Sunday, August 28, 2011

గెలుపు అన్నాదే, ఇక బాధ్యత మనందరిది!!

గాంధేయ మార్గంలో కోట్ల మందిని చైతన్య పరచి, ప్రభుత్వానికి, రాజకీయనాయకులకు చమట్లు పట్టించి, అన్నా అనుకున్నది సాధించాడు. "ఇక్కడ అదంతా జరగదు" - అని మనలో పేరుకుపొయి ఉన్న నిర్లిప్తతను కూకటి వేళ్ళతో పెకిళించాడు. మార్పు ఇక్కడా సాధ్యమే జనం తలుచుకోవాలే గానీ, నిజమైన నాయకుడు వెలుగు వైపు వెన్నుతట్టి నడిపించాలే గానీ.

ఇది అపురూపమైన విజయమే, అన్నాకీ, మనకీ, మన ప్రజాస్వామ్యానికి. హింసకి తావు లేకుండా, బందులూ, జన సమీకరణలు లేకుండా, తనను తాను శిక్షించుకుంటూ దేశాన్ని గెలిపించాడు అన్నా. ప్రాణమున్న సమాజానికి ఇంతకు మించిన పరీక్ష లేదు. కానీ మన బాధ్యతా పది రెట్లు పెరిగింది ఇప్పుడు, ఇకముందు, బద్దకం వలనో, లేక ఓ పదిరూపాయలు మిగల్చడానికో, అలవాటు మానుకోలేకో, లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డ ప్రతీసారీ మనం అన్నాని గుర్తు తెచ్చుకోవాలి, మనం చేస్తున్న పనికి సిగ్గుతో తలవంచుకోవాలి, మన మనస్సాక్షి ఎదుట నేరస్తుడిగా నిలబడాలి. చట్టాలు ఎన్ని వచ్చినా, చివరికి మన నైజం, పద్ధతి మారే వరకూ, మన బ్రతుకులు మారేది లేదు, ఎవరి బ్రతుకులో మనం మార్చేదీ లేదు. అన్నా కలకనే సాహసాన్ని ఇచ్చాడు, ఒక మార్గం చూపించాడు, అడ్డదారులు వదలి నిజాయితీగా ముందుకు అడుగులు వేద్దాం, ఎందుకంటే వేగం కంటే, గమ్యం కంటే, మార్గం విలువైనది, ఉన్నతమైనది.

నిస్వార్థమైన దీక్షతో అన్నా మనందరిని గెలిపించాడు, మన బలహీనతలో అతన్ని మనం ఓడించద్దు.

Wednesday, August 24, 2011

ట్వీట్లండీ ట్వీట్లు.. వేడి వేడిగా - 2నన్ను భయపెట్టేది నేను ఎదుర్కునే సమస్యలు కాదు, ఇంకా నేను గెలవని నా బలహీనతలు.
=================================

ఈనాడు పేపర్ లోని "ఇదీ సంగతి" ని "జగన్ సంగతి" గా మార్చేయచ్చేమో.
=================================

అన్నా హజారే మళ్ళీ భోజనం చేసేవరకూ సోనియా ఆరోగ్యం బాగుపడదేమో అని నా అనుమానం. దేశం పట్ల ఆవిడకున్న నిబద్దత అలాంటిది మరి. ;-)
=================================

నీతో పాటూ ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసావ్.. కానీ వెళ్ళిపోతూ నా ప్రపంచాన్నీ నా నుంచి తీసుకెళ్ళిపోయావ్.. ఎందుకు ?
=================================

ఈ ప్రయాణంలో కొత్త నేస్తాలు ఎందరు ఎదురైనా.. నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటికీ అమ్మే.
=================================

రైటా, లెఫ్టా ? వేగంగా వెళ్ళాలా, మెల్లగానా ? వెంబడించనా, లేక నూతన ఒరవడి నిర్మించనా ?. ఈ ఆలోచనల్లో పడి, అసలు గమ్యమెక్కడో మరచిపోతుంటాను.
=================================

అమ్మ ఎంత అమాయకురాలో.. ఇవ్వడమే తెలుసు అమ్మకి..
=================================

నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. నీకు తెలియకుండా.. బహుశా నాక్కూడా తెలియకుండా.
=================================

ఏకాంతం విలువ పోగొట్టుకుంటేగానీ తెలీదు. (అలా అని పెళ్ళి చేసుకోకుండా ఉండిపోలేం కదా.. ;-))
=================================

అడుగులతో స్నేహం చేస్తే, గమ్యం ఎంత చేరువో..
=================================

Monday, August 22, 2011

నా బ్లాగు రెండవ పుట్టిన రోజు!! :-)


నా బ్లాగు మొదలుపెట్టి రేపటికి (23 ఆగస్టు కి) రెండు సంవత్సరాలు అవుతోంది. ఎంతమంది చదువుతున్నారో, ఎంతమంది నచ్చుకున్నారో, ఎంతమంది తిట్టుకున్నారో కానీ, నేను మాత్రం నాకు రాయాలనిపించింది, సమయం/ఓపిక ఉన్నపుడు సంతృప్తిగా రాసుకుంటున్నాను. ఆ అనుభూతి లేని రోజున మానెస్తా కూడా. ఈ రెండేళ్ళలో ఇటు వైపు లుక్కు వేసిన వారందరికీ కృతజ్ఞతలు.
(బహుశా వెయ్యని వారికి కూడా. ;-) )

మరీ ముఖ్యంగా ఆగ్రిగేటర్లకి, తమ తమ బ్లాగుల్లో నా బ్లాగుకి లింక్ వేసిన బ్లాగర్లకీ, తన ఉత్తమ బ్లాగుల లిస్ట్ లో ఇప్పటి వరకు నా బ్లాగునీ ఉంచిన శరత్ గారికీ, నేను రాయడం మొదలు పెట్టిన కొత్తలోనే తన బ్లాగులో "నా హరివిల్లు" గురించి నాలుగు మంచి మాటలు రాసిన a2zdreams బ్లాగర్ కి ధన్యవాదాలు.

మళ్ళీ ఇంకో కొత్త పోస్టుతో కలుద్దాం. (కలానికీ, కాలానికి ఒక సారూప్యత ఉంది, ఆ రెండూ వెనక్కి తిరిగి చూడవు; అవి అక్షరాలైనా, లేక జ్ఞాపకాలైనా, దాచుకోవడం మన వంతే..)

Saturday, August 20, 2011

వార్తలు కాదు.. మాకు బురదే ప్రధానం!!

నువ్వు కుక్కవి..
కాదు నువ్వు పిచ్చి కుక్కవి.
కాదు నువ్వు పిచ్చి గజ్జి కుక్కవి..
నువ్వూ.. ... **. ***. **.. ***. కుక్కవి.
(అంటే నా బ్లాగులో నేను ఇలాంటి పదాలు వాడను)

ఇదీ సాక్షి, ఈనాడు పరిస్థితి. ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడమే ప్రధానమైతే వాటికి వార్తా పత్రికలు అని పేరు ఎందుకు, మనం డబ్బులిచ్చి వాటిని కొనుక్కోవడం ఎందుకు ? ఒక ప్రక్క అవినీతిపై దేశం ఎన్నడూ లేనివిధంగా ఒక్క తాటిపై ఉద్యమిస్తోంది, తెలంగాణా సమస్యని కేంద్రం కోల్డ్ స్టోరేజీలో పెట్టి చక్కా కూర్చుంది.. అంతర్జాతీయం గా ఆర్థిక మాంద్యం పుంజుకుంటోంది.. ఈ వార్తలు, కథనాలు, విశ్లేషణలు, ఇవేవి పెద్ద ప్రధానం కాదు. రోజూ పేపర్ తెరవడం, సండూర్ పవర్, కార్నెగి, కార్మెల్ ఆసియా, డాల్ఫిన్ హోటల్, రామోజి ఫిల్మ్ సిటీ వ్యవహారాలు చదువుకోవడమే. జగన్ అంత పన్ను ఎలా కట్టాడు, రామోజీ అంత పన్ను ఎలా ఎగ్గొట్టాడు.. విష్ణు సహస్ర నామం లా. ఈనాడు "ఇదీసంగతి" కాస్తా "జగన్ సంగతి" అయిపోయింది. సాక్షిలో చెప్పే రాజశేఖరుని కొటేషన్స్ చూస్తుంటే ఒక మనిషి జీవితంలో ఇన్ని ఎలా చెప్పగలడు అనిపిస్తోంది. అదృష్ట వసాత్తూ నేను సాక్షి చదవను, ఎప్పుడో ఈ-పేపర్ తప్ప, ఈనాడు మాత్రం తప్పడం లేదు. వాళ్ళ సొంత అజెండాలు కాకుండా ఉన్న వార్తలని నిజాయితీగా చెప్పే ఒక్క తెలుగు పత్రికైనా ఉందా ?

చివరిగా ఒక మాట, మన కాలనీ బురదలో ఏ పందులో కొట్టుకుంటున్నాయనుకోండి, ఒక సారి చూస్తాం, ఛీ.. అనుకుంటాం, మహా అయితే సంబంధిత అధికారులకి మన బాధ నివేదిస్తాం, కానీ రోజూ చూసి తరించి చప్పట్లు కొట్టి ఇంకా ప్రోత్సహించలేం కదా ?

Monday, August 15, 2011

ఆరక్షణ్ - "ఆకర్షణ్" అంతా ట్రైలర్లోనే!!

ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!!

దడ పుట్టించే "దడ" తప్ప, మరే తెలుగు సినిమా మా చెన్నైలో ఈ రోజు కనిపించకపోవడంతో మేము "ఆరక్షణ్" కవర్ చేసాం. సగటు ప్రేక్షకుడిగా నాకేం పెద్ద బోర్ కొట్టలేదు, మద్యాహ్నం నిద్ర త్యాగం చేసి చూసినా తలనొప్పి రాలేదు. అక్కడక్కడ కళ్ళుచమర్చాయి, సో ఈ కోణంలో చూస్తే సినిమా ఓ మోస్తరుగా ఉందనే చెప్తాను. నవతరంగంలో వచ్చిన ఈ సినిమా సమీక్ష చాలా బావుంది, అందుకని మళ్ళీ కథనీ, అవే పాయింట్లను రాయలని అనిపించడం లేదు, నిజానికి అంత ఓపికా లేదు. :-) (http://navatarangam.com/2011/08/arakshan_a-view)

ఇంతకుముందు ప్రకాష్ ఝా తీసిన రాజ్ నీతి కూడా అంత గొప్పగా ఏమీ అనిపించలేదు నాకు, కానీ పాత్రలు బానే ఆకట్టుకున్నాయి ఆ చిత్రంలో. ఈ సినిమాలో అమితాబ్ తప్ప మరే పాత్రకు అంత డెప్త్ మరియు నిడివి ఇవ్వబడలేదు, అందువల్ల కొన్ని సన్నివేశాలు మరీ టీవీ సీరియల్ లా అనిపించాయి. ఒక చోట అమితాబ్ అంటాడు, "ఇండియా లో రెండు ఇండియాలు" ఉన్నాయని, అది ఎంత నిజమో కానీ, ఈ చిత్రంలో మాత్రం రెండు కథలు ఉన్నాయి. ఒక కథ రిజర్వేషన్స్ గురించి, రెండోది ఒక ప్రిన్సిపాల్ (అమితాబ్) కథ. రిజర్వేషన్స్ గురించి సమాజంలో ఇప్పటికే ఉన్న అభిప్రాయాలను పాత్రలు చెప్పడం వలనేమో హాలులో కాస్త సందడి కనిపించింది, కొన్ని చోట్ల. కానీ సినిమా అసలు కథకి ఆ ముందు వచ్చిన ఆవేశాలకి (ట్రైలర్లో అవే మనకి ఎక్కువ చూపిస్తున్నారు) పెద్ద సంబంధం కనిపించదు. మామోలు ఏ సినిమాలో అయినా చూసే, "హీరో సిద్ధాంతాలు, నిబద్దత, కష్టాలు, మళ్ళీ సున్నా నుంచి మొదలయ్యి, తన స్థానానికి రావడం", ఈ ఫార్ములా ఈ సినిమాలోనూ ఉంది. (మీరు హీరో అమితాబ్ అని గుర్తించగలరు, సైఫ్ కాదు) రిజర్వేషన్స్ గురించి కొన్ని ప్రశ్నలైతే వినిపించాయి కానీ, ఎక్కడా పూర్తి స్థాయి నిష్పక్షపాతమైన చర్చగానీ, సమాధానాలు కానీ నా వరకూ కనిపించలేదు. మూడు గంటల ఒక రొటీన్ హిందీ సినిమా నుంచి మనం అంత ఆశించలేం కూడా; అలాంటప్పుడు అంత సున్నిత అంశాలని కథతో జోడించడం ఎంతవరకూ అవసరం ?, అది దర్శకుని చాయిస్ అనుకోండి. కానీ మరి అది వ్యాపార దృక్పదంతో చేసినట్టైతే మాత్రం అసమంజసమే, ఎందుకంటే, సినిమా ఏ కోణాన్నీ ప్రత్యక్షంగా సమర్ధించకపోయినా, కొట్టుకోడానికి కారణాలు వెతుక్కునే మనవాళ్ళకీ, వాళ్ళని రెచ్చగొట్టే మన నాయకులకీ ఇది అనవసరపు మేతే. చాలా ఏళ్ళక్రితం, ఓ సారి రిజర్వేషన్స్ మీద ఒక నాటకాన్ని ప్రసారం చేసినందుకు ఆకాశవాణి విశాఖ కేంద్రం మీద దాడి జరిగింది, ఆ నాటకంలో ఉన్న సంభాషణలతో పోలిస్తే ఈ చిత్రంలో పది రెట్లు ఉన్నాయి.

ఇంక అసలు కథ విషయానికి వస్తే, అది మనకి పాత చింతకాయ పచ్చడే. విద్యా వ్యవస్థలో అవినీతి,అక్రమాల గురించి ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలు దక్షిణాదిలో రావడం వలన నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు. నిజానికి ఇంకా భారీ సీన్లకి మనం అలవాటు పడిపోయాం కూడా. ఆ రకంగా చూస్తే సినిమా ఇప్పటి పరిస్థితులకు అంత దగ్గరగా లేదేమో అనిపించింది. ఓ ట్యుటోరియల్ కాలేజీ గొలుసుని మరీ మాఫియాలా చూపించడం కాస్త అసహజం గా తోచింది నాకు. ప్లస్ పాయింట్లు మాత్రం నటీనటుల నటన మరియు ప్రిన్సిపాల్ కథలోని నిజాయితీ అని చెప్పుకోవాలి. అందరూ వాళ్ళకున్న పరిధిలో బానే చేసారు. అమితాబ్ కి ఇంకా మంచి సంభాషణలు రాసి ఉండాల్సింది, సైఫ్ కి ఇంకా మంచి మేకప్. క్లైమాక్స్ లో ఇంకాస్త ఖర్చు కూడా పెట్టాలి మరి. బహుశా, నటినటులకే సింహ భాగం ఖర్చు చేసి ఉంటారు. ;-)

నా సలహా మాత్రం మరీ పనిగట్టుకుని, పక్కరాష్ట్రాలకు వెళ్ళేమీ చూడక్కర్లేదు, నా నమ్మకం ఏంటంటే, టీవీ9 ఎదో ఒక రూపంలో మీకు ఈ సినిమా చూపించేస్తుంది. (అంటే 30 మినిట్స్, రహస్యం, వగైరా.. వగైరా. లేక డైరెక్ట్ గా 9pm లైవ్లో)

Friday, August 12, 2011

విదేశీ వ్యవహారాలకు ఇంకో దిక్కు లేదా ?
ఒక ప్రక్క పాక్ తన కొత్త విదేశాంగ మంత్రితో దూసుకుపోతుంటే, మనం మాత్రం ఈ S.M కృష్ణ తో నత్త నడకే నడుస్తున్నాం, ఎటువైపో కూడా తెలీదు. ఆ మధ్య ఎప్పుడో ఇక్యరాజ్య సమితిలో ఎవరో పోర్చుగీసు ప్రతినిథి చదవాల్సిన ప్రసంగ పాఠం చదవడం మొదలు పెట్టాడు ఈ మహానుభావుడు, అంతర్జాతీయ వేదికమీద అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా. మొన్నటికి మొన్న హిల్లరీ ప్రక్కనే కూర్చుని ఆఫ్ఘన్ తో మనకి ప్రత్యక్ష సరిహద్దు లేదని కుండ బద్దలుకొట్టాడు (ఆఫ్ఘన్ సరిహద్దు లో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ భాగాన్ని భారత్ ఎప్పటినుంచో మన దేశంలో ఉన్నట్టే లెక్కపెడుతోంది) ఇవి చాలక, నిన్న పార్లమెంట్ సాక్షిగా మరో కామెడీ.. భారత జైల్లో మగ్గుతున్న ఒక వైద్యుణ్ణి ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని అడిగితే, పాక్ క్షమా బిక్ష పెట్టినప్పుడు అన్నాడంట. అదీ పరిస్థితి. ప్రక్కనే కూర్చున్న సింగ్ తాతగారు లేచి ఎదో సద్దుబాటు చేసారు.

ఈ నూరుకోట్ల పైచిలుకు దేశంలో ఈ ఉత్తముడు కాక మరెవడూ దొరకలేదా మన విదేశీ వ్యవహారాలు చక్కబెట్టడానికి ? అయినా, నాకు తెలీక అడుగుతాను, బడిపంతులు ఉద్యోగానికీ, బిళ్ళ బంట్రోతు పనికీ కూడా ఉన్న వయోపరిమితి క్యాబినెట్ పదవులకి మాత్రం ఎందుకు లేదు, మన ఖర్మ కాకపోతే. కాస్తో కూస్తో కక్కుర్తి బేరమైనా ఆ శశి థరూరే నయమేమో అనిపిస్తోంది నాకు.

నా బుర్రలో మరో గొప్ప ఐడియా కూడా ఉంది, ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కనీసం విదేశాంగ మంత్రులను మార్చుకుందాం పాక్ తో ? ఏంటంటారు ? మనకి కూడా కొంచం పార్లమెంట్ సమావేశాలు చూడాలనిపిస్తుంది.. ;-)

Tuesday, August 9, 2011

బందుల కేలండర్ఇందాకా మా ఆవిడ ఇచ్చిన టమటా సూప్ తాగుతుంటే నాకో అమోఘమైన ఐడియా వచ్చింది. ఈ మధ్య ఎలాగో బందులు రొటీన్ లో భాగమైపోయాయి కనుక, ప్రభుత్వం సంవత్సరం మొదల్లోనే ఒక బందుల కాలండర్ విడుదల చేస్తే ఎలా ఉంటుందని.. ముందు గానే ప్లాన్ ఉన్నవి అందులో పొందుపరచచ్చు, కొన్నేమో అధికార పార్టీకి రిసర్వ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మీకు ఫలానా తారీకునే బందు చెయ్యాలని ముచ్చటగా ఉంటే మరి ఆ విషయం ప్రభుత్వానికి తెలియ చేసి ఆ రోజుని మీకోసం అట్టేపెట్టమని అడగచ్చు. వైరి వర్గాలు ఒకే రోజుకోసం పట్టుపడితే అంటారా, అప్పుడు వేలం వేద్దాం, దానికేం భాగ్యం, ప్రభుత్వానికి ఆదాయం కూడా. పండగల మాదిరిగానే మనం అప్పుడు బందులకు కూడా సొంత ఊళ్ళకి వెళ్ళొస్తూ ఉండచ్చు. ఎప్పుడైన మన పంట పండి వరస బందులు వచ్చాయనుకోండి, దేశ పర్యటనలూ చెయ్యచ్చు. ఇదంతా బావుంది కాని, అసలు బందు అనే ఫీలింగే పోతుందే అంటారా, దానికీ ఓ మార్గముంది, బందులకి కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టుకోనిద్దాం, బహుశా స్పాన్సర్ షిప్ ని కూడా అనుమతించవచ్చేమో, మీరూ ఆలోచించండి. షాపింగ్ మాల్స్ వాళ్ళు బందు కు ముందే మంచి ఆఫర్స్ కూడా ఇచ్చుకోవచ్చు.. బందు రోజు అందరికి రెస్టు.. ఎన్నో సదుపాయాలు, ఎంతో సౌలభ్యం.. అసలు బందులు మన బంధువులైపోతాయి చూసుకోండి మరి.

పనిలో పని, టాలీవుడ్ లో మంచి సినిమాలు కూడా మనం నిర్మించుకోవచ్చు ఈ కాన్సెప్ట్ మీద.. ఉదాహరణకి "బందంటే ఇదేరా", "అందరి బందువయా", "అనుకోకుండా ఒక బందు", "బందుల్లో బందీ" (ఇది లక్ష్మి గణపతి ఫిలింస్ వారిది), "మహేష్ బాబు బందు".. వగైరా.. వగైరా..

Friday, August 5, 2011

ఈ రోజు మన పాఠం - సాగదీయడం ఎలా ?

పిల్లలూ అందరూ వచ్చారా, ఈ రోజు మనం సాగదీయడం గురించి తెలుసుకుందాం. పదార్థాలకున్న అన్ని భౌతిక ధర్మాల్లోనూ అతి ముఖ్యమైనది - సాగదీయబడటం. అలానే ఆ కార్యక్రమాన్ని విజయవంతం గా, నిరంతరాయం గా చెయ్యడం ఒక కళ.

గత కొన్నేళ్ళగా, నేను కూడా చిదంబరం గారు వంట పట్టించుకున్న చెన్నై నీరు తాగడం వలన, నేనూ ఆ విధానాన్ని బాగా అకళింపు చేసుకున్నాను. కేవలం మీకోసం ఇప్పుడు విశదీకరిస్తున్నాను.

1. మొదట సాగదీయాల్సిన పదార్థాన్ని బాగా ముద్ద చేసిపెట్టుకోవాలి. అప్పుడే బావుంటుంది మరి.
2. పదార్థాన్ని ఒక వైపు కొంచం లాగాలి.
3. ఇప్పుడు రెండో వైపూ కొద్దిగా లాగాలి.
4. అర్థం అయ్యింది కదా, ఇప్పుడు పైన చెప్పిన 2 కార్యాలనీ మీకు విసుగు వచ్చే వరకూ చేసుకోవచ్చు.
5. అప్పుడప్పుడు కొంచం వినోదం కోసం, ఈ లాగడాన్ని ఆపి ఒక వైపుగా నిల్చోండి.
6. మళ్ళీ వెంటనే మధ్యలో నిలబడి రెండు వైపులా సరిచేసుకోండి.
7. ఎవరైనా మీతో పాటు జట్టు కడితే, తలో పక్కా కూడా కలిసి లాగవచ్చు, అప్పుడు ఇంకా బావుంటుంది.
8. ఎప్పుడైనా మరీ ఇంక తెగిపోతాయి అని అనిపించినప్పుడు, ఏం కంగారు పడకండి, తొణక్కుండా మళ్ళీ మొదటి స్టెప్ కి వెళ్ళండి. (అస్సలు సిగ్గు పడకూడదు మనం ఈ పని చెయ్యడానికి)
9. మీకు లాగాలని లేకపోయినా, లేక మీరు ఈ లోగా ఇంకేదో లాక్కోవాల్సిన పరిస్థితి వచ్చినా, భయపడకండి, లాగినదంతా బాగా కలిపి ముద్ద చేసి మీ సహచరులకు అప్పచెప్పండి. (లాగుడు సూత్రాలు చెప్పడం మరవకండి)
10. మళ్ళీ మీకే లాగాలని అనిపించినప్పుడు, తిరిగి మొదటి నుంచి మొదలవ్వండి. పొరపాటున కూడా డైరెక్టు గా మధ్య స్టెప్పులకి వెళ్ళకండి.
11. మీకు ఈ కార్యక్రమం లో ఒక నిబద్దత, నైపుణ్యం వచ్చాక, మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. వాళ్ళనీ లాక్కోనివ్వండి.

ఈ పదకొండు సూత్రాలు మీరు ఫాలో అయిపోతే, మీకూ, మీ సాగదీతకు తిరుగే లేదు. నాదీ గారంటీ.

(ఇందులో పాత్రలన్నీ కల్పితం, మీకు ఏదైనా గుర్తొస్తే అది మన ఖర్మ మాత్రమే అని సముదాయించుకోగలరు)