Wednesday, June 15, 2011

మీరు ఏమిట్లు ? సారీ.. మీది ఏ సామాజిక వర్గం ? :-)

కొన్నేళ్ళ క్రితం వరకూ, ఈ ప్రశ్నని నేను చాలా సార్లు ఎదుర్కున్నాను. ఏ ట్రైన్ లోనో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఏ పొరుగు ఊరిలోనో ఎదురుపడినప్పుడు. ఓ నాలుగు మాటలు అనంతరం, ఈ ప్రశ్న పడేది. మన రాష్ట్రం లో నేను ఉండక పోవడంవలనో, లేక టీవీ9 చెప్పిన మార్పు వచ్చేసిందో, ఈ మధ్య ఈ దర్యాప్తు కాస్త తక్కువే వింటున్నాను. కాకపోతే గత కొంత కాలంగా, "కులం" అనే మాటను వాడకుండా, స్టైల్ గా "సామాజిక వర్గం" అని పిలుచుకుంటున్నారు. మాట మారిందేమో కానీ, అసలు భావం అదే. రాజకీయ పార్టీలు కూడా, "సామాజిక న్యాయం" అని చెప్పి, తమను తాము ఆనందం గా అమ్ముకుంటున్నాయి. ఉదాహరణకి ఎవరైనా పెద్దమనిషి (అంటే మన బొత్స సత్తిబాబు లాంటి వాడు అన్నమాట), మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు, అని నొచ్చుకున్నాడనుకోండి, మనం ఆయన కులం గురించి చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. మంత్రి వర్గ విస్తరణలో, సామాజిక న్యాయం జరగలేదు అని పేపర్లోరాస్తే, అదేదో మన జీవితాలని మార్చే సరికొత్త న్యాయం అని మనం భ్రమ పడనక్కర్లేదు, "అన్ని కులాలకీ, డబ్బులొచ్చే పోస్టులు సరిగ్గా పంచలేదు" అని చదువుకోవాలి.

ఇందులో మనకున్న సౌలభ్యం ఏంటా, అంటే, మనం కులాల్ని రూపుమాపాం అని సంబరపడచ్చు. రాజకీయ పార్టీలు, మావి కుల రాజకీయాలు కాదు, మాదంతా సామాజిక న్యాయం అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఏ రాయిచ్చుకుని కొట్టుకుంటే ఏంటి, పళ్ళూడగొట్టుకోడానికి అనుకుంటే, మరి మీరు వెనకబడిపోతారు చూసుకోండి. ఇందులో చిక్కల్లా ఏంటంటే, కులం అంటే, మనం ప్రతిఘటించచ్చు, "సామాజిక వర్గం" అంటే మనం "అయితే ఓకే" అనాల్సి వస్తుంది.

నాకు తెలిసిన సమాజం వరకూ, మూడే వర్గాలు ఉన్నాయి. ధనికులు, మధ్య తరగతి, పేదలు. ధనికులు రాజకీయ నాయకులని కొనేస్తారు, పేదల్ని ఆ నాయకులు కొనేస్తారు.. నోటిచ్చో, సబ్సిడీ ఇచ్చో, లేక ఇంకా వీలైతే ఓ క్వార్టర్ ఇచ్చో. ఇంక మిగిలింది మధ్య తరగతి, వీళ్ళు ఎప్పుడో గానీ ఓటే వెయ్యరు. వీళ్ళు టీవీ లో మెగా సీరియల్సు, వార్తా కథనాలు, లోతైన విశ్లేషణలు, మరియు బాబాల దీక్షలూ చూస్తూ గడిపేస్తారు. ఈ మూడు వర్గాలకి ఎవడైనా న్యాయం చెయ్యగలడా, సమంగా చూడగలడా ? నిజంగా చెయ్యగలితే, అది కదా సామాజిక న్యాయం ?

ప్రస్తుతానికి నేనున్న తమిళ నాడు లో ఈ జాఢ్యం లేదనుకునేరు, ఆ మధ్య మా కొలీగ్ ఒకాయన, ఇల్లు అద్దెకి అడగడానికి ఓనర్ గారికి ఫోన్ చేస్తే, ఆయన ఇలాంటి పరిశోధనే మొదలుపెట్టాడంట, ఈయనికి చిర్రెత్తుకొచ్చి, నేను మీ ఇల్లు అడగడానికి ఫోన్ చేసాను, మీ అమ్మాయిని అడగడానికి కాదు అని చెప్పి ఫోన్ పెట్టేసాడంట.

1 comment:

  1. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
    ఇట్లు నిర్వాహకులు

    ReplyDelete