Monday, May 16, 2011

మా అసెంబ్లీ అద్దెకి ఇస్తున్నాం. మీకేమైనా, ఇంట్రెస్ట్ గానీ, లేక ఆసక్తి గానీ, ఉంటే చెప్పండి.. ;-)

మీకు ఈ విషయం ప్రాముఖ్యత అర్థం అవ్వాలంటే కాస్త ఫ్లాష్ బాక్ తప్పదు. కొన్నేళ్ళ క్రితం, ఓ అర్థరాత్రి మా కరుణ తాతగారిని బాగా కుమ్మి అరెస్ట్ చేసారు, ఏదో Fly-Over అక్రమాల కేసులో. ఆ అరస్ట్ కు సన్ టీవీ వాళ్ళు తమ రీ-రికార్డింగ్ నైపుణ్యం జోడించి, మన మీదకు వదిలారు. అప్పట్లో ఆ యాక్షన్ సినిమా ఒక మోస్తరు హిట్టే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, అదే ప్రాంతం లో, చరిత్ర లో నిలచిపోయేలా ఒక నిర్మాణాన్ని మా తాతగారు తలపెట్టారు. అలా మొదలైంది మా నూతన అసెంబ్లీ భవనం. నగరం నడిబొడ్డున, విశాలంగా, కళాత్మకం గా నిర్మింప బడింది. ఆ మధ్య ఎప్పుడో సోనియా గాంధీ అటువైపుగా వెళ్తుంటే, ఆవిడ చేత ప్రారంభం కూడా చేసామనిపించారు. (అప్పటికి పూర్తి అవ్వని భాగాలకి, తోట తరణి చేత సెట్టు వేయించిమరీ).

బళ్ళు ఓడలు అవుతాయి.. అలాంటప్పుడు, ఓడలు బళ్ళూ అవ్వకా తప్పదు. మా తమిళ తంబీలకి అయిదేళ్ళకోసారి, ఇలా మార్పు చెయ్యడం ఒక సరదా. ఇప్పుడు జయలలిత వంతు, ఆవిడ కి తాతగారి ప్లాను బాగా తెలుసు, అందుకే ఆ ఆసెంబ్లీ గట్టు కాదు, మెట్టు కూడా ఎక్కనని ఎప్పుడో ప్రతిజ్ఞ చేసింది. ఆ మాటకు కట్టుబడి, ఇప్పుడు అసెంబ్లీ వంక చూడను కూడా చూడనంది. మద్రాసు విశ్వవిద్యాలయం లో ప్రమాణ స్వీకారం చెయ్యాలని డిసైడ్ అయిపోయింది. సమావేశాలు, పాత అసెంబ్లీ లోనే మరి ఇంక. ఇదంతా బానే ఉంది, కానీ మరి కొత్త భవనం పరిస్థితి ఏంటి ? ఇక్కడే అసలు కామెడీ, ఏ బహుళ జాతి సంస్థకో అద్దెకి ఇస్తారంట.. కోరి కోరి ఎవడైనా కొరివితో తల గోక్కుంటాడా.. అనుమానమే. చవగ్గా ఇస్తామంటే మనం కూడా అద్దెకి తీసుకోవచ్చు అనుకోండి.. కానీ మరి అటాచ్డ్ బాత్రూం, టూ వీలర్ పార్కింగ్ వగైరా ఉన్నాయో లేవో. ఈ విషయం తెలిసినప్పటినుంచి ఇదే ఆలోచన నాకు, ఎవరికి అద్దెకిద్దాం అని.. పారదర్శకం గా ఉంటుందంటే, జయ టీవీ కి ఇవ్వచ్చు, లేక శశి కళ హోల్డింగ్స్ వారికో, ఇవ్వచ్చు, పెద్ద సమస్య ఏముంది.. కానీ ఈ భవన వాస్తు బాగో లేదని పుకార్లు ఉన్నాయి.. మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నేను మా ఆవిడని సలహా అడుగుతాను. మీకు తెలిసిందే. మా ఆవిడ ఉద్దేశం లో కళ్యాణ మండపం అయితే బేషుగ్గా ఉంటుంది. కానీ ఈ పెళ్ళిళ్ళ గురించి కరుణకున్న క్లారిటీ జయ కి లేదే.. నాకు ఇంకో అమోఘమైన ఆలోచన కూడా వచ్చింది, అయితే గియితే, తెలంగాణా వచ్చి, మన వాళ్ళకి ఇంకో అసెంబ్లీ కావాలనిపిస్తే, చెన్నై మన చిత్తూరు కి ప్రక్కనే కాబట్టి, ఎంచక్కా సమావేశాలు ఇక్కడ జరుపుకోవచ్చు. మన చెన్నై లో తెలుగు తిట్ల వాడుక పెరిగి, కాస్త భాషోద్ధరణా జరిగినట్టుంటుంది. ఏంటంటారు ?

ఏది అయితేనేం, ఇంతటితో ముగిస్తున్నాను. మీకేమైనా ఇంట్రెస్ట్ గాని.. లేక ఆసక్తి గాని.. లేక మరొకటి గాని.. ఉంటే.. నన్ను కాంటాక్టు చెయ్యడం మరవకండి. ఇదంతా ఎందుకు, జగనన్నయ్యకి గెస్ట్ హౌస్ క్రింద తీసి పడేయ్యచ్చు కదా అంటారా.., చెయ్యచ్చు .. కానీ.. తను ఇలా అద్దెకు తీసుకోవడం ఇష్టపడడు. తనకంతా చూసామా.. ఏ భూ పందేరానికో బదులుగా కొట్టేసామా అన్నట్టు ఉండాలి. మీకు తెలియంది ఏముంది ?

1 comment: