Wednesday, July 13, 2011

అమ్మ మార్కు పాలన

ప్రక్క ప్రక్కనే ఉన్నా, మన రాష్ట్రానికి, తమిళ నాడుకి చాలా తేడా ఉంది. ముఖ్యం గా పరిపాలన విషయంలో. మన ఊరిలో ప్రభుత్వం, ప్రతిపక్షం, టీవీ ఆన్లో ఉన్నప్పుడు ముచ్చటగా కొట్టుకున్నా, తరువాత బానే కలసిపోతారు. సొమ్ములు కూడా బానే పంచుకుని స్వాహా చేస్తారు. ఎప్పుడో మరీ మీడియా లో పొక్కితే తప్ప, ఒకరిమీద మరొకరు కేసులు పెట్టుకోరు. పొరపాటున పెట్టినా, అవి వీగిపోయేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తం మీద ఒక జట్టు లా మన అభ్యున్నతి కోసం కలిసి పని చేస్తారు. కాని తమిళ నాడులో అలా కాదు ముందరి ప్రభుత్వంలో అధికారాన్ని ఆస్వాదించిన అందరికీ, ప్రభుత్వం పడిపోయిన వెంటనే ముచ్చమటలే. ఎక్కడైన దొరికారో ఇంక అంతే సంగతులు. మొన్నటి వరకూ రాజరిక హోదాని అనుభవించిన కరుణ కుటుంబం.. బంధువర్గం.. (అంటే రాష్ట్ర జనాభాలో ఓ సగం వేసుకోండి.. ;-) ) ఇప్పుడు మూడు చెరువుల నీళ్ళూ తాగుతున్నారు. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. అమ్మ పదవిలోకి వచ్చిన వెంటనే, కలర్ టీవీ లాంటి, కరుణ మార్కు పథకాలకు మంగళం పలికింది. మిక్సీలు, గ్రైండర్ల పథకాలు రెడీ అవుతున్నాయి. ఆయన ఫొటోలూ, రాతలు, వగైరాలు తీయించేయడం ఎలానో ఉన్నదే. గత ప్రభుత్వం పని కట్టుకుని అటకెక్కించిన ప్రభుత్వ కేబుల్ టీవీ కి మళ్ళీ ఊపిరి పోస్తున్నారు, ఇది సన్ టీవీ నెట్ వర్క్ ని భూ స్థాపితం చెయ్యడానికే. ఎవరో డిస్ట్రిబ్యూటర్ (జయ ఇచ్చిన లాండ్ లో ఆయన ఏమైన మల్టిప్లెక్స్ కట్టాడేమో మనకి తెలీదు మరి) పెట్టిన చీటింగ్ కేసులో ఇప్పటికే కళానిధి మీద సమన్లు జారీ అయ్యాయి. గోరు చుట్టు పై రోకలి పోటు అమ్మ స్టైలు, లేకపోతే అసలు ఈమధ్య పత్తాలేని రంజిత వచ్చి ఇప్పుడు సన్ టీవీ మీద కేసు పెట్టడమేమిటి.. అమ్మ పాలనలో ఇలాంటివన్ని కామన్. సడన్ గా, టీటీకే రోడ్డులోనూ, సిపీ రామసామి రోడ్డులోనూ వన్ వే నిబంధనలు తొలగించేసారు.. మళ్ళీ అవి రద్దీతో కిటకిట లాడుతున్నాయి. ఆ రెండు రోడ్లు స్టాలిన్ ఇంటి ప్రక్క రోడ్లని నేను మీకు వేరేగా చెప్పనక్కర్లేదు. మొన్నెప్పుడో గోపాలపురం వైపు వెళ్ళినప్పుడు చూసాను, ఎంతో హడవిడిగా ఉండే తాతగారి ఇల్లు రోడ్డు, ఒక చెత్త లారీతో కంపుకొడుతూ ఉంది. ఒక్క హోంగార్డు కూడా దరిదాపుల్లో కనిపించలేదు. టీ తాగడానికి అలా పోయెస్ గార్డెన్ వైపు వెళ్ళుంటాడనుకోండి. నా లెక్క ప్రకారం మరో ఆరు నెలల్లో కరుణానిధి కూడా జైల్లొనే ఉంటాడు. ఆయన అదృష్టం బావుంటే ఈలోగా ముక్తి లభించవచ్చు. జయలాంటి CM మన రాష్ట్రంలో ఉంటే ఈ పాటికి జగన్ అంతు తేలిపోయేది. ప్రస్తుతానికి మాత్రం కరుణానిధి కుటుంబం చట్ట ప్రకారం నడుచుకోవడం చాలా ముఖ్యం. అంటే ఉదాహరణకి, కరెంటు బిల్లులు వెంటనే కట్టేసుకోవడం (పాత బకాయిలు తీర్చేసుకుంటే ఇంకా మంచిది), పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలని నిలపడం, పాలిథిన్ కవర్లు ఎక్కువ వాడకపోవడం వగైరా.. వగైరా.. లాంటివన్నమాట. ఎందుకంటే ఏ కేసులోనైనా దొరికారా.. మళ్ళీ అధికారంలోకి వచ్చేవరకూ, స్వేచ్చగా ఆకాశం చూడకపోవచ్చు. మనం కూడా సన్ టీవీ కి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది.

సో మొత్తం మీద పంచ్ లైన్ మాత్రం ఇదే - అమ్మ ఎవరికైనా అమ్మే కానీ.. తాతకు మాత్రం కాదు.. ;-)

(అయినా ఉట్టినే అనలేదు ఈ మాట -- "The female of the species is more deadly than the male")

No comments:

Post a Comment