Wednesday, July 27, 2011

ట్వీట్లండీ ట్వీట్లు.. వేడి వేడిగా.. (స్టాకు పాతదీ.. పోస్టు కొత్తదీనూ)

సాయంత్రం, జన్మదిన శుభాకాంక్షలు చెప్దామని మా పిన్నికి ఫోన్ చేసాను. సంగతులన్నీ అయ్యాక, "ఏదో మౌనం మాట్లాడుతుందన్నావ్, ఎక్కడ్రా" అంది పిన్ని. అప్పుడు నాకు అర్థం అయ్యింది, మనం ఎంతో ఆతృతగా మొదలు పెట్టిన ట్విట్టెర్ పెద్దగా ఎవరి కళ్ళల్లోనూ, కాళ్ళల్లోనూ పడటం లేదని. అందుకని ఓ చిన్న సర్దుబాటు చేసుకున్నాను, నేటితో ఎలాగో ఓ పది మౌనాలు ట్వీటాం కాబట్టి, వాటన్నిటినీ కలిపి ఓ పోస్ట్ గా రాస్తున్నాను. ఈ పాత సరుకు కొత్త సీసా పద్దతి నాకూ పెద్దగా రుచిగా లేదు కానీ, తప్పడం లేదు. పండగ చేసుకోండి మరి.2G కుంభకోణంలో నాపేరు కూడా బయటపెట్టేస్తారేమో అని భయంగా ఉంది. నేనూ అదే సమయంలో ఓ రెండు ఫుల్ టాక్ టైం కార్డులు కొన్నాను.. పర్లేదు కదా.. ? ;-)
=================================

ఓటమిని అంగీకరించ లేకపోవడమూ అహంకారమేనా ?
=================================

కొన్ని మాటలు, కాలాన్ని గెలిచి మనసులో ఎప్పటికీ నిలచిపోతాయి. కానీ గుర్తొచ్చినప్పుడల్లా, ఓ కొత్త అర్థాన్ని ఇస్తాయి.
=================================

నన్ను నేను గెలవడానికి ఒక్క జీవితం సరిపోతుందా,... సరిపోక తప్పదేమో ?
=================================

ప్రతీ సమస్య కి ఒక పరిష్కారం ఉంటుంది. ఆంటే పరిష్కారం లేనిది సమస్య కాదన్నమాట. :-)
=================================

అమెరికా లో ఎన్ని తెలుగు సంఘాలున్నాయి ? మన రాష్ట్రం లో ఎన్ని కుల సంఘాలున్నాయి ? ;-)
=================================

మౌనం మాటలాడినప్పుడు.. మాటలకు అర్థం వెతక్కూడదు.. ఎందుకంటే భాష హృదయానిది కాదు..
=================================

వంద అబద్దాలు చెప్పైనా ఒక అబద్దాన్ని నిజం చెయ్యొచ్చు. కానీ ఎన్ని అబద్దాలు చెప్పి ఒక నిజాన్ని అబద్దం చెయ్యగలం ? ;-)
=================================

ప్రేమ విషయంలో మనం చేసే మొదటి పొరపాటు, ప్రేమంటే ఎదో పొందడం అని అనుకోవడం..
=================================

నేను కళ్ళు ఎప్పుడు తెరవాలి ? వెలుగు మనసుని తాకినప్పుడు.
=================================

Saturday, July 23, 2011

వరుణా.. సారీ.. తరుణనుకున్నా.. :-)

దొరికితేనే దొంగలు, అని అనుకునేవాణ్ణి నేను, ఎంత అమాయకుడినో చూడండి. ఇప్పుడు లేటెస్టు గా దొరికినా దొంగలు కాదు. దొరలే. మీకు అవకాశం ఉంటే, టీవీ9 స్టూడియో కి రావచ్చు, మీ నిర్ధోషిత్వాన్ని ప్రచారం చేసుకోవచ్చు, నిరూపించుకోవచ్చు కూడా. ఆరోజు 9pm యాంకర్ ఏంతేలిస్తే అదే ఫైనల్ మరి. (పోలీసులు, సాక్ష్యాలు , కోర్టులు.. అంతా దండగ)

నిజానిజాలు, వరుణ్ కీ తెలుసు.. తరుణ్ కీ తెలుసు..
ఖాన్ సారుకీ తెలుసు.. స్టీఫెన్ రవీంద్రకీ తెలుసు..

మనమే ఇక్కడ వెర్రి వెధవలం. :-) డౌటేం లేదు.

మనలో మన మాట, నిన్న రజిని కాంత్ లేడు షోలో లేకపోతే, నాటకం మరింత పండేది.

(వరుణ్ దోషికాకూడదనే నేనూ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే, డ్రగ్స్ కి బానిస అవ్వడం కంటే పెద్ద శిక్ష మరేముంది ? )

Tuesday, July 19, 2011

కొత్త ఉద్యోగాలు.. కొంగొత్త ఉద్యోగాలు (మరల రాని అవకాశం :-) )

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వం కొత్త ఉద్యోగాల రూపకల్పనలో పడినట్టు తెలుస్తోంది. నాకున్న సమాచారం ప్రకారం, మొదట విడత ఈ క్రింది పోస్టులను భర్తీ చేస్తారంట. మీకు ఆసక్తి ఉంటే, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను సంప్రదించగలరు.

(ఇవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలే కాకపోవచ్చు, ఎందుకంటే, ప్రయివేటు భాగస్వామ్యం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందిట. )


1. సంపద లెక్కింపు అధికారి : బంగారం, వజ్రాలు, పురాతన వస్తువులు, మరియు నగదు లెక్కింపు భాధ్యతలు చేపట్టగలగాలి. నైపుణ్యం బట్టి వేతనం. పూర్వానుభవం (ఆంధ్రాలో కానీ, కేరళలో కానీ) ఉన్నవారికి ప్రాధాన్యత. విద్యార్హతల పట్టింపు లేదు, కాని వయసు లెక్కింపు మొదలయ్యేటప్పటికి ముప్ఫై మించకూడదు, అలాగే లెక్కింపు ముగిసే నాటికి నూరు లోపూ ఉండాలి.


2. జాక్ (JAC) కన్వీనర్ - ఇది ప్రయివేటు భాగస్వామ్యంతో నడుస్తుంది. జాక్ లో ఉన్న సంస్థల మధ్య సమన్వయం, మరియు ప్రభుత్వంతో చర్చల భాద్యత. ఉద్యమ నేపధ్యం ఉంటే ప్రాధాన్యం. కనీస విద్యార్హత - Ph.D (మూడు నాలుగు పీజీ లు తప్పక కలిగి ఉండాలి)


3. రాహుల్ రాజకీయ సలహాదారు - రాహుల్ ని ప్రధాని గా చూడాలి అనే ఏకైక లక్ష్యం కలిగి ఉండాలి. ఆయన కారణ జన్ముడని ఒప్పుకోగలగాలి. రాజకీయ అనుభవం కనీసం ఓ ఎనభై ఏళ్ళు తప్పదు. ఇటలీ భాషలో ప్రవేశం ఉంటే ప్రాధాన్యత. (జీవితంలో ఇప్పటివరకూ నరేంద్ర మోడీనీ, మాయవతిని కలిసి ఉండరాదు) జోల పాటలు పాడటం, డైపర్ మార్చడం వచ్చి ఉండాలి. (విద్యార్హత - NA )


4. మంత్రి మండలి సంధాన కర్త ( మంత్రి మండలిని జైళ్ళతో అనుసంధానం చెయ్యగలగాలి) కొత్తగా మంత్రి వర్గంలోకి ఎవరు వచ్చినా, వెంటనే తీహార్ జైల్ లో ఒక డీలక్స్ రూము బుక్ చేసి పెట్టడం, భవిష్యత్తులో ఖాళీ భర్తీకి ప్లాను చేసుకోవడమూ.. వగైరా.. వగైరా.. విద్యార్హత- నిశాని అయి ఉండాలి, వీరప్పన్ లేక ఫూలన్ ఆంతరంగికులు మాత్రమే దరఖాస్తు చెయ్యగలరు.


5. మానసిక వైద్య నిపుణుడు - ఇది వెను వెంటనే అవసరం (అంటే యుద్ధ ప్రాతిపదికన అన్నమాట), మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ పెద్దలకు వైద్యాన్ని అందించాలి. ముఖ్యంగా, ప్రధాని మంత్రి వర్గ సహచరులు అయిన దిగ్విజయ్ సింగ్, ఆజాద్, జై రాం రమేష్ తదితరులకు. ఏదైనా ప్రముఖ పిచ్చాసుపత్రిలో పని చేసిన అనుభవం తప్పనిసరి. (మీరు ఇప్పటికే మణిశంకర్ అయ్యర్ కి చికిత్స చేసారా.. అలా అయితే, మేము మీకోసమే వైటింగ్ ఇక్కడ.. )


(పైన ప్రస్తావించబడిన అర్హతలు మీకున్నాయా, మీరు ఇన్నాళ్ళూ ఇలాంటి ఉద్యోగం కోసమే కలలు కంటున్నారా ? మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ కలలను నిజం చేసుకోండి.. దూసుకుపోండి అంతే. )

Wednesday, July 13, 2011

అమ్మ మార్కు పాలన

ప్రక్క ప్రక్కనే ఉన్నా, మన రాష్ట్రానికి, తమిళ నాడుకి చాలా తేడా ఉంది. ముఖ్యం గా పరిపాలన విషయంలో. మన ఊరిలో ప్రభుత్వం, ప్రతిపక్షం, టీవీ ఆన్లో ఉన్నప్పుడు ముచ్చటగా కొట్టుకున్నా, తరువాత బానే కలసిపోతారు. సొమ్ములు కూడా బానే పంచుకుని స్వాహా చేస్తారు. ఎప్పుడో మరీ మీడియా లో పొక్కితే తప్ప, ఒకరిమీద మరొకరు కేసులు పెట్టుకోరు. పొరపాటున పెట్టినా, అవి వీగిపోయేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తం మీద ఒక జట్టు లా మన అభ్యున్నతి కోసం కలిసి పని చేస్తారు. కాని తమిళ నాడులో అలా కాదు ముందరి ప్రభుత్వంలో అధికారాన్ని ఆస్వాదించిన అందరికీ, ప్రభుత్వం పడిపోయిన వెంటనే ముచ్చమటలే. ఎక్కడైన దొరికారో ఇంక అంతే సంగతులు. మొన్నటి వరకూ రాజరిక హోదాని అనుభవించిన కరుణ కుటుంబం.. బంధువర్గం.. (అంటే రాష్ట్ర జనాభాలో ఓ సగం వేసుకోండి.. ;-) ) ఇప్పుడు మూడు చెరువుల నీళ్ళూ తాగుతున్నారు. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. అమ్మ పదవిలోకి వచ్చిన వెంటనే, కలర్ టీవీ లాంటి, కరుణ మార్కు పథకాలకు మంగళం పలికింది. మిక్సీలు, గ్రైండర్ల పథకాలు రెడీ అవుతున్నాయి. ఆయన ఫొటోలూ, రాతలు, వగైరాలు తీయించేయడం ఎలానో ఉన్నదే. గత ప్రభుత్వం పని కట్టుకుని అటకెక్కించిన ప్రభుత్వ కేబుల్ టీవీ కి మళ్ళీ ఊపిరి పోస్తున్నారు, ఇది సన్ టీవీ నెట్ వర్క్ ని భూ స్థాపితం చెయ్యడానికే. ఎవరో డిస్ట్రిబ్యూటర్ (జయ ఇచ్చిన లాండ్ లో ఆయన ఏమైన మల్టిప్లెక్స్ కట్టాడేమో మనకి తెలీదు మరి) పెట్టిన చీటింగ్ కేసులో ఇప్పటికే కళానిధి మీద సమన్లు జారీ అయ్యాయి. గోరు చుట్టు పై రోకలి పోటు అమ్మ స్టైలు, లేకపోతే అసలు ఈమధ్య పత్తాలేని రంజిత వచ్చి ఇప్పుడు సన్ టీవీ మీద కేసు పెట్టడమేమిటి.. అమ్మ పాలనలో ఇలాంటివన్ని కామన్. సడన్ గా, టీటీకే రోడ్డులోనూ, సిపీ రామసామి రోడ్డులోనూ వన్ వే నిబంధనలు తొలగించేసారు.. మళ్ళీ అవి రద్దీతో కిటకిట లాడుతున్నాయి. ఆ రెండు రోడ్లు స్టాలిన్ ఇంటి ప్రక్క రోడ్లని నేను మీకు వేరేగా చెప్పనక్కర్లేదు. మొన్నెప్పుడో గోపాలపురం వైపు వెళ్ళినప్పుడు చూసాను, ఎంతో హడవిడిగా ఉండే తాతగారి ఇల్లు రోడ్డు, ఒక చెత్త లారీతో కంపుకొడుతూ ఉంది. ఒక్క హోంగార్డు కూడా దరిదాపుల్లో కనిపించలేదు. టీ తాగడానికి అలా పోయెస్ గార్డెన్ వైపు వెళ్ళుంటాడనుకోండి. నా లెక్క ప్రకారం మరో ఆరు నెలల్లో కరుణానిధి కూడా జైల్లొనే ఉంటాడు. ఆయన అదృష్టం బావుంటే ఈలోగా ముక్తి లభించవచ్చు. జయలాంటి CM మన రాష్ట్రంలో ఉంటే ఈ పాటికి జగన్ అంతు తేలిపోయేది. ప్రస్తుతానికి మాత్రం కరుణానిధి కుటుంబం చట్ట ప్రకారం నడుచుకోవడం చాలా ముఖ్యం. అంటే ఉదాహరణకి, కరెంటు బిల్లులు వెంటనే కట్టేసుకోవడం (పాత బకాయిలు తీర్చేసుకుంటే ఇంకా మంచిది), పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలని నిలపడం, పాలిథిన్ కవర్లు ఎక్కువ వాడకపోవడం వగైరా.. వగైరా.. లాంటివన్నమాట. ఎందుకంటే ఏ కేసులోనైనా దొరికారా.. మళ్ళీ అధికారంలోకి వచ్చేవరకూ, స్వేచ్చగా ఆకాశం చూడకపోవచ్చు. మనం కూడా సన్ టీవీ కి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది.

సో మొత్తం మీద పంచ్ లైన్ మాత్రం ఇదే - అమ్మ ఎవరికైనా అమ్మే కానీ.. తాతకు మాత్రం కాదు.. ;-)

(అయినా ఉట్టినే అనలేదు ఈ మాట -- "The female of the species is more deadly than the male")

Sunday, July 10, 2011

మౌనం మాటలాడినప్పుడు..

అప్పుడప్పుడు ఒక చిన్న ఆలోచన మనసులో మెదులుతుంది, సరిగ్గా మౌనం ఇంక మాటలాడదాం అని అనుకున్నప్పుడు. ఆ ఆలోచనని ఎక్కడో రాసుకుని దాచుకునే లోపు, కనీసం గుండె పొరల్లో పదిల పరచుకునే లోపు, క్షణాల కెరటాల ఆత్రుతల మధ్య ఎక్కడో, ఎక్కడికో కొట్టుకు పోతుంది. అది ఏ ఒంటరి తీరం చేరుతుందో మరి..

అలాంటి ఆలోచనలని బ్లాగు పోస్టుగా వేసుకుందామంటే మొహమాటం (ఆగ్రిగేటర్ల పుణ్యమా అని), అంత అర్థవంతం గా కూడా ఉండకపోవచ్చు. అందుకు, ట్విట్టర్ సౌకర్యంగా ఉంటుందని అనిపించి, ఒక అకౌంట్ తెరిచి దాన్ని నా బ్లాగుకు జత చేసాను ("మౌనం మాటలాడినప్పుడు.." - అనే పేరుతో). ఆసక్తి వున్నవాళ్ళు ఓ లుక్కు వేస్తూ ఉండండి.

(వీలైనంత వరకూ తెలుగు లోనే రాస్తాను, ఎపుడైనా ఆంగ్ల వాక్యాలు లేక ఆంగ్ల లిపిలో తెలుగు మాటలూ, కనిపిస్తే మరోలా అనుకోకండి. భావం ప్రధానం కదా.. ;-) )

Friday, July 8, 2011

శ్రీకృష్ణ కమీషన్ ఏంసాధించింది ?

మీకు కొత్తగా ఏదో చెప్పాలని కాదు, నా బుర్ర నెమ్మద పరచుకోడానికి.. అంతే.

తెలంగాణాలో సొంత రాష్ట్రం కావాలనే భావన బలంగా ఉంది. అన్ని వర్గాల్లోనూ ఆ ఆకాంక్ష రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, మరీ ముఖ్యంగా డిసెంబరు 9 ప్రకటన తరువాత. రాష్ట్రం వస్తే వాళ్ళ బ్రతుకులు మెరుగౌతాయనే నమ్మకం ఎంతవరకూ నిజమో కాలమే నిర్ణయించాలి. ఆంధ్ర ప్రాంతంలో, అసలు సమస్య/భయం, హైదరాబాదు గురించే. అంతకు మించి తెలంగాణా ఏర్పాటుతో కొత్తగా వచ్చేది.. పోయేదీ వారికి ఏమీ లేదు. తెలంగాణా ఇవ్వద్దని రోడ్డెక్కిన వారిలో చాలా మందికి తెలంగాణా జిల్లా పేర్లే సరిగ్గా తెలీవు. ఈ పరిస్థితిలో ఏకాభిప్రాయం రావాల్సింది హైదరాబాదు మీదే. ఓ ఏడాది కాలం వృధా చేసిన శ్రీకృష్ణ కమీషన్, అసలు విషయం పై ధ్యాస పెట్టకుండా, ఓ ఆరు కొత్త సూత్రాలను ప్రజల్లోకి వదిలింది. దాని వల్ల అణువంతైనా ప్రయోజనం చేకూరిందా ? రాష్ట్రమంతా కలియ తిరిగి కమీషన్ తేల్చింది, సాధించింది శూన్యం. నా అవగాహన వరకు, ఈ తరుణంలో ఏ కమీషన్, ఏ ఒక్క వ్యక్తీ నిర్ధారించి. నిర్ణయించేదీ ఏమీ లేదు. కనీసం, ఉద్యమ పార్టీలు వచ్చిన గత దశాబ్ధంలో అయినా, తెలంగాణా లో నిజమైన అభివృద్ది చేసి వాళ్ళు చెప్పేది తప్పు అని ప్రభుత్వం నిరూపించ గల్గిందా ? లేక.. నిధులన్నీ హైదరాబాదులోనే పొయ్యకుండా, రాష్ట్రంలో కానీసం మరో రెండు నగరాలని భాగ్యనగరానికి దీటుగా ముందుకు తీసుకెళ్ళిందా ? రెండూ జరగలేదు. దశాబ్ధాలు గడిచినా ప్రజల అభిప్రాయాలు/భయాలు మారలేదంటే, దానికి కారణం మనల్ని పాలిస్తున్న పాలకులది కాక మరెవరిది ? మరియు, అలాంటి పాలకులకు పట్టం కట్టిన మనదీను.

ఏది అయితేనేం, వాదనలతోనూ, లేక అధికారంతోనూ సమస్యని పరిష్కరించే స్థాయి దాటిపోయింది, అంత సామర్ధ్యం ఉన్న నాయకులూ లేరు ఇప్పుడు. నాకు తెలిసినంత వరకూ, రెండు ప్రాంతాల వారి ప్రతినిధులను కూర్చోబెట్టి అర్థవంతంగా చర్చించడమే మార్గం. చర్చల గురించి హోం మంత్రిగా అనుభవం కూడా వున్న జానా రెడ్డి ఎలాగో మన వ్యవహారాన్ని సరిహద్దు దేశాలతో పోల్చనే పోల్చాడు, అసలు నైతికతే లేని పాక్ తోనే చర్చిస్తున్నప్పుడు, ఒకే జాతిగా ఉన్న మనం, ఎందుకు చర్చించుకోలేం ? ఒక అరవై శాతమైన ఏకాభిప్రాయనికి వస్తే, మిగతా భాగం ప్రభుత్వం నిర్ణయం తో ఒప్పించవచ్చు నొప్పించకుండా. అసలు చర్చే లేకుండా నిర్ణయిస్తే మాత్రం, సమస్య పరిష్కారం కాదు కదా, ఇంకా జటిలం అవుతుంది. డిసెంబరు ప్రకటనలతో జరిగింది అదే.

అయినా, రాహుల్ గాంధి అలా ఉత్తర ప్రదేశ్ పొలాల్లో తిరక్క పోతే, ఇంత పెద్ద సమస్యని ఒక కొలిక్కి తేవచ్చు కదా. ప్రధాని అవ్వడానికి తన బయో డేటా లో కూడా పెట్టుకోవచ్చు. మనమేమైనా కాదంటామా. హైదరాబాదుని హాంగ్ కాంగ్ చేస్తామంటున్నారు, మరి అలా అయితే, వైజాగ్ ఇంక సింగపూరే, సందేహమే లేదు. ఆదిలాబాదు, విజయనగరం మాత్రం ఆదిలాబాదు, విజయనగరం గానే ఉంటాయి ఎప్పటికీ. మీరు వర్రి అవ్వకండి. మన అదృష్టాలు అలాంటివి మరి.

(ఇంకో కామెడీ ఏంటంటే, ఇన్నేళ్ళుగా చెన్నై లోనే ఉన్నాను, ఇంక మా భాగ్యనగరానికి ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని మా బాసుని అడిగితే, అసలే అక్కడంతా గొడవలు.. ఏం వెళ్ళక్కర్లేదు అన్నాడు.. ఒళ్ళు మండి, అవన్ని మా ఇంటి గొడవలు, మీరు బాధ పడకండి, మాలో మేము తీర్చుకుంటాం ఆన్నా.. ఆ మాటైతే అన్నాను కానీ, ఎక్కడో డౌటుగానే ఉంది.. ఎందుకంటారు ? )

Friday, July 1, 2011

ఒకటీ.. రెండు, మూడు.. తరువాత నాలుగు.. అయిదూ. తరువాత నా మొహం..

ఈ లేటు వయసులో, ఇప్పుడు మీకు అంకెలు ఎందుకు చెప్తున్నానా అని మీ అనుమానం ? ఏ చానల్ పెట్టినా ఇదే గోల మరి, ఏంచెప్పమంటారు. మొదటి పదిలో పదిహేను ర్యాంకులు మావే అని ఒకడంటే, మా టాపర్స్ బ్యాచ్ లో ప్రతి ఒక్కరికి మూడు ర్యాంకులు వచ్చాయని మరొకడు. విషయం వరకూ పర్వాలేదనుకున్నా, దానికి వెనక వాయిస్ ఓవర్ కేక.. మీకు లక్ష్మీ గణపతి ఫిలింసే గుర్తొస్తుంది. నో డౌట్.

రాసే వాళ్ళకంటే సీట్లే ఎక్కువ అంటున్నారు మరి ఇంకా దేనికి పరీక్ష, ఓ సగం మంది నారాయణా నుంచి రాస్తే, మిగతా సగం చైతన్య లా ఉంది. మరి వాళ్ళకి కాక మీకూ నాకూ ర్యాంకులు ఎందుకొస్తాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎక్కడైనా శ్రీలంక గెలుస్తుందా. మన ఎంసెట్ పరిస్థితీ అలానే తగలడింది. అసలు ఇంటర్ లెవెల్లో ఇంత పోటి.. ఇంత హడావిడి అవసరమా ? ఒకడు రోజూ పది మైళ్ళు పరిగెడుతున్నాడని.. మరొకడు మరో మూడు పరిగెట్టడం. పరుగెవరికోసమో ఎవరికీ తెలీదు. మున్ముందు జీవితానికి కావాల్సిన నైపుణ్యం ఏదైనా పొందుతున్నామా ఈ పరుగులో ?

ఓకే లెండి.. ఇప్పుడు ఇంతకంటే లోతుగా రాసే మూడ్ లేదు.. సో.. ఆరు.. ఏడు.. ఎనిమిది. మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే టీవీ పెట్టుకోమనండి, రేపటికల్లా అంకెలు వచ్చేస్తాయి. (శృతి సంగతి మాత్రం అడక్కండి.. ;-) )

(నా గోల ఇలా ఉంటే, మా ఆవిడ మాత్రం మొగలి రేకుల్లో ఆలీ గురించి తెగ వర్రీ అయిపోతోంది.. ఇప్పుడు నేను ఇంక సముదాయించాలి.)