitale
    They are very good with a lot of poetry
    I wish you write more and more
    Good luck

    ReplyDelete
  3. రామానాయుడు గారు చక్కగా చెప్పారు.
    వంద దాటితే పుస్తకం వేయవచ్చు.
    అభినందనలు!

    ReplyDelete
  4. రామా నాయుడు గారు మరియు ఫణీంద్ర గారు, మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలండీ.

    సృజనా, ఆ లైన్ ఎవరినీ ప్రత్యేకం గా ఉద్దేశించి రాయలేదు.. ఎవరికైనా అలా అనిపిస్తే, అది కేవలం యాదృచ్చికం మాత్రమే. ;-)

    ReplyDelete