Wednesday, May 4, 2011

ఇలా జరిగింది (ఈనాడు ఆదివారం కథ - మరియు నా గోల)

ఒక్కోసారి కొన్ని కథలు మనసును భలేగా హత్తుకుంటాయి. మొన్న ఈనాడు ఆదివారం లో వచ్చిన కథ "ఇలా జరిగింది", నాకు తెగ నచ్చేసింది. వలివేటి నాగ చంద్రావతి గారు ఇప్పటికే ప్రముఖ రచయత్రియేమో మరి నాకు తెలీదు., కానీ ఆవిడ ఈ కథలో వాడిన శైలి, పదప్రయోగం, మరియు ముఖ్యం గా కథ యొక్క శిల్పం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కథ చదవడానికి మామోలు గానే అనిపించినా, అంతర్లీనంగా, మానవ జీవితం లోని విభిన్న పార్శ్వాలను అబ్బురపరిచే రీతిలో స్పృశించారు. చెప్పాలనుకున్న విషయం కూడా లోతైనదే. కథ రెండు భాగాల్లో కనిపించింది నాకు; మొదటిది చాలా సాధారణం గా నడిచినట్టు అనిపించినా, మిగతా కథకి కావాల్సిన పునాదిని బాగా నిర్మించింది. ఇక, రెండో భాగానికొస్తే, సందర్భాలు, వివరణలు సరదాగా అనిపించాయి, నవ్వు తెప్పించాయి, కానీ కథ అయిపోయాక కూడా చాలా సేపు ఆలోచింప చేసాయి. ఇదంతా ఒక ఎత్తైతే, కొస మెరుపు అద్భుతం.

మీరు ఇంతవరకూ చదవకపోతే మాత్రం, ఖచ్చితం గా చదవండి, క్రింద అటాచ్ చేసాను. అసలు విషయం చెప్పనే లేదు, నాకు ఇంతగా నచ్చడానికి మరొక కారణం, మా ఆవిడ ఈ కథని నాకు చదివి వినిపించడం కాబోలు. :-)


మీరూ కథని చదివాక, ఈ నాలుగు వాక్యాలు చదవండి. (కథ చదివిన వెంటనే నాకు అనిపించినవి)

నాకూ, నా మిత్రుడికి, భగవంతుడు ఒక పరీక్ష పెట్టాడు. ఇద్దరినీ ఒక తెలియని ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. అడుగడుగునా ప్రమాదాలతో ఉన్న ఒక బాటని మేము దాటాలి. అష్ట కష్టాలూ పడి, కను రెప్ప కూడా వెయ్యకుండా, ఆచి తూచి అడుగులు వేసుకుని, నేను బాట చివరికి వచ్చాను, నా మిత్రుడు అప్పటికే నా ముందర ఉన్నాడు. మా ఎదురుగా ఒక ద్వారం ఉంది, దానికి అవతల ఎవరో మమ్మల్ని గట్టిగా పిలిస్తున్నారు. స్పష్టం గా కనిపించడం లేదు, మాట మాత్రం బాగా వినిపిస్తోంది. కానీ నేను ఉన్న చోటుకి ఆ ద్వారానికి మధ్య అంతా చీకటే. నేను ఆలోచిస్తున్నాను, ఎలా అడుగేసేది ?, ఈ లోగా నా మిత్రుడు దాటుకుని వెళ్ళిపోయాడు.. ఎవరో చెయ్యి పట్టుని తీసుకువెళ్ళినట్టు.. ఇది ఎలా సాధ్యం.. ? వాడికి భయం లేదా ? నేను ఇప్పుడు ఏంచెయ్యాలి ? ఈ లోగా ద్వారం మూసుకుపోతోంది.. నా మిత్రుడు ఎందుకో వెనక్కి తిరిగాడు.. నేను అరచానా ? వాడి కళ్ళు మూసుకుని ఉన్నాయి.. నాకు అర్థమయ్యింది, వాడిని చీకటి ఎందుకు ఆపలేకపోయిందో.. వాడి ముఖం అచ్చం నాలానే ఉంది.. ద్వారం మూసుకుపోయింది. నేనూ, ఆ చీకటీ అక్కడే ఉన్నాం.

(చదివిన కథకి, పై నాలుగు వాక్యాలకి, మీకు ఏమీ సంబంధం కనిపించకపోతే, మరోలా అనుకోకండి.. లైట్ గా తీసుకోండి.. ;-) )

సరదాగా ఇంకో మాట, ఇప్పుడు ఈ కథని నాలానే, మన ఈ టీవి మెగా హీరో - సుమన్ బాబు (హీరోలకి బాబు కామన్.. ) చదివి, అతనికీ ఈ కథ నచ్చి, ఒక ప్రీమియర్ షో తీసాడనుకోండి.. ఏమౌతుంది.. ? ఆయన ఏ పాత్ర చేస్తాడు.. ? మీరు మరీ అలా గోపాలు పాత్రలో, నిక్కర్లో, సుమన్ ని ఊహించుకుంటే, నేను కాదు.. ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడ లేడు..No comments:

Post a Comment