Wednesday, June 29, 2011

సత్యసాయి బోధనలు.. ముఖ్యం గా ట్రస్టు సభ్యులకు..

(దీన్ని, నా పాత టపా కి అనుబంధ టపా గా భావించవచ్చు)

క్రిందివి కొన్ని సత్యసాయి బోధనలు.. ముఖ్యం గా ట్రస్టు సభ్యులకు.. (ఎవరైనా వారికి గుర్తు చేస్తున్నారో లేదో మరి.. )

తెలుగు వాడిని.. తెలుగు బ్లాగర్ ని అయిన నేను ఈ ఆంగ్ల భాష వాక్యాలను మిక్కిలి ఆవేదనతోనే పెడుతున్నాను. అనువాదం అసలు అర్థాన్ని పోగొట్టే ప్రమాదముంది, మరియు, ట్రస్టు సభ్యుల్లో ఆంధ్రేతరులు కూడా ఉండటం వలన, వారి సౌలభ్యం కోసం, ప్రస్తుతానికి అనువాద ప్రయత్నం చెయ్యలేదు. మరోలా అనుకునేరు..

We do not get what we desire, We get what we deserve.

To earn the goodwill of the Master, there is one recipe; obey His order without murmur. Grace is showered on all who obey instructions and follow order.

Life is just a chance to see for yourself your beginning and your end.

Man is born to share and serve, not to grab and grieve.

An educated man must realise that he has more obligations than privileges, more duty than right.

No one has a right to advise others unless he is already practicing what he preaches.

Don not come to me with your hands full of trash, for how can I fill them with Grace when they are already full. Come with empty hands, and carry away My Treasure, My Love.

I am Infinite, Immeasurable, Unique, and Incomparable, equal to Myself alone; I am My own Measure, Witness and Authority.

Avoid pomp, exhibition, and boasting. Be simple, sincere and sweet.

Learn to adapt adjust and accommodate.


( పోస్ట్ పెట్టక ముందే ఎవరో ట్రస్టు సభ్యులకు ఉప్పందించేసారు, ఒకాయన నాకు ఫోన్ చేసి, అయ్యా, ఇన్నాళ్ళూ మేము మీరు రాసిన ఆ రెండో వాక్యాన్ని పాటించే ఈ పరిస్థితి తెచ్చుకున్నాము అని వాపోయాడు.. ఏంచెప్పగలం.. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఆఖరి వాక్యాన్ని ఫాలో అయిపోండి ఇప్పుడు ఏంపోయింది.. అన్నా నేను.. ;-) )

Friday, June 24, 2011

పుట్టపర్తి విషయంలో నాకో క్లారిటీ వచ్చేసింది..

మొన్న మొన్నటి వరకూ పుట్టపర్తి అంటే నాకు సాయే.. అంతా ఆయనే..
కానీ ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. పుట్టపర్తి అంటే సత్యసాయే కాదు.. ఇంకా చాలా చాలా ఉంది.
మీ కళ్ళూ తెరిపిస్తాను.. ఉండండి మరి..


సత్యసాయి వేరు.. ట్రస్టు వేరు..
ట్రస్టు వేరు.. భక్తులు వేరు..
ట్రస్టు సొమ్ము వేరు.. భక్తులు ఇచ్చిన విరాళం వేరు..
సత్యజిత్ వేరు.. ట్రస్టు వేరు..
అలాగే మిగతా భక్తులు వేరు.. సత్యజిత్ వేరు..
శ్రీనివాసన్ వేరు.. రత్నాకర్ వేరు..
నిజానికి ట్రస్టు వేరు.. దాని సభ్యులు వేరు.
మిగతా మందిరాలు వేరు.. యజుర్వేద మందిరం వేరు..
ప్రభుత్వం వేరు.. చట్టం వేరు..
భక్తి వేరు.. ఆశయం వేరు..

బాబా ఉన్నప్పుడు పుట్టపర్తి వేరు..
బాబా లేనప్పుడు పుట్టపర్తి వేరు..

ప్రభుత్వానికి అది సంపద.. భక్తులకది నమ్మకం.. ట్రస్టుకది బాధ్యత.. వ్యక్తులకది అవకాశం.. మనలాంటి సామాన్యులకి అది ఓ చిదంబర రహస్యం.

Tuesday, June 21, 2011

ప్రేమించడం ఒక కళ

ప్రేమించడం ఒక కళ.. ఆ కళ తెలియడం ఒక వరం.

ప్రేమ అంటే ఏమిటి.. ఎందుకు మనం ప్రేమించాలి.. లేక ప్రేమింప బడాలి.. ఈ ప్రశ్న నన్ను అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటుంది. ఆ క్షణానికి నేను చెప్పుకునే సమాధానం కూడా మారుతూనే ఉంటుంది. అర్థం అయినా, అవ్వకున్నా, మన అనుభవం లో తెలుసుకున్నా.. లేకున్నా... ప్రతీమనిషి జీవితం లోనూ ప్రేమ అత్యంత ముఖ్యమైనదే.. నిస్సందేహంగా. ఎందుకంటే, అది అమితమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. (దూరం చేస్తుంది కూడా) చదువుకునే రోజుల్లో, నేను అనుకునే వాణ్ణి, "ప్రేమించడానికీ అర్హత కావాలని", అదే ఈ రోజుకీ నమ్ముతాను. మనకంటూ ఒక వ్యక్తిత్వం, గమ్యం/సామర్ధ్యం లేనప్పుడు, మన ప్రేమ ఎవరికీ అక్కర్లేకపోవచ్చు/ఉపయోగపడకపోవచ్చు కూడా. మన తెలుగు సినిమా హీరో లా, నేను కేవలం "ప్రేమించడం" మాత్రమే చేస్తాను అంటే, ఎవడికి కావాలి ఆ ప్రేమ ? ఈ మధ్య నాకు అనిపిస్తోంది.. "ప్రేమించడమూ ఒక కళే" అని. అందరూ జీవితంలో ప్రేమనే నింపుకోవాలనుకుంటారు, మరి అలాంటప్పుడు, కొందరి జీవితంలో ద్వేషమే ఎందుకు మిగిలిపోతుంది.. అందరూ ఉన్నా నిర్లిప్తత లోనే ఎందుకుండిపోతారు ? వాళ్ళకు ప్రేమించడం ఎలానో తెలీలేదు అని అనుకోవాలా ? జీవించడం ఒక కళ అయితే, ఆ జీవితాన్ని ప్రేమతో సుసంపన్నం చేసుకోవడమూ ఒక కళే కదా.. మా పిన్ని ఎప్పుడూ చెప్పేవారు.. "ప్రపంచాన్ని ప్రేమించడం చాలా తేలిక.. పక్కింటి వాడిని ప్రేమించడమే కష్టం" అని. నిజమే.


నా వరకూ నేను గ్రహించుకున్నవి.. (మీకు వేరే విధంగా అనిపించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు)


ఎవరినో ప్రేమించే ముందు.. మనల్ని మనం ప్రేమించుకోగలగాలి, అంటే నా ప్రేమను పొందగలిగే అర్హతను నేను కలిగిఉండాలి.

నేను ప్రేమిస్తున్నది నాకోసం, నా ఆనందం కోసం. (ఎదుట వ్యక్తి కి మనం ఎదో నిస్వార్థంగా ఇస్తున్నాం, అనేది, మన భ్రమ)

ప్రేమ ఉన్న చోట నమ్మకం, సహనం, బాధ్యత కూడా ఉండి తీరాలి. అప్పుడే అది కలకాలం నిలుస్తుంది.. మనల్నీ నిలబెడుతుంది.

మన యాంత్రిక జీవితాల్లో, అప్పుడప్పుడైనా, మన అనుభూతులను బయటకు వ్యక్తపరచడం ఎంతో అవసరం. వాటిని జీవితాంతం పదిలపరచుకోవడం కూడా.

ఎలాంటి బంధమైన, ఎప్పుడో అప్పుడు ఒడిదుడుకులను ఎదుర్కుంటుంది. అలాంటి తరుణంలో మన తప్పులను సరిదిద్దుకోవడం తో పాటూ, ఎదుట వ్యక్తి తప్పులను మనస్పూర్తిగా క్షమించగలగాలి.

జీవితంలో మార్పు సహజం.. గుండెలో పదిలంగా దాచుకున్న ప్రేమ మారకపోవచ్చు, కానీ వర్తమానాన్ని అంగీకరించే పరిణితి ప్రేమకుండాలి. జ్ఞాపకం ఎంత విలువైనది అయినా, కాలాన్ని ఆపలేదు కదా.. కరిగిన క్షణాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వలేదు కదా..


ప్రేమా.. జీవితమా అని ఎంచుకోవాల్సి వస్తే మాత్రం.. నేను జీవితాన్నే ఎంచుకుంటాను. (వీలున్నంతవరకూ అలాంటి పరిస్థితే రానివ్వను) ఎందుకంటే,.. ప్రేమ లేని జీవితానికి అర్థం లేకపోవచ్చు.. కానీ జీవితం లేని ప్రేమకు ఉనికే లేదు.

Friday, June 17, 2011

పనిమనిషి కష్టాలు (సినిమా కష్టాలు లాంటివి)

భాష, జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, కొత్త కొత్త వాడుకలు వస్తూ ఉంటాయి, వాక్య ప్రయోగాలూ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను ఒక సరికొత్త ఆవిష్కరణని పరిచయం చెయ్యబోతున్నాను. మీరందరూ ఈ వాక్య ప్రయోగాన్ని, అస్సలు మొహమాటం పడకుండా, ఫ్రీ గా.. వాడేసుకోవచ్చు.

అదేంటంటే..
అదేంటంటే..
అదేంటంటే..
..

(రెండు బ్రేకులు.. మూడు సార్లు ఇప్పటివరకూ ఉన్న హెడ్ లైన్స్ చెప్పిన తరువాత )

"పనిమనిషి కష్టాలు.. "
అవును ....
"పనిమనిషి కష్టాలు.. "

(పైన శీర్షిక లో రాసిన దానికి ఇంత హాడవిడి అవసరమా, అని మీకు అనుమానం రావచ్చు.. తప్పదు మరి, ఆ మాత్రం హైప్ లేకపోతే ఏంబావుంటుంది చెప్పండి, మీరు 30 మినిట్స్ చూడరా.. ఏమిటి ?)

ఓకే.. ఇంక మీకు నేను ఈ పదబంధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, అసలు దీని అర్థమేంటో వివరిస్తాను. మాకు తెలుసులేవోయ్, పని మనిషి కష్టాలు అంటే, పనిమనిషి రాకపోవడమో, లేక పూర్తిగా మానేయ్యడమో అని మీరు అనుకుంటే, మరి శరవణా భవన్ పొంగల్ లో కాలేసినట్టే. మీరు అనుకున్నది ఒక మోస్తరు నిజమే కాని, ఆ కష్టాలు వేరు, ఇప్పుడు నేను చెప్పే కష్టాలు వేరు. మీరొక క్షణం కళ్ళుమూసుకుని చదువుతూ ఉండండి.. (ఎందుకంటే.. అప్పుడే కదా నేను మీ కళ్ళు తెరిపించగలను).. ముందుగా, ఎలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం చేసుకోవచ్చో మీకు చెప్తాను.. ఫర్ సప్పోజ్, మీరు ఆవిడని (మీ ఆవిడనే) సినిమాకి తీసుకెళ్తానని మాటిచ్చారు అనుకోండి, కానీ సాయంత్రానికి మీకు ఎప్పటిలానే ఓపిక లేదు (భార్యతో కదా వెళ్ళాల్సింది.. ;-) ), అలాంటి సమయాల్లో, మీరు మీ ఆవిడని ఒప్పించుకోడానికి ఇలా అనచ్చు "ఏమోయ్, ఈ రోజు నాకు ఆఫీసులో బోలుడన్ని పనిమనిషి కష్టాలు వచ్చేయ్, అందుకని మనం సినిమా కి రేపు వెళ్దాం.. ". ఆవిడ ఒప్పుకుందా లేదా, అన్నది మీ అదృష్టానికి సంబంధించిన మేటర్ కాబట్టి, నేను మరీ వివరాల్లోకి పోను. మీకు ఇంకో మెరుగైన ఉదాహరణ ఇస్తాను, మీ క్రింద పనిచేసేవాడెవడైనా, ఓ ఫొను కొట్టేసి లీవ్ తీసుకున్నాడనుకోండి, మీరు మీ కొలీగ్ తొ ఇలా అనచ్చు.. "ఆ రమేష్ గాడు చూడు, పది గంటలకి ఫోన్ చేసి, ఏవో పనిమనిషి కష్టాలు చెప్తున్నాడు".

పై రెండు వాక్యాలతో మీకు విషయం అర్థం అయ్యే ఉంటుంది, కానీ నా భాద్యతగా ఇంకా వివరిస్తాను.

1. ఇవి చాలా భయంకరమైన కష్టాలు. మానవ మాత్రుడెవడూ పడలేనివి
2. కానీ ఒక్క రోజులోనో, మాహా అయితే రెండు రోజుల్లోనో తీరిపోతాయి.. కామెడీగా..
3. ఇవి మళ్ళీ మళ్ళీ రావని అస్సలు గ్యారంటీ లేదు. అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి.
4. కామెర్లు వచ్చి హాస్పిటల్ కి వెళ్ళడం (రెండో రోజే తగ్గిపోవాలి మరి), భర్త ఉద్యోగం పోవడం (వచ్చే నెల మళ్ళీపోతుంది), అబ్బాయికి బైకు ప్రమాదం. (వాడేమో ఉయ్యాల్లో ఉన్నాడు) తమ్ముడి కూతురు విశేషం.. (పదోసారి అనుకుంటా) వగైరా.. వగైరా..
5. ముఖ్యమైన విషయం ఏంటంటే, సానుభూతి కాదు.. షాక్ అయిపోయేలా ఉండాలి.. అదీ మెయిను..
6. SEI CMM ప్రమాణాల ప్రకారం, ఇది లెవెల్ - 5 టైపు. (అంటే ఎప్పటికప్పుడు మెరుగవుతూనే ఉంటుంది)

ఇంతకీ, నాకు ఇవన్నీ ఎలా తెలిసాయనే కదా మీ అనుమానం.. "జీవితమే ఒక పాఠం" మీకు తెలీదా ?

నేను ఇంత వివరంగా చెప్పాక కూడా మీకు అర్థం అవ్వకపోతే,... ఈసారి ఎప్పుడో మా పనిమనిషి తన మాటల్లో చెప్పినప్పుడే మీకు లైవ్ లో వినిపిస్తాను. టీవీ 9 రజిని కాంత్ టైప్ లో.. అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే మరి.. ప్రస్తుతానికి ముగిస్తున్నాను, మీరు సిగ్గులేకుండా, హ్యాపీగా ఈ పద ప్రయోగాన్ని వాడేసుకోండి.. ఏంపర్వాలేదు.. :-)

(ఏమోయ్.. అముద ఇవాళయినా వచ్చిందా....ఏంటీ..... వాళ్ళ ఏరియాలో వరదలా.. చెన్నైలో ఏ నదికబ్బా ? )

Wednesday, June 15, 2011

మీరు ఏమిట్లు ? సారీ.. మీది ఏ సామాజిక వర్గం ? :-)

కొన్నేళ్ళ క్రితం వరకూ, ఈ ప్రశ్నని నేను చాలా సార్లు ఎదుర్కున్నాను. ఏ ట్రైన్ లోనో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఏ పొరుగు ఊరిలోనో ఎదురుపడినప్పుడు. ఓ నాలుగు మాటలు అనంతరం, ఈ ప్రశ్న పడేది. మన రాష్ట్రం లో నేను ఉండక పోవడంవలనో, లేక టీవీ9 చెప్పిన మార్పు వచ్చేసిందో, ఈ మధ్య ఈ దర్యాప్తు కాస్త తక్కువే వింటున్నాను. కాకపోతే గత కొంత కాలంగా, "కులం" అనే మాటను వాడకుండా, స్టైల్ గా "సామాజిక వర్గం" అని పిలుచుకుంటున్నారు. మాట మారిందేమో కానీ, అసలు భావం అదే. రాజకీయ పార్టీలు కూడా, "సామాజిక న్యాయం" అని చెప్పి, తమను తాము ఆనందం గా అమ్ముకుంటున్నాయి. ఉదాహరణకి ఎవరైనా పెద్దమనిషి (అంటే మన బొత్స సత్తిబాబు లాంటి వాడు అన్నమాట), మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు, అని నొచ్చుకున్నాడనుకోండి, మనం ఆయన కులం గురించి చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. మంత్రి వర్గ విస్తరణలో, సామాజిక న్యాయం జరగలేదు అని పేపర్లోరాస్తే, అదేదో మన జీవితాలని మార్చే సరికొత్త న్యాయం అని మనం భ్రమ పడనక్కర్లేదు, "అన్ని కులాలకీ, డబ్బులొచ్చే పోస్టులు సరిగ్గా పంచలేదు" అని చదువుకోవాలి.

ఇందులో మనకున్న సౌలభ్యం ఏంటా, అంటే, మనం కులాల్ని రూపుమాపాం అని సంబరపడచ్చు. రాజకీయ పార్టీలు, మావి కుల రాజకీయాలు కాదు, మాదంతా సామాజిక న్యాయం అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఏ రాయిచ్చుకుని కొట్టుకుంటే ఏంటి, పళ్ళూడగొట్టుకోడానికి అనుకుంటే, మరి మీరు వెనకబడిపోతారు చూసుకోండి. ఇందులో చిక్కల్లా ఏంటంటే, కులం అంటే, మనం ప్రతిఘటించచ్చు, "సామాజిక వర్గం" అంటే మనం "అయితే ఓకే" అనాల్సి వస్తుంది.

నాకు తెలిసిన సమాజం వరకూ, మూడే వర్గాలు ఉన్నాయి. ధనికులు, మధ్య తరగతి, పేదలు. ధనికులు రాజకీయ నాయకులని కొనేస్తారు, పేదల్ని ఆ నాయకులు కొనేస్తారు.. నోటిచ్చో, సబ్సిడీ ఇచ్చో, లేక ఇంకా వీలైతే ఓ క్వార్టర్ ఇచ్చో. ఇంక మిగిలింది మధ్య తరగతి, వీళ్ళు ఎప్పుడో గానీ ఓటే వెయ్యరు. వీళ్ళు టీవీ లో మెగా సీరియల్సు, వార్తా కథనాలు, లోతైన విశ్లేషణలు, మరియు బాబాల దీక్షలూ చూస్తూ గడిపేస్తారు. ఈ మూడు వర్గాలకి ఎవడైనా న్యాయం చెయ్యగలడా, సమంగా చూడగలడా ? నిజంగా చెయ్యగలితే, అది కదా సామాజిక న్యాయం ?

ప్రస్తుతానికి నేనున్న తమిళ నాడు లో ఈ జాఢ్యం లేదనుకునేరు, ఆ మధ్య మా కొలీగ్ ఒకాయన, ఇల్లు అద్దెకి అడగడానికి ఓనర్ గారికి ఫోన్ చేస్తే, ఆయన ఇలాంటి పరిశోధనే మొదలుపెట్టాడంట, ఈయనికి చిర్రెత్తుకొచ్చి, నేను మీ ఇల్లు అడగడానికి ఫోన్ చేసాను, మీ అమ్మాయిని అడగడానికి కాదు అని చెప్పి ఫోన్ పెట్టేసాడంట.

Friday, June 3, 2011

చెడు స్నేహాలతోనే కష్టాలు - కరుణానిధి :-)

శ్మశాన వైరాగ్యం టైపులో అకస్మాత్తుగా, కరుణానిధి తాతగారికి స్నేహ బంధాలు బేరీజు వేసుకోవాలని అనిపించింది. తన పుట్టిన రోజు సందేశం లో ప్రముఖం గా, చెడు స్నేహాల వలనే కష్టాలు వస్తాయని చెప్పి మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసారు..(తను మాత్రం నల్ల కళ్ళజోడు తీయలేదు). కాంగ్రెస్ నే ఉద్దేశించి అన్నారని తమిళ కోళ్ళు కూస్తున్నాయి కానీ.. అసలు భావం అది కాదేమో అని నా గట్టి అభిప్రాయం. కనిమోళి జైలు లో ఉండటం వలన, మారన్ జైలు కి వెళ్ళే షేర్ ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండటం వలనా, వాళ్ళకి చెప్పాలనుకున్నది ఇలా పత్రికా ముఖంగా చెప్పారేమో అని నా డౌటు. ఇప్పుడు మీ పిల్లలెవరైనా కోరి తలనొప్పులు తెచ్చుకున్నారనుకోండి.. మీరు ఏంచెప్తారు, చెడు స్నేహాలు మానమని చెప్తారా లేదా. అలాగే మరి మా కరుణ తాతగారు కూడా చెప్పుకొచ్చారేమో అని నాకు అనిపిస్తోంది. ఎన్ని చెడు నేస్తాలు లేకపోతే, కని, గంటలు తరబడి బేరాలు కొనసాగించి రాజాకి టెలికాం మంత్రి పదవి దక్కించుకుంటుంది.. దయానిధి మూడు వందలకు పైచిలుకు ఫోను లైన్లు ఇంటికి వేయించుకుంటాడు.. అందుకని ఈ మాట మనం కనీని, దయనిధిని మార్చడానికే అన్నారని కూడా భావించ వచ్చు.

ఇప్పుడు అదే ఫీలింగు సోనియ మేడం కి ఉందనుకోండి, అందుకే DMK తో చెడు స్నేహం మానేసి, జయలలితతో మంచి స్నేహం మొదలుపెట్టే ఆలోచనలో ఉంది. రాజకీయాల్లో ఎన్నికల తరువాత, మంచి స్నేహాలు, చెడు స్నెహాలుగా మారుతూ ఉంటాయి, మనం దాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. ఉదాహరణకి, కొన్ని రోజుల్లో, మమతా కి కాంగ్రెస్ చెడు స్నేహం అనిపించచ్చు.. TRS కి BJP చెడు గా కనిపించనూ వచ్చు. విజయ కాంత్ కి జయలలిత స్నేహం చెడు గా మారి పీడకలలు తేవచ్చు. అందుకని మనం ఈ స్నేహాల గురించి పెద్దగా బాధ పడనక్కర్లేదు. డార్విన్ పరిణామ సిద్ధాంతం కూడా అదే చెప్తోంది మరి.. పులులు.. సింహాలూ... అవకాశం ఉంటే రాక్షస బల్లులు.. ఇలాంటి భయంకరమైన జీవాలు, వాటిలో అవికొట్టుకున్నా.. కలిసి కాపురం చేసినా ముచ్చటగానే ఉంటుంది. కానీ ఇందులో మనలాంటి లేడి పిల్ల సంబరపడటానికి, అదిరిపోడానికి ఏమీ లేదు. ఈ అడవిలో మనం ఉన్నది ఆ క్రూర జంతువుల ఆహారం గా చావడానికే గానీ, వాటి మధ్య బాంధవ్యాల గురించి బెంగ పడ్డానికి కాదు. మీకు ఇంతకంటే వివరంగా చెప్పడం నావల్ల కావడం లేదు.


ఇందులో ఇందులో కరుణానిధికి ఒక సౌలభ్యం ఉంది, వయసు పెరుగుతుంది కానీ, తగ్గదు కాబట్టి, వచ్చే యేడు, ఈ సందేశాల బాధ ఉండకపోవచ్చు. మరీ నమ్మకంగా చెప్పలేం లెండి, లీడరూ చిరాయువు అన్నారు అసలే.

సో ఇందుమూలంగా నే చెప్పేదేమింటంటే, మీరు కూడా మీకున్న చెడు స్నేహాలు మనేయండి. మంచిగా రాహుల్ తోనూ, జగన్ తోనూ, KTR ఇంకా వీలైతే జూనియర్ NTR తోనూ, స్నేహం చేసుకోండి.. పడుంటుంది.