Friday, June 17, 2011

పనిమనిషి కష్టాలు (సినిమా కష్టాలు లాంటివి)

భాష, జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, కొత్త కొత్త వాడుకలు వస్తూ ఉంటాయి, వాక్య ప్రయోగాలూ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను ఒక సరికొత్త ఆవిష్కరణని పరిచయం చెయ్యబోతున్నాను. మీరందరూ ఈ వాక్య ప్రయోగాన్ని, అస్సలు మొహమాటం పడకుండా, ఫ్రీ గా.. వాడేసుకోవచ్చు.

అదేంటంటే..
అదేంటంటే..
అదేంటంటే..
..

(రెండు బ్రేకులు.. మూడు సార్లు ఇప్పటివరకూ ఉన్న హెడ్ లైన్స్ చెప్పిన తరువాత )

"పనిమనిషి కష్టాలు.. "
అవును ....
"పనిమనిషి కష్టాలు.. "

(పైన శీర్షిక లో రాసిన దానికి ఇంత హాడవిడి అవసరమా, అని మీకు అనుమానం రావచ్చు.. తప్పదు మరి, ఆ మాత్రం హైప్ లేకపోతే ఏంబావుంటుంది చెప్పండి, మీరు 30 మినిట్స్ చూడరా.. ఏమిటి ?)

ఓకే.. ఇంక మీకు నేను ఈ పదబంధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, అసలు దీని అర్థమేంటో వివరిస్తాను. మాకు తెలుసులేవోయ్, పని మనిషి కష్టాలు అంటే, పనిమనిషి రాకపోవడమో, లేక పూర్తిగా మానేయ్యడమో అని మీరు అనుకుంటే, మరి శరవణా భవన్ పొంగల్ లో కాలేసినట్టే. మీరు అనుకున్నది ఒక మోస్తరు నిజమే కాని, ఆ కష్టాలు వేరు, ఇప్పుడు నేను చెప్పే కష్టాలు వేరు. మీరొక క్షణం కళ్ళుమూసుకుని చదువుతూ ఉండండి.. (ఎందుకంటే.. అప్పుడే కదా నేను మీ కళ్ళు తెరిపించగలను).. ముందుగా, ఎలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం చేసుకోవచ్చో మీకు చెప్తాను.. ఫర్ సప్పోజ్, మీరు ఆవిడని (మీ ఆవిడనే) సినిమాకి తీసుకెళ్తానని మాటిచ్చారు అనుకోండి, కానీ సాయంత్రానికి మీకు ఎప్పటిలానే ఓపిక లేదు (భార్యతో కదా వెళ్ళాల్సింది.. ;-) ), అలాంటి సమయాల్లో, మీరు మీ ఆవిడని ఒప్పించుకోడానికి ఇలా అనచ్చు "ఏమోయ్, ఈ రోజు నాకు ఆఫీసులో బోలుడన్ని పనిమనిషి కష్టాలు వచ్చేయ్, అందుకని మనం సినిమా కి రేపు వెళ్దాం.. ". ఆవిడ ఒప్పుకుందా లేదా, అన్నది మీ అదృష్టానికి సంబంధించిన మేటర్ కాబట్టి, నేను మరీ వివరాల్లోకి పోను. మీకు ఇంకో మెరుగైన ఉదాహరణ ఇస్తాను, మీ క్రింద పనిచేసేవాడెవడైనా, ఓ ఫొను కొట్టేసి లీవ్ తీసుకున్నాడనుకోండి, మీరు మీ కొలీగ్ తొ ఇలా అనచ్చు.. "ఆ రమేష్ గాడు చూడు, పది గంటలకి ఫోన్ చేసి, ఏవో పనిమనిషి కష్టాలు చెప్తున్నాడు".

పై రెండు వాక్యాలతో మీకు విషయం అర్థం అయ్యే ఉంటుంది, కానీ నా భాద్యతగా ఇంకా వివరిస్తాను.

1. ఇవి చాలా భయంకరమైన కష్టాలు. మానవ మాత్రుడెవడూ పడలేనివి
2. కానీ ఒక్క రోజులోనో, మాహా అయితే రెండు రోజుల్లోనో తీరిపోతాయి.. కామెడీగా..
3. ఇవి మళ్ళీ మళ్ళీ రావని అస్సలు గ్యారంటీ లేదు. అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి.
4. కామెర్లు వచ్చి హాస్పిటల్ కి వెళ్ళడం (రెండో రోజే తగ్గిపోవాలి మరి), భర్త ఉద్యోగం పోవడం (వచ్చే నెల మళ్ళీపోతుంది), అబ్బాయికి బైకు ప్రమాదం. (వాడేమో ఉయ్యాల్లో ఉన్నాడు) తమ్ముడి కూతురు విశేషం.. (పదోసారి అనుకుంటా) వగైరా.. వగైరా..
5. ముఖ్యమైన విషయం ఏంటంటే, సానుభూతి కాదు.. షాక్ అయిపోయేలా ఉండాలి.. అదీ మెయిను..
6. SEI CMM ప్రమాణాల ప్రకారం, ఇది లెవెల్ - 5 టైపు. (అంటే ఎప్పటికప్పుడు మెరుగవుతూనే ఉంటుంది)

ఇంతకీ, నాకు ఇవన్నీ ఎలా తెలిసాయనే కదా మీ అనుమానం.. "జీవితమే ఒక పాఠం" మీకు తెలీదా ?

నేను ఇంత వివరంగా చెప్పాక కూడా మీకు అర్థం అవ్వకపోతే,... ఈసారి ఎప్పుడో మా పనిమనిషి తన మాటల్లో చెప్పినప్పుడే మీకు లైవ్ లో వినిపిస్తాను. టీవీ 9 రజిని కాంత్ టైప్ లో.. అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే మరి.. ప్రస్తుతానికి ముగిస్తున్నాను, మీరు సిగ్గులేకుండా, హ్యాపీగా ఈ పద ప్రయోగాన్ని వాడేసుకోండి.. ఏంపర్వాలేదు.. :-)

(ఏమోయ్.. అముద ఇవాళయినా వచ్చిందా....ఏంటీ..... వాళ్ళ ఏరియాలో వరదలా.. చెన్నైలో ఏ నదికబ్బా ? )

1 comment:

  1. Amudha - Bangalakadali lo vachindamma........
    nado samudramo nakem telustundi nenemina chaduvukunana.....
    (denni tamil lo translate chesukuni chaduvukondi naku antha tamil radu)

    ReplyDelete