Monday, May 2, 2011

పాకిస్తాన్ కేంద్ర మంత్రిని చంపిన అమెరికా దళాలు.. ;-)

అవును.. మీరు సరిగ్గానే చదివారు. పాకిస్తాన్ తీవ్రవాద మరియు అంతర్గత రక్షణ శాఖా మంత్రి ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా సైన్యం ఒక ప్రత్యేక ఆపరేషన్ లో మట్టుపెట్టింది. పాకిస్తాన్ రాజధానికి అత్యంత సమీపంలో, ఆయన అధికార నివాసంలో జరిగిన ఈ సంఘటనలో, మరెవ్వరూ గాయపడినట్టు సమాచారం లేదు. ఒబామా, తీవ్రవాదం పై తమ దేశం చేస్తున్న యుద్ధం లో ఇది ఒక మైలు రాయిగా వర్ణించగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ సంఘటనని తీవ్రంగా ఖండించింది. ఇది ఖచ్చితంగా తమ సార్వభౌమాధికారాన్ని భంగ పరచడమే అని అభివర్ణించింది. కాల్పులు జరిగిన సమయం లో ప్రభుత్వ రక్షణ దళం, గ్రీన్ కమాండోలు అక్కడే ఉన్నా, వాళ్ళు రేడియో లో ఐపీయల్ కామెంటరీ వింటూ ఉండటం వల్ల, వెంటనే ఎదురు కాల్పులు చెయ్యలేకపోయినట్టు తెలుస్తోంది. ఇది యాదృచ్చికమా, లేక భారత్ హస్తం ఏమైన ఉందా అనే కోణం లో పాకిస్తాన్ ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టింది.

పరిస్థితి పై, అధికారికంగా స్పందించడానికి ప్రధాని నిరాకరించారు, రేపు వార్తాపత్రికలు చూసి గానీ తను ఏమీ చెప్పలేను అన్నారు; కానీ ఆయన కాఫీ తాగుతూ అన్న మాట విని మా ప్రతినిధి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే - "ఇది పూర్తిగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారం.. మరియు అమెరికా కి వెలుపలి వ్యవహారం కనుక, తాము స్పందించక్కర్లేదు అన్నారంట. కాకపోతే పరిణామాలని బాగా దగ్గరగా (అంటే బాగా క్లోజ్ గా అన్నమాట) పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు గానూ ప్రధాని కార్యాలం పై అంతస్థులో ఒక టెలిస్కోప్ ని కూడా అమర్చడానికి ఈ-టెండర్లు పిలుస్తున్నారంట.. "

ఇకపోతే, మా ప్రత్యేక ప్రతినిధి ఇస్లామాబాద్ నుంచి లైవ్ లో మొన్నామధ్య చెప్పిందేమిటంటే, ఆ కోటలో దాదాపుగా ఉన్న వాళ్ళందరూ లాడెన్ లానే ఉండటం వల్ల, అమెరికా దళాలు అసహనం వ్యక్తం చేసాయంట. మృతిచెందిన ఒక్క లాడెన్ కూడా, చస్తూ, చస్తూ, అల్లూరి సీతారామ రాజు రేంజ్ లో కొన్ని భారీ డైలాగులు చెప్పాడని, నిజంగానే ఆయన ప్రతి రక్తం చుక్క నుంచి ఒక లాడెన్ పుట్టాడని, పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇవన్నీ గాలివార్తలని (అంటే మన టీవి నైన్ వార్తల్లాంటివన్నమాట) అమెరికా కొట్టిపారేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, లాడెన్ చావడమే తమకు ముఖ్యమని.. ఎంతమంది లాడెన్లు ఉన్నారన్నది తమ ప్రాధాన్యం కాదని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. మన తానా వాళ్ళు కూడా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, కిరణ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియచేసారు. (ఇదే మరి కామెడి అంటే, సుబ్బరామి రెడ్డికి సన్మానం కూడా చెయ్యండి.. సరిపోతుంది..)


ఏది అయితేనేం, ఉగ్రవాదం పై పోరులో అమెరికా ఇంకో అడుగు ముందుకేసింది.. ఎటు వైపో నాకు మాత్రం ఏంతెలుసు, వాళ్ళకే తెలియనప్పుడు. కానీ, లాడెన్ మరణ వార్త విని, అమెరికా లోనూ, ఆఫ్గనిస్తాన్ లోనూ, ఒక పదిహేను మంది శతాధిక వృధ్ధులు మరణించినట్టు తెలుస్తోంది. (గ్లోబల్ వార్మింగ్ వల్లేమో ?) ఓదార్పు యాత్రకు ఎవరైన మన వాళ్ళు వెళ్తున్నారో లేదో ?

7 comments:

 1. హ్వాహ్వహ్వహ్ మొదటి పేరా చదివినంత సేపూ నిజమే అనుకుని సీరియస్గా చదివేశా ... తస్సాదియ్యా నన్ను బోల్తా కొట్టించారే.

  న్యూస్ అదిరింది, బాగా రాశారు ముఖ్యంగా గాలివార్తల టి.వి9 .. ఎక్కడో గుండెల్లో కలుక్కుమనిపించింది, మన జర్నలిస్టు బ్లాగర్లు ఒక్కొక్కరే కంటిముందు మెదిలారు.

  ReplyDelete
 2. >>>ఒక టెలిస్కోప్ ని కూడా అమర్చడానికి ఈ-టెండర్లు పిలుస్తున్నారంట..
  ఇందులో ఏ స్కాం బయటపడుతుందో. :))

  ReplyDelete
 3. మీ సెటైర్ కెవ్వు కేక

  ReplyDelete