Tuesday, July 19, 2011

కొత్త ఉద్యోగాలు.. కొంగొత్త ఉద్యోగాలు (మరల రాని అవకాశం :-) )

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వం కొత్త ఉద్యోగాల రూపకల్పనలో పడినట్టు తెలుస్తోంది. నాకున్న సమాచారం ప్రకారం, మొదట విడత ఈ క్రింది పోస్టులను భర్తీ చేస్తారంట. మీకు ఆసక్తి ఉంటే, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను సంప్రదించగలరు.

(ఇవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలే కాకపోవచ్చు, ఎందుకంటే, ప్రయివేటు భాగస్వామ్యం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందిట. )


1. సంపద లెక్కింపు అధికారి : బంగారం, వజ్రాలు, పురాతన వస్తువులు, మరియు నగదు లెక్కింపు భాధ్యతలు చేపట్టగలగాలి. నైపుణ్యం బట్టి వేతనం. పూర్వానుభవం (ఆంధ్రాలో కానీ, కేరళలో కానీ) ఉన్నవారికి ప్రాధాన్యత. విద్యార్హతల పట్టింపు లేదు, కాని వయసు లెక్కింపు మొదలయ్యేటప్పటికి ముప్ఫై మించకూడదు, అలాగే లెక్కింపు ముగిసే నాటికి నూరు లోపూ ఉండాలి.


2. జాక్ (JAC) కన్వీనర్ - ఇది ప్రయివేటు భాగస్వామ్యంతో నడుస్తుంది. జాక్ లో ఉన్న సంస్థల మధ్య సమన్వయం, మరియు ప్రభుత్వంతో చర్చల భాద్యత. ఉద్యమ నేపధ్యం ఉంటే ప్రాధాన్యం. కనీస విద్యార్హత - Ph.D (మూడు నాలుగు పీజీ లు తప్పక కలిగి ఉండాలి)


3. రాహుల్ రాజకీయ సలహాదారు - రాహుల్ ని ప్రధాని గా చూడాలి అనే ఏకైక లక్ష్యం కలిగి ఉండాలి. ఆయన కారణ జన్ముడని ఒప్పుకోగలగాలి. రాజకీయ అనుభవం కనీసం ఓ ఎనభై ఏళ్ళు తప్పదు. ఇటలీ భాషలో ప్రవేశం ఉంటే ప్రాధాన్యత. (జీవితంలో ఇప్పటివరకూ నరేంద్ర మోడీనీ, మాయవతిని కలిసి ఉండరాదు) జోల పాటలు పాడటం, డైపర్ మార్చడం వచ్చి ఉండాలి. (విద్యార్హత - NA )


4. మంత్రి మండలి సంధాన కర్త ( మంత్రి మండలిని జైళ్ళతో అనుసంధానం చెయ్యగలగాలి) కొత్తగా మంత్రి వర్గంలోకి ఎవరు వచ్చినా, వెంటనే తీహార్ జైల్ లో ఒక డీలక్స్ రూము బుక్ చేసి పెట్టడం, భవిష్యత్తులో ఖాళీ భర్తీకి ప్లాను చేసుకోవడమూ.. వగైరా.. వగైరా.. విద్యార్హత- నిశాని అయి ఉండాలి, వీరప్పన్ లేక ఫూలన్ ఆంతరంగికులు మాత్రమే దరఖాస్తు చెయ్యగలరు.


5. మానసిక వైద్య నిపుణుడు - ఇది వెను వెంటనే అవసరం (అంటే యుద్ధ ప్రాతిపదికన అన్నమాట), మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ పెద్దలకు వైద్యాన్ని అందించాలి. ముఖ్యంగా, ప్రధాని మంత్రి వర్గ సహచరులు అయిన దిగ్విజయ్ సింగ్, ఆజాద్, జై రాం రమేష్ తదితరులకు. ఏదైనా ప్రముఖ పిచ్చాసుపత్రిలో పని చేసిన అనుభవం తప్పనిసరి. (మీరు ఇప్పటికే మణిశంకర్ అయ్యర్ కి చికిత్స చేసారా.. అలా అయితే, మేము మీకోసమే వైటింగ్ ఇక్కడ.. )


(పైన ప్రస్తావించబడిన అర్హతలు మీకున్నాయా, మీరు ఇన్నాళ్ళూ ఇలాంటి ఉద్యోగం కోసమే కలలు కంటున్నారా ? మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ కలలను నిజం చేసుకోండి.. దూసుకుపోండి అంతే. )

1 comment:

  1. మీరు ఇంకోటి మరిచి పోయారు .. అదేంటంటే
    6.పని లేని వారికోసమే ప్రత్యేకంగా కేటాయించబడినది
    www.bloggerspoll.blogspot.com
    పైన తెలిపిన బ్లాగును గెలకడం.

    ReplyDelete