Friday, July 8, 2011

శ్రీకృష్ణ కమీషన్ ఏంసాధించింది ?

మీకు కొత్తగా ఏదో చెప్పాలని కాదు, నా బుర్ర నెమ్మద పరచుకోడానికి.. అంతే.

తెలంగాణాలో సొంత రాష్ట్రం కావాలనే భావన బలంగా ఉంది. అన్ని వర్గాల్లోనూ ఆ ఆకాంక్ష రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, మరీ ముఖ్యంగా డిసెంబరు 9 ప్రకటన తరువాత. రాష్ట్రం వస్తే వాళ్ళ బ్రతుకులు మెరుగౌతాయనే నమ్మకం ఎంతవరకూ నిజమో కాలమే నిర్ణయించాలి. ఆంధ్ర ప్రాంతంలో, అసలు సమస్య/భయం, హైదరాబాదు గురించే. అంతకు మించి తెలంగాణా ఏర్పాటుతో కొత్తగా వచ్చేది.. పోయేదీ వారికి ఏమీ లేదు. తెలంగాణా ఇవ్వద్దని రోడ్డెక్కిన వారిలో చాలా మందికి తెలంగాణా జిల్లా పేర్లే సరిగ్గా తెలీవు. ఈ పరిస్థితిలో ఏకాభిప్రాయం రావాల్సింది హైదరాబాదు మీదే. ఓ ఏడాది కాలం వృధా చేసిన శ్రీకృష్ణ కమీషన్, అసలు విషయం పై ధ్యాస పెట్టకుండా, ఓ ఆరు కొత్త సూత్రాలను ప్రజల్లోకి వదిలింది. దాని వల్ల అణువంతైనా ప్రయోజనం చేకూరిందా ? రాష్ట్రమంతా కలియ తిరిగి కమీషన్ తేల్చింది, సాధించింది శూన్యం. నా అవగాహన వరకు, ఈ తరుణంలో ఏ కమీషన్, ఏ ఒక్క వ్యక్తీ నిర్ధారించి. నిర్ణయించేదీ ఏమీ లేదు. కనీసం, ఉద్యమ పార్టీలు వచ్చిన గత దశాబ్ధంలో అయినా, తెలంగాణా లో నిజమైన అభివృద్ది చేసి వాళ్ళు చెప్పేది తప్పు అని ప్రభుత్వం నిరూపించ గల్గిందా ? లేక.. నిధులన్నీ హైదరాబాదులోనే పొయ్యకుండా, రాష్ట్రంలో కానీసం మరో రెండు నగరాలని భాగ్యనగరానికి దీటుగా ముందుకు తీసుకెళ్ళిందా ? రెండూ జరగలేదు. దశాబ్ధాలు గడిచినా ప్రజల అభిప్రాయాలు/భయాలు మారలేదంటే, దానికి కారణం మనల్ని పాలిస్తున్న పాలకులది కాక మరెవరిది ? మరియు, అలాంటి పాలకులకు పట్టం కట్టిన మనదీను.

ఏది అయితేనేం, వాదనలతోనూ, లేక అధికారంతోనూ సమస్యని పరిష్కరించే స్థాయి దాటిపోయింది, అంత సామర్ధ్యం ఉన్న నాయకులూ లేరు ఇప్పుడు. నాకు తెలిసినంత వరకూ, రెండు ప్రాంతాల వారి ప్రతినిధులను కూర్చోబెట్టి అర్థవంతంగా చర్చించడమే మార్గం. చర్చల గురించి హోం మంత్రిగా అనుభవం కూడా వున్న జానా రెడ్డి ఎలాగో మన వ్యవహారాన్ని సరిహద్దు దేశాలతో పోల్చనే పోల్చాడు, అసలు నైతికతే లేని పాక్ తోనే చర్చిస్తున్నప్పుడు, ఒకే జాతిగా ఉన్న మనం, ఎందుకు చర్చించుకోలేం ? ఒక అరవై శాతమైన ఏకాభిప్రాయనికి వస్తే, మిగతా భాగం ప్రభుత్వం నిర్ణయం తో ఒప్పించవచ్చు నొప్పించకుండా. అసలు చర్చే లేకుండా నిర్ణయిస్తే మాత్రం, సమస్య పరిష్కారం కాదు కదా, ఇంకా జటిలం అవుతుంది. డిసెంబరు ప్రకటనలతో జరిగింది అదే.

అయినా, రాహుల్ గాంధి అలా ఉత్తర ప్రదేశ్ పొలాల్లో తిరక్క పోతే, ఇంత పెద్ద సమస్యని ఒక కొలిక్కి తేవచ్చు కదా. ప్రధాని అవ్వడానికి తన బయో డేటా లో కూడా పెట్టుకోవచ్చు. మనమేమైనా కాదంటామా. హైదరాబాదుని హాంగ్ కాంగ్ చేస్తామంటున్నారు, మరి అలా అయితే, వైజాగ్ ఇంక సింగపూరే, సందేహమే లేదు. ఆదిలాబాదు, విజయనగరం మాత్రం ఆదిలాబాదు, విజయనగరం గానే ఉంటాయి ఎప్పటికీ. మీరు వర్రి అవ్వకండి. మన అదృష్టాలు అలాంటివి మరి.

(ఇంకో కామెడీ ఏంటంటే, ఇన్నేళ్ళుగా చెన్నై లోనే ఉన్నాను, ఇంక మా భాగ్యనగరానికి ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని మా బాసుని అడిగితే, అసలే అక్కడంతా గొడవలు.. ఏం వెళ్ళక్కర్లేదు అన్నాడు.. ఒళ్ళు మండి, అవన్ని మా ఇంటి గొడవలు, మీరు బాధ పడకండి, మాలో మేము తీర్చుకుంటాం ఆన్నా.. ఆ మాటైతే అన్నాను కానీ, ఎక్కడో డౌటుగానే ఉంది.. ఎందుకంటారు ? )

No comments:

Post a Comment