Friday, May 6, 2011

కోటి రూపాయల అవార్డ్ వద్దన్న అన్నా హజారే

కొన్ని రోజుల క్రితం, ఐఐపిఎం, ఈ ఏడాది రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి బహుమతిని అన్నా హజారే కి ప్రకటించింది. ఈ బహుమతికి గానూ, అన్నా కి ఒక కోటి రూపాయల నగదు పురస్కారం కూడా రావాల్సి ఉంది, కానీ అన్నా హజారే, నిన్ననే ఈ పురస్కారాన్ని తిరస్కరించారు. తాను కారణాలు ఇవ్వలేనని, కాని ఎందుకో తన మనసు ఈ అవార్డ్ స్వీకరించొద్దనే చెప్తోందని అన్నారు. ఈ వార్త విని నేను మాత్రం ఆనందించాను. అవినీతి పై పొరాటం లో తనకంటూ ఒక స్థాయిని, ముద్రని ఏర్పరుచుకున్న అన్నా, ఇలాంటి కార్పొరేట్ బహుమతులకి ఎంత దూరంగా ఉంటే, అంత మంచిది. నిజంగా ఎవరైనా ఆయనకి సాయమందించాలి అనుకుంటే, తాము కూడా ఆయనతో పాటు పాలు పంచుకొవాలని అనుకుంటే, అన్నా నడుపుతున్న సంస్థలకి విరాళం ఇవ్వచ్చు, లేక తమ తమ వృత్తుల్లో ఆయన సూచించిన విలువలను పాటించవచ్చు, నిస్సందేహం గా. అన్నా ఉద్యమ జీవితం ఈనాటిది కాదు, కానీ మీడియా ఫోకస్ మాత్రం ఇటీవల కాలం లో బాగా పెరిగింది, ముఖ్యం గా జన్ లోక్ పాల్ బిల్ పై అయన చేసిన నిరాహార దీక్ష వల్ల. ఆ క్రమం లో ఆయనకంటూ ఒక "బ్రాండ్ వాల్యూ" ఏర్పడింది ఇప్పుడు, అది అన్నా కోరుకున్నది కాకపోవచ్చు, కాని మీడియా కి అలాంటి సెలబ్రిటి కావాలి, వాళ్ళ పబ్బం గడుపుకోడానికి, నిజానికి మన దేశంలో "అవినీతే" అతి పెద్ద సెలబ్రిటి. మద్దెలచెరువు సూరిని, మొద్దు శీను ని, సెలబ్రిటి గా మార్చిన మన మీడియా కి అన్నా హజారే ని ఒక సెలబ్రిటి ని చెయ్యడం అస్సలు కష్టం కాదు కూడా. ప్రస్తుతానికి, ఆయనకు వచ్చిన ఫాలోఇంగ్ ని ఉపయోగించుకోడానికి భాజపా లాంటి రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు పొటీ పడుతున్నాయి. అదే సమయం లో, ఆయన మచ్చలేని చంద్రుడేమీ కాదని నిరూపించడానికి ప్రభుత్వం యత్నిస్తోంది. మన వంద (నూట ఇరవై ? ) కోట్ల ప్రజాస్వామ్యంలో, మంచి చెప్పడం, చెయ్యడం అంత సులువైన పనేమీ కాదు, అది అన్నా కి తెలియందీ కాదు. బురదలో ఆనందం గా దొర్లుతున్న పంది దగ్గరకు వెళ్ళి, ఇలా దొర్లకే, అంటే, అదేంచేస్తుంది ? ఓకే.. అలాగే.. ఆల్ రైట్.. అని మినరల్ వాటర్ తో స్నానం చెసి ఫ్రెష్ గా బయటకి వస్తుందా ? రాదు కదా.. మన రాజకీయాలు అంతకన్నా అధ్వాన్నం.

గుడ్డిలో మెల్ల, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఎమీ లేవు లేకపోతే, ఈ పాటికి, అన్నా హజారే 1938 లో టిక్కెట్ లేకుండా ప్రయాణించాడనో (ఆయన పుట్టింది 1940 లో :-)), లేక ఫలానా సభలో ఆయన కూర్చున్న కుర్చీ క్రింద నలిగి ఒక చీమ చచ్చిందనో.. లేక ఆయన ఆశ్రమంలో సీబీఐ చేసిన రైడ్ లో మారణాయుధమైన దోమల బాట్ దొరికిందనో.. ఎన్నో ప్రచారాలు జరిగేవి. ఇంక అవార్డ్ విషయానికొస్తే, అవార్డ్ వ్యకికి గుర్తింపు తేవాలి కాని, వ్యక్తి వల్ల గుర్తింపు తెచ్చుకోకూడదు. వచ్చే నెలా, రెండునెలల్లో, మనం ఇంకా కొన్ని అవార్డులు, మరికొన్ని డాక్టొరేట్లు అన్నా కి సులువుగా ఊహించచ్చు. కొన్నేళ్ళ క్రితం సరిగ్గా ఇలాంటి పరిస్థితే కలాం గారి కొచ్చింది, అయన ఇంక నాకు డాక్టొరేట్లు ఇవ్వద్దు మొర్రో అని అన్ని విశ్వవిద్యాలయాలకు మొర పెట్టుకున్నారు కూడా. ఈ సో కాల్డ్ సోషల్ యుగంలో, మంచి చెయ్యడం కంటే, మాట్లాడుకోవడం, ప్రోత్సహిస్తున్నట్టు కనపడడం ఒక ఫేషన్, ముఖ్యం గా ఎగువ మధ్య తరగతికి, సంపన్న వర్గాలకి. కాని చివరకు ఎవరి బ్రతుకైన మార్చేది చేతలే.. మాటలు కాదు..

మనలో మన మాట, మమోలుగానే ఐఐపిఎం పబ్లిసిటి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోదు, త్వరలో "ఐఐపిఎం లీడర్స్" అని ఒక ఐపిఎల్ టీం పెట్టినా మనం ఏమాత్రం ఆశ్చర్య పోనక్కర్లేదు.

No comments:

Post a Comment