Friday, September 30, 2011

ఈ సారి గవర్నర్ గారి ప్రసంగం అనవసరమేమో..

మామోలుగా అసెంబ్లీ సెషన్ మొదలు లో ఒక సారి గవర్నర్ గారికి మైకునీ, సీటునీ ఇస్తారు, ఆయన, ప్రభుత్వం చెప్పాలనుకున్నది తన మాటల్లో ఒకసారి చెప్పి అది తను నడుపుతున్న ప్రభుత్వమే అని ఒక ఫీలింగ్ తెచ్చుకుని, మనకీ తెస్తారు. (బిజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ వ్యవహారం కొంచం వేరేగా ఉంటుంది.. మనకి ఆ ప్రసక్తి అప్రస్తుతం) తివారి లాంటి బిజీ మనిషి అనుకోండి, ఆయనకున్న ముఖ్య కార్యక్రమాలు ఆ ఒక్క రోజుకీ వాయిదా వేసుకుని సభలో మనకి కనుల విందు చేస్తారు. ఓ సారి అందరి ముఖ్యులను ఆయనా చూసినట్టు ఉంటుంది అని. అది మన ప్రజాస్వామ్యం లో ఓ తప్పని రొటీన్ సన్నివేశం. కానీ ఈ సారికి దీన్ని మనం వదిలించుకోవచ్చు అని అనిపిస్తోంది నాకు, ఎందుకంటే ఎలానో పాలిస్తున్నది, మంత్రులతో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తూ పనులు చేయిస్తున్నదీ నరసింహన్ గారే అయినప్పుడు, మళ్ళీ ప్రత్యేకం గా ఆయన ఏంచెప్తాడు. చేతల్లో ఎలానో చూపిస్తాడు కదా. అందుకే దానికి బదులు మనం మన ప్రియతమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి ఒక అవకాశం కల్పించవచ్చు. ఆయనే మన ముఖ్యమంత్రి అని ఒక సారి గుర్తుకు తెచ్చుకున్నట్టు ఉంటుంది. సమావేశాలంటే మంత్రులు అందరూ ఎదో ఒక గేటు ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, (శంకర్రావు గారికి సుమోటో వ్యవహారలేమీ లేకపోతే ఖచ్చితంగా వస్తారు), కిరణ్ కూడా అందరినీ ఒక సారి కలిసి చేతులు ఊపచ్చు. ఓ నాలుగు మాటలు చెప్పచ్చు. ("ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో, అది మరి లేదో.." ఈ టైపులో.. ) అర్థ సంవత్సర పరీక్షల్లో ఎవరైనా మన సీ.ఎం నరసింహన్ అనో, రాజశేఖర్ రెడ్డీ అనో రాసేస్తే ఎంతటి అపప్రధ మనకి. (తెలంగాణ విద్యార్థులు పరీక్షే రాయరు కాబట్టి ప్రమాదం తప్పింది.. లేకపోతే వాళ్ళకి MLA ఎవరన్నదే అవుటాఫ్ సిలబస్ ప్రశ్న అయ్యేది)

ఇదే మాట మా ఆవిడతో అంటే, మొగలి రేకులు బ్రేకులో నా వైపు ఓ లుక్కిచ్చి, అసలు సమావేశాలు జరిగినప్పుడు కదా.. అప్పుడే ఒక నిర్ణయం తీసుకుందాం లెండి అని తేల్చింది. కరక్టే.. నాది మరీ ఆదికి ముందు హడావిడి అనుకోండి..

మనలో మన మాట, అసెంబ్లీ ప్రక్క జెరాక్స్ షాపుల్లో రాజీనామా ఫార్మాట్లు ప్రింట్ చేసి మరి అమ్ముతున్నారంట కదా.. ? నిజమేనా ?

Saturday, September 24, 2011

సూపర్, ఎక్సెలెంట్, ఎక్స్ ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్..

సూపర్, ఎక్సెలెంట్, ఎక్స్ ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్..

గా ఎమీ లేదు, ఓ రెగ్యులర్ శ్రీను వైట్ల ఎంటర్ టైనర్ - దూకుడు. దుబాయ్ శీనూ ని, రెడీని కలిపి మిక్సీ లో వేసి దానికి కొంచం పొకిరీని జోడిస్తే మీకు ఇట్టే దూకుడు వచ్చేస్తుంది. తెలివైన దర్శకుడు, తెలివి అస్సలు లేని పాత్రలు, వోల్వో బస్సులో మళ్ళీ చూసాక అర్థం అయ్యే కథ, పొరపాటున రీళ్ళు అటు ఇటు అయిన అస్సలు ప్రమాదం లేని పాటలు..

కానీ పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళి, నవ్వొచ్చినప్పుడల్లా హాయిగా ఎంజాయ్ చేసి, మిగతా సమయం అస్సలు ఆలోచించకుండా కూర్చుంటే మాత్రం (అంటే నాలాగ అన్నమాట), మీకు సరదా కాలక్షేపం గ్యారంటీ.

(ఓ సాధారణ సినిమాని హిట్టుగా మార్చుకుని సంబరపడాల్సిన పరిస్థితిలో తెలుగు సినిమా ఉన్నందుకు మనసులో ఎక్కడో చివుక్కుమంటోంది)

Friday, September 23, 2011

అమ్మ మందుల చీటీ..

ఓ రెండ్రోజుల క్రితం నాకు ఒక కల వచ్చింది. అమ్మ కి నలత గా ఉంటే నేను డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్ళినట్టు..

ఆ డాక్టరుగారు అంతా పరిశీలించీ.. పరిశోధించీ.. అమ్మ వైపూ, నావైపూ ఓ నాలుగు సార్లు తీక్షణం గా చూసి, ఓ మందులు చీటీ నా చేతిలో ఉంచి అయిదొందలు పుచ్చుకున్నారు. ప్రక్కనే వున్న మందుల షాపు కి వెళ్తే, ఆ షాపాయన నేను ఇచ్చిన చీటీ ఎగాదిగా చూసి నాకు ఒక్కటిచ్చి (ముద్దనుకునేరు..కాదు.. గుద్దు) ఆ చీటీని తిరిగి నా చేతిలో పెట్టాడు ఓ వింత నవ్వు నవ్వుతూ.. నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. (ఇక్కడ మీరు ఒక కలవరింత ఊహించుకోవచ్చు నింపాదిగా) అందులో ఏముందా అని కంగారుగా చదివానా.. తల తిరిగి, తిక్క వదిలి.. మెలకువ వచ్చేసింది.

ఇంతకీ ఏముంది ఆ చీటీలో అంటారా.. ఇదీ వివరం..

Rx

1. ఆవిడ తో మనసారా సంభాషించడం - పదిహేను నిమషాలు - ఉదయం, మళ్ళీ రాత్రి
2. కలిసి భోజనం చెయ్యడం - వారానికి రెండు సార్లు
3. జ్ఞాపకాలు కలబోసుకోవడం - వారానికి ఒకసారి
4. ఆవిడ ఈ రోజుకీ మీకు ఎంత ముఖ్యమో ఆప్యాయం గా చేతలతో తెలియచెప్పడం - రెండు వారాలకొకసారి

(ఇంతకీ ఇది అమ్మ మందుల చీటీనా.. లేక నాదా ? )

Saturday, September 17, 2011

చావు చావుకీ ఒక స్టేటస్

ఈ మధ్య అరక్కోణం సమీపంలో జరిగిన రైలు ప్రమాదం గురించి వార్త చదువుతూ ఉంటే మనసంతా వేదనతో నిండిపోయింది. ఒకే ట్రాక్ మీద రెండు రైళ్ళు వెళ్ళి గుద్దుకోవడం, సాంకేతిక లోపమో, లేక మానవ తప్పిదమో కానీ, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దాని గురించి పెద్ద చర్చ జరగదు, అసలు కారణాలు విశ్లేషించబడవు, లోతైన దర్యాప్తులూ ఉండవు, ప్రభుత్వానికీ, సమాజానికీ ఇది చాలా చిన్న విషయం. అదే ఏ ఢిల్లీ పేలుడునో మాత్రం అందరూ చర్చిస్తారు, బోలుడన్ని కథనాలూ, ఇంటర్వ్యూలు. కొవ్వొత్తులతో ప్రదర్శనలు జరుగుతాయి. ఒక జాతీయ నాయకుడిని చంపే కుట్రలో పాలు పంచుకుని, ఆ నాయకుడితో పాటూఎందరో అమాయకుల్ని కూడా బలి తీసుకున్న నేరస్థుల్ని ఉరికంబం నుంచి రక్షించడానికి ముమ్మరం గా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ తీర్మానంతో సహా. ఆ దాడిలో నిష్కారణంగా ఛిద్రమైన కుటుంబాల గోడు ఎవరికీ పట్టదు.

న్యాయమో కాదో.. ప్రతీ చావుకీ ప్రభుత్వం ఒక రేటు కడుతుంది.. మీడియా ఓ రెండు రోజులు ఈగల్లా మూగి హడావిడి చేస్తుంది. తరువాత ? అంతా నిశ్శబ్ధం, అంధకారం. అది మరణం యొక్క సొంత సామ్రాజ్యం.

ఎందుకీ తేడా.. చావు ఏ రూపంలో.. ఏ కారణం వల్ల వచ్చినా చావే కదా. అది మరల వెనక్కి తేలేని ముగింపే కదా.. అయినా సమాజం చావుకీ.. మనిషికీ.. సందర్భానికీ.. ఒక స్టేటస్ ని ఇస్తుంది. ఉగ్రవాద దాడిలో మరణిస్తే మీకు మెయిన్ పేపర్ లో ఫొటో కనిపిస్తుంది, ఏ అమలాపురంలోనో కుక్క కరచి పోయినవాడి వార్త వీలుంటే ఆ లోకల్ పేపర్లో వస్తుంది. విమాన ప్రమాదంలో పోతే ఒక రేటు, పొట్ట కూటికి ఏరు దాటుతూ, పడవ బోల్తా పడితే ఒక రేటు. ఆ మధ్య ఎవరో అంటుంటే విన్నాను, 'మరీ కామెర్లు తో పొయాడండి... కనీసం హార్ట్/కిడ్నీ ప్రోబ్లం కూడా కాదు" అని.. కానీ చావుకి ఈ వ్యత్యాసాలు తెలీవు, ప్రమాదం లో అది AC బోగీ ని ఒకలాగా, జెనరల్ బోగీ ని ఒకలాగా చూడదు. అదో సోషలిస్టు మరి. ముక్కలైన హెలీకాప్టర్లో అది ముఖ్యమంత్రినీ ఆయన గుమాస్తానీ ఒకేలా చూస్తుంది.

కొందరికి చావు అమితమైన కీర్తిని ఇస్తుంది, కానీ ఆ కీర్తి వాళ్ళ గతంలోని ఏ ఒక్క క్షణాన్నీ మార్చలేదు.. వెనక్కి తేలేదు.
కొందరికి చావు శాంతిని ప్రసాదిస్తుంది.. యుద్ధాన్ని అర్థాంతరంగా ఆపేయిస్తుంది. అది ఒక నియంత మరి..

జీవితం ఆగిపోయిన చోట మరణం మొదలవుతుంది. అది అంతమో, అనంతమో.

(నా బాధ మీకు అర్థమవ్వకపోతే క్షమించగలరు. కన్నీటిబొట్టుకి ఏ రంగూ లేదు, అందులో ఆకాశం కనిపించినా.. అదే చెప్పాలనుకున్నాను.)

Saturday, September 10, 2011

డాక్టర్ భాస్కర్ (అంటే నేనే) :-)

ఈ మధ్య డాక్టరీ చదవాలనే ఆశ, కోరికా, వగైరా.. వగైరా.. బాగా పెరిగిపోయాయి నాలో. ఈ లేటు వయసులో ఇంత ట్విస్టు అవసరమా అంటారా, ఏంచెయ్యమంటారు పరిస్థితులు అలా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి రెండు బలమైన కారణాలు నన్ను MBBS వైపు ఉసిగొల్పుతున్నాయి. వాటిని మీకు విశదీకరించే ముందు కొంచం బ్లాక్ అండ్ వైట్ లో కొన్ని సంగతులు చెప్పాలి. (అంటే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట, మీకు తెలుసులెండి)

పదోతరగతిలో ఉండగా, ఈ జీవ శాస్త్రం సంబంధిత అంశాల్లో మన ప్రావీణ్యత అంతంత మాత్రమే అయినా, ఏదో ఒక మోస్తరు ఆసక్తి మాత్రం ఉండేది. కానీ మా అన్నలిద్దరూ అప్పటికే ఇంజనీరింగు బాట పట్టడం వల్ల, వాళ్ళు రోజూ అదే పనిగా ఓ రెండు బకెట్ల ట్యాంకర్ నీళ్ళను నా ఆసక్తి మీద జల్లి, మెల్లగా నన్ను కూడా MPC లో పడేసి చేతులు దులుపుకున్నారు, వాళ్ళు దులుపుకున్న సౌండ్ ఇప్పటికి నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది మరి. ఆ పాపానికి ముక్కుతూ మూల్గుతూ మొత్తానికి M.Tech చేసాననిపించాను. కంప్యూటర్ తెర వైపు ఎగాదిగా చూస్తూ నెల నెలా నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నాను కూడా.

ఓకే ఇంక కలర్లోకి వచ్చేయండి. దగ్గరగా స్టెతస్కోపుని ఎప్పుడూ చూడకపోయినా, ఏంటో డాక్టర్ వృత్తి అంటే నాకు ఒక క్రేజు మరియు మోజు.. , ఆఫీసులో ఏ ప్రక్క సీట్లో ఉన్న అమ్మాయికో ఒక క్రోసిన్ టాబ్లెట్ ఇచ్చి సమాధానపడుతుంటాను. చెన్నై మహానగరం లో పొరపాటున డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చినప్పుడు మాత్రం మనిషి అన్నవాడికి ఎవడికైనా "డాక్టరునైనా కాకపోతిని ... " అని అనిపించక మానదు. వారాల ముందు అప్పాయింటుమెంటు, గంటల తరబడి నిరీక్షణ, రెండు నిమషాల ముఖాముఖీ, అయిదు వందల ఫీజు, కంపెనీ కార్డు మెడలో ఉంటే ఒకటి రెండు స్కానులు, సో టోటల్ గా మీ జబ్బు మాట దేవుడెరుగు బ్రతుకు మాత్రం బస్ స్టాండ్ దగ్గర్లోకి వచ్చేస్తుంది. జుట్టు ఊడడం నుంచి కాలు విరగడం వరకూ అన్నింటికీ కంప్యూటర్ ఉద్యోగమే కారణం అని డాక్టరు గారు తీరిగ్గా సెలవిచ్చినప్పుడు, హేతుబద్ధం గా అనిపించకపోయినా తలవంచుకుని మిగిలిన పదో పరకో చొక్కా పై జేబులో దాచుకుని బయటపడాలి మనం. డెంటల్ క్లీనిక్కుల మాటయితే చెప్పనే అక్కర్లేదు. పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశాలు, అప్పుడప్పుడు ఫోను కాల్స్, "రండి రండి.. " అంటూ.. కాలం ఖర్మం కలిసిరాక ఏ సాయంత్రమో వెళ్ళామే అనుకోండి "ముందు తెలిసెనా ప్రభూ.. " అని పాటందుకుని మొహమాట పెట్టేస్తారు.. అదీ పరిస్థితి.

గుండె కోసే గాయాలని ఇంతకంటే గుర్తు తెచ్చుకోలేక నేను తదుపరి అంశానికి వెళ్ళిపోతున్నానండి.. వెళ్లిపోతున్నాను.

విధి ఎంతబలీయమైందో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది సులువుగా. ఆఫీసుకి దగ్గర్లో ఓ ఇల్లు చూసుకుని ఆ మధ్య మారినప్పుడు మాకో వింత మనిషి (??) పరిచయం అయ్యాడు. ఆయనే మా అపార్టుమెంటు సెక్రటరి (చివరిసారి సెక్రటరీ ఎన్నికలు ఓ పాతికేళ్ళ క్రితం జరిగినట్టు మొన్ననే పురావస్థు శాఖ పరిశోధనలో తేలింది), కన్నడ డబ్బింగ్ సినిమాల్లో ఉపేంద్రకీ, తెలుగు డైరక్టు సినిమాల్లో పోసానికి ఏమాత్రం తగ్గని వ్యక్తిత్వం ఈయనిది. వయసు మీద పడుతున్నా, ఏ అర్థరాత్రో మోటారు గట్టు మీద కూర్చుని పాటలు పాడుకోవడం, మధ్యాహం పన్నెండుకి, అరచి.. పిలచి.. మంచి నీళ్ళు పట్టుకోమని ఆదేశించడం. ఇవి మచ్చుకి రెండు చిన్న ఉదాహరణలు మాత్రమే, మీ అంచనాలని అస్సలు తారుమారు చెయ్యడు ఆయన. ఎలా అనిపించిందో.. ఏ విదేశీ హస్తముందో గానీ, మేము ఫ్లాటు లో దిగినప్పటి నుంచి నేను వైద్య వృత్తిలో ఉన్నానని ఆయనకి ఒక తప్పుడు అభిప్రాయం. ఏ డాక్టరు అయిన మెడలో రెండు కార్డులు వేసుకుని బైక్ మీద తిరుగుతుంటాడా.. ఏంటో ఆయన అభిమానం అలాంటిది మరి. మైంటెనన్స్ పుస్తకం లో ఆయన Dr. భాస్కర్ అని రాసి పంపడమూ, నేను ఒక క్షణం ఆనందపడి.. నిట్టూర్చి.. దాన్ని Mr. భాస్కర్ గా మార్చడమూ, కొన్ని నెలలు గా జరుగుతోంది. ఏదో ఒకరోజు ఆయనకి నిజం చెప్పాలి అని అనుకుంటూనే, మనకి పుట్టుక తోనే వచ్చిన బద్దకం వల్లో, లేక ఆయన లాంటి వాడితో కోరి కెలుక్కోవడం ఎందుకనో, ఆయనకి చెప్పడం జరగలేదు. అసలు మలుపు ఎప్పుడంటే, మొన్నెప్పుడో సూట్ కేసులు సద్దుకుని భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ కి బయలుదేరుతుంటే సడన్ గా అయన మా ఇంటి గుమ్మం తొక్కాడు, ఆశ్చర్య పడ్డాం. ఎందుకంటే అరిచి పిలవడమే తప్ప, వచ్చి మాట్లాడడం ఆయన ఇంటా వంటా లేదు. విషయం ఏంటా అని అడిగితే, "మా ఆవిడకి ఒంట్లో బాలేదు.. కొంచం వచ్చి చూస్తారా" అని అన్నాడు.. ఇండియా వరల్డ్ కప్పు గెలిచినప్పుడు కూడా ఇంత కంగారు పడలేదు నేను.. మీకిందాక బ్లాక్ అండ్ వైట్ లో చెప్పిన సంగతులన్ని గుర్తొస్తుంటే, సద్దుకుని, సముదాయించుకుని, అయ్యా నేను డాక్టర్ ని కాదు.. కనీసం యాక్టర్ ని కూడా కాదు.. కాదు.. కాదు.. అని భయంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన గౌరవం తో నొక్కి వక్కాణించాను. ఆయన నా వైపు ఎన్నికల తరువాత ఓటరులా ఓ లుక్కు ఇచ్చి, మా అపార్టుమెంటులోనే ఉన్న మరో డాక్టర్ (అసలు డాక్టర్) ఇంటి వైపు వెళిపోయాడు. (ఊరు అయితే వెళ్ళామే కానీ, మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన శ్రీమతి ని నవ్వుతూ చూసే వరకూ ఎక్కడో ఓ మూల టెన్షన్ మాత్రం ఉండిపోయింది అంటే నమ్మండి) అదీ నేను ఎదుర్కొన్న విషమ పరిస్థితి.

లోకులు కాకులు, కోతులు, ఇంకా బోలుడన్ని... ఈ బాధలు అన్నీ పడలేక.. లోలోనే మధన పడుతూ నా ఆరోగ్యాన్ని మింగేస్తున్న కంప్యూటర్ అనే అణుబాంబు ముందు పని చెయ్యలేక.. ఏది అయితే అయ్యింది, నేను డాక్టరీ చదివేయాలని తీవ్రం గా డిసైడ్ అయిపోయాను. ఒకసారి డిసైడ్ అయితే నేను మా ఆవిడ మాటే వినను.. సో ఇది ఫైనల్.. ఈ జన్మలో ఏదైన కారణాల వల్ల జరక్కపోయినా.. ఖచ్చితం గా వచ్చే జన్మలో మాత్రం ష్యూర్. అప్పుడు ఆ సాయికుమర్ జన్మల పోగ్రాంలో చంద్ర మోహన్ లా సగం తెరిచిన కళ్ళతో ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని మరీ మళ్ళీ ఒక పోస్ట్ వేస్తా. ప్రస్తుతానికి ఇంక ఆపేస్తా.. ;-)

(ఇంకో విషయమండోయ్, ఈ నెల మైంటెనన్స్ పుస్తకం లో నా పేరే రాయలేదట ఆయన.. బాగా హర్టెడ్ ఏమో.. ;-))