Saturday, September 10, 2011

డాక్టర్ భాస్కర్ (అంటే నేనే) :-)

ఈ మధ్య డాక్టరీ చదవాలనే ఆశ, కోరికా, వగైరా.. వగైరా.. బాగా పెరిగిపోయాయి నాలో. ఈ లేటు వయసులో ఇంత ట్విస్టు అవసరమా అంటారా, ఏంచెయ్యమంటారు పరిస్థితులు అలా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి రెండు బలమైన కారణాలు నన్ను MBBS వైపు ఉసిగొల్పుతున్నాయి. వాటిని మీకు విశదీకరించే ముందు కొంచం బ్లాక్ అండ్ వైట్ లో కొన్ని సంగతులు చెప్పాలి. (అంటే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట, మీకు తెలుసులెండి)

పదోతరగతిలో ఉండగా, ఈ జీవ శాస్త్రం సంబంధిత అంశాల్లో మన ప్రావీణ్యత అంతంత మాత్రమే అయినా, ఏదో ఒక మోస్తరు ఆసక్తి మాత్రం ఉండేది. కానీ మా అన్నలిద్దరూ అప్పటికే ఇంజనీరింగు బాట పట్టడం వల్ల, వాళ్ళు రోజూ అదే పనిగా ఓ రెండు బకెట్ల ట్యాంకర్ నీళ్ళను నా ఆసక్తి మీద జల్లి, మెల్లగా నన్ను కూడా MPC లో పడేసి చేతులు దులుపుకున్నారు, వాళ్ళు దులుపుకున్న సౌండ్ ఇప్పటికి నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది మరి. ఆ పాపానికి ముక్కుతూ మూల్గుతూ మొత్తానికి M.Tech చేసాననిపించాను. కంప్యూటర్ తెర వైపు ఎగాదిగా చూస్తూ నెల నెలా నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నాను కూడా.

ఓకే ఇంక కలర్లోకి వచ్చేయండి. దగ్గరగా స్టెతస్కోపుని ఎప్పుడూ చూడకపోయినా, ఏంటో డాక్టర్ వృత్తి అంటే నాకు ఒక క్రేజు మరియు మోజు.. , ఆఫీసులో ఏ ప్రక్క సీట్లో ఉన్న అమ్మాయికో ఒక క్రోసిన్ టాబ్లెట్ ఇచ్చి సమాధానపడుతుంటాను. చెన్నై మహానగరం లో పొరపాటున డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చినప్పుడు మాత్రం మనిషి అన్నవాడికి ఎవడికైనా "డాక్టరునైనా కాకపోతిని ... " అని అనిపించక మానదు. వారాల ముందు అప్పాయింటుమెంటు, గంటల తరబడి నిరీక్షణ, రెండు నిమషాల ముఖాముఖీ, అయిదు వందల ఫీజు, కంపెనీ కార్డు మెడలో ఉంటే ఒకటి రెండు స్కానులు, సో టోటల్ గా మీ జబ్బు మాట దేవుడెరుగు బ్రతుకు మాత్రం బస్ స్టాండ్ దగ్గర్లోకి వచ్చేస్తుంది. జుట్టు ఊడడం నుంచి కాలు విరగడం వరకూ అన్నింటికీ కంప్యూటర్ ఉద్యోగమే కారణం అని డాక్టరు గారు తీరిగ్గా సెలవిచ్చినప్పుడు, హేతుబద్ధం గా అనిపించకపోయినా తలవంచుకుని మిగిలిన పదో పరకో చొక్కా పై జేబులో దాచుకుని బయటపడాలి మనం. డెంటల్ క్లీనిక్కుల మాటయితే చెప్పనే అక్కర్లేదు. పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశాలు, అప్పుడప్పుడు ఫోను కాల్స్, "రండి రండి.. " అంటూ.. కాలం ఖర్మం కలిసిరాక ఏ సాయంత్రమో వెళ్ళామే అనుకోండి "ముందు తెలిసెనా ప్రభూ.. " అని పాటందుకుని మొహమాట పెట్టేస్తారు.. అదీ పరిస్థితి.

గుండె కోసే గాయాలని ఇంతకంటే గుర్తు తెచ్చుకోలేక నేను తదుపరి అంశానికి వెళ్ళిపోతున్నానండి.. వెళ్లిపోతున్నాను.

విధి ఎంతబలీయమైందో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది సులువుగా. ఆఫీసుకి దగ్గర్లో ఓ ఇల్లు చూసుకుని ఆ మధ్య మారినప్పుడు మాకో వింత మనిషి (??) పరిచయం అయ్యాడు. ఆయనే మా అపార్టుమెంటు సెక్రటరి (చివరిసారి సెక్రటరీ ఎన్నికలు ఓ పాతికేళ్ళ క్రితం జరిగినట్టు మొన్ననే పురావస్థు శాఖ పరిశోధనలో తేలింది), కన్నడ డబ్బింగ్ సినిమాల్లో ఉపేంద్రకీ, తెలుగు డైరక్టు సినిమాల్లో పోసానికి ఏమాత్రం తగ్గని వ్యక్తిత్వం ఈయనిది. వయసు మీద పడుతున్నా, ఏ అర్థరాత్రో మోటారు గట్టు మీద కూర్చుని పాటలు పాడుకోవడం, మధ్యాహం పన్నెండుకి, అరచి.. పిలచి.. మంచి నీళ్ళు పట్టుకోమని ఆదేశించడం. ఇవి మచ్చుకి రెండు చిన్న ఉదాహరణలు మాత్రమే, మీ అంచనాలని అస్సలు తారుమారు చెయ్యడు ఆయన. ఎలా అనిపించిందో.. ఏ విదేశీ హస్తముందో గానీ, మేము ఫ్లాటు లో దిగినప్పటి నుంచి నేను వైద్య వృత్తిలో ఉన్నానని ఆయనకి ఒక తప్పుడు అభిప్రాయం. ఏ డాక్టరు అయిన మెడలో రెండు కార్డులు వేసుకుని బైక్ మీద తిరుగుతుంటాడా.. ఏంటో ఆయన అభిమానం అలాంటిది మరి. మైంటెనన్స్ పుస్తకం లో ఆయన Dr. భాస్కర్ అని రాసి పంపడమూ, నేను ఒక క్షణం ఆనందపడి.. నిట్టూర్చి.. దాన్ని Mr. భాస్కర్ గా మార్చడమూ, కొన్ని నెలలు గా జరుగుతోంది. ఏదో ఒకరోజు ఆయనకి నిజం చెప్పాలి అని అనుకుంటూనే, మనకి పుట్టుక తోనే వచ్చిన బద్దకం వల్లో, లేక ఆయన లాంటి వాడితో కోరి కెలుక్కోవడం ఎందుకనో, ఆయనకి చెప్పడం జరగలేదు. అసలు మలుపు ఎప్పుడంటే, మొన్నెప్పుడో సూట్ కేసులు సద్దుకుని భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ కి బయలుదేరుతుంటే సడన్ గా అయన మా ఇంటి గుమ్మం తొక్కాడు, ఆశ్చర్య పడ్డాం. ఎందుకంటే అరిచి పిలవడమే తప్ప, వచ్చి మాట్లాడడం ఆయన ఇంటా వంటా లేదు. విషయం ఏంటా అని అడిగితే, "మా ఆవిడకి ఒంట్లో బాలేదు.. కొంచం వచ్చి చూస్తారా" అని అన్నాడు.. ఇండియా వరల్డ్ కప్పు గెలిచినప్పుడు కూడా ఇంత కంగారు పడలేదు నేను.. మీకిందాక బ్లాక్ అండ్ వైట్ లో చెప్పిన సంగతులన్ని గుర్తొస్తుంటే, సద్దుకుని, సముదాయించుకుని, అయ్యా నేను డాక్టర్ ని కాదు.. కనీసం యాక్టర్ ని కూడా కాదు.. కాదు.. కాదు.. అని భయంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన గౌరవం తో నొక్కి వక్కాణించాను. ఆయన నా వైపు ఎన్నికల తరువాత ఓటరులా ఓ లుక్కు ఇచ్చి, మా అపార్టుమెంటులోనే ఉన్న మరో డాక్టర్ (అసలు డాక్టర్) ఇంటి వైపు వెళిపోయాడు. (ఊరు అయితే వెళ్ళామే కానీ, మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన శ్రీమతి ని నవ్వుతూ చూసే వరకూ ఎక్కడో ఓ మూల టెన్షన్ మాత్రం ఉండిపోయింది అంటే నమ్మండి) అదీ నేను ఎదుర్కొన్న విషమ పరిస్థితి.

లోకులు కాకులు, కోతులు, ఇంకా బోలుడన్ని... ఈ బాధలు అన్నీ పడలేక.. లోలోనే మధన పడుతూ నా ఆరోగ్యాన్ని మింగేస్తున్న కంప్యూటర్ అనే అణుబాంబు ముందు పని చెయ్యలేక.. ఏది అయితే అయ్యింది, నేను డాక్టరీ చదివేయాలని తీవ్రం గా డిసైడ్ అయిపోయాను. ఒకసారి డిసైడ్ అయితే నేను మా ఆవిడ మాటే వినను.. సో ఇది ఫైనల్.. ఈ జన్మలో ఏదైన కారణాల వల్ల జరక్కపోయినా.. ఖచ్చితం గా వచ్చే జన్మలో మాత్రం ష్యూర్. అప్పుడు ఆ సాయికుమర్ జన్మల పోగ్రాంలో చంద్ర మోహన్ లా సగం తెరిచిన కళ్ళతో ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని మరీ మళ్ళీ ఒక పోస్ట్ వేస్తా. ప్రస్తుతానికి ఇంక ఆపేస్తా.. ;-)

(ఇంకో విషయమండోయ్, ఈ నెల మైంటెనన్స్ పుస్తకం లో నా పేరే రాయలేదట ఆయన.. బాగా హర్టెడ్ ఏమో.. ;-))

5 comments:

 1. భలే రాసారండీ ! పోలికలు బాగున్నాయి. ఎన్నికల తర్వాత ఓటరు, ఏ డాక్టరైనా బైక్ వేసుకుని...., లోకులు కాకులు, కోతులు..ఇంకా బోలుడన్ని.... !!!! నవ్వించేశారు డాక్టర్ గారూ!

  ReplyDelete
 2. bhaskar MBBS theseddam etv lo...suman is ready to produce and act

  ReplyDelete
 3. దీన్నే ట్రై కోమా బార్సాలోనా సియాస్కా అంటారు. దీనికి మందు ఇంకా కనుక్కోలేదు.

  ReplyDelete
 4. పాపం మీ సెగట్రీగారి మనోభావాల్ని చాలా గాయపరిచినట్టున్నారు!
  టపా కేక!!

  ReplyDelete
 5. annitikante meko easy way vundemo dr.bhaskar avadaniki.....

  ReplyDelete