Monday, August 15, 2011

ఆరక్షణ్ - "ఆకర్షణ్" అంతా ట్రైలర్లోనే!!

ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!!

దడ పుట్టించే "దడ" తప్ప, మరే తెలుగు సినిమా మా చెన్నైలో ఈ రోజు కనిపించకపోవడంతో మేము "ఆరక్షణ్" కవర్ చేసాం. సగటు ప్రేక్షకుడిగా నాకేం పెద్ద బోర్ కొట్టలేదు, మద్యాహ్నం నిద్ర త్యాగం చేసి చూసినా తలనొప్పి రాలేదు. అక్కడక్కడ కళ్ళుచమర్చాయి, సో ఈ కోణంలో చూస్తే సినిమా ఓ మోస్తరుగా ఉందనే చెప్తాను. నవతరంగంలో వచ్చిన ఈ సినిమా సమీక్ష చాలా బావుంది, అందుకని మళ్ళీ కథనీ, అవే పాయింట్లను రాయలని అనిపించడం లేదు, నిజానికి అంత ఓపికా లేదు. :-) (http://navatarangam.com/2011/08/arakshan_a-view)

ఇంతకుముందు ప్రకాష్ ఝా తీసిన రాజ్ నీతి కూడా అంత గొప్పగా ఏమీ అనిపించలేదు నాకు, కానీ పాత్రలు బానే ఆకట్టుకున్నాయి ఆ చిత్రంలో. ఈ సినిమాలో అమితాబ్ తప్ప మరే పాత్రకు అంత డెప్త్ మరియు నిడివి ఇవ్వబడలేదు, అందువల్ల కొన్ని సన్నివేశాలు మరీ టీవీ సీరియల్ లా అనిపించాయి. ఒక చోట అమితాబ్ అంటాడు, "ఇండియా లో రెండు ఇండియాలు" ఉన్నాయని, అది ఎంత నిజమో కానీ, ఈ చిత్రంలో మాత్రం రెండు కథలు ఉన్నాయి. ఒక కథ రిజర్వేషన్స్ గురించి, రెండోది ఒక ప్రిన్సిపాల్ (అమితాబ్) కథ. రిజర్వేషన్స్ గురించి సమాజంలో ఇప్పటికే ఉన్న అభిప్రాయాలను పాత్రలు చెప్పడం వలనేమో హాలులో కాస్త సందడి కనిపించింది, కొన్ని చోట్ల. కానీ సినిమా అసలు కథకి ఆ ముందు వచ్చిన ఆవేశాలకి (ట్రైలర్లో అవే మనకి ఎక్కువ చూపిస్తున్నారు) పెద్ద సంబంధం కనిపించదు. మామోలు ఏ సినిమాలో అయినా చూసే, "హీరో సిద్ధాంతాలు, నిబద్దత, కష్టాలు, మళ్ళీ సున్నా నుంచి మొదలయ్యి, తన స్థానానికి రావడం", ఈ ఫార్ములా ఈ సినిమాలోనూ ఉంది. (మీరు హీరో అమితాబ్ అని గుర్తించగలరు, సైఫ్ కాదు) రిజర్వేషన్స్ గురించి కొన్ని ప్రశ్నలైతే వినిపించాయి కానీ, ఎక్కడా పూర్తి స్థాయి నిష్పక్షపాతమైన చర్చగానీ, సమాధానాలు కానీ నా వరకూ కనిపించలేదు. మూడు గంటల ఒక రొటీన్ హిందీ సినిమా నుంచి మనం అంత ఆశించలేం కూడా; అలాంటప్పుడు అంత సున్నిత అంశాలని కథతో జోడించడం ఎంతవరకూ అవసరం ?, అది దర్శకుని చాయిస్ అనుకోండి. కానీ మరి అది వ్యాపార దృక్పదంతో చేసినట్టైతే మాత్రం అసమంజసమే, ఎందుకంటే, సినిమా ఏ కోణాన్నీ ప్రత్యక్షంగా సమర్ధించకపోయినా, కొట్టుకోడానికి కారణాలు వెతుక్కునే మనవాళ్ళకీ, వాళ్ళని రెచ్చగొట్టే మన నాయకులకీ ఇది అనవసరపు మేతే. చాలా ఏళ్ళక్రితం, ఓ సారి రిజర్వేషన్స్ మీద ఒక నాటకాన్ని ప్రసారం చేసినందుకు ఆకాశవాణి విశాఖ కేంద్రం మీద దాడి జరిగింది, ఆ నాటకంలో ఉన్న సంభాషణలతో పోలిస్తే ఈ చిత్రంలో పది రెట్లు ఉన్నాయి.

ఇంక అసలు కథ విషయానికి వస్తే, అది మనకి పాత చింతకాయ పచ్చడే. విద్యా వ్యవస్థలో అవినీతి,అక్రమాల గురించి ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలు దక్షిణాదిలో రావడం వలన నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు. నిజానికి ఇంకా భారీ సీన్లకి మనం అలవాటు పడిపోయాం కూడా. ఆ రకంగా చూస్తే సినిమా ఇప్పటి పరిస్థితులకు అంత దగ్గరగా లేదేమో అనిపించింది. ఓ ట్యుటోరియల్ కాలేజీ గొలుసుని మరీ మాఫియాలా చూపించడం కాస్త అసహజం గా తోచింది నాకు. ప్లస్ పాయింట్లు మాత్రం నటీనటుల నటన మరియు ప్రిన్సిపాల్ కథలోని నిజాయితీ అని చెప్పుకోవాలి. అందరూ వాళ్ళకున్న పరిధిలో బానే చేసారు. అమితాబ్ కి ఇంకా మంచి సంభాషణలు రాసి ఉండాల్సింది, సైఫ్ కి ఇంకా మంచి మేకప్. క్లైమాక్స్ లో ఇంకాస్త ఖర్చు కూడా పెట్టాలి మరి. బహుశా, నటినటులకే సింహ భాగం ఖర్చు చేసి ఉంటారు. ;-)

నా సలహా మాత్రం మరీ పనిగట్టుకుని, పక్కరాష్ట్రాలకు వెళ్ళేమీ చూడక్కర్లేదు, నా నమ్మకం ఏంటంటే, టీవీ9 ఎదో ఒక రూపంలో మీకు ఈ సినిమా చూపించేస్తుంది. (అంటే 30 మినిట్స్, రహస్యం, వగైరా.. వగైరా. లేక డైరెక్ట్ గా 9pm లైవ్లో)

1 comment: