Friday, June 3, 2011

చెడు స్నేహాలతోనే కష్టాలు - కరుణానిధి :-)

శ్మశాన వైరాగ్యం టైపులో అకస్మాత్తుగా, కరుణానిధి తాతగారికి స్నేహ బంధాలు బేరీజు వేసుకోవాలని అనిపించింది. తన పుట్టిన రోజు సందేశం లో ప్రముఖం గా, చెడు స్నేహాల వలనే కష్టాలు వస్తాయని చెప్పి మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసారు..(తను మాత్రం నల్ల కళ్ళజోడు తీయలేదు). కాంగ్రెస్ నే ఉద్దేశించి అన్నారని తమిళ కోళ్ళు కూస్తున్నాయి కానీ.. అసలు భావం అది కాదేమో అని నా గట్టి అభిప్రాయం. కనిమోళి జైలు లో ఉండటం వలన, మారన్ జైలు కి వెళ్ళే షేర్ ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండటం వలనా, వాళ్ళకి చెప్పాలనుకున్నది ఇలా పత్రికా ముఖంగా చెప్పారేమో అని నా డౌటు. ఇప్పుడు మీ పిల్లలెవరైనా కోరి తలనొప్పులు తెచ్చుకున్నారనుకోండి.. మీరు ఏంచెప్తారు, చెడు స్నేహాలు మానమని చెప్తారా లేదా. అలాగే మరి మా కరుణ తాతగారు కూడా చెప్పుకొచ్చారేమో అని నాకు అనిపిస్తోంది. ఎన్ని చెడు నేస్తాలు లేకపోతే, కని, గంటలు తరబడి బేరాలు కొనసాగించి రాజాకి టెలికాం మంత్రి పదవి దక్కించుకుంటుంది.. దయానిధి మూడు వందలకు పైచిలుకు ఫోను లైన్లు ఇంటికి వేయించుకుంటాడు.. అందుకని ఈ మాట మనం కనీని, దయనిధిని మార్చడానికే అన్నారని కూడా భావించ వచ్చు.

ఇప్పుడు అదే ఫీలింగు సోనియ మేడం కి ఉందనుకోండి, అందుకే DMK తో చెడు స్నేహం మానేసి, జయలలితతో మంచి స్నేహం మొదలుపెట్టే ఆలోచనలో ఉంది. రాజకీయాల్లో ఎన్నికల తరువాత, మంచి స్నేహాలు, చెడు స్నెహాలుగా మారుతూ ఉంటాయి, మనం దాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. ఉదాహరణకి, కొన్ని రోజుల్లో, మమతా కి కాంగ్రెస్ చెడు స్నేహం అనిపించచ్చు.. TRS కి BJP చెడు గా కనిపించనూ వచ్చు. విజయ కాంత్ కి జయలలిత స్నేహం చెడు గా మారి పీడకలలు తేవచ్చు. అందుకని మనం ఈ స్నేహాల గురించి పెద్దగా బాధ పడనక్కర్లేదు. డార్విన్ పరిణామ సిద్ధాంతం కూడా అదే చెప్తోంది మరి.. పులులు.. సింహాలూ... అవకాశం ఉంటే రాక్షస బల్లులు.. ఇలాంటి భయంకరమైన జీవాలు, వాటిలో అవికొట్టుకున్నా.. కలిసి కాపురం చేసినా ముచ్చటగానే ఉంటుంది. కానీ ఇందులో మనలాంటి లేడి పిల్ల సంబరపడటానికి, అదిరిపోడానికి ఏమీ లేదు. ఈ అడవిలో మనం ఉన్నది ఆ క్రూర జంతువుల ఆహారం గా చావడానికే గానీ, వాటి మధ్య బాంధవ్యాల గురించి బెంగ పడ్డానికి కాదు. మీకు ఇంతకంటే వివరంగా చెప్పడం నావల్ల కావడం లేదు.


ఇందులో ఇందులో కరుణానిధికి ఒక సౌలభ్యం ఉంది, వయసు పెరుగుతుంది కానీ, తగ్గదు కాబట్టి, వచ్చే యేడు, ఈ సందేశాల బాధ ఉండకపోవచ్చు. మరీ నమ్మకంగా చెప్పలేం లెండి, లీడరూ చిరాయువు అన్నారు అసలే.

సో ఇందుమూలంగా నే చెప్పేదేమింటంటే, మీరు కూడా మీకున్న చెడు స్నేహాలు మనేయండి. మంచిగా రాహుల్ తోనూ, జగన్ తోనూ, KTR ఇంకా వీలైతే జూనియర్ NTR తోనూ, స్నేహం చేసుకోండి.. పడుంటుంది.

1 comment: