Saturday, May 28, 2011

అద్దాలు లేని ఊరు,. (కవితే కాబోలు)

మా చిన్న ఊరుకి వచ్చారు ఓ పెద్ద గురువు గారు..
నాలుగు రోజులు మాతోనే గడుపుతానన్నారు.
మంచి మాటలు ఎన్నో చెప్పారు.. పురాణాలు విశదీకరించారు.
ఓ సాయంత్రం, సభ అవ్వగానే, ఇంక వెళ్ళాలి అంటూ బయలుదేరారు.
బిక్క చచ్చిన జనం, వద్దు వద్దు అన్నారు..
మంచి కూడా వ్యసనమే మరి. ముఖ్యంగా వినడం..
మాతోనే మీరు అని పట్టుపట్టారు.
చిరునవ్వుతో ఆయన అన్నారు..
"మీరు నాకొక మాట ఇస్తే ఇంకొన్నాళ్ళు మీ ఊరిలోనే ఉంటాను.. "
మీకోసం ఏదైనా సరే అన్నాం ఒక్క గొంతుతో..
"మీ ఇళ్ళల్లో దర్పణాలని పగలగొట్టండి" అన్నారు ఆయన.
ఆశ్చర్యపోవడం ఇంక మా వంతు.
అయ్యో, ఎలా అలంకరించుకునేది..
ఎలా నా అందానికి గర్వపడేది.. ?
కానీ ఇచ్చిన మాటకి.. చెప్పినట్టే చేసాం మరి.

ఆయనా.. కొన్నాళ్ళు కాదు.. కొన్నేళ్ళు మాతోనే ఉన్నారు..
ఆరు నూరు అయ్యిందో ఏమో.. మా వాళ్ళు భలే మారిపోయారు.
ఇళ్ళల్లోమునుపు కంటే ప్రేమగా ఉంటున్నారు..
బయట నలుగురూ కలిస్తే ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు..
నాదీ నీదీ కాదు.. అంతా మనది అంటున్నారు..
ఆనందాన్ని కలసి పంచుకుంటున్నారు..
కష్టమొస్తే, ఒకరికొకరు నిలబడుతున్నారు.
మా ఐకమత్యానికి మురిసిందో ఏమో..
ధాన్య లక్ష్మి మా ఊరిలోనే కొలువు తీరింది.
ప్రతి ఇంటా సౌభాగ్యం.. ఆనందం వంద రెట్లు ఇప్పుడు.

ఎలా ఇంత మార్పు.. ఉండబెట్టుకోలేక.. అడిగేసాను నేను..
మా గురువు గారు అన్నారు..
"నాయనా.. మీరు అద్దాలతో పాటూ,
నేను అనే స్వార్థాన్ని.. అహంకారాన్ని వదులుకున్నారు..
అవి లేని చోటే.. సంతోషాలకి నెలవు"..
కొంచం అర్థం అయినట్టే ఉంది.

ఇది జరిగి ఇప్పటికి ఎన్నాళ్ళయిందో ఎవరికీ తెలీదు..
కానీ మా ఊరు.. ఇప్పటికీ.. అద్దాలకి ఆమడ దూరమే.

Monday, May 16, 2011

మా అసెంబ్లీ అద్దెకి ఇస్తున్నాం. మీకేమైనా, ఇంట్రెస్ట్ గానీ, లేక ఆసక్తి గానీ, ఉంటే చెప్పండి.. ;-)

మీకు ఈ విషయం ప్రాముఖ్యత అర్థం అవ్వాలంటే కాస్త ఫ్లాష్ బాక్ తప్పదు. కొన్నేళ్ళ క్రితం, ఓ అర్థరాత్రి మా కరుణ తాతగారిని బాగా కుమ్మి అరెస్ట్ చేసారు, ఏదో Fly-Over అక్రమాల కేసులో. ఆ అరస్ట్ కు సన్ టీవీ వాళ్ళు తమ రీ-రికార్డింగ్ నైపుణ్యం జోడించి, మన మీదకు వదిలారు. అప్పట్లో ఆ యాక్షన్ సినిమా ఒక మోస్తరు హిట్టే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, అదే ప్రాంతం లో, చరిత్ర లో నిలచిపోయేలా ఒక నిర్మాణాన్ని మా తాతగారు తలపెట్టారు. అలా మొదలైంది మా నూతన అసెంబ్లీ భవనం. నగరం నడిబొడ్డున, విశాలంగా, కళాత్మకం గా నిర్మింప బడింది. ఆ మధ్య ఎప్పుడో సోనియా గాంధీ అటువైపుగా వెళ్తుంటే, ఆవిడ చేత ప్రారంభం కూడా చేసామనిపించారు. (అప్పటికి పూర్తి అవ్వని భాగాలకి, తోట తరణి చేత సెట్టు వేయించిమరీ).

బళ్ళు ఓడలు అవుతాయి.. అలాంటప్పుడు, ఓడలు బళ్ళూ అవ్వకా తప్పదు. మా తమిళ తంబీలకి అయిదేళ్ళకోసారి, ఇలా మార్పు చెయ్యడం ఒక సరదా. ఇప్పుడు జయలలిత వంతు, ఆవిడ కి తాతగారి ప్లాను బాగా తెలుసు, అందుకే ఆ ఆసెంబ్లీ గట్టు కాదు, మెట్టు కూడా ఎక్కనని ఎప్పుడో ప్రతిజ్ఞ చేసింది. ఆ మాటకు కట్టుబడి, ఇప్పుడు అసెంబ్లీ వంక చూడను కూడా చూడనంది. మద్రాసు విశ్వవిద్యాలయం లో ప్రమాణ స్వీకారం చెయ్యాలని డిసైడ్ అయిపోయింది. సమావేశాలు, పాత అసెంబ్లీ లోనే మరి ఇంక. ఇదంతా బానే ఉంది, కానీ మరి కొత్త భవనం పరిస్థితి ఏంటి ? ఇక్కడే అసలు కామెడీ, ఏ బహుళ జాతి సంస్థకో అద్దెకి ఇస్తారంట.. కోరి కోరి ఎవడైనా కొరివితో తల గోక్కుంటాడా.. అనుమానమే. చవగ్గా ఇస్తామంటే మనం కూడా అద్దెకి తీసుకోవచ్చు అనుకోండి.. కానీ మరి అటాచ్డ్ బాత్రూం, టూ వీలర్ పార్కింగ్ వగైరా ఉన్నాయో లేవో. ఈ విషయం తెలిసినప్పటినుంచి ఇదే ఆలోచన నాకు, ఎవరికి అద్దెకిద్దాం అని.. పారదర్శకం గా ఉంటుందంటే, జయ టీవీ కి ఇవ్వచ్చు, లేక శశి కళ హోల్డింగ్స్ వారికో, ఇవ్వచ్చు, పెద్ద సమస్య ఏముంది.. కానీ ఈ భవన వాస్తు బాగో లేదని పుకార్లు ఉన్నాయి.. మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నేను మా ఆవిడని సలహా అడుగుతాను. మీకు తెలిసిందే. మా ఆవిడ ఉద్దేశం లో కళ్యాణ మండపం అయితే బేషుగ్గా ఉంటుంది. కానీ ఈ పెళ్ళిళ్ళ గురించి కరుణకున్న క్లారిటీ జయ కి లేదే.. నాకు ఇంకో అమోఘమైన ఆలోచన కూడా వచ్చింది, అయితే గియితే, తెలంగాణా వచ్చి, మన వాళ్ళకి ఇంకో అసెంబ్లీ కావాలనిపిస్తే, చెన్నై మన చిత్తూరు కి ప్రక్కనే కాబట్టి, ఎంచక్కా సమావేశాలు ఇక్కడ జరుపుకోవచ్చు. మన చెన్నై లో తెలుగు తిట్ల వాడుక పెరిగి, కాస్త భాషోద్ధరణా జరిగినట్టుంటుంది. ఏంటంటారు ?

ఏది అయితేనేం, ఇంతటితో ముగిస్తున్నాను. మీకేమైనా ఇంట్రెస్ట్ గాని.. లేక ఆసక్తి గాని.. లేక మరొకటి గాని.. ఉంటే.. నన్ను కాంటాక్టు చెయ్యడం మరవకండి. ఇదంతా ఎందుకు, జగనన్నయ్యకి గెస్ట్ హౌస్ క్రింద తీసి పడేయ్యచ్చు కదా అంటారా.., చెయ్యచ్చు .. కానీ.. తను ఇలా అద్దెకు తీసుకోవడం ఇష్టపడడు. తనకంతా చూసామా.. ఏ భూ పందేరానికో బదులుగా కొట్టేసామా అన్నట్టు ఉండాలి. మీకు తెలియంది ఏముంది ?

Friday, May 6, 2011

కోటి రూపాయల అవార్డ్ వద్దన్న అన్నా హజారే

కొన్ని రోజుల క్రితం, ఐఐపిఎం, ఈ ఏడాది రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి బహుమతిని అన్నా హజారే కి ప్రకటించింది. ఈ బహుమతికి గానూ, అన్నా కి ఒక కోటి రూపాయల నగదు పురస్కారం కూడా రావాల్సి ఉంది, కానీ అన్నా హజారే, నిన్ననే ఈ పురస్కారాన్ని తిరస్కరించారు. తాను కారణాలు ఇవ్వలేనని, కాని ఎందుకో తన మనసు ఈ అవార్డ్ స్వీకరించొద్దనే చెప్తోందని అన్నారు. ఈ వార్త విని నేను మాత్రం ఆనందించాను. అవినీతి పై పొరాటం లో తనకంటూ ఒక స్థాయిని, ముద్రని ఏర్పరుచుకున్న అన్నా, ఇలాంటి కార్పొరేట్ బహుమతులకి ఎంత దూరంగా ఉంటే, అంత మంచిది. నిజంగా ఎవరైనా ఆయనకి సాయమందించాలి అనుకుంటే, తాము కూడా ఆయనతో పాటు పాలు పంచుకొవాలని అనుకుంటే, అన్నా నడుపుతున్న సంస్థలకి విరాళం ఇవ్వచ్చు, లేక తమ తమ వృత్తుల్లో ఆయన సూచించిన విలువలను పాటించవచ్చు, నిస్సందేహం గా. అన్నా ఉద్యమ జీవితం ఈనాటిది కాదు, కానీ మీడియా ఫోకస్ మాత్రం ఇటీవల కాలం లో బాగా పెరిగింది, ముఖ్యం గా జన్ లోక్ పాల్ బిల్ పై అయన చేసిన నిరాహార దీక్ష వల్ల. ఆ క్రమం లో ఆయనకంటూ ఒక "బ్రాండ్ వాల్యూ" ఏర్పడింది ఇప్పుడు, అది అన్నా కోరుకున్నది కాకపోవచ్చు, కాని మీడియా కి అలాంటి సెలబ్రిటి కావాలి, వాళ్ళ పబ్బం గడుపుకోడానికి, నిజానికి మన దేశంలో "అవినీతే" అతి పెద్ద సెలబ్రిటి. మద్దెలచెరువు సూరిని, మొద్దు శీను ని, సెలబ్రిటి గా మార్చిన మన మీడియా కి అన్నా హజారే ని ఒక సెలబ్రిటి ని చెయ్యడం అస్సలు కష్టం కాదు కూడా. ప్రస్తుతానికి, ఆయనకు వచ్చిన ఫాలోఇంగ్ ని ఉపయోగించుకోడానికి భాజపా లాంటి రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు పొటీ పడుతున్నాయి. అదే సమయం లో, ఆయన మచ్చలేని చంద్రుడేమీ కాదని నిరూపించడానికి ప్రభుత్వం యత్నిస్తోంది. మన వంద (నూట ఇరవై ? ) కోట్ల ప్రజాస్వామ్యంలో, మంచి చెప్పడం, చెయ్యడం అంత సులువైన పనేమీ కాదు, అది అన్నా కి తెలియందీ కాదు. బురదలో ఆనందం గా దొర్లుతున్న పంది దగ్గరకు వెళ్ళి, ఇలా దొర్లకే, అంటే, అదేంచేస్తుంది ? ఓకే.. అలాగే.. ఆల్ రైట్.. అని మినరల్ వాటర్ తో స్నానం చెసి ఫ్రెష్ గా బయటకి వస్తుందా ? రాదు కదా.. మన రాజకీయాలు అంతకన్నా అధ్వాన్నం.

గుడ్డిలో మెల్ల, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఎమీ లేవు లేకపోతే, ఈ పాటికి, అన్నా హజారే 1938 లో టిక్కెట్ లేకుండా ప్రయాణించాడనో (ఆయన పుట్టింది 1940 లో :-)), లేక ఫలానా సభలో ఆయన కూర్చున్న కుర్చీ క్రింద నలిగి ఒక చీమ చచ్చిందనో.. లేక ఆయన ఆశ్రమంలో సీబీఐ చేసిన రైడ్ లో మారణాయుధమైన దోమల బాట్ దొరికిందనో.. ఎన్నో ప్రచారాలు జరిగేవి. ఇంక అవార్డ్ విషయానికొస్తే, అవార్డ్ వ్యకికి గుర్తింపు తేవాలి కాని, వ్యక్తి వల్ల గుర్తింపు తెచ్చుకోకూడదు. వచ్చే నెలా, రెండునెలల్లో, మనం ఇంకా కొన్ని అవార్డులు, మరికొన్ని డాక్టొరేట్లు అన్నా కి సులువుగా ఊహించచ్చు. కొన్నేళ్ళ క్రితం సరిగ్గా ఇలాంటి పరిస్థితే కలాం గారి కొచ్చింది, అయన ఇంక నాకు డాక్టొరేట్లు ఇవ్వద్దు మొర్రో అని అన్ని విశ్వవిద్యాలయాలకు మొర పెట్టుకున్నారు కూడా. ఈ సో కాల్డ్ సోషల్ యుగంలో, మంచి చెయ్యడం కంటే, మాట్లాడుకోవడం, ప్రోత్సహిస్తున్నట్టు కనపడడం ఒక ఫేషన్, ముఖ్యం గా ఎగువ మధ్య తరగతికి, సంపన్న వర్గాలకి. కాని చివరకు ఎవరి బ్రతుకైన మార్చేది చేతలే.. మాటలు కాదు..

మనలో మన మాట, మమోలుగానే ఐఐపిఎం పబ్లిసిటి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోదు, త్వరలో "ఐఐపిఎం లీడర్స్" అని ఒక ఐపిఎల్ టీం పెట్టినా మనం ఏమాత్రం ఆశ్చర్య పోనక్కర్లేదు.

Wednesday, May 4, 2011

ఇలా జరిగింది (ఈనాడు ఆదివారం కథ - మరియు నా గోల)

ఒక్కోసారి కొన్ని కథలు మనసును భలేగా హత్తుకుంటాయి. మొన్న ఈనాడు ఆదివారం లో వచ్చిన కథ "ఇలా జరిగింది", నాకు తెగ నచ్చేసింది. వలివేటి నాగ చంద్రావతి గారు ఇప్పటికే ప్రముఖ రచయత్రియేమో మరి నాకు తెలీదు., కానీ ఆవిడ ఈ కథలో వాడిన శైలి, పదప్రయోగం, మరియు ముఖ్యం గా కథ యొక్క శిల్పం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కథ చదవడానికి మామోలు గానే అనిపించినా, అంతర్లీనంగా, మానవ జీవితం లోని విభిన్న పార్శ్వాలను అబ్బురపరిచే రీతిలో స్పృశించారు. చెప్పాలనుకున్న విషయం కూడా లోతైనదే. కథ రెండు భాగాల్లో కనిపించింది నాకు; మొదటిది చాలా సాధారణం గా నడిచినట్టు అనిపించినా, మిగతా కథకి కావాల్సిన పునాదిని బాగా నిర్మించింది. ఇక, రెండో భాగానికొస్తే, సందర్భాలు, వివరణలు సరదాగా అనిపించాయి, నవ్వు తెప్పించాయి, కానీ కథ అయిపోయాక కూడా చాలా సేపు ఆలోచింప చేసాయి. ఇదంతా ఒక ఎత్తైతే, కొస మెరుపు అద్భుతం.

మీరు ఇంతవరకూ చదవకపోతే మాత్రం, ఖచ్చితం గా చదవండి, క్రింద అటాచ్ చేసాను. అసలు విషయం చెప్పనే లేదు, నాకు ఇంతగా నచ్చడానికి మరొక కారణం, మా ఆవిడ ఈ కథని నాకు చదివి వినిపించడం కాబోలు. :-)


మీరూ కథని చదివాక, ఈ నాలుగు వాక్యాలు చదవండి. (కథ చదివిన వెంటనే నాకు అనిపించినవి)

నాకూ, నా మిత్రుడికి, భగవంతుడు ఒక పరీక్ష పెట్టాడు. ఇద్దరినీ ఒక తెలియని ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. అడుగడుగునా ప్రమాదాలతో ఉన్న ఒక బాటని మేము దాటాలి. అష్ట కష్టాలూ పడి, కను రెప్ప కూడా వెయ్యకుండా, ఆచి తూచి అడుగులు వేసుకుని, నేను బాట చివరికి వచ్చాను, నా మిత్రుడు అప్పటికే నా ముందర ఉన్నాడు. మా ఎదురుగా ఒక ద్వారం ఉంది, దానికి అవతల ఎవరో మమ్మల్ని గట్టిగా పిలిస్తున్నారు. స్పష్టం గా కనిపించడం లేదు, మాట మాత్రం బాగా వినిపిస్తోంది. కానీ నేను ఉన్న చోటుకి ఆ ద్వారానికి మధ్య అంతా చీకటే. నేను ఆలోచిస్తున్నాను, ఎలా అడుగేసేది ?, ఈ లోగా నా మిత్రుడు దాటుకుని వెళ్ళిపోయాడు.. ఎవరో చెయ్యి పట్టుని తీసుకువెళ్ళినట్టు.. ఇది ఎలా సాధ్యం.. ? వాడికి భయం లేదా ? నేను ఇప్పుడు ఏంచెయ్యాలి ? ఈ లోగా ద్వారం మూసుకుపోతోంది.. నా మిత్రుడు ఎందుకో వెనక్కి తిరిగాడు.. నేను అరచానా ? వాడి కళ్ళు మూసుకుని ఉన్నాయి.. నాకు అర్థమయ్యింది, వాడిని చీకటి ఎందుకు ఆపలేకపోయిందో.. వాడి ముఖం అచ్చం నాలానే ఉంది.. ద్వారం మూసుకుపోయింది. నేనూ, ఆ చీకటీ అక్కడే ఉన్నాం.

(చదివిన కథకి, పై నాలుగు వాక్యాలకి, మీకు ఏమీ సంబంధం కనిపించకపోతే, మరోలా అనుకోకండి.. లైట్ గా తీసుకోండి.. ;-) )

సరదాగా ఇంకో మాట, ఇప్పుడు ఈ కథని నాలానే, మన ఈ టీవి మెగా హీరో - సుమన్ బాబు (హీరోలకి బాబు కామన్.. ) చదివి, అతనికీ ఈ కథ నచ్చి, ఒక ప్రీమియర్ షో తీసాడనుకోండి.. ఏమౌతుంది.. ? ఆయన ఏ పాత్ర చేస్తాడు.. ? మీరు మరీ అలా గోపాలు పాత్రలో, నిక్కర్లో, సుమన్ ని ఊహించుకుంటే, నేను కాదు.. ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడ లేడు..Monday, May 2, 2011

పాకిస్తాన్ కేంద్ర మంత్రిని చంపిన అమెరికా దళాలు.. ;-)

అవును.. మీరు సరిగ్గానే చదివారు. పాకిస్తాన్ తీవ్రవాద మరియు అంతర్గత రక్షణ శాఖా మంత్రి ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా సైన్యం ఒక ప్రత్యేక ఆపరేషన్ లో మట్టుపెట్టింది. పాకిస్తాన్ రాజధానికి అత్యంత సమీపంలో, ఆయన అధికార నివాసంలో జరిగిన ఈ సంఘటనలో, మరెవ్వరూ గాయపడినట్టు సమాచారం లేదు. ఒబామా, తీవ్రవాదం పై తమ దేశం చేస్తున్న యుద్ధం లో ఇది ఒక మైలు రాయిగా వర్ణించగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ సంఘటనని తీవ్రంగా ఖండించింది. ఇది ఖచ్చితంగా తమ సార్వభౌమాధికారాన్ని భంగ పరచడమే అని అభివర్ణించింది. కాల్పులు జరిగిన సమయం లో ప్రభుత్వ రక్షణ దళం, గ్రీన్ కమాండోలు అక్కడే ఉన్నా, వాళ్ళు రేడియో లో ఐపీయల్ కామెంటరీ వింటూ ఉండటం వల్ల, వెంటనే ఎదురు కాల్పులు చెయ్యలేకపోయినట్టు తెలుస్తోంది. ఇది యాదృచ్చికమా, లేక భారత్ హస్తం ఏమైన ఉందా అనే కోణం లో పాకిస్తాన్ ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టింది.

పరిస్థితి పై, అధికారికంగా స్పందించడానికి ప్రధాని నిరాకరించారు, రేపు వార్తాపత్రికలు చూసి గానీ తను ఏమీ చెప్పలేను అన్నారు; కానీ ఆయన కాఫీ తాగుతూ అన్న మాట విని మా ప్రతినిధి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే - "ఇది పూర్తిగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారం.. మరియు అమెరికా కి వెలుపలి వ్యవహారం కనుక, తాము స్పందించక్కర్లేదు అన్నారంట. కాకపోతే పరిణామాలని బాగా దగ్గరగా (అంటే బాగా క్లోజ్ గా అన్నమాట) పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు గానూ ప్రధాని కార్యాలం పై అంతస్థులో ఒక టెలిస్కోప్ ని కూడా అమర్చడానికి ఈ-టెండర్లు పిలుస్తున్నారంట.. "

ఇకపోతే, మా ప్రత్యేక ప్రతినిధి ఇస్లామాబాద్ నుంచి లైవ్ లో మొన్నామధ్య చెప్పిందేమిటంటే, ఆ కోటలో దాదాపుగా ఉన్న వాళ్ళందరూ లాడెన్ లానే ఉండటం వల్ల, అమెరికా దళాలు అసహనం వ్యక్తం చేసాయంట. మృతిచెందిన ఒక్క లాడెన్ కూడా, చస్తూ, చస్తూ, అల్లూరి సీతారామ రాజు రేంజ్ లో కొన్ని భారీ డైలాగులు చెప్పాడని, నిజంగానే ఆయన ప్రతి రక్తం చుక్క నుంచి ఒక లాడెన్ పుట్టాడని, పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇవన్నీ గాలివార్తలని (అంటే మన టీవి నైన్ వార్తల్లాంటివన్నమాట) అమెరికా కొట్టిపారేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, లాడెన్ చావడమే తమకు ముఖ్యమని.. ఎంతమంది లాడెన్లు ఉన్నారన్నది తమ ప్రాధాన్యం కాదని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. మన తానా వాళ్ళు కూడా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, కిరణ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియచేసారు. (ఇదే మరి కామెడి అంటే, సుబ్బరామి రెడ్డికి సన్మానం కూడా చెయ్యండి.. సరిపోతుంది..)


ఏది అయితేనేం, ఉగ్రవాదం పై పోరులో అమెరికా ఇంకో అడుగు ముందుకేసింది.. ఎటు వైపో నాకు మాత్రం ఏంతెలుసు, వాళ్ళకే తెలియనప్పుడు. కానీ, లాడెన్ మరణ వార్త విని, అమెరికా లోనూ, ఆఫ్గనిస్తాన్ లోనూ, ఒక పదిహేను మంది శతాధిక వృధ్ధులు మరణించినట్టు తెలుస్తోంది. (గ్లోబల్ వార్మింగ్ వల్లేమో ?) ఓదార్పు యాత్రకు ఎవరైన మన వాళ్ళు వెళ్తున్నారో లేదో ?